వనమంతా ఆకుపచ్చన

అచటచటా ముచ్చటగా నీవు నిండు ముత్తైదువాతు పచ్చన

నీవచటెచటయితే వెలుస్తావో అచ్చ పసుపుపచ్చగా

అచట నివసించినారేమో నీలాంటి

నిమ్మపండు లాంటి నిండైన ఆడపడుచులని

లేక మొలిచావేమో నీవే వారి అస్తికలపై

వారి అందాలకు అనవాళ్ళుగా యని.

గుత్తులు గుత్తులుగా పూయు నీ పూలు చూస్తుంటే

ప్రకృతి తన పట్టరాని ఆనందాన్ని చిందులు

త్రొక్కుతూ ఇట చిగురించెనా?

విహంగమై విహరించెనా? యని అనిపిస్తుంది నాకు

స్త్రీకి పసుపూ కుంకుమా అందమంటారు

నీ దళాలు నాకు పసుప్పచ్చని చీరె ధరించిన వధువువలె

నీ కొమ్మలు, ఆకుపచ్చని ఆకులు ధరించి నిన్ను మోసుకుపోతున్న

పల్లకీ బోయిలవలె అనిపిస్తాయి నాకు

నీవూ, మోదుగా, పసుపూ కుంకుమలవలె

వనజాక్షికి అలంకారాలవలె, వనమంతా వెలిగించే వెన్నెలల,

కన్నెలల వలె అనిపిస్తాయి నాకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com