స్వచ్ఛమైన రచనలో నాటి సాంఘీక స్థితి…

ఆవుల పిచ్చయ్య ఉద్యమకారుడు .పోరాట యోధుడు .రచయిత .కమ్యూనిస్టు రాజ్యం రావడానికి ఇంకెంతో కాలం ఎదురు చూడవలసిన అవసరం లేదు .రష్యా చైనా లాగే మనదేశం కూడా కమ్యూనిస్టు దేశం అవుతుంది ,అపుడు సొంత ఆస్తి అంటూ ఎవరికీ ఉండదు .కమ్యూన్లు ఏర్పడుతవి ,అందరికీ పని ,కూడు గుడ్డ ,లభిస్తవి.సుఖ శాంతులతో ఉండవచ్చు .అని ఆశాభావం వెలిబుచ్చిన స్వాప్నికుడు .(దేవుల పల్లి కృష్ణ మూర్తి ఆవుల పిచ్చయ్య కవిలె తెలంగాణ పోరాటకతలకు రాసిన ముందు మాట )1919 లో సూర్యాపేట లో తెనుగోల్లు అనే కులానికి చెందిన బీద కుటుంబం లో పిచ్చయ్య జన్మించాడు . ఆంధ్ర మహాసభనుండి 1944 లో అతివాద కమ్యూనిస్ట్ గా రూపాంతరం చెందిండు .పరిశోధకులకు దొరికినవి కొద్ది కథలే అయినా తెలంగాణ నాటి సమాజాన్ని బలం గా చిత్రించిండు. వెట్టి చాకిరీ దినచర్య అనే కథల్లో గ్రామాల్లో సాగిన వెట్టిచాకిరిని రికార్డ్ చేసిండు .నాటి ఊర్లలో మాల మాదిగలు కుమ్మరి చాకలి మంగలి వాళ్ళు ,దొరలకు, జమీందార్లకు , పోలీస్ పటేల్ మాలీ పటేల్ ,పట్వారీ లవంటి అధికారులకి వెట్టి చేయాలె.వెట్టి పని అంటే ఏ జీతం భత్యం లేకుండా పని చేయడం ,సంవత్సరానికి ఒకసారి కళ్ళం లో ధాన్యం మార్పిడి అయినపుడు దొరల గ్రామాధికారుల కొంత ధాన్యాన్ని వెట్టి పనులవాల్లకు కొలిచేవారు . వాళ్ళ సొంత వ్యవసాయం ,మొదలైన పనులను వదలుకొని వెట్టి చేయడమే వాళ్ళ బాధ్యత .

‘’వెట్టి చాకలి దినచర్య ‘’ కథ లో వాస్తవ పరిస్థితులను సాదాగా సీదాగా వ్యక్తం చేస్తరు .పిచ్చయ్య నాడు గ్రామాలలో వెట్టి చేసేవాని బతుకు ఎట్లా ఉండేదో చెబుతడు . ఆ ఊరికి అధికారి వచ్చినపుడు చాకలి రంగడు అధికారి తోటి దెబ్బలు తింటడు. పటేల్ తను లేడని చెప్పమంటే నిస్సహాయం గా తలూపుతడు.అధికారిని చివరికి మంచం లో కూచోపెట్టి స్నానం చేయిస్తడు.చివరికి అధికారి తను ఆశించింది జరుగక పోయేసరికల్లా అక్కడనుండి బయలుదేరుతడు. చాకలికి మాత్రం అశ్రువులు మాత్రమే మిగులుతవి.

చాకలి ఇంటికి చేరేసరికి రాత్రి పది అవుతది .ఆ రోజు వర్షం కొడుతూ ఉంటది .చాకలి గుడిసె లోంచి నీరు బయటకు వెళ్ళడం లేదు .చంటి పిల్లలను పడుకోబెడదామంటే జనాబ్ స్నానం చేయడం వల్ల మంచం తడిచి పోయింది .కడుపుకు తిండి లేదు .చలికి నిదుర లేదు .భార్య భర్తలిద్దరూ అలోచించిండ్రు .గిరిదావరు కు ఇంటిముందు కచ్చడం బండి ,ఇంటి వెనుక గుర్రం ,ఎక్కడిది అది ?బీద ప్రజలను పీల్చి పిప్పి చేసి సంపాదించింది .ఖానూను ఒకటి ,వాళ్ళు చేసేది ఒకటి ,దేవుడు మన కర్మం గింతే రాసిండు అని భార్య అంటే ,అది మానవుడు చేసింది కానీ దేవుడు చేసింది కాదు అంటడు. పిచ్చయ్య కథలన్నిటికీ ఫలశ్రుతి లాంటి వాక్యాలు ఇవి .

