-డా. నలిమెల భాస్కర్

తెలంగాణ భాష అత్యంత ప్రాచీనమైనది. తెలుగు ఎంత పురాతన వారసత్వ సంపద్విలసితమో, తెలంగాణ భాష సైతం అంతే ప్రాక్తన భాస్వంత భాష. తెలుగు భాష, తెలంగాణ భాష.. ఈ రెండూ వేర్వేరు కావు. ఒక్కటే! ఆ మాటకొస్తే, తెలుగు, తెలంగాణ..అనే రెండు పదాల్లో తెలుగు కన్నా పురాతనమైనది తెలంగాణం. తెలుంగు అణెం తెలంగాణం. తెలుంగు అనే మాట మొదటిది. అందులోని పూర్ణానుస్వారం తదనంతరం అరసున్నాగా మారి ఆ..తర్వాత అదీ లుప్తమై యివాళ తెలుగు మిగిలింది. నన్నయ సైతం “సారమతిన్” అనే పద్యంలో “తెనుంగునన్ మహాభారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్” అన్నారు. ఇందులో “తెనుంగు” క్రమంగా తెలుంగు అయిందని భాషా శాస్త్రవేత్తల నిర్ధారణ. ఈనాటికీ తమిళ, మళయాళీలు మన భాషను తెలుంగు అనే వ్యవహరిస్తారు. మనం ప్రాచీనతా చిహ్నం అయిన సున్నాను మరచిపోయినా. మొత్తమ్మీద తెలంగాణం అనే పదంలోని తెలుంగు, తెలుగు కన్నా ప్రాచీనమనీ, తెలంగాణ, తెలుగులు వేరు వేరు కావనీ తెలియవస్తున్నవి. అందువల్ల తెలుగు భాషకు ఉన్న లక్షణాలు దాదాపుగా అన్నీ ఈనాటి తెలంగాణ భాషలోనూ కనిపిస్తూ, భాషావేత్తలను ఆశ్చర్యానికి లోనుచేస్తున్నది.
తెలుగు భాష నాద సౌందర్యం కల్గిన భాష. వినసొంపైన భాష. ఈ శ్రవణ సుభగత్వానికీ, కర్ణ పేయత్వానికీ అనేక కారణాలున్నాయి. తెలుగు భాషా పదాల్లోని అంతర్గత సాక్ష్యాలు ఈ నాద మాధుర్యానికి తిరుగులేని దృష్టాంతాలుగా నిలిచి వున్నాయి. తెలంగాణేతర తెలుగులో ఈ గానానుకూలత కొంత కాలగమనంలో లోపించినా, తెలంగాణ మాటల్లో అది వేళ్ళూనికొని వుండటం గమనించాల్సిన అంశం. అసలు తెలంగాణ భాషకు ఈ నాదమాధుర్యం కల్గడానికి ముఖ్య కారణాలు అది అజంత భాష కావడం, పదాల్లో ముఖ్యంగా పదాంతర్గత పూర్ణానుస్వారం రావడం లేదా నిలిచి వుండటం..బత్యాదులు.
తెలంగాణ భాష- లక్షణాలు
1. నాదమాధుర్యం:- a) పూర్ణానుస్వారం నిలిచి వుండటం:- ఉదాహరణకు “నాగుంబాము” పద పరిశీలన చేసినప్పుడు పదాంతర్గత అనుస్వారం సంధిగతంగా వచ్చినదైనా అట్లాగే వుండటం గమనార్హం. అదే పదం తెలంగాణేతర తెలుగులో నాగుపాము, నాగు బాము అనే రూపాల్లో విన్పిస్తున్నది. రెండవ రూపమైన “నాగుబాము”ను శబ్ద రత్నాకరంలో చూస్తే “నాగు” తర్వాత “బాము” కు ముందు అరసున్న వుంటుంది. అంటే ఏమిటి? నాగుంబాము అనే సమాసము నాగుబాము కన్నా పరమ ప్రాచీన గ్రాంథిక రూపమనీ, అది యిప్పటికీ తెలంగాణ పల్లె ప్రజల భాషా వ్యవహారంతో చెక్కు చెదరకుండా నిలిచివుందనీ, నాగుంబాము అని ఉచ్ఛరించడంలో అనుస్వారం ఓ నాదాన్ని కలిగిస్తుందనే మనందరికీ తెలిసివస్తుంది. అట్లాగే “ఆంబోతు” పదం. అచ్చుటెద్దు, ఎద్దు అర్థాలు కల్గిన ఈ మాట శబ్ద రత్నాకరంలో “ఆబోతు” అని వుంది. కాకుంటే, ఆ తర్వాత అరసున్న వుంది. ఇదీ నాగుంబాము వంటి పాతమాట. “తాంబేలు” మరో నుడి. ఇది తెలంగాణేతర ప్రాంతాల్లో
