తెలంగాణ కథా రచయితల్లో ఈ కాలం వచ్చేసరికి భాషా విషయం గా కొంత మార్పు వచ్చింది .గ్రాంధిక వాసనలు సడలి పోయి వ్యవహార భాషాప్రయోగం మొదలైంది . తెలంగాణ క్రియాపదాలు ,నుడికారం వాడకం మొదలైంది .కాగా తెలంగాణ భాష కు మాండలిక పరిధిని విదించిన కుట్ర ఇంకా మొదలు కాలేదు .కేవలం సమాజం లోని విషయాలు ఉన్నదున్నట్లు రాయడమే కాక కొంత వర్గ దృక్పథం ప్రవేశించిందీ కాలం లో .కథ లలో పద్యాలు రాసే పద్ధతి దాదాపు గా తొలగి పోయింది .

1894 -1979 మధ్య కాలం లో జీవించిన చలం ప్రసక్తి అక్కడక్కడా కనిపిస్తుంది .అయినా ఇక్కడి స్థానీయత ప్రకారమే ఈ కథలు నడిచినవి కాని ఎవరి ప్రభావం ఉందని ఇదమిద్దం గా తేల్చ లేము.

1910 నుండి గిడుగు రామ్మూర్తి ప్రతిపాదించిన భాషోద్యమ ప్రభావం అక్కడక్కడా కనబడుతుంది .

దానితో పాటు ఈ కథలలో తెలంగాణ భాష వాడడం కనిపిస్తుంది .

గడుపుతుండ్రి, సాగించిండు ,మిడ్కు, మనిషి కావాలె ,బొర్రలు సవురు కుంటూ ,(కోవిల్లో ) భోసిడి, ఇగరా, ఇస్పేటు ,(గప్ చుప్) లాంటి పదాల వాడకం ఉంది .

ఈ కాల పరిమితి లోని అందుగుల తిరుమల రావు నిష్ఫల ,(1940) మరియు నందగిరి వెంకట రావు ప్రతి ఫలం ,(1934) చారిత్రిక కథా కాలం నాటివి .ప్రతి ఫలం కథలో చారిత్రిక స్పృహ కనబడుతుంది .నిష్ఫలం కథ లో చారిత్రిక వ్యక్తు లను పేర్కొనడమే ఉంది కాని చారిత్రిక సంఘటనలు కనిపించవు .ఒక వీరుడు తన విజయానికి ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే భార్య దగ్గర కూడా ఆ మెప్పు ఆశిస్తాడు .కాని భార్య నిర్లిప్తత అతన్ని నిరాశ పరుస్తుంది .మానవ సంబంధాలలో ఉండే సహజానుభూతులు ఇందు లో కనబడుతాయి .రెండు కథల్లోనూ రాజరిక వ్యవస్థ లోని యుద్ధాలు సైనిక మనస్తత్వాలు కనబడుతాయి .

‘’ప్రతి ఫలం’’ కథ లో నాటి యుద్దాలలో జరిగే మోసాలు చూస్తాం ,విధ్యానాథ పండితుడు తానీషా ను మోసగించి ఔరంగజేబు క్రౌర్యానికి బలౌతాడు .నాటి యుద్ధాలలోని క్రౌర్యం యుద్ధం రావడం వల్ల జరిగే విషాదాలు ,ఈ కథ చిత్రించింది .

