-డా. నలిమెల భాస్కర్

తెలంగాణ భాషకు నాద సౌందర్యాన్ని కల్గించడానికి ఈ పూర్ణానుస్వారమే గాక మరొక లక్షణం సైతం వున్నది. అది ద్విత్వాగమనం.

b)ద్విత్వం:- ఒక‌ హల్లును ద్విరుక్తం పల్కితే ద్విత్వం. అక్క, చెల్లి, మొదలైన మాటల్లో క్క, ల్లి లు ద్విత్వాలు. ఈ ద్విరుక్తాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. ఇది అంతటా వున్న సమాన లక్షణం. కానీ చిత్రం ఏమిటంటే తెలుగు భాష పదాలు కొన్ని తెలంగాణలో అదనంగా ద్విరుక్తం కావటం. ఉదాహరణకు ‘మసి’ పదం తీసుకోండి.

ఇది తెలంగాణలో ‘మస్సి’ అవుతున్నది. మసాల, గసగసాలు, అనగల మాట, దయగల తల్లి, ఆత్మ గల చెయ్యి, అనే పదాలూ పదబంధాలూ వరుసగా “మస్సాల, గస్సాలు, అనగల్ల మాట, దయగల్ల తల్లి, ఆత్మ గల్ల చెయ్యి” లుగా మారుతున్నాయి.

కొన్ని హల్లులను నొక్కి చెప్పడం వల్ల ( మస్సి, మస్సాల, గస్సాలులో ‘స’ ను, మిగిలిన అనగల్ల మాట వంటి పదాల్లో “ల”ను) ఊనికతో పల్కడం వల్ల ఆ పదాలకు శక్తి వస్తున్నది. ఈ ద్విత్యాలు ఉచ్చారంగా విధేయంగా మాత్రమే వచ్చి చేరాయనుకోవటం పొరపాటే అవుతుంది. నాదాన్ని కల్గించడానికి వచ్చాయి. లబో దిబో మనడం ( లబ్బ లబ్బ మొత్తుకున్నాడు) కాళ్ళు తట తటా తాటించడం ( తట్ట తట్ట కాల్లు గొట్టుడు), బరా బరా గోకడం (బర్ర బర్ర గోకుడు), త్వర త్వరగా నడవడం ( సర్ర సర్ర నడుసుడు), కిలుక్కున నవ్వడం( కిల్ల కిల్ల నవ్వుడు), కిసుక్కున నవ్వడం( కిస్స కిస్స నవ్వడం), గొర గొరా లాక్కుపోవడం( గొర్ర గొర్ర గుంజుకపోవుడు), తుపుక్కున ఉమియడం( తుప్ప తుప్ప ఊంచుడు), కొఱి మీనులు( కొర్ర మట్టలు), మహా వైళం(మా‌ ఎల్లెం), చొరగొట్టడం( సొర్ర గొట్టుడు), విచిత్రం( ఇచ్చంత్రం), అఱ( అర్ర), ఎఱ(ఎర్ర)…ఇట్లా వందలాది ద్విత్వ రూపాల్ని చూడవచ్చు.

పాపాయి కన్నాల్లు కలువ రేకుల్లు/ పాపాయి జుంపాలు పట్ట కచ్చుల్లు/ పాపాయి దంతాల మంచి ముత్యాలు/ పాపాయి చేతుల్లు పొట్ల కాయల్లు అనే పాటలోని కన్నుల్లు, రేకుల్లు, కుచ్చుల్లు, చేతుల్లు, పొట్ల కాయల్లోని చివరి ద్విత్వ లకారం ఎందుకొచ్చింది? పాడుకోవటానికి వీలుగా వచ్చింది. అట్లాగే ” మా పాప మామల్లు మత్య్సావతారం/కూర్చున్న బావల్లు కూర్మావతారం/వరసైన బావల్లు వరహావతారం” పాటల్లోని ద్విరుక్త లకారము ఆ బాబతే! అదుగో.. అటువంటి అద్భుత నాదసౌందర్యావకాశ ద్విత్వాగమనం గమనంలోకి తీసుకోవడం లక్షణం.