ఆవుల పిచ్చయ్య మరో కథ లెవీ ధాన్యం వసూలుకు సంబంధించినది. లెవీ ధాన్యం అంటే మిగిలిన ధాన్యం .రెండో ప్రపంచ యుద్ధం లో బ్రిటిషు ప్రభుత్వం చేసిన ఖర్చు భారత దేశం గ్రామసీమల మీద పడింది .అక్కడి దేశ్ ముఖులు జమీందార్లు బాగానే ఉన్నారు .వచ్చే అధికారులతో కుమ్మక్కయి తమ పంటలు బాగా పండుతలేవని రాయించుకొన్నరు. బక్క రైతులు మాత్రం బలైతరు. ఈ విషయం ఆవుల పిచ్చయ్య తన దౌర కథ లో మనముందు జరిగినట్లు చిత్రించిండ్రు.

బక్కరైతులు లెవీ మాఫీ కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకుంటరు.తహసీల్దార్ ఈ విషయం గా తనఖీ చేసేందుకు దౌర వస్తడు.పోలీస్ పటేల్ ,మాలీ పటేల్ , పనులు పురమాయిస్తరు. హరిజనులు , చాకలివారు ,మంగలి వారు ,కుమ్మరివారు ,వడ్రంగులు ,మొత్తం గుంపులను చావడి వద్దకు పిలిపించి వాళ్ళ వాళ్లకు పని అప్పచెబుతరు. హరిజనులకు మన గ్రామం రోడ్డుకు ఐదు కిలోమీటర్ల దూరం లో ఉంది .అధికారి తోవ తప్పుతడు .కాబట్టి రోడ్డునుండి మన గ్రామం వైపు వేసిన రాళ్ళ గుర్తులు వేయాలె, అని పురమాయిస్తరు.ఇంకొందరు హరిజనులను పిలిచి ‘’మన జమీందారు గారు అధికారికి దావతు ఇస్తడో ఏమో ?మీరు పోయి మన చెర్లో తుమ్మ చెట్టు నరికి పొయ్యి లోకి కట్టెలు తెండి ,అవి పచ్చిగా ఉంటె ఏ రైతు చెలక లో ఎండిన చెట్టుంటే అది నరికి కట్టెలు తెండి అని పురమాయిస్తరు .చావడికి చుట్టూ మందడి కట్టడానికి తరువాత బాటకు పెట్టెన రాళ్ళ కు సున్నం వేయడానికి మంచాలు తేవడానికి చావడిలో పరదాలు కట్టడానికి దుప్పట్లు తేవడానికి పురమాయిస్తరు.మంగలి వాళ్ళ కు కత్తులు సాన బెట్టుకోండి క్షవరాలకు అని చెబుతరు .కుమ్మరి వాళ్ళ కు అరేయ్ ,మీరు కుండలు తెండి ,ఇప్పుడే ఒక పెద్ద కుండెడు నీళ్ళు పొయ్యిల పెట్టి చల్లార్చండి అని చెబుతరు .పట్వారి మస్కూరిని పిలిచి’’ ఏమోయి ,మొన్న గొర్రె పిల్ల ముట్టిగాడు తెచ్చాడు కదా ,ఈ సారి వంతు ఎవరిదో తెలిసి కో , ఒక గొర్రె పిల్ల తీసుకో ,కొన్ని కోడిపిల్లలు కూడా సంపాదించు’’ అని చెబుతడు .’’ఈ సారి పాలు పెరుగు ఎవరు పోస్తారో ఇంతేజాం చెయ్’’ అని పంపుతరు .కోమట్లను పిలిచి ‘’మీదగ్గర సరైన సామానులు ఉంచండి ,లేకుంటే బస్తీకి పొయ్యి సామానులు తీసుకు రండి , నేను చీటీ పంపితే ఖాళీ చెయ్యొద్దు’’ అని చెబుతరు .