వెట్టి మాదిగ (1932) భాగ్యరెడ్డి వర్మ, గరీబోన్ని (1939) ఎం. బి..సీతా రామారావు, సంఘాల పంతులు (1940) సురవరం ప్రతాప్ రెడ్డి ,లాంటి కథ లలో ,నాటి గ్రామం లోని పెత్తందారి వ్యవస్థ కనబడుతుంది .వెట్టి మాదిగ లో పటేల్ గిరి చేసిన దౌర్జన్యం , దళితుని దైన్య పరిస్థితి చిత్రించారు .కథ లో నిష్కారణం గా దెబ్బలు తిన్న మాదిగ మల్లు నాటి గ్రామ వ్యవస్థ లోని దైన్యతకు నిలువెత్తు ప్రతీక .పటేల్ రామిరెడ్డి అహంకారం నాటి పాలకులు పెంచి పోషించిన క్షీణ విలువలకు నిదర్శనం .పటేల్ చెప్పిన పనిని వాయిదా వేయడమే మాదిగ మల్లు చేసిన మహా దోషం .అట్లాగే ‘’గరీబోన్ని’’ కథ కూడా అట్లాంటిదే . వెంకయ్య అనే శ్రామిక జీవి కథ ఇది .వెంకయ్య నడుము కు రుమాలు బిగించి పొలం లో పని చేస్తుంటే గట్టు మీద కూర్చొని యజమాని సంతోష పడ్డాడు .అట్లాంటి చలమా రెడ్డి ఇప్పుడు వెంకయ్య మంచాన పడితే ‘’ ఫో , నన్నేమంటావ్ ,’’ అన్నాడు .

వెంకయ్య భార్య రామి ఏడుస్తూ ఆకలి తట్టుకోలేక చీర కొంగును బిగ్గరగా నడుముకు చుట్టింది .పిల్లలు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడి ఉన్నారు .వెంకయ్య కు జ్వరం తీవ్రం గా ఉంది .మూల్గుతున్నాడు. మూడు రోజులనుండి నోట్లోకి ఇంత అంబలైనా లేదు .రామి భరించలేక ఇస్పేటు ఆటలో ఉన్న చల్మారెడ్డి దగ్గరికి వెళ్లి అభ్యర్తిస్తుంది . చల్మారెడ్డి విసుగు తో ,కోపం తో ,చెప్పు ను రామి పైకి విసురుతాడు .

సమాజానికి ఈ గొడవ అవసరం లేనట్టు ‘గప్ చుప్’ గా ఉంటుంది .

ఇక సురవరం ప్రతాప్ రెడ్డి ‘’సంఘాల పంతులు’’ కథ కొంచెం భిన్నం గా ఉంటుంది .అంగ్రేజీ ఇలాకా లో జనులు సుఖం గా ఉంటె నిజాం ఇలాకా రామసాగారం లో జనులు పోలీసుల దౌర్జన్యాల వల్ల,కస్టాలు పడతారు. సంఘాల పంతులు వల్ల ఊరిలొ సంఘాలు ఏర్పడి దౌర్జన్యం ఎదిరిస్తారు. .చివరికి అసలైన ఖానూన్ అమలులోకి వచ్చి , దౌర్జన్యం చేసిన అధికారులు మోతల్ (సస్పెండ్ ) తనుజ్జుల్ (డిగ్రేడ్ ) అవుతారు . చరుకు పల్లి రఘోత్తమ రావు ‘కోవిల్లో’’ (1940) కథ కూడా పెత్తందార్ల అహంకారాన్ని చిత్రించిన కథ. .దొర, పటేల్ ,కరణం ,లాంటి వాళ్ళ కోసం పూజా కార్యక్రమం కూడా ఎట్లా నిరీక్షణ కు గురౌతుందో తెలిపే కథ ఇది .

ఇంకా ‘’సుగుణా ఈ పొరపాటు నాదే’’ ,(1934) జే. వనాంబ, ‘’టాకీ లో సమావేశాలు’’ ,(1940) గుండువరపు హనుమంత రావు , ‘’ఈ రాదేనా’’ (1938) ఎల్లా ప్రేగడ సీతా కుమారి , తిరుగు బాటు (1940) వి.ఆర్. అవధాని .లాంటి కథలన్నీ స్త్రీ దృక్పథం కలిగిన కథలే . కనీసం స్త్రీ చట్టు తిరిగే కథలు . నేడు విస్తృతి చెందిన స్త్రీ వాదానికి ప్రాతిపాదిక కొంత వరకు ఈ కథల్లో చూపిన దృక్పధం కూడా .