c) యతిమైత్రి:- తెలంగాణ భాషకు గొప్ప ‘లయ’ నూ, ‘సంగీతాన్నీ’, యోగ్యతనూ కల్గించింది యతిమైత్రి. ఈ యతిని యతి తెలంగాణ భాషకు సంబంధించిన ప్రత్యేక లక్షణం కాదు. ఇది తెలుగు భాషా లక్షణం. కన్నడానికి యతి లేదు. ( కన్నడక్కె యతి యిల్ల- కోణెక్క(ఎద్దు) యతి యిల్ల- అని కన్నడ సామెత) తెలుగు భాషా సహజ స్వభావం అయిన యతి తెలంగాణ భాషలో యిప్పటికీ గొప్పగా నిలిచివుంది.

తెట్టున తెల్లారుడు (భళ్ళున తెల్లవారడం), బెక్కన బెంగటిల్లుడు( బాగా బెంగ పెట్టుకోవడం), పట్టున గుండె పల్గుడు( గుండె పగిలి ఏడ్వడం) చెటాన చెంపదెబ్బ ఏసుడు( లెంపకాయ వేయడం), చెంప చెటిల్లుమని పించుడు( చెంప చెళ్ళుమనిపించడం), జబ్బలు జారేసుడు( మొహం వేళ్ళాడేసుకోవటం), పాలు పల్గుడు( పాలు విరగడం), జరం జారుడు( జ్వరం తగ్గడం), పిటాన పిరం( ధరలు మండిపోవటం), కాట కల్సుడు ( దారి తప్పిపోవడం), కటాల్న ఊరంత కదులుడు( ఊరు ఊరంతా కదిలిపోవటం).. యిటువంటి పదబంధాల్లో వాక్యాల్లో యతినివాతి వుండి నాదానికి మూలమవుతున్నది. బ్రాకెట్లలో యిచ్చినవి దాదాపు ఆధునిక ప్రమాణ భాష తాలూకువి). తెలంగాణ మాటల్లో ఎంత అవలీలగా యతి దొర్లుతున్నదో చూడవచ్చును. సామెతలు, జాతియాలు, నుడికారాలు, పాటలు, మాటలు… ఒక్కటేమిటి సమస్త భాషావ్యవహారం యతితో వుంటుంది. ” ఏం చెప్పమంటరు సారూ నా బాద. ఇగ చెప్పుడు మొదలుపెడితే, కార్జాలు కాలిపోతై- గుండెలు కూలిపోతై”. అంటుంటారు బాధితులు. కార్జాలు కాలడంతో , గుండెలు కూలడంలో యతి లేదూ!( యతి మైత్రి) . ‘పైనొక పలక క్రిందొక పలక/ పలకల నడుమ మెలికల పాము’ ఇది. పై దవడా, కింది దవడా మధ్య వున్న నాలుకను వుద్దేశించిన పొడుపు కథ. ఈ “పొడుపు” ఎంత పొదుపుగా వుందో, ఎట్లా యతిమైత్రియుతంగా వుందో తెలంగాణలో చూద్దాం.‌ పలుగు రాల్లల్ల పాము బొర్లాపడుతది. పలుగు రాళ్ళంటే తెల్లని దంతాలు. పాము నాలుక ఎంత చక్కటి ప్రహేళిక యిది! ఈ యతిని తెలంగాణీయులు తిట్లలోనూ మర్చిపోరు( మొకాన మొద్దాలు పెట్ట, చేతులకు జెట్ట పుట్ట, కడుపు కాలిపోను, కాడు గాలి పోను)- అల్లుడు వచ్చాడు, చొక్కా విప్పాడు. బావిలో దూకాడు” అనేది ఆధునిక ప్రమాణ భాషా పొడుపు కథ. తెలంగాణ లో యిది ” బట్టలు యిప్పి బాయిల దూకుతడు”. ఇంతే! యతిని యతిగా రావడం వింతే!! పదాల సంఖ్య కొంతే!!