తాబేలుగానూ, నిఘంటువుల్లో తా అనే అక్షరం తరువాత అరసున్నతో వున్న రూపంతోనూ గోచరిస్తున్నది. తెలంగాణలో “టంగుటుయ్యాల” అనే పదం కొన్ని ప్రాంతాల్లో వ్యవహారంలో వుంది. ఏమిటి యిది? “తూగుటూయల” . ఈ రూపం శబ్ద రత్నాకరంలో కన్పిస్తున్నది. “తూగు” తూ పిదప అరసున్నతో కనిపిస్తున్నది. కనుక అరసున్న కన్న పూర్వపు రూపాలు తెలంగాణలో వున్నాయి. తూగుటూయలకు పూర్వరూపం తూంగుటూయల. తూంగు అంటే నిద్రపోవు అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో యిప్పటికీ “తొంగో” అంటుంటారు. ఇది తమిళం నుండి వచ్చింది. “తూక్కం” అంటే నిద్ర. తూంగువుదు అనగా నిద్రించుట. ఆ తూంగు తూగుటూయలలో తూగుగా నిలచి వుంది. కానీ తెలంగాణలో “తూంగు”, “టంగు” అయ్యింది. పదాది దీర్ఘం హ్రస్వమై తకారం, టకారంగా మారిపోయింది. ఇక్కడ ప్రధానాంశం అది కాదు, సున్నాను నిల్పుకొన్న రూపాలు తెలంగాణలో వుండటం అనేది. ఆ సున్నాయే నాదానికి హేతువవుతున్నదని. “పెండ” పదాన్ని సైతం పరిశీలించాలి. దీన్ని ఆధునిక ప్రమాణ భాషలో పేడ అంటున్నారు. నిఘంటువుల్లోనూ పే తర్వాత అరసున్నాను చూపిస్తున్నారు. కాకపోతే శబ్ధ రత్నాకర కారుడు పేడ యొక్క రూపాంతరమే పెండ అంటున్నారు. ఇది పొరపాటు. భాషలో ముందు పూర్ణానుస్వార సహిత రూపాలే వుంటివి. అది ముందు పెండ, తర్వాత పేడ అయ్యింది. అందుకే మహాభారత అనుశాసనిక పర్వంలో “వ్రతాధీనత పెండ యున్నమును ధేనువు మూత్రము” అన్నారు తిక్కన.
భోజనానంతరం కొందరు తొందరగా జీర్ణం కావడానికి తెలంగాణలో “సోంపు” బుక్కుతారు…నోట్లో వేసుకుంటారు. మరి ఇతర తెలుగు ప్రాంతాల్లో దీన్ని “సోపు” అంటున్నారు. (ఇంగ్లీషు సోపు కాదు సుమా!). ఒకానొక సంబారపు దినుసు అనే అర్థాన్ని సూచిస్తూ శబ్ద రత్నాకరం ఈ పదాన్ని అరసున్నయుతంగా చూపించింది.
ఆధునిక ప్రమాణ భాషలోని “చిమ్మ చీకటి” తెలంగాణలో “చిమ్మంజీకటి” రూపంలో వుంది. చిమ్మ తరువాత చేరిన సున్నా, సంధిగతంగా వచ్చి చేరినా అది నాదానికి మూలమవుతున్నది. తెలంగాణ భాషలో పూర్ణానుస్వారం పెండ, సోంపు వంటి పదాల్లో సహజసిద్ధంగా వున్నదైతే, నాగుంబాము, ఆంబోతు లాంటి సమాసాల్లో సంధిగతంగా వచ్చి చేరింది. ఎట్లా వచ్చినా ఆ నిండు సున్నను నిండుగ మెండిగ దండిగ నిలుపుకున్న రూపాలు తెలంగాణలో వున్నాయి. మరో విశేషమేమంటే ఈ పూర్ణ బింధువు అవసరం లేకున్నా కొన్ని పదాల్లో వచ్చి చేరటం. ఉదాహరణకు “విచిత్రం” అనే మాట తెలంగాణలో “ఇచ్చంత్రం”.