నాటి కథ కూడా ఉత్తమ పురుష లోకి రావడం విశేషం .రచయితే కథనానికి ప్రత్యక్ష సాక్షి గా ఉంటాడు .

తరువాత తహసీల్దార్ పెళ్లి లాంటి ఊరేగింపు తో ఊరిలొకి వస్తడు .ఒకరోజు విశ్రాంతి .రెండో రోజు జమీందార్ ఇంట్లో దావతు .మూడో రోజు బండ్లో కూచొని పొలాలు తనఖీ చేస్తడు . తహశీల్ దార్ బండి పేద రైతు రంగయ్య పొలం దగ్గరనుండి వెడుతుంది .నాలుగు ఎకరాలలో మొదటగా ఉన్నది మాత్రం పచ్చ పచ్చ గా ఉంది .తక్కిన వన్నీ రోగాలు తగిలి ఎండిపోయినవి. బాగానే ఉంది అని రాసుకున్నడు .తర్వాత త్రి మూర్తులు పోలీస్ పటేల్ ,మాలీ పటేల్ ,పట్వారీ చెరువు కింద జమీందార్ గారి పొలాన్ని చూడడానికి తీసుకెళ్ళారు .చెరువు చివరకు నీళ్ళు రాకుండా ఉన్న పొలాన్ని చూసి అరెరే ఎండిపోయింది అని రాసుకున్నడు .బండి దిగలేదు . దేనినీ సరిగా చూడలేదు . తరువాత జమీందార్ చేతిలో చేయి కలిపి వెళ్లి పోయాడు .

రైతులు మా పంటలు చూడండని దరఖాస్తులు పెట్టుకుంటే జమీందారు ఇంట్లో విందులు ,రాగాలు ,భోగాలు .పేద రైతులు లెవీ కట్టవలసి వస్తే జమీందారు లెవీ మాఫీ అయింది .అధికారి పొట్ట నిండింది .

రచయిత కథలో సహజమైన భాష వాడుతడు .

ఈ సేకరణ లో నే ఊరేగింపు అని మరో కథ ఉంది .

ఇది కూడా ఉత్తమ పురుష లో నే సాగుతుంది . అమరజీవి కొమురయ్య వీర మరణానికి ఆ రోజుఊరేగింపు జరుగుతుంది .’’నేను అక్కడికే వెడుతున్నాను ,నీవుకుడా రావయ్యా , అంటూ ఓ వృద్దురాలు తాను కూడా ఊరేగింపుల కు బయలు దేరుతుంది .పొలాల్లో నాటేసే స్త్రీలు ,పట్వారి దగ్గర పని చేసే జీతగాళ్ళు ,గొర్రెలు కాసే వాళ్ళు ,మోట కొట్టేవాళ్ళు ,ఇంట్లో అందరూ పాడిపంటలతో చల్లగా ఉండాలని ప్రాణ త్యాగం చేసిన కొమురయ్య ఊరేగింపు లో పాల్గొనడానికి వెళ్ళారు. .కొమురయ్య పేరు మీద పాటలు పాడుతున్నరు .నినాదాలు ఇస్తున్నరు .చివరికి గ్రామాధికారి కూడా ఇట్లా జవాబు చెబుతాడు .’’నేను ప్రభుత్వ బానిసను ,ఆ ఊరేగింపు రాజకీయ ఊరేగింపు .అక్కడ ఉంటే తప్పక రిపోర్ట్ రాయాలె .వీటన్నిటికంటే ఈ గ్రామం నుండి వేరే గ్రామ వెళ్ళడం ఉత్తమం అని నిర్ణయించుకొని వెడుతున్నాను .

ఇదే కథలో ఆయన పరిస్థితిని వాతావరణానికి అనుసంధానం చేస్తూ రాసిన పద్ధతి చూడండి.