d) పదమధ్య అచ్చులోపం:- అపదాది అచ్చులు అంటే పదం మొదట్లోని అచ్చు కాకుండా పద మధ్యంలోని అచ్చు లోపించడం. ఆ తర్వాత రెండు హల్లులూ కల్సి సంయుక్తాక్షరంగా మారడం. ఇది ఉచ్చారణగా విధేయంగానూ, వేగోచ్చారణ కారణంగానూ కలిగే మార్పు. ఈ లక్షణం తెలుగు భాషలో నన్నయ నుండీ వుంది. తెలంగాణ లో యిది ఎక్కువ. సూత్కం( సూతకం), జాత్కం( జాతకం), పాత్కం(పాతకం), దాప్కం(దాపకం), దోప్కం(దోపకం-దోపిడి), ఉన్క(ఉముక, ఉనుక, ఊక), ఎన్క(వెనుక), దన్క(దనుక)…ఇట్లా ఎన్ని వుదాహరణలో చూడవచ్చును. ఈ పదమధ్యా లోపం వల్ల కూడా తెలంగాణ భాషకు నాదమాధుర్యం చేకూరింది. ఈ నాద సౌందర్యాన్ని నిలువునా నింపుకున్న తెలంగాణ పాటలు తెలంగాణ ప్రత్యేకత. అందుకే తెలంగాణ ప్రాంతంలో జానపద గేయాల ఆలాపన ఎక్కువ. తెలంగాణ సాహిత్యంలో దేశి పద్ధతి మిక్కిలి. ఒక గద్దర్, గోరటి, అందెశ్రీ ప్రభృతుల పరంపర, నాద సంభరితమైన పాటల తామరతంపర పరస్పర ధారితాలు- ఒకదానికొకటి పరిపూరకాలు

2. అర్థవంతమైన భాష:- తెలుగు భాష అర్ధవంతమైనది. తెలుగులోని చాలా పదాలకు వ్యుత్పత్తి చెప్పటం వీలవుతున్నది. సి.పి. బ్రౌన్ కనునది కన్ను‌ అనీ, వినినవి వీనులనీ, చేయునవి చేతులనీ, కదలునవి కాళ్ళు అనీ, కుడిచె అంటే తినే తాగే చేయి అనీ, ఆ చేతికి కాస్త ఎడంగా వున్న చేయి ఎడమ చేయి అనీ, తల మొండెం కాళ్ళూ చేతులకు నడుమభాగంలో వున్నది నడుము అనీ, పెళ్ళి తర్వాత తన తల్లి వంక వారినీ, ఆలి వంక వారినీ అల్లుబాడు అల్లుడు అనీ…యిలా చాలా పదాలకు వ్యుత్పత్తి చెప్పాడు. నిజమే మరి! కోడె ప్రాయంలో వున్న ఆలు కోడలు, వేరు పడదామని పోరు పెట్టే ఆలు ఏరాలు, మే మే అనునది మేక, కావు కావు మనునది కాకి, కూ కూ అని పాడేది కోకిల, పీ పీ అని పలికేది పీక.. ఈ విధంగా చాలా మాటలకు మూలాలు అన్వేషించగలం తెలుగులో, ఈ అర్థవంతమైన మూల పదాలకు తెలంగాణ భాషలో కొరతే లేదు…వెలితే లేదు..కొదవే రాదు. తల కింద మెత్తగా వుండటానికి పెట్టుకునే మెత్త( దిండు), చల్లగా వుండి చల్లదనాన్ని కలిగించే చల్ల(మజ్జిగ) , లోపల బోలుగా వుండే బోలు ప్యాలాలు( మరమరాలు), ఎర్రని రంగంలో వుండి చేపలు పట్టడానికి ఎరగా గాలానికి గుచ్చే ఎర్ర( వానపాము) , మేరల మేరకు అంటే హద్దులూ కొలతల ప్రకారం గుడ్డలు కత్తిరించి కుట్టి యిచ్చే మేర(దర్జీ), పంటను వేసిందగ్గర్నించీ ఇల్లు చేరేదాకా కాపలా‌ కాసే కాపు( రైతు), అంగాన్ని అంటే శరీరాన్ని అచ్ఛాదనం చేసే అంగి(చొక్కా), వేసుకునేటపుడూ , తీసివేసేటపుడూ లాగుతూ వేస్తూ తీసే లాగు( పంట్లాము), లోపల గుల్లగా, ఖాళీగా వుండే గుల్ల(గంప), గుండ్రంగా చిన్నగా వుండే గుండీ(బొత్తాము), గోళాకారంలోని గోలి(మాత్ర), పాము పడగ విప్పిన ఆకారంలోని ఆకులు( నిజానికిది కాండం) కల్గిన పాముపడిగె చెట్లు (నాగజెముడు).. యిట్లా వేలాది తెలంగాణ పదాలు అర్థవంతమైనవి. అంటే మూలం చెప్పగల వీలున్నవి. బ్రాకెట్ల లో యిచ్చిన పదాలు దాదాపు ఆధునిక ప్రమాణ భాషలోనివి.పై పదాల స్వరూప స్వభావాల్ని గమనిస్తే తెలంగాణ తెలుగు పదాల్లో ఎంతగా తెలుగుదనం, తెలుగుధనం వుందో కూడా తెలిసివస్తున్నది.

