– డా. సూర్యాధనంజయ్

భారతదేశం భిన్న జాతులను, సమాజాలను ఏకీకృతం చేసిన దేశం. ఇక్కడ అనేక ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లాయి. విభిన్నమైన సంప్రదాయాలకు, సంస్కృతులకు కేంద్రస్థానంగా ఈ దేశం ప్రపంచానికి ఒక చుక్కాని వలే నిలుస్తున్నది. పండుగలు ఇక్కడి సంస్కృతికి ప్రాణం పోస్తూ సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్నాయి. ఇట్టి విశిష్ట దేశంలో తమ సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు విలక్షణ జీవనవిధానంతో సప్తవర్ణ శోభితం చేస్తున్నారు. బంజారాలు. వీరు నిర్వహించుకునే పండుగలు ప్రాచీన భారత అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అట్లాంట పండుగల్లో ఒకటి తీజ్ పండుగ, వర్షఋతువులో వచ్చే శ్రావణ, భాద్రపద మాసాల్లో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తీజ్ పండుగ ప్రకృతికి ప్రతిరూపంగా పిలువబడుతుంది. శక్త్యారాధనలల్లో ఇదొక భిన్నమైన ఆరాధనగా భావించవచ్చు.

తీజ్ పండుగ జన్నస్తానంగా నేటి రాజస్తాను చెప్పుకోవచ్చు. స్త్రీలకు సంబంధించిన పండుగ ఇది. ముఖ్యంగా కన్నెపిల్లలు, సుమంగళులు తమ సౌభాగ్యం కోసం, సమాజ కళ్యాణం కోసం జరుపుకుంటారు. సృష్టి ఆవిర్భావం, పంచభూతాల విశిష్టత దైవారాధన, తత్ఫలితంగా విశ్వశ్రేయస్సు వంటి అంశాలు ఈ పండుగ వెనక దాగున్నాయి. అందుకు సాక్ష్యంగా

మొలకెత్తిన గోధుమ గింజల బుట్టలను ఆరాధించడం వంటివి నిదర్శనంగా చూపవచ్చు. బీజాలు మొలకెత్తించడం సృష్టి ఆవిర్భావానికి, బీజాలు మొలకెత్తుటకు కావాల్సిన మట్టి, గాలి, నీరు, సూర్యరశ్మి వంటివి పంచభూతాలకు, బుట్టల ఆరాధన శక్త్యారాధనకు తత్ఫలితంగా విశ్వశ్రేయస్సును సిద్ధిస్తాయి.

(పంచజింగ్) పంచనదుల పరివాహక ప్రాంతమైన రాజస్తాన్, గుజరాత్, హర్యానా, పంజాబు రాజపుత్రులచే పరిపాలింపబడినవి. యవనులు (తురుష్కులు) మొగలాయిలు వంటివారి దోపిడికి, దండయాత్రలకు గురై ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయినా వారు వారి సాంస్కృతిక నేపథ్యాన్ని ఎన్నడూకోల్పోలేదు. నేటికీ సజీవంగా ఉంచుతున్నారు. రాజపుత్ర రాజ్యాల విధ్వంసం అక్కడి ప్రజలను వనవాసులుగా చేసింది. వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అందులో బంజారాలు అతీతమేమికాదు.

బంజారాలు ఆషాడ, శ్రావణ, భాద్రపద మాసాల్లో విశేషక్రతువులను చేస్తారు. అందులో సాతీభవానీలైన తొళా, మత్రాల్, హింగళా, ధ్వాళాంగర్, కంకాళీ, మేరామా, శీతలామాతలను పూజించడం ప్రకృతి శక్తులను పూజించడమే. ఈ సాతీభవానీలు సప్తమాత్రుకలకు ప్రతీకలుగా చెప్పబడుతారు. సాతీభవానీలలో చిన్నదైన శీతలామాత పండుగ ఈ ఆషాడ,

శ్రావణ మాసాల్లోనే నిర్వహిస్తారు. మానవాళి అంటువ్యాధుల, బారిన పడకుండా ఉండేండుకు ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో కళకళలాడేందుకు, పశుపక్ష్యాదులకు ఆరోగ్యాన్ని ఆహారాన్ని సమృద్ధిగా ఉంచేందుకు ఈ పండుగ నిర్వహిస్తారు. శీతలా పండుగతో పాటు నిర్వహించుకొనే మరొక పండగే తీజ్ పండుగ.

