ఈ కాలం వచ్చే సరికల్లా నాటి కథల్లో కొంచెం ఇంగ్లీషు పదాల వాడకం కనిపిస్తుంది .తొలి నాటి కథల సంపాదకులలో ఒకరైన ముదిగంటి సుజాత రెడ్డి అన్నట్టు ఈ కథలు ఆంగ్ల కథల ప్రభావం తో వచ్చినవి కావు . ఉర్దూ లోని ప్రేమ్ చంద్ ,కిషన్ చందర్ ,మొదలైన రచయితల రచనల ప్రభావం తో వచ్చినవి .అయినా కొన్ని కథలలో ఈ ఆంగ్ల పదాల వాడకం ఓ విశేషం .కాళోజి నారాయణ రావు ,పి.వి . నరసింహా రావు లాంటి ప్రముఖులు ఈ కాలం లో కథలు రాశారు .కథలన్నిటి లోనూ గుర్తించ దగిన సామాజిక స్పృహా కనిపిస్తుంది .జాగ్రత్త గా గమనిస్తే సాహిత్య ప్రక్రియ నిర్వహణ తో పాటు ,ప్రజల జీవన గతులు కూడా తెలుస్తాయి .

1940 లో వచ్చిన అందుగుల లక్ష్మణ రావు కథ లో చలం ప్రసక్తి వస్తుంది .మా డరన్ కేఫ్ , హిందూ దినపత్రిక చూడడం ,కాఫీ స్ట్రాంగ్ ,ఇవన్నీ ఆ కాలానికి ఆధునిక విషయాలు . నగరీకరణ ప్రారంభానికి చిహ్నాలు .ఇది పల్లె వాతావరణానికి చెందని ఆ కాలపు కథ .

ఓ యువకుడు వితంతువుని వివాహం చేసుకోవాలనే ఆదర్శం తో ఉంటాడు ,ధైర్యం గా చేసుకుంటాడు . కాని కొంత కాలానికి ఆ వివాహం మీద వెగటు పడి, మరో పెళ్లి కి సిద్ధ పడతాడు .చివరికి ఆ అమ్మాయి ఇది అర్థం చేసుకొని వేరే జీవతం గడపడానికి నిర్ణయించుకుంటుంది .మానసిక బలహీనులైన యువకుల చాంచల్యాన్ని చిత్రించిన కథ ఇది .ఇప్పటికి ఇట్లా ఆదర్శాలంటే ఉరికి ,మళ్ళీ ఆచరణ కు వచ్చేసరికి చతికిల పడే యువత మనకు కనిపిస్తుంది.

కాళోజి కవి గా సుప్రసిద్దుడు . తెలంగాణ ఉద్యమ సమయం లో అయన స్పూర్తి మరువలేనిది .ఆయన గొప్ప కథకుడు కూడా అనేది ఈ సంకలనం లో తెలుస్తుంది . మానవ లోకం లో (కులం కంపు ఉన్న భారత దేశం లో ) జరిగిన కుమ్ములాట లో మృతి చెందిన మనుషుల ఆత్మలు మాట్లాడుకోవడం ,1943 లో వచ్చిన కాళోజి ‘’తెలియక ప్రేమ ,తెలిసి ద్వేషము ,’’ అనేకథ లో చిత్రించిన అంశం .దేవాలయ ప్రవేశం కోసం హరిజనులు చేసిన పోరాటం ,దాన్ని నిరోధించటం కోసం బ్రాహ్మణులు నిలబడ్డ తీరు చిత్రించారు ఈ కథలో . మృతి చెందిన మనుషుల ఆత్మలు కూడా ఒకరి కులం ఒకరికి తెలియనపుడు స్నేహం గా మాట్లాడుకొని తీరా తెలిశాక అక్కడ కూడా ఈ కులం ఆవృతం లో ప్రవేశించి కీచులాడుకోవడం చూస్తాం . భారత దేశాన్ని ఈ నాటికీ సవాల్ చేస్తున్న కులం యొక్క వికృతత్వం వ్యంగ్యం గా చిత్రించారు కాళోజి .