‘సుగుణా ఈ పొరపాటు నాదే’ అన్న కథ స్త్రీ పురుష సంబంధాలను అపార్థం చేసుకున్న ప్రేమికుని కథ. తనకు ప్రేయసికి అపార్థాన్ని సృష్టించడానికి ఒక కపట స్నేహితుడు ఆడిన నాటకం తెలిసికొని ,తన ప్రేమికురాలి స్వచ్చతను గుర్తించి పశాత్తాప పడుతాడు .’’టాకీ లో సమావేశము’’ కథలో సినిమా తే ఎతారు లో జనాన్ కోరాత్ సినిమా చూడడానికి రూపాయి పావలా టికెట్టు కొని కథా నాయకుడు లోపలికేడతాడు . రూపాయి పావలా అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ అన్నమాట . మిగతా తరగతుల్లో చాలా రద్దీ ఉండడం వల్ల అతడు ఎక్కువ ధర టికెట్ కొనుక్కుంటాడు .అక్కడ పరిచయమైనా స్త్రీ తో ప్రేమలో పడతాడు . ఆమె వేశ్యా వాటికకు చెందినదైనా స్వచ్చమైనదని తెలుసుకొంటాడు .ఆమె తానున్న జీవితం పైన అసహ్యపడి బయటకు రావాలని కోరుకుంటుంది .తను వివాహిత కావడానికి ఉబాలాటపడుతుంది. చివరికి ఆమెను అక్కడనుండి తీసుకెళ్ళి బ్రహ్మ సమాజ పద్ధతి లో వివాహం చేసుకునే ప్రణాళిక వేస్తాడు మాధవ రావు .

అట్లాగే ‘ఈ రాదేనా’ కాల్పనిక వాసనలున్న కథ .భావుకత తో కొనసాగుతుంది. .తన మరదలు రాధ పైన అయిష్టం గా ఉన్నబావ రాజాను ఆ అమ్మాయి ఏమీ తెలియనట్టు వచ్చి మరో వ్యక్తి గా అతన్ని ట్రాప్ చేస్తుంది .రాజా కలలన్నిటికీ ఆమె సరిపోక పోయినా చివరికి ఆమె అంటే ఇష్టపడే స్థితి వస్తుంది .తన ప్రేమ వ్యక్తం చేశాక ఆమె తన మరదలే అని తెలిసి ఆశర్యపోతాడు రాజా .నాటి సమాజం లో కన్నె పిల్లల కథలు యువకుల భావ ప్రపంచం రచయిత్రి చక్కగా చిత్రించారు .వ్యావహారిక భాషా వినిమయం చక్కగా కొనసాగుతుంది .షాద్ నగర్ లోని ప్రకృతీ సౌందర్యం చక్కగా వర్ణించబడింది .

ఇక ‘’తిరుగుబాటు’’ అనే మరో కథ లో తనను అణచి వేసే పురుష సమాజం పైన స్త్రీ తిరుగు బాటు వైనం చిత్రిస్తుంది .

సరోజ అనే స్త్రీ ని భర్త వదలి పెట్టి మరో పెళ్లి చేసుకుంటాడు .ఆమె స్వయం కృషి తో లా చదువుతుంది .తనను వదలిపెట్టిన భర్త కూడా ప్లీడరే .ఆయన ముందే నిలుచొని లాయర్ గా సవాల్ చేస్తుంది .

ఆమే కోర్టు లో సహేతుకం గా వాదిస్తే జడ్జ్ సానుకూలం గా వింటాడు .ఈ విషయమే సహా న్యాయవాదులు హైకోర్ట్ లైబ్రరీ లో చర్చిస్తారు .అట్లాగే మొగాడు లేకుండా మాతృత్వం పొందిన మరో అమ్మాయిని సరోజ చేరదీయడం గురించి క్లబ్బు లో చిత్రిస్తారు .

సిను ప్రభాతం పత్రికా కార్యాలయానికి మారితే తరువాత తెలుస్తుంది .సరోజనీ దేవి ఎం.ఎ.ఎల్.ఎల్.బి.గారు ఓ ఆశ్రమం స్థాపిస్తారు .దాన్ని గురించి పత్రికలో ప్రచురించే చర్చ అక్కడ జరుగుతుంది .