ఈ తీజ్ పండుగను హర్యాలీ తీజ్, గగోర్ తీజ్, కజిరి తీజ్, హర్తాలికా తీజ్, అఖా తీజ్, అవ్రాతీజ్, కాజల్ తీజ్, కేవడా తీజ్, తాయ్ తీలుగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంప్రదాయం పాటించబడుతూ పండుగ భిన్నత్వాన్ని సంతరించుకుంటుంది. అయితే ఇంత వైభవంగా నిర్వహించుకునే ఈ తీజ్ పండుగ వెనుక గల ఐతిహ్యాన్ని పరిశీలిస్తే బంజారాలు, ఇతర సమాజాలు కోరుకునే మానవకళ్యాణ భావన మనకు స్ఫురిస్తుంది.

ఐతిహ్యం:-

పూర్వం దక్షప్రజాపతి కూతురు సతీదేవి ఈశ్వరుడిని పెళ్లి చేసుకున్నాక జరిగిన నిరీశ్వరయాగం సతీదేవి పరాభవానికి, ఈశ్వరుని అవమానానికి కారణమైంది. తత్ఫలితంగా సతీదేవి అగ్నికి ఆహుతికావడం, ఈశ్వరుడు దక్షుని సంహరించడం జరిగిపోయింది. కాని సతీలేని శివుడు ఉండలేకపోయాడు. దానితో సతీదేవి తిరిగి హిమవంతుని ఇంట పార్వతిగా జన్మించింది. జగన్మాత అంశ అయిన పార్వతీదేవి బాల్యం నుండే శివున్ని తన పతిగా భావించింది. హిమవంతుని ఇంట ఏలోటూ లేకుండా పెరిగింది. శివారాధనకోసం అప్పుడప్పుడు తన చెలికత్తెలతో ఘోరవనాల్లోకి వెళ్ళేది. అక్కడి వనాల్లో ఏకాంతంగా శివోపాసన చేసేది. ఇదిలా ఉండగా హిమవంతుడు తన కూతురైన పార్వతికి పెళ్లి చేయాలనుకున్నాడు.

ఒకనాడు నారదుడు హిమాలయ సందర్శనార్థం వచ్చి హిమవంతుని రాజమందిరానికి వెళ్ళాడు. దీర్ఘాలోచనలో ఉన్న పర్వతరాజును చూసి “కులపర్వతశ్రేష్ఠుడా హిమవంతా! నీ దీర్ఘాలోచన ఏమిటి? ఎందుకింత చింతలోనున్నావు” అన్నాడు. అంతనా నారదునికి ప్రణామం చేసిన పర్వతరాజు పార్వతి పెళ్లి విషయం చెప్తాడు. అప్పుడు నారదుడు “జగత్పతియైన విష్ణువుండగా ఎందుకీ వ్యర్థ చింత’ అంటాడు. నారదుని సమాధానంతో పర్వతరాజు హిమవంతుడు విష్ణువే తన పుత్రికకి తగినవాడు అని నిశ్చయించుకుంటాడు. కాని నారదుని మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించలేకపోతాడు. విష్ణువు సహితం శివలీలావిలాసానికి బద్దుడై కాగల కార్యాన్ని చూస్తూ యోగనిద్రలో లీనమవుతాడు. హిమవంతుడి ఈ నిర్ణయం చెలికత్తెల ద్వారా తెలుసుకొన్న పార్వతి చింతాగ్రస్థమవుతుంది. పార్వతి వేదనను చూసిన చెలికత్తెలు ఒక కొండ గుహలోకి పార్వతిని తరలించి ఆమె ఉపాసనకు భంగం వాటిల్లకుండా చూస్తారు. అప్పుడు పార్వతీదేవి శీఘ్రతిశీఘ్రంగా పరమేశ్వరున్ని పతిగా పొందడానికి చేసిన వ్రతమే ఈ తీజ్. తొమ్మిది రోజులపాటు కఠోర దీక్షను బూని అన్న పానియాలను మాని ఈ వ్రతం చేస్తుంది పార్వతి.

