సదాశివ మరపురాని యాదిని పంచుతున్న వ్యాసం..

తాము పుట్టిన మట్టికి, ప్రాంతానికి కొందరే కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతారు. ఆ గడ్డకు ఖాండాంతరాలలో పేరు ప్రఖ్యాతులు వెదజల్లుతారు. అటువంటి వారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో మన సాహితీ శిఖరం సంగీత మేరునగం సామల సదాశివ. ఆదిలాబాదు భారత దేశ పటంలో ప్రముఖ ప్రాంతంగా నిలబెట్టిన వారు వీరు.

సదాశివగారు మామూలు మనిషి మంచి ఉపాధ్యాయుడు. తెలుగు, ఉర్దూ, ఫార్ని, మరాఠి తదితర భాషల్లో పాండిత్యం సంపాదించిన వాడు. తెలుగు సాహిత్యాన్ని సునిశితంగా చదవడం వల్ల ఇటు తెలుగు పాఠకులకు, ఉర్దూ, మరాఠి, ఫారసి సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించడం వల్ల అటు వారితోను. సన్నిహితుడయ్యాడు. హిందుస్థానీ కర్ణాటక సంగీత విషయాలను పత్రికల్లో వ్యాసాలుగా రాస్తుండడం వల్ల సంగీత ప్రియులకూ దగ్గరయ్యాడు. అందుకే ఆదిలాబాద్లో ఆయన ఇల్లు ఏదో ఒక రంగానికి చెందిన వారితో సదాశివ

ముచ్చటించడం తాను మరణించేవరకు జరిగాయి.

ఉదయాన్నే లేచి ఐదారు దినపత్రికలు చదవడం, మధ్యాహ్నం వరకు తన దగ్గరికి వచ్చిన వారితో కబుర్లు చెప్పుకోవడం, మళ్ళీ సాయంత్రం ఒక పుస్తకం చేతిలో ఉండడం పక్కనే అతని వయసంతటి రేడియోలో కమ్మని హిందుస్థాని సంగీత స్వరాలు వినడం అతనున్నంత వరకూ జరిగాయి.

ఎక్కడెక్కడి నుంచో అతని దగ్గరికి వచ్చి సంగీత సాహిత్య విషయాలను

ముచ్చటించుకునే వాళ్ళు. కవులు, రచయితలు తమ కవితల్ని, రచనల్ని చూయించడానికి, ముందు మాట రాయించుకోవడానికి వస్తుండేవారు. నిర్మోహమాటంగా, సున్నితంగా చక్కని సలహాలిచ్చేవాడు.

అప్పుడప్పుడు నా కవితల్ని సదాశివ గారికి చూయించే వాణ్ణి. ఈ వాక్యం మళ్ళీ చదువూ? ఇది బాగుంది. ఇది బాగా లేదని చెప్పేవాడు. అన్యభాషల (ఉర్దూ, ఫారసి) ప్రభావం వల్ల సులభమైన భాషను లోతైన భావాన్ని ఇష్టపడేవారు. “కవిత రాయడం ముఖ్యం కాదయ్యా! రాసిన దాంట్లోంచి ఏది తీసివేయాలో తెలిసిన వాడే గొప్ప కవి అవుతాడని” అనేవాడు.

ఎవరైనా పద్యం రాసి వినిపిస్తే వెంటనే దానిలోని దోషాన్ని చూయించేవాడు. “పద్యంలో కవిత్వం చెప్పగలిగితేనే పద్యం రాయాలి. అయినా ఇప్పుడు పద్యం ఎవరు రాస్తున్నారు. రాస్తున్న కొందరి లాగా మనం రాస్తామా! రాస్తున్న దాన్ని ఎందరు చదువుతున్నారయ్యా! చక్కగా వచన కవితనో, కథనో, నవలనో రా యొచ్చు గదా”ని ముక్కు సూటిగా అనేవాడు. ఆ సూటిపోటి సలహాలే కొందరిని అతనికి దూరం చేశాయి. అతడు ముచ్చట్లు

మొదలు పెడితే కాలమే భయపడి పోయేది. మధ్య మధ్యలో సందర్బోచితంగా ఎక్కడెక్కడి కవితా పంక్తులనో,

దోహెనో వినిపిస్తూ సాహితీ వాతావరణాన్ని మరింత రసమయం చేసేవాడు.

