మడికి‌ సింగన:- అనేక శాసనాల ఆధారంగా, ఇతడు పచ్చినాటి రామగిరిని పరిపాలించిన ముప్ప భూపతి ఆస్థాన కవిగా నుండి, తిక్కన సోమయాజి మనుమరాలగు చిట్టాంబికను పెళ్లాడినట్లుగా 4 పద్యకావ్యాలు రచించినట్లుగా రూఢి అవుతుంది.

1. పద్మపురాణోత్తరఖండము 2. భాగవత దశమ స్కంధము

3. వాసిష్ఠ రామాయణము 4. సకల నీతి సమ్మతము అనేవి అతడు రచించిన కావ్యాలుగా క్రీ.శ. 1325-1400 మధ్య కాలం వాడుగా తేటతెల్లమవుతోంది.

సింగన తన మొదటి రెండు కావ్యాలను ముప్పభూపతి మంత్రియేగాక‌ నేటి కరీంనగర మందలి నాటి, వెలిగందుల దుర్గ పాలకుడగు కందన మంత్రికి అంకితమిచ్చాడు. కందన కేసనకు స్వయాన సోదరుడు. ‌సింగన పద్య రచనలో సిద్దహస్తుడు. అల్లసాని పెద్దన కూడా యితని పద్యాన్ని అనుసరించి రచన చేసినట్లుగా తెలుస్తున్నది. పద్మ పురాణమందలి మొదటి అశ్వాసంలోని ఆ పద్యం-

చ: చని చని కాచెనంత మునిసత్తముడున్న శృంగజాలమున్

కనియె శ్రుతి స్మృతి ప్రకట గాఢతరార్థ వరిష్ఠు దివ్యబో

ధన పదవీ మహత్వ సముదగ్ర గరిష్ఠు దపోవిశేనం

జనిత నితాంత పుణ్యగణ సంచయ సువ్రత నిష్టునయ్యెడన్

ఈ‌ పద్యమే పెద్దన్న ప్రసిద్ధమైన

“ఆటజని కాంచె భూమిసురుడంబరచుంబిత” మనెడు పద్యానికి మాతృకగా నిలుస్తున్నది. భావాలను సూటిగా సుందరంగా చెప్పడం సింగన పద్యవిద్యా ప్రత్యేకతగా భావించవచ్చు. మచ్చుకు పద్మపురాణమందలి సూర్యోదయ వర్ణన పద్యాన్ని ‌పరిశీలిద్దాం-

సీసం:- కమలినీ‌ముఖ పద్మకాంతి నివాళింప

నేపారమెత్తిన దీపమనగ

పూర్వపర్వతంలో భూషాకవిశేషమై

చెలువారు గైరిక శిలయనంగ

ప్రాచీనదిశా వధూఫాల దేశంబున

లలినొప్పసిందూర తిలకమనగ

జంభారివారణ కుంభ మధ్యంబున

భాసిల్లు జెంగల్వబంతియనగ

తే.గీ మెరసి చీకటి విరయించి మిన్నుముట్టె

చక్రవాకాళి తాపము సంహరించి

యళుల మేల్కొని కొలకుల దెలువులొసగి

తరణి ముదయాద్రి బొడదెంచె దక్షిణంలు

(పద్మ : 1-117)

ఈ పద్యంలో తేలిక పదాలతో పాటుగా ‘గ్రరిక్ శిల’ అంటే బంగారు మేరు‌ పర్వతమని, ‘జంభారివారణ’ మంటే ఇంద్రుని ఐరావతమని పండితులకు మాత్రమే అర్థమయ్యే పద ప్రయోగాలు చేశాడు. తూర్పున గల పర్వత శిఖారాగ్రముల్ని స్వర్ణ కాంతులతో ప్రవేశింపజేస్తూ ఐరావత కుంభ సమానమైన కొండల మధ్యలో ఎర్ర ఎర్రని చెంగల్వ బంతిలా మెరుస్తూ చీకట్లను పారద్రోలుతూ, సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా, చక్రవాక పక్షులకు – పద్మాలకు ప్రీతి కూరుస్తూ తరణి (సూర్యుడు) తరలివస్తున్నాడని మనోహరంగా సూర్యోదయ వర్ణన గావించాడు.

