సాహిత్యం సమాంతర సమాజ ప్రతిఫలనం అని ఈ రోజు కొత్తగా చెప్పవలసిన పని లేదు ,కాగా కొంతమంది సాహితీ వేత్తలు చాలా స్పృహ తో సమాజ ప్రాతినిధ్యానికి దోహదపడుతారు .కొంతమంది చాలా ప్రాచీనమైన ఇతివృత్తాన్నే ఎన్నుకొని తమ పద్దతిలో రాస్తూ పోతారు .అయినా వాళ్ళు అనివార్యంగా సమాంతర సామాజిక స్థితిని ప్రతిఫలించకుండా ఉండలేరు .

కవిత్వం కంటే వచన సాహిత్యం లో ఈ దోహదం ఎక్కువగా ఉండడం తెలిసిందే .ఎక్కువగా కాకపోయినా చాలా ఎక్కువమందికి చేరే విధంగా ఉండడం సహజమే .

తెలంగాణ తొలితరం కథలు ,ముదిగంటి సుజాతారెడ్డి,అట్లాగే తొలినాటి కతలు ముదిగంటి సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వం లో వచ్చిన నాటి సంకలనాలు. .తెలంగాణా ను చీకటి ఖండం అని నిందించిన కాలం లో తెలంగాణా సాహిత్యం ప్రయత్న పూర్వక విస్మరణ కు గురైన కాలం లో వచ్చిన సంకలనాలు ఇవి. .తెలంగాణా కు ఇదొక ఆత్మగౌరవ ప్రతీక .ఈ అంశాన్ని గురించి పీఠికాకర్తలు చర్చించారు . ఈ చర్చలో తెలంగాణ లో మధ్యతరగతి వర్గం లేదనే ,వివాదాస్పద విషయాలు ఉన్నాయి .కాని ఈ పొత్తం ద్వారా నాటి సామాజిక పరిస్థితులను అవలోకనం చేసుకోవడనానికే పరిమితం ఈ చిరు ప్రయత్నం .

కథలో వస్తువు దాదాపుగా సామాజికమే .హృదయ శల్యము, విపరీత సాహసము ,లాంటి చారిత్రిక కాలానికి చెందిన కాల్పనిక కథలలో సైతం ప్రాయికం గా నాటి సామాజిక విలువలే చిత్రించా బడ్డాయి .

నాటి దాంపత్య ధర్మాన్ని చిత్రించడానికి ప్రయత్నం చేసిన కథ హృదయ శల్యము. మాడపాటి హనుమంత రావు నాడు విలువవలు గా భావించిన కొన్ని విషయాలను వ్యంగం గా చిత్రించారు . ఈ కథలో పురుషవేషం లో ఉన్న రుద్రమ దేవి,ఒక స్త్రీ ని విపరీత పరిస్థితి లో కౌగిలించుకోవడం వల్ల ఆమె భర్త అపార్థం చేసుకుంటాడు .చివరికి రుద్రమ దేవి స్త్రీ అని తెలిసికొని ,ఆ దంపతులిద్దరూ ఆమెని క్షమాపణ కోరుతారు .రుద్రమ దేవి పాదాలకు వాళ్ళు నమస్కారం చేసిన తీరు ‘’రాజు విష్ణుతో సమానుడు’’ అనే పూర్వ నానుడి స్పురిస్తుంది .అదేవిధంగా భర్త భార్యను అనుమానించడం ,భార్య భర్త అనుమానం లోని హేతుబద్దతను అర్థం చేసుకోవడం చూస్తే నాటి దాంపత్య విధానం అవగతమౌతుంది .ఇది కాకతీయుల కాలం నాడు జరిగిన కథ అని చెప్పినా రచనా కాలం నాటి పరిస్థితులు గా కొన్నిటిని ఈ కథ ద్వారా బేరీజు వేయవచ్చు .విపరీత సాహసము అనే చారిత్రిక కాలానికి చెందినది గా పేర్కొన్న కథలో ఒక నిమ్నస్థాయి స్త్రీ ఆరాధనా భావం కనిపిస్తుంది .ఈ కథ రాజరికం లోని బహుభార్యత్వాన్ని సాధారణ విషయం గానే చిత్రిస్తుంది .సకీనా అనే ఒక పరిచారిక రాజును గురించిన మొహాంధకారం తో చేసిన సాహసమే ఈ కథ .