అట్లాగే ఇదే సంవత్సరం లో వచ్చిన పెండ్యాల శేషగిరి రావు కథ ‘’ముహూర్త బలం ‘’జీవితం లో ఉహించని మలుపులు ఎట్లా వస్తాయో చిత్రించిన కథ .శ్రీనివాస రావు అనే వ్యక్తి పొందిన ఎన్నో ఒడిదొడుకులు ,చివరికి అతడు పెద్ద మోతుబరి కావడం ,అతని అనంతరం అతని కొడుకుల అవివేకం వలన సర్వం కోల్పోయి యథా స్థితికి చేరడం ,ఇందులోని కథనం .’’ఘాటైన జ్యోతిష్యుడు’’ లాంటి గమ్మతైన పదాలు ,జ్యోతిష్యం ,ముహూర్త బలం ,మనుషుల పై ప్రభావం చూపుతాయనే పాత తరం నమ్మకం ,ఇందులో చూస్తాం .కాని జీవితం లో అనుకోని సంఘటనలు జరగడాన్ని పెండ్యాల స్వాభావికం గా చిత్రించారు .మధురం గా పాడే లలిత అనే ఓ స్త్రీ పాటకు పక్కింటి వ్యక్తి ఆకర్షించబడతాడు. అతనూ గాయకుడే .అతని తో కలయికకు ఆమె మౌనం తో కూడిన సిగ్గు అర్ధాంగీకారం తెలుపుతుంది .కాని అతని లో వివేకం మేల్కొంటుంది .ఆకర్షణ నుండి బయటకు వస్తాడు .అతని భార్య, వేరే పేరుతో రాసిన కథ అని చదివి అందులో లలిత పాత్ర తానని ఊహించుకొని ,రాసిన వ్యక్తి పైన ఆగ్రహిస్తుంది. కాని రాసింది తన భర్తే అని తేలడం అందులో కొస మెరుపు .అడ్మైర్ , వీక్ మోవ్ మెంట్ ,లాంటి ఇంగ్లీష్ పదాల వాడకం కనిపిస్తుంది 1945 లో వచ్చిన బూర్ల రంగనాథ రావు ఈ కథ లో .

అదే సంవత్సరం వచ్చిన ధరణి కోట శ్రీనివాస్ రావు ‘’చల్లపులుసు’’ కథ హాస్య దృక్పథం తో రాయబడింది .కాని చల్ల పులుసు తెలంగాణ కే చెందిన వంటకం. మిత్రుడు ఇంటికి వచ్చి భోంచేసి తాను తిన్నవాటిలో ఈ చల్ల పులుసు బాగుందని ,కొత్తగా ఉందని మెచ్చు కుంటాడు .వంట చేసినామెను భర్త ,పిల్లలు ,చల్ల పులుసు, అని చల్లపులుసు స్పెషలిస్ట్, అని ఆటపట్టిస్తారు. ఇదే కథ లో అప్పటి వివాహ పద్దతులు అన్యాపదేశం గా చెబుతాడు రచయిత .

‘’మన పెద్దలకు ఎంత సేపు కుటుంబ సంప్రదాయాలు ,కట్నాలు ,మర్యాదలు ,గొప్పలు గోడులు ,కావాలి గాని ,పిల్ల ,పిల్లవాడి ఇష్టాఇష్టాలు ,ఎవరికీ కావాలి ? పిల్ల అందం గా ఉందా ? అని ఎవరైనా ధైర్యం చేసి అడిగితే ,అందం దేనికోయ్ ? జుర్రుకు తినడానికి ,సంసారం చేయాలి గాని ,అని సమాధానం చెబుతారు .

ఇంకా ఈ కథలో ఇంగ్లీషు పదాలు వాడడం , ఉత్తరాలు రాయడం ,లాంటి అంశాలు చూడవచ్చు .ఆ రోజుల్లో ఉత్తరాలు రాయడం కూడా ఒక కళే.

ఆ రోజుల్లో అన్ని కులాలలోను ,కుల భావన విపరీతం గా ఉండేది . కులం కట్టు వీడిన వానికి కుల బహిష్కారం ఉండేది .కుల బహిష్కరణ జరిగిన వాడు కులం లో కలవాలంటే ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ కులం లో కలుపుకోనేవారు. .ఇప్పటికి ఇలాంటి దుష్ట సంప్రదాయాలు అక్కడక్కడా కొనసాగుతున్నాయి. నాడు ఒక వంక భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతుంది .గాంధీ ప్రభావం దేశవాసులపై పుష్కలంగా ఉంది .కులరహిత సమాజ నిర్మాణ ఆదర్శాలు ఒక వంక వినిపిస్తున్నాయి . కులవ్యవస్థ బలం గా ఉన్న కాలం అదే .ఓ పద్మశాలి కుటుంబం లోని యువకుడు కులాంతర వివాహం చేసుకొని ,కష్టాలు పడిన వైనం చిత్రించిన కథ ఇది . ఈ కులాంతర వివాహం వల్ల అతని తోబుట్టువులను భర్తలు వదలి పెడతారు . ప్రాయశ్చిత్తం గురించిన ప్రస్తావన కూడా కథలో వస్తుంది .ఒక కులం వాడు మరో కులం వాడి నీళ్ళ బిందె ఎత్తడం కూడా తప్పనే నిమ్న స్థాయి లో ఉన్న సమాజం ఈ కథ లో కనిపిస్తుంది .