3. ఆత్మీయతా పరిమళం:- భాష సంస్కృతీస్ఫోరకం,ఆత్మీయతాద్యోతకం, ప్రపంచంలోని ప్రతిభాషలోనూ, ఆ భాషా మర్యాదల్లోనూ, సభ్యతా సంస్కారాల లోనూ, భాషా వ్యవహారం లోనూ ఆత్మీయత తప్పనిసరిగా వుంటుంది.

ఈ ఆత్మీయతా ముద్ర కాలం యింతగా మారినా పల్లెటూళ్ళ తెలంగాణ భాష లో ప్రతి మాటలో కన్పిస్తున్నది. సంభాషణలు ముఖ్యంగా సంబోధనల్లో, పిలుపుల్లో యిది మిక్కిలి ప్రస్పుటమవుతున్నది‌. ఉదాహరణకు- ” అన్నా ఎటు పోతున్నడే”, “అవ్వా మంచిగున్నవా?”, ” తమ్మీ జర పైలం”, “తాతా! ఏం పరాశికావే”, ” నాయినా, నా మొర ఏ దేవునికి ముడుతదో”, “చెల్లే, బావ బతుకమ్మ ‌పండుగకు పంపలేదానే” “మర్దలు పిల్లా, ఈ నడుమల జెర్ర నిగనిగ అయినవు గని”, .ఇటువంటి మాటతీరు తెలంగాణది. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళ భాషలో పిలుచుకుంటే తొణకిసలాడే ఆత్మీయతా గంధం వేరు- నెలకొనే ఆప్యాయతా బంధం వేరు. ఒక ప్రాంతం వాళ్ళు మరో ప్రాంతం వాళ్ళ మాటతీరు లో వ్యవహరిస్తే ఆత్మీయతే కాకుండా ఆ ప్రాంత ఆత్మ ‌సైతం లోపిస్తుంది. ఎవరి భాష వారికి తీపి. ఎవరి యాస వారికి గొప్ప.” అన్నా” అనే సంబోధనని తెలంగాణ లో అన్నయ్యా అన్నారనుకోండి..అంతా అసహజం. చెల్లెను చెల్లీ అన్నా, తాతను తాతయ్యా అన్నా, నాయినను నాన్నా అన్నా, తమ్మీ అనే పిలుపును తమ్ముడూ అన్నా, అవ్వా అనే మవ్వమైన మాటను అమ్మా అన్నా అంతా కృతకం. పైగా అన్న, తమ్మి, చెల్లె, తాత, అవ్వ మొదలైన సుడుల్లో ప్రాచీనత గుడి కట్టుకుని వుంది.