‘’శరీరమంతా బురద చల్లుకొని ,నాగలిను మెడపై వేసుకొని , మొకాటి లోతున బురద పొలంలో నిలబడ్డ ఎడ్లనును చూశాను .పిట్టల కీచు కీచులు వినబడడం లేదు .సన్నని మంచు కురుస్తోంది .ప్రపంచమంతా ఇవ్వాళ్ళ విచారం వెలి బుచ్చుతున్నట్టుగా కనిపించింది . మబ్బుల్లో తల దాచుకొన్న సూర్యుడు కనిపించడం లేదు . నా శరీరం అంతా ఒకేమారు జలదరించింది . ఈ కథ పిచ్చయ్య ప్రత్యక్షానుభవం నుండే వచ్చిందని పేర్కొంటారు ముదిగంటి సుజాతారెడ్డి .ఆయన వర్ణించిన ఊరేగింపులు నల్గొండ జిల్లా కదివెండి గ్రామం లో దొడ్డి కొమురయ్య విసునూరు దొర చేసిన కాల్పుల్లో నేల కొరిగిండు.వేలాది జనం తో అయన అంతిమయాత్ర జరిగింది . ఆయనకు మద్దత్తుగా అనేక గ్రామాలలో అంతిమయాత్ర జరిగింది .కాబట్టే ఊరేగింపులు అనే బహువచనం .

ఇట్లా కొనసాగే ఈ కథలలో చపరాసి దిన చర్య నాటి సమాజాన్ని చిత్రించిన మరో కథ .నాటి చపరాసుల్లో ఉండే లంచగొండితనం ,చిత్రించిండు. కథలో ప్రభుత్వ అధికారులు ,వాళ్ళ వైభోగం ,పెత్తం దారులు అధికారుల లాలూచీ , కనిపిస్తుంది .

a

ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాగిన జమీందారు కథ ఈ పరిశోధకులకు పూర్తిగా లభించ లేదు . ఆ కాలం లో మీజాన్ పత్రిక తెలుగు విభాగానికి సంపాదకుడు గా పనిచేసిన అడవి బాపిరాజు పిచ్చయ్య రచనా వైదగ్ద్యత గురించి ,భాషను భావ గాంభీర్యాన్ని గురించి మెచ్చుకొన్న మాటలు ఈ కథ ప్రారంభం లో ఉన్నాయి .

చితికి పోయిన పేద రైతు దుక్కం ఇది .షావుకారు రైతు కుటుంబాన్ని పీల్చి పిప్పి చేసి ,చివరికి జమీందారు దగ్గరికి తీసుకెడతడు .రైతు గోపయ్య తన దైన్య స్థితి ని వివరిస్తూ అప్పు అడిగితే ‘’నా దగ్గర డబ్బు దొరకదు కాని ధాన్యం ఇస్తా అంటాడు .ప్రకాశకులకు ఈ కథ మొత్తం దొరకక పోవడం వల్ల సగమే అచ్చయింది .కాని స్థూలం గా దీనిలోని సారాశం పాఠకులకు చేరుతుంది .

ఆవుల పిచ్చయ్య రాసినవి కొద్ది కథలైనా నాటి తెలంగాణ సమాజాన్ని బలంగా చిత్రించిండు. పిచ్చయ్య ను పరిశోధించి తెలంగాణ సమాజానికి అందించిన సంగిశెట్టి శ్రీనివాస్ అభినందనీయుడు . ఈ పుస్తకం ముందుమాట లో కాసుల ప్రతాప రెడ్డి అన్నట్టు గా ‘’సంగిశెట్టి లాంటి వాళ్ళు శూన్యంలో మెరుపు తీగలను చూస్తున్నారు .ఆవుల పిచ్చయ్య లాంటి వాళ్ళ రచనలు తెలంగాణ కు సంబంధించిన సమకాలీనత ను సంతరించుకొంటున్నాయి. అలాంటి సమకాలీన సందర్భాన్ని గుర్తు చేసే కవిలె పుస్తకాలను అందిస్తున్న సంగిశెట్టి కి ఈ తరమే కాదు భావిష్యత్తరం కూడా ఋణపడి ఉంటుంది’’ .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com