పదాది వకారం లోపించడం కొందరిలో సాధారణంగా జరిగే పరిణామమే. విచిత్రంలోని రెండవ అక్షరం విచిత్రంగా “చ్చ” గా మారింది. అ అక్షరానంతరం సున్నా వచ్చి చేరడమూ, నాద సౌందర్యభరితం కావడం తెలంగాణ భాష లక్షణం. “లక్ష్మీ దేవి”, “లచ్చిందేవి”గా అవతారమెత్తుతుంది. ఆదిలాబాద్ లోని బోధ్ అనే పట్టణం పేరు
స్థానిక లేదా ఆ పరిసర ప్రాంత ప్రజల వ్యవహారంలో “బొంతల” అవుతుంది. నిజామాబాదు “బోధన్” ను ఆ పరిసర ప్రాంత వ్యవహర్తలు “బోదునం” అంటారు. “మెంతి” కూరను “మెంతెం” అని వ్యవహరిస్తారు. ఆదిలాబాదు “ముధోల్” ను “ముదోడం” గా మార్చుతారు. ఇవన్నీ ఏమిటి? సున్నాతో వున్న రూపాల్లో ఒక సంగీతం వుందని పల్కుతున్న పద్దతులు , కాకుంటే “బోధన్”, “బోదునం” కావడం, “మెంతి” “మెంతెం” గా మారడం వంటి వాటిల్లో పూర్ణబిందువు పదాంతర్గతం కాకుండా పదాంతంలో వుంది. ఈ సున్నాను నిలుపుకొనే , తెచ్చుకొనే వ్యవహారం ఎక్కడిదాకా వెళ్ళిందంటే, ఆంగ్ల పదాలు కొన్నింటిలోకీ వచ్చి చేరింది. తెలంగాణలో ఇప్పటికీ కొందరు “క్లాసుమేటు”ను, “క్లాసుమెంటు” అనీ, “మేనేజర్” ని, “మేనింజర్” అనీ, కిరసనాయిల్ ను గాంచునూనే అని (అది గ్యాస్ నుండి వచ్చిన బాపతు కదా!) వ్యవహరిస్తారు. ఇంకా అతలాకుతలం, తల్లడిల్లడం, ఇచ్చిపుచ్చుకోవడాలు వరుసగా అతులం కుతులం, తల్లడం మల్లడం, ఇచ్చుకం పుచ్చుకం రూపాల్లోకి మారుతున్నాయి. ఇట్లా పరిశీలించినపుడు వందలాది తెలంగాణ పదాల్లో ఈ పూర్ణ అనుస్వారం గొప్ప నాద మాధుర్యాన్ని కల్గజేస్తున్నది.
ఆధునిక ప్రమాణ భాషలోని “సరిగా,ఎదురుగా, రాగారాగా, పోగాపోగా, అనగనగా” వంటి అన్నంత రూపాలు తెలంగాణలో “ సరింగ, ఎదురుంగ, రాంగ రాంగ, పోంగ పోంగ, అనంగనంగ” అనే విధంగా ప్రజల వ్యవహారంలో నిండుసున్నతో వున్నవి.
తెలంగాణలోని ఒక సామెతను పరిశీలిద్దాం! “చెప్పంగా విననోన్ని చెడంగ చూడాలె”. దీన్ని “చెప్పగా వినని వాణ్షి చెడుగా చూడాలి” అని ఆధునిక భాషలోకి అనువదిస్తే ఆ సంగీతం వుందా? లేదు. అట్లాగే ” ఎయ్యంగ ఎయ్యస్తది కని తియ్యంగ తియ్యరాదు” అంటే తీయగా వుందా? లేదు. ప్రపంచంలో వున్న భాషలన్నీ గౌరవార్హాలే! ఒక భాష గొప్పది, ఇంకొకటి తక్కువది అన్న ఆలోచన సరైనది కాదు. ఐనా, తెలంగాణ భాషలో యిప్పటికీ ప్రాచీనతను నిల్పుకొన్న రూపాలు నిలిచి వుండి కొన్ని సందర్భాల్లో గానానుకూలతము కల్గివున్నాయని చెప్పడమే లక్ష్యం. ఇంకో పాటను చూద్దాం! చెమ్మ చెక్క చేరడేసి మొగ్గ/ అట్ల పోయింగ ఆరగచంగ/ ముత్యాల చెమ్మ చెక్క ముగ్గు లేయంగ/ రత్నాల చెమ్మ చెక్క రంగు లేయంగ/ పగడాల చెమ్మ చెక్క పందిరేయంగ/ పందిట్లో మా బావ పెండ్లి చేయంగ. ఇది ఆడపిల్లలు పాడుకొనే పాట. ఇది తెలంగాణ పాట మాత్రమే కాదు, తెలుగు బాలల గీతం. ఇందులో వరుసగా “పోయింగ, ఆరగించంగ, (మ్రుగ్గు)లేయంగ, (రంగు)లేయంగ, (పంది)రేయంగ, చేయంగ ల్లోని పదాంతాల్లోని “గ” కు ముందున్న సున్నలు పరిహరించి పాడుకుంటే నాదమాధుర్యం సున్ననే అవుతుంది దాదాపుగా. కనుక ఈ రకమైన “అన్నంత పదాల్లో” సహజసిద్ధంగా వున్న పూర్ణ బిందువు తెలంగాణ వ్యవహారం లోని మాటల్లోనూ పాటల్లోనూ నిలిచివుండటం విశేషలక్షణం. తెలుగు భాషా స్వభావాన్ని అట్లాగే కలిగివుండటం తెలంగాణ మాటల విశిష్టత.
( మిగతాది వచ్చే సంచికలో..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com