ఆ తర్వాత కావ్యమైన ‘భాగవత దశమ స్కంధము’ను పాల్కురికి అడుగు జాడల్లో ద్విపద కావ్యంగా మలిచాడు. దశమ స్కంధము శ్రీ కృష్ణ లీలలకు సంబంధించినది కాబట్టి -ఇతడు హరిభక్తుడు అయినందున ఈ కవి స్కంధము నొక్కటె గ్రహించి 1. కల్యాణ కాండ 2. మధుర కాండ 3. జగదభి రక్షకాండ అనే రామాయణ కాండములుగా విభజించి రచన చేశాడు. బమ్మెర పోతన్నకు మార్గ దర్శకంగా నిలిచాడు.

ఎర్రన భారతంలో శారదను శారద నీరదగా శ్వేత వస్త్ర ధారిణిగా వర్ణించినట్లు యీ కవి చీకటిని నల్లని ఉపమానాలతో వర్ణించాడు. ఇతని కథా కథన విధానం సూటిగా_నన్నయ ప్రసన్న కథా కవితార్థ ముక్తిగా సాగుతుందనడానికి కల్యాణ కాండలోని యీ‌ ద్విపద్యను చూపవచ్చు.

నరకాహ్వమందు దానవ కులేశ్వరుడు

పరశక్తి మహిమ దుర్వార సత్త్వమున

ధరణి పై గల రాజమాత నెల్ల ‌నోర్చి

తన శాసనంబుల దగ నిల్పియంత

దనివోక యతి బలోదగ్రుడ్రై నడిచి

మమరాధి పుంగెల్చి మగ్పినోడించి

శమనుని గెల్చి రాక్షసు పారద్రోలి…..(కల్యాణ కాండ)

ప్రాసనియమంతో వరుసగా 3 ఇంద్రగణములు 1సూర్య గణము కలిగి మొదటి గణములోని ప్రథమాక్షరానికి యతికూర్చడం ద్విపద లక్షణం! ఈ లక్షణాలన్నీ పాటిస్తూనే నరకుని వీరవిహారాన్ని సలక్షణంగా వర్ణించాడీ ద్విపద పాదాల్లో-

అలాగే ‘జగదభి రక్షకాండలో

మేలైన కృష్ణుని మే చాయ లోలె

నెరినొప్పు కాళింది నీరంబువోలె

తరచైన తేటుల దాటుల వోలై

పెనుపైన నీలాల పేరుల వోలె

లలినొప్పు నీలోత్పలంబులవోలె

దలమారి చీకటి దట్టమైపేర్చె..!

అంటూ కృష్ణుని మేనిచాయలా- కాళింది మడుగు నీరులా- తుమ్మెదల్లా- నీలాల పేరులా- నల్లని కలువల్లా(నీలోత్పలాలు) నల్లని శిరోజాల కొప్పుల్లా(తురుములు) చీకటి దట్టంగా వ్యాపించినట్లు వర్ణించాడు. అయితే ద్విపద లోని ప్రాసనియమం వీడి కొన్ని పంక్తుల్ని మంజరీ ద్విపద లా మలచి స్వతంత్రించాడు.

సంస్కృత ‘యోగ వాసిష్ఠం’ను సింగన ‘వాసిష్ఠ రామాయణం’గా రచన చేశాడు. రఘువంశ గురువైన వసిష్ఠుడు శ్రీరామ చంద్రునికి కావించిన ధర్మ ప్రబోదమే యీ ప్రబంధం! ‘జగం మిథ్య- ఆత్మ సత్యం’ అనే ధర్మ దీక్షా కర్తవ్యంలో దాశరథి కర్తవ్యోన్ముఖుని చేయు సందర్భంలో-

ఉత్ప: చిత్త సమాకులీకరణ శీల మనోహర దైన్య సాధ్యని

స్సత్త మహాభుజంగ కుల సంశ్రయగర్త సమృద్ధ వల్లి దు

ర్వృత్త గృహాంత వాసిని నవీన విలాసిని లక్ష్మి యట్టి సం

పత్తి సమస్త దోహ భవ భావ భయప్రదగాక సౌఖ్యమే?

సకల దుఃఖ హేతువైన సంపదలను -సంసార సౌఖ్యాలను త్యజించి రాజ ధర్మాన్ని పాటించడమే. కర్తవ్య పాలన చేయడమే సర్వోత్కృష్టమని వసిష్ఠుడు ప్రబోధించినట్లుగా యో ఉత్పల మాలను సింగన రచించాడు. వేదాంత సార సంగ్రహంగా రూపొందించాడు. మూలంలోని అనేక ఉపకథల్ని స్వీకరించిన యుక్తి ముక్తముగా రచించాడు. పోతన్నకు స్ఫూర్తిగా నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com