విదేశీయానం దానివల్ల జరిగే విపరీతాలు ఈ రోజువరకు చూస్తూనే ఉన్నాం .ఆ రోజుల్లో కూడా విదేశీ విద్య వల్ల వచ్చిన అనర్థం చిత్రించారు, లండన్ విద్యార్థి కథ లో . ఈనాటి కి విదేశాలకు వెళ్ళిన వాళ్ళ విపరీత ప్రవర్తన చూస్తుంటాం .ఇక్కడ పెళ్లి చేసుకొని వెళ్లి మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకోవడం ,లేక అక్కడ పెళ్లయినా దాచిపెట్టి ఇక్కడ పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలనేకం మనకు కనబడతాయి .ఈ విషయాన్ని చిత్రించి ఈ కథ ప్రాసంగికతను చాటుకొంది .మేజు వాణి అనే కథ ఒక ఊహా ప్రపంచం మన ముందు పెడుతుంది .

ఇక ఒద్దిరాజు సీతా రామచంద్ర రావు రాసిన రక్త మూల్యం ఒక చలన చిత్రం లాగా ఉంటుంది .స్నేహితుడు వ్యాదిగ్రస్తుడైతే ఆర్తి తో తన రక్తం ఇచ్చి ,చివరికి అతని తో కలిసి మరణించిన విషాదాంతం ఇది .ఆ కాలం కథల్లో విషాదాంతం రాయడం కొత్తదనమే అని గుర్తించాలి . ‘’ఆదిలక్ష్మి’’ ఆదిరాజు వీరభాద్రారావు కథ .వెనుకబడిన తరగతులలో కూడా అత్తల గయ్యాలితనం ,ఆడబిడ్డ, భర్తల మంచితనం ,మొదలైన మానవ సంబంధాల చిత్రీకరణ కనబడుతుంది .

భండారు శ్రీనివాస రావు ‘’రాజయ్య సోమయాజులు కథలో నాటి సంస్కరణోద్యమం లక్షణ స్పర్శ ఉంది .అరవదనిమిదేండ్ల వృద్దుడైన రాజయ్య సోమయాజులు తో ఎనిమిదేండ్ల లలితాబాయికి వివాహం ,మళయాళ వైద్యుని మోసం ఇదంతా సినిమా ఫక్కీ లో హాస్యం గా చిత్రించాడు రచయిత .

‘’బాలికా వివాహము ‘’ బాల వితంతువును ఒక దేశ భక్తుడు ఆత్మహత్యలనుండి కాపాడడమే ఇతివృత్తం .ఇది నాటి వ్యవస్థలోని అనాచారాలను కళ్ళముందుంచుతుంది .మేఘాద్రి పెరుమాళ్ళ నాయుడు ‘’న్యాయవాదము’’ కథలో ధన సంపాదనకన్నా సామాజిక సేవే ప్రదానం అని నమ్మిన వ్యక్తి కి అతని మరణానంతరం లభించే గుర్తింపు చెప్పిన కథ ఇది .సామాజిక సేవా దృక్పధానికి ,పత్రికా రచనకు ఏనాటికైనా ఆదరణ లభించగలదని చెప్పిన కథ ఇది .

‘ఏబది వేల బేరం’’ కథ ఉహించని మలుపు తిరుగుతుంది .జమీందారులనేందరినో తన వచోచాతుర్యం తో మోసగించిన ఒక బంగారు నగల వ్యాపారి చివరికి ఒక జమీందారి వేషం వేసిన మోసగాడితో ఎట్లా వంచనకు గురౌతాడో తెలిపే కథ ఇది .జమీందారీ మర్యాదలు ,ఆడంబరాలు ,అట్లాగే నాటి జనంలో ఉండే కల్లు తాగడం మీద మోజు ,వెరసి నాటి సామాజిక పరిస్థితి ని ,ధన దాహాన్ని చక్కగా చిత్రించిన కథ ఇది .ఈ కథ తో బాటు ‘అడవి గాచిన వెన్నేల’ ,’నీవేనా’ లాంటి కథలన్నీ ఈ నాటి డిటెక్టివ్ కథల్లా ఉంటాయి . బహుశా తరువాత వచ్చిన అపరాధ పరిశోధనా కథలకు ఇట్లాంటి కథలే బీజవాపన కావచ్చు .అడవి గాచిన వెన్నెలలో నాయకుడు గా కనిపించే వ్యక్తి చివరకు విలన్ గా రుపొండుతాడు .అట్లాగే మొదట విలన్ గా బడా చోర్ గా చెప్పబడిన వ్యక్తి నాయకుడవుతాడు .దొంగలను పట్టుకునే వ్యక్తి కి చోరకళ తెలిసి ఉండాలనేది కనబడుతుంధీ కథలో . అట్లాగే నీవీనా అనే కథ లో మొదట భయానక వాతావరణం కనబడుతుంది. చివరికి అదంతా ఇంటి దొంగల పనే అని తెలిస్తే ఆశర్యం కలుగుతుంది .