సాంప్రదాయానికి అభ్యుదయానికి స్పర్డ నాటినుండి ఉన్నదే .కమ్యూ నిస్ట్ భావాలు గల భర్త ,తన భార్యను తన భావజాలం వైపు ,కార్య కర్తుత్వం వైపు రమ్మని శాసించడం , 1945 లో ప్రతిమ రాసిన నిట్టూర్పు అనే కథ . భర్త కమ్యూనిస్ట్ సహచరులు కూడా భార్యకు తమ ఉద్యమం లో చేరమని చెబుతారు .ఆమె సంప్రదాయాభిమాని . అంగీకరించదు. ఎదుటి వ్యక్తి ఇష్టాన్ని గౌరవించలేని భర్త , చివరికి వార్దా కు, మహాత్ముని దగ్గరకు వెళ్లాలని ఆమె నిర్ణయించుకుంటుంది . స్టేషన్ లో రైలు పక్కన ఆమెను ఆపడానికి పరుగెత్తుకొచ్చిన భర్త , ఆమెను కదలుతున్న రైలు నుంచి కిందకు లాగుతాడు.కింద పడిపోయిన ఆమె తలకు బలమైన గాయం అవుతుంది . పోలీసుకు భర్తను రక్షించడానికి చిన్న గాయమే అని చెబుతుంది .కాని ఇంటికి తీసుకెళ్లేసరికి ఆమె మరణిస్తుంది . నాటి సమాజం లోని సంప్రదాయ ధోరిణి, భర్త ప్రాధాన్యం , కమ్యూనిజమ్ సమాజం మీద చూపెడుతున్న ప్రభావం ,దాని ఫలితాలు ,మానవ వైరుధ్యాలు ,ఈ కథ లో చిత్రించారు ప్రతిమ .

జీవితం లో అనుకోని మలుపులు ఉత్తాన పతనాల స్వాభావికత ను చిత్రించిన మరో కథ 1946 లో సర్వదేవ భట్ల నరసింహ మూర్తి రాసిన భిక్షుకులు.

తలిదండ్రులు లేని అనాధ గా మిగిలి .బాధ పడిన వ్యక్తి .చివరికి పట్టబద్రుడై ఉద్యోగస్తుడవుతాడు . రసాయనిక శాస్త్రవేత్త అవుతాడు .వికాసం జరుగుతుంది. కూతురు జన్మిస్తుంది .భార్య మరణించి మరల విషాదం లో మునుగుతాడు .తరువాత అంధుడై ఉద్యోగం కోల్పోతాడు.చివరికి ఒక ఇంట్లోకి వెడితే ఆ అపరిచిత వ్యక్తి తన కూతురును బలాత్కరించబోతాడు .తన చేతి లో కర్ర విసరగా అది పొరపాటున ( అంధుడు కావటం వల్ల)తన కూతురు కే తగిలి ఆమె మరణిస్తుంది .ఈ విషాదాంత కథను రచయిత చిత్రించిన తీరు హృదయ మూలాలు కదలిస్తుంది .ఇందులో రచయిత అక్కడక్కడా వాడిన కవితామయ వ్యక్తీకరణలు ఉదాహరణ కు , 1)అతడు సంసార సాగరం లో రాజహంస వలె ఈదసాగాడు .2).అతని హృదయము సంతోషము గా గంతులు వేయుచున్నది 3)రెక్కలు రాని పక్షి వలె కొట్టుకున్నాడు 4) దిక్కులు లేని యతి వలె రోదన చేశాడు లాంటి కవితాత్మక వ్యక్తీకరణ ల తో కొనసాగించాడు ,

కొంత మంది ఆదర్శ వంతులలాగా నటిస్తారు .కాని వాళ్ళ దాకా వెడితే కాని అర్థం కాదు వాళ్ళ ఆదర్శం .నాటి జాతీయోద్యమ సందర్భం లో ఇలాంటి అవకాశ వాదం గురించి చెప్పిన కథ 1946 లో వెలువడిన నాగులవల్లి కోదండ రావు కథ దేశ మాత కశి.