ఒకరోజు బ్రహ్మముహుర్తంలో శుద్ధ జలస్నాన మాచరించిన పార్వతి మట్టితో శివలింగాన్ని తయారుచేసింది. భాద్రపద శుక్ల తృతీయ హస్త నక్షత్రంలో ఉండగా దీక్షాకంకణ ధారణ చేసింది. తొమ్మిది రకాల దినుసులలో శ్రేష్ఠమైన గోధుమలను చిన్న మట్టికుండలో బీజోద్ధవం కోసం ఉంచింది. అట్లా నిర్జలావ్రతం ఆచరిస్తూ పార్వతి శివారాధన చేసింది. తొమ్మిదవ రోజున మొలకెత్తిన గోధుమల కుండను శివునికి సమర్పించింది. తొమ్మిదిరోజుల కఠిన దీక్షను చూసి శివుడు సప్తఋషులను పార్వతి చెంతకు వెళ్లి ఆమెను పరీక్షించమని ఆదేశిస్తాడు. పార్వతి చెంతకు చేరిన ఋషులకు వినమ్రంగా వందనంచేసింది మాత పార్వతి. అనంతరం తన తపోదీక్ష గురించి చెప్తుంది. భగవంతుడైన శివుని గుణగానం చేస్తుంది. కాని సప్తఋషులు శివున్ని నిందిస్తూ “స్మశానవాసితో ఎట్లా మనగల్గుతావు తల్లి! అతడు పాములను మాలగా ధరిస్తాడు. భూతప్రేతములతో సహవాసం చేస్తాడు. నీవు కోమలంగా భవనాల్లో పెరిగిన దానివి. ఈతనితో సహచర్యం చేయలేవు అని అంటారు.

దానికి ప్రతి సమాధానమిస్తూ “ఓ మహర్షులారా! మీరు తపః సంపన్నులు. మీపై నేను ఆగ్రహించలేను. శివనింద నేను వినలేను. వ్రతదీక్షలో ఉన్నాను. నన్ను విసిగించకండి. మీకు చేతులెత్తి వినమ్రురాలై అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది పార్వతి. దానితో సప్తర్షులు కైలాసం వెళ్ళి పార్వతీదేవి తపస్సు పరిపక్వమైనదని ఆమెను అనుగ్రహించమని కైలాసపతికి విన్నవిస్తారు. ఈ వార్తవిన్న శివుడు పరమానందభరితుడై పార్వతి ఎదుట ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరున్ని చూసిన పార్వతీదేవి పలు విధాలస్తుతించి ప్రణమిల్లుతుంది. అపుడు శివుడు “ఓ పార్వతీ నీవు నీ తపోదీక్షతో నన్ను ప్రసన్నం చేసుకున్నావు. నీ మనోవాంఛ సిద్ధిస్తుంది. నీవు ఇక ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులతో చెప్పి ఒక శు భముహూర్తమున వివాహ నిశ్చయానికి పంపించు” అని చెప్తాడు. పార్వతి చేసిన వ్రతాన్ని లోకంలో కన్నెపిల్లలు, సుమంగళలు చేసిన యెడల వారికి వారి మనోవాంఛలు పార్వతీదేవి వలెనే తీరుతాయని వరం ప్రసాదిస్తాడు. అట్లా పార్వతీదేవి శివాజ్ఞకు బద్దురాలై వ్రత సామాగ్రిని గోధుమ మొలకలను నదిలో నిమజ్జనం చేసి వ్రత ఉద్యాపనం చేస్తుంది.

అంతలో పార్వతి జాడ తెలుసుకున్న హిమవంతుడు ఆ గుహకు వచ్చి తాను నిర్ణయించిన వివాహం సంగతి చెబుతాడు. అందుకు పార్వతీ తన తపోదీక్షకు మెచ్చి శివుడు తనను పాణిగ్రహణం చేసుకోవడానికి తనకు వరం ప్రసాదించాడని కనుక తాను శివుడినే పెండ్లాడుతానంటుంది. ఈ విషయం విన్న హిమవంతుడు మహాశక్తి పార్వతిగా జన్మించక ముందు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నాడు. “తల్లి పార్వతి మహాశక్తి అంశవు నువ్వు. నీ అభిష్టానికి ఎప్పుడూ అడ్డు చెప్పను” అంటూ ఆమెను అనునయిస్తాడు. తర్వాత అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఈ విధంగా తీజ్ వ్రతాన్ని ఆచరించి పార్వతి పరమేశ్వరున్ని పొందింది కనుక నేటికి రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లోని ప్రజలే కాకుండా అక్కడి నుండి దేశవ్యాప్తమైన బంజారా ప్రజలు ఈ పండుగను నేటికీ జరుపుకుంటారు. అట్లా ఈ పండుగ దేశవ్యాప్తమైంది.