ఏ పత్రికలోనైనా గురజాడ గురించో, కందుకూరి గురించో, శ్రీ శ్రీ గురించో వ్యాసం వస్తే ఎందుకయ్యా ఇంకా వీరినే ఆకాశానికెత్తడం ఇటువంటి గొప్ప వారి గురించి టన్నుల కొద్దీ పుస్తకాలొచ్చాయి. అదే యువకవుల్ని, రచయితన్ని ప్రోతాహిస్తే మరింత పదునెక్కు తారనేవాడు”.

సదాశివరూపం సాంప్రదాయం, భావాలు మాత్రం ఆధునికం, సమకాలికం. ఏ రచయిత గురించైనా, కవి గురించైనా ప్రస్తావన వచ్చినప్పుడు అతని దీనస్థితిని గ్రహించి “బాబాలకు స్వాములకు చందాల పేరుతో లక్షలకు లక్షలు తగల బెడతారు. కానీ ఒక కవి పుస్తకం అచ్చు వేసుకోవడానికి పది రూపాయలు సహాయం చెయ్యడం ధైర్యం కాదని” బాధపడేవాడు. జి.కృష్ణ, కె.రామచంద్రమూర్తి, కృష్ణబాయి, చలసాని ప్రసాద్, వాకాటి పాండురంగారావు, పొత్తూరి వేంకటేశ్వర రావు తదితర కవులు రచయితలు మేధావులతో ఇతనికి గల సఖ్యతను బట్టి చూస్తే ఇతను ఆధునికుడని స్పష్టంగా తెలుస్తుంది. వేలూరి శివరామ శాస్త్రిని రోజూ ఏదో ఒక సందర్భంలో యాది చేసుకోవడం చూస్తే సదాశివకు శాస్త్రి గారంటే ఎంత అభిమానమో తెలుసుకోవచ్చు.

ఎవరైనా ప్రజానాయకుడు గాని, ప్రజల మనిషి గాని మరణిస్తే సదాశివ కంటికొలుకుల్లో రెండు కన్నీటి చుక్కలు విలవిల్లాడితే బాధగా రెండు వేళ్ళతో ఒత్తుకొని దు:ఖించేవాడు. అయినవాళ్ళకోసం జీవితాంతం దు:ఖించిన వారికి ఈ ముదిమి వయసులో కన్నీళెక్కడుంటాయి.

తెలుగు సాహిత్య వాతావరణం కలుషితమైందని కొంత కాలం తెలుగు పాఠకులకు రాయడం మానేశాడు. ఉర్దూ, హిందీ పత్రికలకు రాస్తుండేవాడు. ముఖ్యంగా మరాఠి కవి కేశవవసంత్ గురించి, మీర్జా గాలిబ్ జీవితం, రచనల గురించి అమద్ రుబాయిల అనువాదం ఇట్లా విలువైన వ్యాసాలెన్నో రాశాడు. హిందూస్థానీ సంగీత కారులైన పండిత్ జరాజ్, ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ సాహెబ్, హీరా బాయి బరోడేకర్, కేసర్ బాయి కేర్కర్,

అంజనీ బాయి ముల్పేకర్, బేగం అక్తర్ సంగీత మాధుర్యాన్ని చెప్తుంటే చెట్టు కొమ్మలు లయాత్మకంగా ఊగుతుంటే దోసిలి నిండా పూల ముచ్చట్లను నింపుకోవడమే మనవంతు అన్నట్లుగా అతని కబుర్లు సాగేవి.

ఉర్దూ, ఫారసి సాహిత్యా లకు సంబంధించి ఎన్నో వ్యాసాలు రాసి వాళ్ళకు ఎన్నో కొత్త విషయాలు తెలియజేసి ఇంత కృషి చేసినా ఉర్దూ భాషకు సంబంధించిన ఎటువంటి పురస్కారం రాకపోవడం ఆశ్చర్యం, విచారం కూడా!

సభలో ప్రసంగించినా, వాలు కుర్చీలో కూర్చోని ముచ్చటించినా మనముందు ముచ్చటాడుతున్నట్టు, సాహితీ వేత్తలెందరో మన ముందు ఉన్నట్లు అనిపించేది. తెలుగు పంచె, లాల్చీ, మెడలో రుద్రాక్ష మాలలతో సాదాసీదాగా ఉన్నట్లు అతని వాక్యము అంతే పొట్టిగా సాదా సీదాగా ఉంటుంది. భావం లోతు మాత్రం అనంతం.