దేశం లో సత్యాగ్రహం నడుస్తన్న కాలం లో ఒక ఊరి లో ఉన్న పెద్దలందరూ కూడి. తాము కూడా ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొనాలని ఆలోచిస్తారు .ఊరి నుండి ఎవరినో ఒక్కరిని పంపాలని నిర్ణయించుకుంటారు .అందరూ ఆలోచన సమర్థిస్తారు కాని ఎవరూ ముందుకు రారు .ఒక అనామకుడు ముందుకు వస్తాడు . ఆ ఊరికి నాయకుడు లాంటి సత్యనాథం పంతులు కూడా తన రంగు బయట పెట్టుకుంటాడు .

ఇదే సమయం లో సమాజం కోసం ఎంత సాహసమైనా చేసే వీరవనితలు కూడా గ్రామ ప్రజలలో ఉన్నారు . అట్లాంటి స్త్రీ కథే పీ.వి. రాసిన గొల్ల రామవ్వ కథ .ఈ కథ కూడా 1948 సంవత్సరమే వెలువడినది .గసొంటి ,గడంచె ,లాంటి తెలంగాణపదాల తో పాటు అనుల్లంఘనీయం ,పయస్సంగీతం ,తరుణసింహం, లాంటి సంస్కృత పదబంధాలు కూడా ఈ కథ లో ఉన్నాయి .కమ్యునిస్టులు, వాళ్ళను వెతుకుతూ వచ్చిన పోలీసులు ,ఘర్షణ తో అట్టుడికిన కాలం అది. ఒక విప్లవ యోధుడైన యువకున్ని గొల్ల రామవ్వ తన మనవరాలి దగ్గర పడుకోబెట్టి పోలీసులను వాళ్ళను భార్యా భర్తలని నమ్మించి ఆ వీరుణ్ణి పోలీసులనుండి కాపాడిన కథ ఇది . .నాటి రక్తసిక్త తెలంగాణ కు అద్దం పట్టిన కథ ఇది . అటువంటి భయానక వాతావరణం లో గొల్ల రామవ్వ లాంటి వీరవనితలు ,చమత్కారులు ,కూడా తెలంగాణ లో ఉండేవారని చాటిచెప్పిన పి.వి. కథ ఇది .

ఎం . హీరాలాల్ రాయ్ ఇదే ఏట రాసిన కథ ‘’ఎవరి కథ రాయను?’’ ఈ ప్రశ్న వేస్తూనే అందరి కథ రాస్తాడు .ఇది కథ అనడం కంటే సమాచారం అనాలి. జర్నలిస్ట్ లను సిగరెట్ లాగా వెలిగించుకొనే రాజకీయ నాయకులు , రహస్య జీవితం గడుపుతూ నిన్నటిదాకా ప్రభుత్వం తో పోరాడిన విప్లవకారులు,సన్నని పూచ కాళ్ళు,కర్ర పుల్ల లాంటి చేతులు ,కలిగిన సగటు మనుషులు అయన ఆలోచనలకు వచ్చారు .వదినతో చమత్కారం గా వాళ్ళ పిల్లలని గురించి ‘’మీరిద్దరూ కూడబలుక్కొని ఈ ఉత్పత్తి ని ఆపండి ,లేకుంటే ఎవరైనా లక్షాధికారి కి తలా ఒకన్ని పెంపకం ఇవ్వండి ,అనే మాట నాటి కుటుంబాలలో సంతన నిరోధం లేని అఙ్ఞానాన్ని చాటుతుంది .

ఆ కాలం లో తర తమ బేధాలు చాల ఎక్కువ . ఒక ఇరవై ఏండ్ల కింది వరకు ఇవి బాహాటం గా నే కొనసాగాయి .ఒక పాలేరు పిల్లవాడితో యజమాని పిల్లవాడు ఆడుకోవడం జీర్ణించు కోలేనివారు ఈ కాలం వరకు కూడా ఎందరో ఉన్నారు .ఈ కోవకు చెందినదే పాలేరు తమ్ముడు కథ .ఈ కథను 1948 లో మానేపల్లి తాతాచార్య రాశారు .

