– రామా చంద్రమౌళి

9390109993

కళ్ళు మూసుకుంటావో

కళ్ళు తెరిచే.. ఎక్కడో నిన్ను నువ్వు పోగొట్టుకుంటావో

ఒక నిశ్శబ్దం ఆవరించగానే ‘ ఆట ‘ మొదలౌతుంది

సినిమా హాల్ కావచ్చు.. సముద్రతీర ఆత్మహత్యాస్థలి కావచ్చు

ఒంటరి రైల్వే స్టేషన్‌లో

కన్నీళ్ళను మోసుకువెళ్తున్న రైలును అనార్ద్ర చూపుల్తో చూస్తున్నపుడు కావచ్చు

సరిగ్గా ఆ క్షణాల్లోనే పిడికెడు గుండెలో

ఒక సూక్ష్మరోదసి విస్ఫోటిస్తున్నట్తు తెలుస్తూంటుంది

స్థితప్రజ్ఞతో, తత్వమో, వైరాగ్యమో.. ఒట్టి నిరలంకారతో

లోపల ఎడారిలా విస్తరిస్తూ

ఏమిటిదంతా.. అన్న ప్రశ్న ఒట్టి శూన్యాకాశమై నిలబడ్తుంది

అంతా హాస్పిటల్ ఔటర్‌యార్డ్‌లో ‘ మార్చురీ ‘ వాసన,

‘ విషం’ అంటే .. మనిషికి అవసరమైన దానికన్న

ఎక్కువగా ఉన్న ప్రతిదీ విషమే అన్న ‘ఎరుక ‘ జ్వలిస్తూండగా

ఎక్కడా దొరకని ‘ శాంతి ‘ కోసం అన్వేషణ

దొరకదు శాంతి ఎన్ని.. ఎంతగా వెచ్చించినా

పిడికెడు మట్టి, పిడికెడు గాలి, రవ్వంత నిప్పు

మొలకెత్తడానికి దోసెడు కన్నీటి తడి కావాలి

నిశ్శబ్దంగా ఆకాశంలోకి.. అమ్మ కళ్ళలోకివలె శూన్యంగా చూస్తున్నపుడు

హృదయంలోనే ఒక స్థూల అంతరిక్షం ఉందని తెలుస్తూంటుంది

కళ్ళు ఆకాశాలై, మహాసముద్రాలై, వర్షారణ్యాలై.. రూపాంతరతే జీవితమా.?

మట్టి కాలి ఇటుకై.. ఇటుక మళ్ళీ మట్టినే మోస్తూ

ఎదుట విద్యుత్ తీగలపై వరుసగా కూర్చుని పక్షుల సభ కనబడ్తూండగా

ఫటేల్మని దెబ్బ తగలగానే విచ్ఛిన్నమయ్యే

గాజుగోళీల గుంపులా జీవితమంతా కకావికలు –

జీవితంతోనైనా, మృత్యువుతోనైనా

యుద్ధాలెప్పుడూ ముగియవు.. కొనసాగుతూనే ఉంటాయి

అంతిమంగా.. మళ్ళీ ఒక నిర్భేధ్య నిశ్శబ్దం మిగుల్తుంది

సరిగ్గా అప్పుడే ఇక ‘ఆట ‘ ముగుస్తుంది

ముగింపు ఎప్పుడూ మరో ఆరంభానికి ఆది బిందువు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com