కాళోజీ సోదరులు గురించి ఒక చోట “బతికినంత కాలం బతికారు అంటాడు. అట్లాగే రావు బాల సరస్వతీ గారి గురించి రాస్తూ “ఆమె గొంతులో ఏదో ఉంది అంటాడు” సదాశివ గారి వచనంలో విలక్షణత అంటే ఇదే మరి.

సదాశివగారి వాక్యంలో క్రియా పదాలైన వచ్చినారు, పోయినారు, చేసిండ్రు, చూసిండ్రు అని ఉంటాయి. ఒక సారి నేను భయపడుతూ వచ్చారు, పోయారు అని

రాయొచ్చు గదా సార్! అంటే అదే! ఇట్లా రాయొద్దా ! ఇట్లా రాస్తే తప్పా! నేను ఇట్లనే రాస్తా అని బదులిచ్చాడు. అంటే సదాశివ గారికి తెలంగాణా భాషా నుడికారం, పలుకు బళ్లంటే ఎంత ఇష్టమో తెలుసుకోవచ్చు.

తెలుగు టీచరుగా జీవితాన్ని ప్రారంభించి తన అభిరుచి మేరకు రచనా వ్యాసాంగాన్ని ఎంచు కున్నాడు. చివరి దాకా దానినే కొనసాగించాడు.

తాను నడిచిన వీధుల్లో సాహిత్య సౌరభాలను ఏరుకున్నాడు. సంగీత మధురిమల్ని ఒంపుకున్నాడు. మొదట పద్య కవిత్వం “రేవతి’ నవల రాసినా సురవరం ప్రతాపరెడ్డి సలహా మేరకు అనువాద రంగాన్ని ఎంచుకున్నాడు. వివిధ భాషల్లోని మంచి సాహిత్యాన్ని అనువదించడం తన వ్యక్తిగతమే అయినా ఆయా భాషా, సాహిత్యాల సొగసుల్ని మాధుర్యాన్ని తెలుగు వారికి అందించడం మన భాగ్యమే.

సదాశివ సుమారు ఇరవై రెండు పుస్తకాలు రాసినా ఆయన “యాది” సదాశివగారికి ఇంటి పేరుగా ఖ్యాతిని తెచ్చి పెట్టింది. దీనిలో ఇతని జీవితానుభవాలు, జీవన సమరం, ప్రాంతే తరుల అవమానాలు వివక్ష, వాళ్ళలో కొందరి అభినందనలు అన్నిటినీ వినమ్రంగా చెప్పుకున్నాడు. ఈ యాది పుస్తకం తెలుగు వారి తరగని సంపద.

సాహిత్యానికి అమూల్య నిధి. గిరిజన విప్లవ వీరుడు కొమురం భీం జీవిత చరిత్రను 1972 సం.లో 7వ తరగతి తెలుగు వాచకంలో మొట్టమొదటి సారిగా పాఠంగా రాసి పెట్టించాడు. ఈ విధంగా తన మాతృభూమి రుణం కొంత తీర్చుకున్నాడు. ఒక కవి రచయిత తన మట్టి రుణం తీర్చుకోవడానికి ఇంత కన్నా ఏమి కావాలి? తుమ్ భూల్ భీ యాద్ నహీకర్తె హెగోయా! హమ్ తుమారే యాద్ మే సబ్ కుచ్ భులాదియా” నువ్వు పొరపాటున గూడా నన్ను జ్ఞాపకం చేయవు. నేనేమో నీ జ్ఞాపకాల్లో సమస్తం మరచి పోయాను” మనం పట్టించుకోని మరచిపోయిన విలువైన విషయాలను సదాశివ రసజ్ఞులకు అందించాడు. తన జీవితంలో ప్రతి క్షణాన్ని

సౌందర్యాత్మకంగా మలుచుకొన్న రసజీవి. తనను సంపద వరించకున్నా ఎందరో మంది అభిమానుల్ని, మిత్రుల్ని సంపాదించుకున్న సాహితీ బంధువు.

సంగీత సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేసినందుకు గాను సదాశివను రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు నిచ్చి గౌరవించింది. తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేటును ఇచ్చి ఘనంగా సత్కరించాయి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదాశివకు “రాజీవ్ ప్రతిభా పురస్కారానిచ్చి అభినందించింది. కేంద్ర ప్రభుత్వం సదాశివకు తన 83వ యేట 2011 సంవత్సరమునకు “స్వరలయలు” పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బహుకరించింది. సాహితీ దిగ్గజం సదాశివ ఆగస్టు 7, 2012న లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. తెలుగు సాహిత్యం ఒక అపురూపమైన వాక్యాన్ని కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com