ఇంకా “ఎవని నెత్తురు వానికి కొట్టుకుంటది”, ” తోడపుట్టిన తోడు దొర్కది”, నీ కడుపు సల్లగ వుండ, నీ కడుపున అంబలి పడ”, మొదలైన నుడికారాల్లో ఎంత ఆత్మీయత నెలకొన్నదో చెప్పవలసిన పని లేదు.

4) అందమైన భాష:- జలుబూ, సర్ది కారణంగా ముక్కులోంచి చీమిడి కారుతుంటే “చీమిడి వచ్చింది” అని వ్యవహరిస్తే రోతగా వుంటుందని తెలంగాణ వాసులు “ముక్కు వచ్చింది” అంటారు. గవద బిల్లల‌ వ్యాధిని “చెంపలు వచ్చినయి అని అంటారు. గోరుచుట్టును జెట్టరోగం అని పల్కడానికే జంకుతారు. అంత బాధాకరమైన భయంకర వ్యాధి అనే అర్థం లో, కండ్ల కలకను ” కండ్లు వచ్చినయి” అని వ్యవహరిస్తారు. బహిర్భూమికి వెళ్లాడు అనే అర్థం లో చిత్రంగా , తెలంగాణలో అర్థగౌరవంతో “వాడు సుట్టాల మార్గం పోయిండు” అంటారు. ఇంకా “పాకిస్తాన్ కు పోయిండు” అనీ మాట్లాడుతారు. దేహశుద్ధి చేశారు అంటే “వీపు సాపు చేసిండ్రు” అనేస్తారు. ఇంకా “ఈపుల పాపయ్యను లేపిండ్రు” అనీ వ్యవహరిస్తారు.

అచ్చతెనుగుతనం:- తెలుగు భాషలో తత్సమాలు, తద్భవాలు, దేశ్యాలు అన్ఉదేశ్యాలున్నాయి, గ్రామాలూ వున్నాయి, కొందరు వ్యాసకర్తలు అంగీకరించకున్నా. తత్సమాలు అంటే సంస్కృత ప్రాకృత సమాలు. మరి అచ్చతెనుగు అంటే? సంస్కృత నమాలు మినహా వున్న ప్రాకృత నమాలు, తద్భవాదులు. తెలంగాణ లో ఈ తెలుగుతనం ఎక్కువ. తెలంగాణ అనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోని పల్లెవాసుల పలుకుల్లో ఇది అధికం. తెలంగాణ యిక్కడి లక్ష్యం కనుక ఆ తెలుగుతనం పరిశీలనార్హం. ఆధునిక ప్రమాణ భాషలోని ఆత్మబంధువు తెలంగాణ లో “పానం అసోంటి సుట్టం” గా కనిపిస్తడు. అర్థాకలితో బాధపడుతున్నాడు అంటే “సగం కడ్పుకు తిన్నడు అంటున్నారు తెలంగాణలో. అర్థరాత్రి తెలంగాణ లో చెరిసగం రాత్రిగా చీకట్లు చిమ్ముతున్నది. ఇంకా నడిజాము రాత్రిగా భయం గొల్పుతున్నది. మీదుమిక్కిలి ” దొంగరాత్రి”గా బెంగ కల్గిస్తున్నది. కేశాకేశీ కచకచా పోట్లాటలు తెలంగాణ లో “శికెల్ శికెల్ పట్టుకోని” కొట్టుకుంటున్నవి. బాల్యం, వృద్ధాప్యాలు, చిన్నతనం, ముసలితనంగా పరివర్తితం అవుతున్నవి. జ్ఞానం తెల్సిన తనంగానూ, అజ్ఞానం తెల్వనితనంగానూ, మిడిమిడి జ్ఞానం తెల్సీ తెల్వని తనంగానూ తెలిసివస్తున్నది తెలంగాణలో. ఈర్ష్య, ద్వేషం, కండ్లమంటతనం, కన్నెర్రతనం, ఓర్పుమల్లెగునం, ఓర్వలేని తనంగా రూపుదిద్దుకున్నది. అందం సక్కదనం, రామసక్కదనం అయ్యింది చక్కగా. చోరీ దొంగతనంగా మారిపోయింది.