తీజ్ పండుగ నిర్వహణలో బంజారాలు:-

వర్షఋతువు ఆరంభంలో వచ్చే ఆరుద్ర మాసపు ఎర్రనిపురుగును తీజ్ పురుగు అంటారు. ఈ పురుగు సందర్శనం అనంతరం పండుగలు ఆరంభమవుతాయి. భారతదేశంలో శాక్తేయ పరంపరలో కన్యలను అమ్మవారి ప్రతిరూపాలుగా పూజించడం జరుగుతుంది. కన్యపూజ నేటికి ముత్తైదువులు నిర్వహించుకుంటారు. కన్యలు అమ్మవారిని పూజించడం కూడా ఈ పరంపరలో భాగంగా జరుగుతున్నది. నేటికి వైష్ణవీదేవి పూజల్లో కన్యాపూజ అంటే కన్యలు దేవిని పూజించడం మనం గమనించవచ్చు. బంజారాలు శక్త్యారాధకులు కాబట్టి సాతీభవానీలను పూజిస్తారు. వారు దేవి పార్వతి అంశలు. పార్వతీదేవి వీరిని సర్వదా కాపాడుతుందని వీరి ప్రగాఢవిశ్వాసం. ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో పెరిగి ప్రకృతినే తమ ఆత్మల్లో నిక్షిప్తం చేసుకున్న వారు బంజారాలు. వారు ప్రకృతి రూపంలోనే ప్రకృతి నైవేద్యంతోనే తీజ్ పండుగను సంబరంగా జరుపుకుంటారు.

బంజారాల ఈ తీజ్ పండుగను మొలకల పండుగ అనికూడా అంటారు. పెళ్ళీడుకు వచ్చిన ఆడపిల్లలు ఈ పండుగను జరుపుకోవటం బంజారా సమాజాల్లో విశేషంగా చెప్పవచ్చు. ఈ పండుగ తెలంగాణ ప్రాంతపు బతుకమ్మ పండుగను పోలి ఉంటుంది. బతుకమ్మ పండుగకు ఎట్లైతే తొమ్మిది రోజులు పూలను పూజింజించి నిమజ్జనం చేస్తారో అదేవిధంగా బంజారాలు కూడా గోధుమ మొలకలను పూజించి నిమజ్జనం చేస్తారు. బంజారాల తొలి పండుగ శీత్తాపండుగ. ఈ పండుగ జరుపుకున్న ఆడపిల్లలంతా కలిసి పాటలు పాడుతూ ఇంటింటికి తిరుగుతూ తమ పెద్దవాళ్ళను కలుసుకొని వారిని తీజ్ పండుగ జరిపించాల్సిందిగా విన్నపం చేసుకుంటారు. పెద్దలు కూడా పెళ్ళీడుకు వచ్చిన ఆడపిల్లలు పెళ్ళిళ్లు చేసుకున్నాక తండాలో ఉండరు కనుక వారిని తీజ్ పండుగ నిర్వహించడానికి ఒప్పుకుంటారు. ,

తీజ్ పండుగ వెనుక ఉన్న అంతరార్థం కూడా పెళ్ళీడు ఆడపిల్లలకు మంచి మాంగళ్యధనం లభించడం కోసం చేసే ఒక వ్రతమని చెప్తుంది. ఇక ఆడపిల్లలు, పెద్దలు కలిసి ఊరేగింపుగా పాటలు పాడుతూ తండా నాయక్ ఇంటికి వెళ్ళి తీజ్ పండుగ నిర్వహించుకోవడానికి అనుమతించాల్సిందిగా నాయకను అడుగుతారు. తండా నాయక్ ఎంతో ప్రేమతో తన అనుమతిని తెలియజేస్తాడు. తండాలో ఏ పండుగైనా నిర్వహించుకోవాలంటే తండానాయక్ అనుమతి అవసరం. ఇది తండా పంచాయతికున్న తరతరాల సంప్రదాయం. దేశకాల పరిస్థితులను బేరిజు వేసి అనుమతినివ్వడం దీని వెనకాల ఉన్న ఉద్దేశ్యం. బంజారాల ప్రతి పనిలోనూ పాటకు స్థానముంటుంది. పాటల్లోనే జీవన సారాన్ని నింపుకుని భవిష్యత్తుకు

భావ ప్రసారం చేస్తారు. తండా నాయక్ ను అనుమతి అడగడానికి వెళ్ళినపుడు సహితం పాటనే వారి మధ్య మాధ్యమంగా నిలుస్తుంది.