ఈ కథల్లో వాడిన భాష ప్రత్యేకించి గమనించ తగ్గది .

హృదయ శల్యము కథ పూర్తి గా గ్రాంధిక భాషలో నడచిన కథ.హృదయ శల్యము లోను, మేజువాణి లోను, లండన్ విద్యార్థి లోను, సందర్భాన్ని బట్టి ప్రాచీన పద్యాల ఉగ్గడింపు ఉన్నది .ఇప్పటి విమర్శకులు ముందుమాటలలో విషయానికి సంబంధం లేని ఆంగ్ల కొటేషన్లు వాడినట్టుగాకుండా ఆ పద్యాలు సందర్భాన్ని బట్టి ఔచితీదాయకం గా ఉంటాయి .

బాలికా విలాపము కథ పూర్తిగా సంప్రదాయాను సారి గా నడిచే భాష తో నడుస్తుంది .చిన్నయ సూరి వ్యాకరణ నియమాల్ని బాగా అనుసరించిన కథ ఇది .అరసున్న కూడా ఇందులో పాటించడం ఉంది .రక్త మూల్యము కథలో నిర్మాణించేను లాంటి ప్రయోగాలు కనబడతాయి . 1910 లో వచ్చిన కథలన్నే గ్రందికలోనే నడుస్తాయి .’నీవేనా ‘అనే కథ మాత్రం సరళ గ్రాంధికం లో నడచింది .రచయితలందరికీ అంతచ్చేతన లో కావ్య సంప్రదాయాలు ఉన్నాయి .కథా ప్రక్రియ కు మూలమైన ఇంగ్లీషు సంప్రదాయాలు ఇంకా ప్రవేశించని సందర్భం అది .1920 పై నుండి వచ్చిన కథల్లో భాష కొంత సరళీకరణ చెందడం చూస్తాం.కాగా చదివించే గుణం ఈ కథల్లో ఉంది . బాలికా విలాపము హృదయ శల్యము వంటి కథల్లో తప్పితే సమాస ప్రయోగాలు కనిపించవు .

నాటి సంయుక్త రాష్ట్రం వల్ల తెలంగాణ తన ప్రత్యేకతను కోల్పోయింది .బ్రిటిషు వాళ్ళ ఆధిపత్యం కింద ఉన్న ఆంద్ర ప్రాంత సాహితీ వేత్తలు తమను తామే మేధావులు గా భావించుకొని ఇవతలి వాళ్ళ అస్తిత్వం గుర్తించడం మానేశారు . ఉర్దూ రాజ్యం చేయడం వల్ల స్థానికమైన తెలుగు సహజం గా వికసించలేక పోయింది . పాత కావ్యాల ప్రభావం ,పాత వ్యక్తీకరణ లే ఎక్కువగా ఈ కథలలో చోటు చేసుకున్నాయి . అయినప్పటికీ మొదటి కథ వెలువడింది తెలంగాణా నుండే అని చెప్పుకోదగిన స్థాయి మన కథా రంగానికుండడం గమనించదగిన అంశం .ఈ కథల్లో సమాంతరం గానే వచ్చిన భావివాదాలు గాని , స్త్రీ వ్యక్తిత్వ వికాసాన్ని గురించిగాని ,కులవ్యవస్థ సంబంధించి గాని ప్రత్యెక చర్చలేవీ కనిపించవు . రాజకీయ సిద్దాంతిక భూమికలు ,హరిజనోద్దరణ వంటి ఆదర్శాలు స్పర్శ కూడా ఉండదు . సమాంతర సమాజం యధాతధం గా కనిపిస్తుంది .కొన్ని మానవ స్పందనలకు సహజం గా అద్దం పట్టే స్వభావం వీటికి ఉంది కాబట్టి ఇవి ఈనాటికి తమ ప్రాసంగికతను కోల్పోలేదు .అప్రయత్నం గానే నాటి సామాజిక పరిస్థితి కనిపించింది కాబట్టి ఇవి తెలంగాణా ఆత్మ గౌరవ ప్రతీకలు గా నిలబడ్డాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com