అన్యభాషా పదాలు:- ఏ భాషలోనైనా యితర భాషా పదాల చేరిక అనివార్యం అవుతుంది. మన భాషావసర పరిపూర్తి కోసం గానీ, పాలక భాష ప్రభావం చేత గానీ, పాలిత భాషలు పాలక భాషల పదాలే గొప్పవి అనుకొన్న కారణం చేతగానీ, ఆధిపత్య భాషల అధికారం వల్లగానీ…అన్యభాషలు అన్ని భాషల్లోనూ చేరిపోతాయి. తెలంగాణ ప్రత్యేకత ఏమిటంటే అది ద్రావిడ భాష కనుక ఆ భాష పదాలూ, ముస్లిముల పాలన కారణంగా ఉర్దూ మాటలూ, తెలంగాణ భాష అంటే తెలుగు భాషే కాబట్టి తెలుగులోకి చేరిన సంస్కృతం పల్కులూ, ఆధునిక కాలపు ఆంగ్ల పదాలూ..యిట్లా అనేక భాషల మాటలు యిందులో చేరడం. ముఖ్యంగా ఉర్దూ పదాల చేర్పు ఇక్కడి ప్రత్యేకత.

మొత్తమ్మీద తెలుగు భాష లక్షణాలు చాలా వరకు తెలంగాణ తెలుగు లో వున్నాయన్నది సుస్పష్టం. ఈ లక్షణాలు తెలంగాణ భాషలోకి ఎక్కువగా వుండటానికి మరి కారణాలేమిటి? మధ్యయుగాల నుండి సంక్రమించిన రాజకీయార్థిక, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులు తెలంగాణ నిన్నామొన్నటి వరకూ అనుభవించింది. ఆధునిక లక్షణాలు అంటే ఆధునిక విద్యా సౌకర్యాలు, ముద్రణా యంత్రాలు, పత్రికలు, గ్రంథాలయాలు, గ్రంథమాలలు మొదలైనవి బ్రిటిష్ ఆంధ్రతో పోల్చినపుడు తెలంగాణ లో చాలా ఆలస్యంగా కన్పించాయి. తద్వారా తెలంగాణ సమాజం నిదానంగా మార్పుకి గురి అయింది. సమాజంలో అంతర్భాగమైన భాష సైతం నెమ్మదిగా కదలబారింది. తెలంగాణ చాలా కాలం వరకూ వెనుకబడిన ప్రాంతం.‌కాదు, వెనుకపడ వేసిన ప్రదేశం. సాధారణంగా వెనుకబడిన లేదా పడవేసిన సమాజాల్లో ఆచార వ్యవహారాలు, సభ్యతా సంప్రదాయాలు, సంస్కృతీ సాహిత్యాలు, భాషాదులు అంత తొందరగా మార్పుకు లోనుకావన్నది వారిత్రకయథార్థం. ఆదివాసీ సమూహాల్లో మార్పుకు గురి కాని పరిస్థితి మరీ ఎక్కువగా వుంటుంది. భాషా పరిశీలకులకు తెలంగాణ సీమలోని భాష అనేకమైన మాటల మాటున వున్న రహస్యాంశాల్ని అందిస్తుంది.

ఏతావా తెలంగాణ భాష అత్యంత ప్రాచీనమనీ, అది పూర్ణానుస్వారం, యతిమైత్రి, ద్విత్వాగమనం, పద మధ్య అచ్చులోపాలతో నాదమాధుర్యాన్ని నిలుపుకుందనీ, అర్థవంతమైన భాష అనీ, అందమైన పలుకుతీరు వుంది అనీ, అచ్చ తెలుగుదనం తెలంగాణ భాషకు అదనం అనీ, అన్య భాషా‌ ప్రభావం కూడా ఆ భాషా స్వభావం అనీ..యిట్లా మనం తెలంగాణ భాషకు లక్షణాలు చెప్పుకోవచ్చును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com