“మారో బాపు జబరజ హూంసియే కనాయియో,

ఓరి బేటివూన తీజ బొరాదు కేరోయే కనాయియో” అని పాడుతూ…

“మా తండా నాయకుడు, మా తండా పెద్దలు తీజ్ పండుగ జరుపుకోవడానికి ఒప్పుకున్నారు. మాకు అత్యంత ప్రీతి పాత్రమైన తీజ్ పండుగ నిర్వహించుకోవడం సంతోషమని, తీజ్ ఎంతో విశిష్టమైనదని అది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపుతుందని” ఈ పాట సారాంశం. తీజ్ అంటే బంజారాల దృష్టిలో ఒక కన్నెపిల్ల. ఆమె సాక్షాత్తు గౌరీదేవి (మేరామా భవానీ) గౌరీదేవిని మేరామా భవానిగా బంజారాలు ఆరాధిస్తారు.

తీజ్ నిర్ణయం జరిగిన మరుసటి రోజు ఎంతో ఆనందంతో ఆడప్లిలలంతా పాటలు పాడుతూ తండా మొత్తం తిరిగి విరాళాలు వసూలు చేస్తారు. పోగుచేసిన ధనాన్ని ‘మేర’ అంటారు. ఈ పవిత్రధనంతో స్థానిక అంగడి నుండి గోధుమలు, శెనగలు కొనుక్కొస్తారు. స్వయంగా చేలలోకి అడవిలోకి వెళ్ళి, దూసేరు తీగలను కోసుకొచ్చి బుట్టలను అల్లుతారు. అల్లిన బుట్టలను మంచి నీటితో కడిగి వాటిలో గోధుమలు, శెనగలు నానబెడతారు. ఈ సందర్భంగా సంతోషంగా పాటలు పాడతారు.

“హేఁవులారయే తోన శ్యారేతి మంగాయీ

ఘేఁవులారయే తోన టపారేమా గోకి

ఘేఁవులరయే తోన నంగరిమా గోకి

ఘేఁవులా ఘమకోరోళ్ ఏకయే నయ్యా”

నవధాన్యాలలో శ్రేష్ఠమైన గోధుమా, శెనగల్లారా మిమ్మల్ని పట్నం నుండి తెప్పించాం. ఎంతో ప్రేమతో పెట్టెల్లో భద్రపరిచాము. మానంగరిలో నిన్ను కొలువుంచాం. పూజలో భాగంగా బుట్టల్లో నానబెట్టి మిమ్మల్ని మొలకలుగా చేస్తున్నాం. మిమ్మల్ని భవానికి సమర్పించి నిమజ్జనం చేస్తామని పాట సారాంశం.

నానబెట్టిన గింజలు మొలకెత్తుతాయి కనుక వాటిని మళ్ళీ కొత్త బుట్టల్లో చల్లుతారు. తలంటూ స్నానాలు చేసి అడవికి వెళ్ళి పుట్టమన్నును తీసుకువస్తారు. గింజల ఎదుగుదలకు మేక ఎరువును పోగుచేసుకుంటారు. సాతీభవానీల పేర్లతో ఒక్కోబుట్టలో ఎరువును, పుట్టమన్నును తండా నాయక్ తో నింపిస్తారు. తండా నాయక్ గోధుమ ఔలను మట్టిలో నాటుతాడు. బీజాలను నాటేటపుడు కన్యపిల్లలు సంబరంగా ఈ పాటను పాడుతారు.