బాలసంఘ సభ్యులం –భారత మాత పుత్రులం కులము మతము ఏదియైన కలసి మెలసి ఉండెదం

ఈ పాట తో మొదలౌతుంది కథ .యజమాని కొడుకు బుల్లయ్య ఆ పాట పాడే వాళ్ళ తో అడుకొంటానంటాడు .తల్లి అంగీకరించదు .బుల్లయ్య పట్టు పడతాడు . పాలేరు కుర్రవాడు వెంకడిని తోడు పంపిస్తుంది .వెంకడు కూడా ఆటలో పాల్గొంటాడు.బుల్లయ్య మొదట వద్దన్నా చివరికి కలసి అడుకొంటాడు .

చాలామంది అధోజగతి కుటుంబాల పిల్లవాళ్ళకు ఇది నిత్యానుభవమే. రచయిత ఈ అనుభవం చెబుతూ అంతరాలున్న సమాజాన్ని అన్యాపదేశం గా మన కళ్ళ ముందు పెడతాడు .

సామాజిక అంతరాలు ,దైన్యులైన స్త్రీల పట్ల అఘాయిత్యాలు ,నేటి పరిస్థితులకు తీసిపోనివే ఆనాడు కూడా ఉండేవి .దైన్య స్త్రీల పట్ల చులకన భావం ,దానితో పాటు కామేచ్చ ,కనిపించేది .ఈ పర్యవసానాన్ని చిత్రించిన కథ 1950 లో తాళ్లూరి రామానుజ స్వామి రాసిన బిక్షిణుల కథ .

కథ పాతకాలపు కథా కథన ధోరిణి తోనే ప్రారంభమౌతుంది .రచయిత అనేక మార్లు కవిత్వ ధోరిణి లోకి వెడుతుంటాడు. ‘’ ఇద్దరు భిక్షిణులు కాల కిరాతుని చే కాల్పబడిన హృదయాల్లో స్వార్థపరత్వం తో నిండిన ఈ పాడు మానవ సంఘం యొక్క ,పదాఘాతాలతో ముక్కలైన ఆశయాలతో దారి ప్రక్క చెట్ల క్రింద గుడ్డ పీలికల్లో తమ శరీరాన్ని పూడ్చి పడుకొని ‘’ ఈ విధం గా సంభాషిస్తారు.

ఓ అటుకులు అమ్ముకునే వ్యాపారి భిక్షుకిని మోసగించిన కథ ఇది .తల్లి కూతురుకి చెబుతుంది .ఆ అటుకుల వ్యాపారి వల్ల నే తాను పుట్టానని కూతురు కి తెలుస్తుంది .తరువాత అ కూతురు ఒక పోలీసు బలాత్కారానికి గురౌతుంది .చివరికి తల్లి అర్ధ రాత్రి పిడుగు పాటు వల్ల మరణిస్తుంది.కూతురు నది లోకి దూకి ఆత్మ హత్య చేసుకుంటుంది .చివరికి నాటి వ్యాపారి కొట్టు ముందున్న శవాన్ని గుర్తించి కంగు తింటాడు .తానొక ఉదారునివలె నటిస్తూ దహనం చేస్తాడు .ఈ విషాద కథ , శైలి కూడా భిన్న ధోరిణి లో నే కొనసాగుతుంది .

‘’మళ్ళీ నిశాకాంత పరుగు మొదలైంది ‘’

‘’ఈ మాటలు విని పరధ్యానం లో త్రాచు పాము పై కాలు పెట్టినట్లు ఉలికి పడ్డాడు ‘’

‘’వారి స్థితి చూసి ఆకాశం కన్నీరు కారుస్తున్నదా అన్నట్టు ,చినుకులు చాల మొదలైనవి .’’

ఇట్లాంటి కవితా వాక్యాల తో సాగిపోయే ఈ కథ నాటి సమాజం లోని మానవ విచక్షణను ,క్రౌర్యాన్ని దైన్యాన్ని చిత్రించింది .

ఈ పదేళ్ళ కాలం లోని కథలన్నింటి లో గొప్ప సామజిక దృక్పథం కనబడుతుంది .ప్రజల్లో ఉన్న స్వతంత్రేచ్చ కు ఇవి అద్దం పడతాయి . తెలంగాణా సమాజం యొక్క పునాదులు తవ్వి మన ముందు పోస్తాయి ఈ కథలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com