సరోజని పెట్టిన ఆశ్రమం లో వృత్తి విద్యలు నేర్పిస్తారు .వృత్తి విద్యలు నేర్చుకొన్నవారు పెండ్లి చేసుకోవాలనుకుంటే పెండ్లి కూడా చేస్తారు .ఈ విషయాలన్నీ తెలిసికొని ఈ వరకు విమర్శించిన వాళ్ళు,ఎగతాళి చేసిన వాళ్ళు కూడా చందాలు ఇవ్వడానికి ముందుకు రావడం ఇందులో ట్విస్ట్ ,

ఈ కథ లో సాశ్చర్యం అని అరుదైన పదం వాడారు .కొన్ని దృశ్యాలుగా విభజించి కొంత నాటకీయత తో వస్తువును పరిచయం చేస్తారు .

ఇక ఈ కాలం లో వచ్చిన’’ మా బావ’’ (1940) అవురువల్లి కృష్ణా రావు కథ ,అట్లనే ‘’పల్లెబడి’’ (1940) చరుకు పల్లి హరి కృష్ణ రావు కథ ప్రత్యేకం గా పేర్కొనదగినవి .మా బావ కథ లో ఒక స్థిరత్వం లేని వ్యక్తి నిర్ణయాలు ఎట్లా ఇబ్బంది పెడతాయో చెబుతుంది .అట్లాగే ‘’పల్లె బడి’’ కథ లో ఆ నాటి బడుల స్వరూపం తెలుస్తుంది .ఈ కథ లో దస్త్రాలు ,పోయిండ్రు ,బడి పెంబ (మానీటర్) శవ ధూమ్ (బాగా అల్లరి )లాంటి పదాలు నాటి తెలంగాణ భాషా నైపుణ్యాన్ని తెలుపడానికి ఉపయోగపడేవి .పిల్లల అల్లరి ,వాళ్ళను బాదడం ,కోదండం ఎక్కించడం ,స్వయం గా తలిదండ్రు లే పిల్లలని శిక్షించమని కోరడం ఇవన్నీ ఖాని గి ,బడి పద్దతులు .

బడి పోద్దటినుండి రాత్రి వరకు కొనసాగేది .పొద్దున్న దూపకు విడువడం ,మధ్యాన్నం అన్నానికి విడువడం ,తరువాత దీపం ముట్టించాక ‘’దీపం పరబ్రహ్మం ‘’ అని శ్లోకం చదువు తూ ,ప్రార్థన చేయడం ఆనవాయితీ .దీనితో బడి ముగిసేది

పిల్లలంతా దండం పంతులూ అని చెప్పి పలకలు చంక పెట్టుకొని ,భుజం మీద తట్టు గుడ్డలు ,చాపచింపు లేసుకొని ,ఒక్కొక్కరు తమ ఇండ్లకు ఉరికేవారు .

పిల్లలంతా దండం పంతులూ అని చెప్పి పలకలు చంక పెట్టుకొని ,భుజం మీద తట్టు గుడ్డలు ,చాపచింపు లేసుకొని ,ఒక్కొక్కరు తమ ఇండ్లకు ఉరికేవారు .

కథలన్నింటి లోనూ అన్యాపదేశం గా నే తెలంగాణా జీవన శైలి కనబడుతుంది .నాటి గ్రామీణ సంస్కృతి సహజమైన ప్రేమలు ,అదే విధం గా నాటి పట్టణాలు ,వాటి లోని సామాజిక స్పృహ ,నాటి వ్యక్తి వైరుధ్యాలు ,విభిన్న కోణాలకు ఈ కథలు అద్దం పడుతాయి .తెలంగాణా ఆత్మ గౌరవాన్ని ప్రకటించుకొన్న సందర్భం లో ఈ కథల సేకరణ జరగడం ప్రశంసనీయం. ముదిగంటి సుజాతా రెడ్డి ,సంగిశెట్టి శ్రీనివాస్ ల కృషి తెలంగాణ సాహితీ లోకానికి శాశ్వత స్మరణీయం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com