“శీనాయాడి బొరాయి తీజ్ బాయి తారోపాలేణ

సోనేరో డాకో ఫలాన బాయి తారో పాలేణ

రూ పేరో పీట ఘలాన బాయి తారో పాలేణ

సోనేరో డాండియా ఘడాన బాయి తారో పాలేణ

నవదాడేరి నవతెవాళ్ బాయి తారో పాలేణ”

ఓ సోదరి బంగారు పందిరిలో నీకోసం వెండి పీటను వేసి బంగారు తీగల బుట్టల్లో తీజ్ (గోధుమ మొలకలు) ను పండించింది జగన్మాత శీతలాదేవి అని పాట సారాంశం. మొలకలు నాటిన గోధుమ బుట్టలను ఉంచడానికి ఒక మంచెను నిర్మించి మంచెపై బుట్టలను పరుస్తారు. పందిరి పై ఈ బుట్టలను ఉంచి, ప్రతీ రోజు పవిత్ర భావంతో నీళ్ళు పోస్తారు. ఇట్లా నిర్మించిన మంచెను ‘డాక్ళో’ అంటారు. గోధుమ గింజలను నాటిన బుట్టలను అనంత విశ్వంగా, మట్టిని భూదేవిగా,

మొలకల కోసం పోసిన నీటిని పంచభూతాల్లో ఒకటైన ఆకాశాన్ని పందిరి మంచెగా భావిస్తే మొలకలను ప్రాణశక్తి అనుకోవచ్చు. ఇది సృష్టి ఆవిర్భావ ఘట్టాన్ని నింపుకున్న సన్నివేశం. తర్వాతి కార్యక్రమం బోరడి ఝుప్కేరో.

బోరడి ఝప్కేరో:-

తీజ్ సంబరాల్లో మరుసటి రోజు బోరడి ఝష్కరో నిర్వహిస్తారు. బోరడి ఝప్కేరో అంటే గోధుమలతో పాటు నానబెట్టిన శెనగలను రేగుముళ్ళకు గుచ్చడం. ఈ కార్యక్రమం మిక్షణమైనది. అడపిల్లలు రేగుముళ్ళకు శెనగల గింజలను గుచ్చుతుంటే అన్నయ్యలు, తమ్ముళ్ళు వీటిని కదిలిస్తుంటారు. అయినా సహనంతో ఆడపిల్లలు శెనగలను ముళ్ళకు గుచ్చాల్సిందే. దీని వెనకాల ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో సహనంతో ఉండాలి. అనే సందేశం కనబడుతుంది. కష్టాలు అడుగడుగునా వేధిస్తుంటాయి. అయినా కష్టాన్ని సుఖాన్ని ఒక రీతిగా స్వీకరించి జీవితాన్ని తియ్యగా మలచుకోవాలనే ప్రబోధం ఈ కార్యం వెనుక కనబడుతుంది.

తీజ్ పండుగ రోజుల్లో కన్నెపిల్లలు శుచికి, శుభ్రదతకు ప్రాధాన్యతనిస్తారు. కఠిన నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉంటారు. ఇట్లాంటి నియమనిబంధనలు పాటిస్తూ రోజుకు మూడు సార్లు మంచినీళ్ళు బావినుండి తీసుకువచ్చి మొలకలకు పోసి వాటిని అమ్మవారి ప్రతిరూపాలుగా ఆరాధిస్తారు.

“ఖోదా ఖాదారే సేవ భాయ కువలో ఖోద

కువలేరో పాణి అకెలాభి భరే, సకేలాభీ భరే

ఛ్వారావాళీ భరే, ఛ్వారీ వాళీ భరే

తళ ఊండోరో సేవా భాయ కువలో ఖోద”

“జగద్గురువైన శ్రీ సేవాలాల్ మహరాజ్ తవ్వించిన బావినుండి నీళ్ళు తీసుకొచ్చి మట్టి బుట్టల్లో చల్లుతున్నాం. మా శ్రేయస్సుకోసం సేవాభాయా నిరంతరం నీరుండే బావిని తవ్వించాడు” ఎవ్వరైనా సరే ఈ బాయి నీళ్ళు వాడుకోవచ్చు. అని ఆడపిల్లలు తాము నీళ్లు తెచ్చే బావిని సేవాభాయనే త్రవ్వించినట్లు భావిస్తూ తన్మయంగా నీళ్ళు తోడుకుంటారు. తెచ్చిన నీళ్ళతో పెరుగుతున్న మొలకలను చూస్తూ….

“లాంబి లాంబియే లాంబడి ఏకేరియా

ల్యార లేరియే లాంబడి ఏకేరియా

ధోక ఖారియే లాంబడి ఏకేరియా

లాంబీ లాంబియే లాంబడి ఏకేరియా” అంటూ పాడుతారు.

