మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ- సంగారెడ్డి, జాతీయ సాహిత్యపరిషత్తు కరీంగనగర్ సంయుక్త నిర్వహణలో అంతర్జాల జూమ్ మాధ్యమంగా వసంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉగాది శ్రీరామనవమి కవిసమ్మేళనం మరియు సాహితీ సదస్సు నిర్వహించబడ్డాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ రామాయణం గొప్ప సందేశాత్మక కావ్యమని, రామాయణం లోని ప్రతి పాత్ర ఆదర్శనీయమని తెలిపారు. శ్రీరామనవమి కవిసమ్మేళనం నిర్వహించుకోవడం ఔచితీవంతమని సంయోజకులు అవుసల భానుప్రకాశ్ ను ప్రశంసించారు. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సాహిత్యం సాంకేతికతతో సమ్మిళితమై వసంతోత్సవాలను నిర్వహించుకోవడం శుభ పరిణామమని తెలిపారు. కవులందరూ రామతత్త్వాన్ని కవితల్లో ప్రకటించడం ద్వారా సమాజాన్ని మంచి మార్గంలో మళ్ళించడం సాధ్యమౌతుందని తెలిపారు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన ప్రముఖకవి సంగనభట్ల నరసయ్య వర్తమాన కవులకు దిశానిర్దేశం చేశారు. మరో ఆత్మీయ అతిథి గండ్ర లక్ష్మణ రావు గారు పద్య కవిత్వ నిర్మాణ మెళకువలందించారు. సాహిత్యం ద్వారానే సమాజగతి నిర్దేశింబడుతుందని దాస్యం సేనాధిపతి తెలిపారు. విశిష్ట అతిథి గా పాల్గొన్న సువర్ణ వినాయక్ పండుగలగూర్చి సంస్కృతి ఔన్నత్యాన్ని సందేశాత్మకంగా అందించారు. ఐదున్నరగంటలపాటు నిరాఘాటంగా జరిగిన ఈ కవిసమ్మేళనంలో మెతుకుసీమ అధ్యక్ష కార్యదర్శులు పూసల లింగాగౌడ్, అవుసుల భానుప్రకాశ్, జాసాప అధ్యక్ష కార్యదర్శులు గాజుల రవీందర్, నందిశ్రీనివాస్ లు క్రియాశీలక పాత్ర వహించారు. ప్రముఖ శతావధాని జియం రామశర్మ, అయాచితం నటేశ్వర శర్మ, కంది శంకరయ్య, దోరవేటి, అన్నవరం దేవేందర్, కలువకుంట రామకృష్ణ, పాకరాజమౌళి, వాసరచెట్ల జయంతి, సరస్వతీ రామశర్మ, బండకాడి అంజయ్య గౌడ్, దబ్బెట రాజారామ్మోహన శర్మ తదితర కవులు శ్రీరామ ప్రాశస్త్యాన్ని కవితలుగా వినిపించారు. సభను ఐదున్నర గంటలపాటు అవుసులభానుప్రకాశ్ ఆద్యంతం సమయోచిత వ్యాఖ్యానంతో కొనసాగించారు.