సేవాలాల్ మహారాజ్ త్రవ్వించిన బావి నుండి నీళ్ళు తేగా, ఆ నీళ్ళతో ఏపుగా ఎదుగుతున్న గోధుమ, శెనగ మొలకలు గునుగుపూలచెట్లవలే ఎదిగి సిరులు కురిపించాలని ఈ పాట సారాంశం. ఇట్లా తొమ్మిది రోజుల పాటు కఠోర నియమపాలన చేస్తూ కఠికనేలపై నిద్రిస్తూ, ఉప్పుకారం లేని ఆహారం తీసుకుంటూ మేరమా భవానిని స్మరిస్తూ ఉంటారు. ఆడపిల్లలు జగన్మాత తమ ఈ క్రతువును సఫలం చేస్తుందని విశ్వసిస్తారు.

ఢమోళి:-

తీజ్ పండుగ జరుపుకునే ఈ తొమ్మిది రోజుల్లో భాగంగా ఏడవరోజు ‘ఢమోళి” నిర్వహిస్తారు. ‘ఢమోళీ’ అంటే నైవేద్యాన్ని సమర్పించడం అని అర్థం. మేరామా భవానికి బియ్యపు రొట్టెలు బెల్లం, నెయ్యి కలిపిన ముద్ద (చుర్మో)ను నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ విశేషం. ఈ ఢమోళీ కార్యక్రమంలో నైవేద్య ఘట్టం అనంతరం మేరామా భవానికి మేకపోతును బలి ఇస్తారు. బలి తర్వాత పాయసం వండుతారు. ఈ పాయసాన్ని మేరామాకు సమర్పించి మిగిలిన పాయసాన్ని, మాంసాన్ని ప్రసాదంగా పంచి పెడతారు. అందరూ తీజ్ పందిరి వద్ద నృత్యగీతాలతో సందడి చేస్తారు. ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమం గణ్ గోర్.

గణ్ గోర్ :-

బంజారాలు తీజ్ పండుగలో భాగంగా నిర్వహించే ఈ గణ్ గోర్ ను రాజస్థాన్లో ఎక్కువగా జరుపుకుంటారు. గణ్ గౌర్ శబ్దానికి రెండు అర్థాలున్నాయి. ‘గణ’ శబ్దానికి సమూహం అని గౌర్ శబ్దానికి గౌరీదేవి అని అర్థం. ఈ గణశబ్దం మనకు శివపురాణం, స్కాందపురాణాలలో ఎక్కువ చూస్తాం. గణాలు అనే మాట శివగణాలసంబంధ విషయాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గణ నాయకుడు శివుడు. శివుని అర్ధాంగి గౌరీదేవి కనుక గణ్ గౌర్ అనే మాట శివపార్వతులను సంబోధిస్తూ ఉద్భవించిందే. ఈ గణ్ గోర్ ఘట్టం వెనకాల కూడా ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది.

శివపార్వతుల కళ్యాణం అనంతరం కైలాసంలో వారు నివసిస్తున్న సమయంలో పార్వతీదేవి శివుడితో నాధా నావలెనే ఆ కన్నె పిల్లలు, సుమంగళులు తమ మనోవాంఛలు తీర్చుకొనే ఉపాయం చెప్పండి’ అని అడిగింది. దానితో శివుడు ఎవరైతే తీజ్ పండుగలో భాగంగా శివపార్వతుల బొమ్మలను మట్టితో తయారుచేసి ఎవరైతే నిష్ఠగా ఆరాధించి నిమజ్జనం చేస్తారో వారి కోరికలు నీవలెనే తీరుతాయి అని వరం ప్రసాదిస్తాడు. ఆ వరం ప్రభావంతో వచ్చిన క్రతువే గణ్ గౌర్. తీజ్ పండుగలో భాగంగా ఎనిమిదవ రోజు నిర్వహించే పండుగ ఇది. బంజారా ప్రజలు తమ ఆరాధ్యదేవతలైన మేరామా మొదలైన ఏడుగురిని మట్టి మూర్తులుగా తయారు చేస్తారు. మట్టితో అబ్బాయి, అమ్మాయిలను తయారుచేసి దేవతలతో పాటుగా వారికి పెళ్ళిళ్ళు చేసి అప్పగింతలు నిర్వహిస్తారు. సందర్భంలో కన్నె పిల్లలకు వారిని వరసకు బావలైన వారు ఆటపట్టిస్తారు. ఆ తర్వాత మట్టి మూర్తులను నిమజ్జనం చేస్తారు.

తీజ్ తోడేరో:-

తీజ్ తోడేరో అంటే నారును తెంపడం అని అర్ధం. తీజ్ పండుగలో తొమ్మిదో రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. మధ్యాన్నం కాగానే ఇంటింటికి వెళ్ళి సాయంత్రం వేళ అందరూ తీజ్ మొలకలను తెంపడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. సాయంత్రం కాగానే తీజ్ దేవతల బుట్టలను మంచె మీది నుండి దించి పీటలమీద భక్తితో ఆరాధిస్తారు. పూలు పండ్లు, పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. మొదట నాయక్ తెంపిన తర్వాత ఐదుగురు ముతైదువలు తీజ్ నారును తెంపుతారు. ఈ తీజ్ నారును తెంపుతూ తన్మయంగా’ సేవా భాయ బొరాయో తీజ్ బాయీతారో పాలేణా! సేవాభాయతి రాజవేగి తీజ్ బాయీ తారో పాలేణ అంటూ పాడతారు.

తీజ్ మొలకల నారును సేవాభాయా, మేరామాయాడిల పేరున భక్తి విశ్వాసాలతో పెంచామని అవి వారితో రాజీ అయ్యాయని, మేము పెంచినది తొమ్మిది రోజులే అయినా వందరోజుల్లాగా అనిపించిన సంతృప్తిని కల్గించాయని ఈ పాట సారాంశం. తీజ్ నారును తెంచినాకా నిమజ్జనానికి ముందు తండా వాసులందరూ తలపాగాలు కట్టుకొని వలయాకారంగా కూర్చుంటారు. తెంపిన తీజ్ నారును భక్తితో మొదట తండా నాయక్ తలపాగాలో అనంతరం మిగతావారి తలపాగాల్లో నెమలి పింఛంలా అమరుస్తారు.

తీజ్ నిమజ్జనం:-

తీజ్ పండుగలో ఆఖరి ఘట్టం నిమజ్జనం. కన్నెపిల్లలు, ముతైదువులు, గ్రామ ప్రజలు అంతా సమీపంలోని ఏరు లేదా నది గట్టుకు చేరుకొంటారు. నదిగట్టుపై అక్క చెల్లెళ్ళ పాదాలను అన్న తమ్ముళ్లు నదీజలాలతో కడుగుతారు. అనంతరం తీజ్ బుట్టలను భక్తిగా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా కన్నెపిల్లలు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అనంతరం వీరంతా తండాకు చేరుకుంటారు. తీజ్ మంచెవద్దకు చేరుకున్న వీరిని, వీరి దుఃఖపూరిత స్థితిని చూసి గ్రామపెద్దలు చెట్లకు ఉయ్యాలలు కట్టి వారికి సంతోషాన్ని కల్గిస్తారు. ఆడపిల్లలు ఉయ్యాల లూగుతూ మళ్ళీ తమ ప్రపంచంలోకి వస్తారు. తీజ్ పండుగ ముగుస్తుంది ఈ విధంగా.

“ఘర్ సంక్టాయియే మకళాయ్ కరలీజో

రాత్త అందారియే దీవో బాళలీజ్”

అంటూ పాడుకుంటారు.

మేము (సాతి భవానీ రూపాలైన సప్తకన్యలు) మీ ఇంటికి వస్తున్నాం. మీ ఇళ్ళు చిన్నవైతే పెద్దవిగా చేసుకోండి. మీ ఇళ్ళలో చీకటి గనక ఉంటే దీపాలు వెలిగించుకోండి అని దీనర్ధం. ఇక్కడ గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం మనకు ఈ పాటవల్ల తెలుస్తుంది. ఇక్కడ ఇళ్ళు అంటే మనసు అని అర్థం. తీజ్ పండగ సందర్భంగా మేము (సాతీభవానీలు) మీ ఇళ్ళుకు వస్తున్నాం. మీ మనసులనే ఇళ్ళను విశాలం చేసుకోండి. దీనిలో అజ్ఞానమనే చీకటిని దూరం చేసుకోండి. వెలుగుదివ్వెలకాంతితో మీ హృదయాలను నింపుకోండి అన్న తత్త్వం తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com