తనదైన అక్షర ముద్రను అడుగడుగునా ప్రతిఫలించిన ప్రతిభాశాలి సినారె రచనా శిల్పం పరిచయం చేస్తున వ్యాసం…

జానపీఠ పురస్కార గ్రహీత ఉన్నత పదవులు ఉదాత్తంగా నిర్వహించిన ప్రజాధురంధరులు డా.సి.నారాయణ రెడ్డి, నవ్వని పువ్వునుండి నా రణం మరణం పైనే దాకా సాహిత్యసృజనలో ఎన్నో శిఖరాల నధిరోహించిన మహాగిరి సముదాయం సినారె కవిత. ఏ శిఖరాన్ని చూసినా అక్కడే ఆగిపోయి అబ్బురపడి అక్కడి శిల్ప వైభవాన్ని విశ్లేషించడం మరిచిపోయి తన్మయులమవుతాం. అది సినారె రచనా శిల్పం లోని వైశిష్ట్యం.

రచనలోని శిల్పం అంటే రచనా కళ అనీ, రచనా నైపుణ్యం అని చెప్పుకోవాలి.

ప్రాచీన ఆలంకారికుల ప్రకారం శబ్దార్థాలంకారాదుల ప్రయోగం, రసరామణీయకాలు, ధ్వని మొదలైనవి శిల్పంలో అంతర్భాగాలు. సినారె పండిత కవి. ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనమే కాదు అర్థవంతంగా సమర్థవంతంగా అధ్యాపనం చేసిన అనుభవ సంపన్నుడు. ఆధునిక సాహిత్యంలో సంప్రదాయము ప్రయోగములు పేరుతో నిశితంగా శోధించిన పరిశోధకుడు. ప్రాచీనాధు నికతల సమ్మేళనం ఆయన మేధో క్షేత్రం. జానపదుల యాసలనుండి, పాటలనుండి, మాటలనుండి, శబ్దలయను హృదయగతం చేసుకున్న సహృదయుడు. పద్యాన్ని పాటనూ సమంగా ప్రేమించి మధ్యే మార్గంగా గేయాన్ని అద్వితీయంగా నడిపించిన నవ్య కవితా వైతాళికుడు.

గేయమైనా, సినీగేయమైనా, ప్రపంచ పదులైనా, ద్విపదులైనా, వచన కవితలైనా, వచనకవితా కావ్యాలైనా, వచనమైనా తనదైన అక్షర ముద్రలు అడుగడుగునా ప్రతిఫలింపజేసిన ప్రతిభాశాలి సినారె. తన అక్షరాలలో లయలు, అంతర్లయలు, ప్రాసలు, యతులు, అంత్యప్రాసలు, వృత్యనుప్రాసలు అలవోకగా సాగిపోతాయి. అక్షర రమ్యత అతిమనో హరంగా పాఠకుని లేదా శ్రోతలను పరవశింపజేస్తుంది. లకుమ నాట్యానికి రాయలు వివశుడైనట్లు సినారె పదాలకు సహృదయులంతా పరవశులయినారు.

కావ్యాన్ని ప్రేమించి తన గొంతులో నుంచి అందంగా వినిపించిన వాడే కాదు, స్వయంగా తొలినాళ్ళలో పద్య కావ్యం రచించినవాడు. రామప్పలో ఒక పద్యం…

ఏదో వెల్గు కరళ్ళు దొక్కినటులై ఏదో మహాసౌరభం

బీదగ్ధమ్ము నురుంగు లెత్తినటు ఈ నా సమస్తాంగముల్

పాదుల్ వీడెను, జీవనాడులను శంపావల్లరుల్ నృత్యమ

ర్యాదల్ జూ పెను – ఈ మహానుభవ మౌరా! యెట్లు రూపొందునో?

ఒక కళానుభూతిని శార్దూల విక్రీడితంలో బంధించిన తీరు ఇది.

సినారె సంప్రదాయం నుండి సారాంశాన్ని తీసుకున్నారు. కాని తిరస్కరించలేదు.

నేను సంప్రదాయాన్ని జీర్ణించుకున్న ప్రయోగాన్ని ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని….

అని తన కవితా సిద్ధాంత తత్వాన్ని ఆవిష్కరించారు.

ఈ దృష్టితో సినారె రచనా శిల్పాన్ని సంప్రదాయ విమర్శలోను, ఆధునిక విమర్శలోను విశ్లేషించుకునే అవకాశం ఉంది.

నవ్వని పువ్వు నుండి నారాయణ రెడ్డి కవిత అనగానే చటుక్కున ఎవరికైనా స్ఫురించేవి శబ్దలయ, అంత్య ప్రాసలు. రెండింటినీ కాకుంటే కనీసం అంత్యాన్ని పాటించడం ఆయన సహజ ధారా లక్షణం .

నవ్వని పువ్వు నుండి నారాయణ రెడ్డి కవిత అనగానే చటుక్కున ఎవరికైనా స్ఫురించేవి శబ్దలయ, అంత్య ప్రాసలు. రెండింటినీ కాకుంటే కనీసం అంత్యాన్ని పాటించడం ఆయన సహజ ధారా లక్షణం .

ఓ చిన్నమొగ్గా ! ఓ కన్నెమొగ్గా ! చల్లచల్లని తీగె తల్లి ఒడిలో నూగు ఓ చిన్ని మొగ్గా ! ఓ కన్నె మొగ్గా !

చివురుటాకుల లోన / రవల రేకుల లోన

మంచు ముత్యాలుంచి / మంచి మధువుల నించి

ఉదయ భాను కరాల / సుధలు జారే వేళ

ప్రకృతి లక్ష్మి దివ్య / పాదపూజలు చేసి… అని తొలిగేయం సాగింది. ఇందులో పదేసి మాత్రలకొక పాదం విరుగుతూ ఆది ప్రాసనూ అంత్య ప్రాసనూ పాటించారు. ప్రతి రెండు పాదాలలో వాడిన పదాల మాత్రలు సమతూకంలో ఉన్నాయి. దీనితో గేయ లయను సాధించారు. ‘నడక నా తల్లి’ అని చెప్పుకోవడంలో తన ఉదయపు నడకకే కాదు తన హృదయ కవిత్వపు నడకకు కూడా వర్తిస్తుంది. నాటినుండి గేయం వచన గేయంగా మారినా ఈ ప్రాసనియ మాలను, ఒకింత పదాలలో తూగునూ, నాద స్వభావాన్ని మరిచిపోలేదు. విడిచి పెట్టలేదు. మాట్లాడినా, యతి ప్రాసలు దొర్లి పోయేవి. ఆ క్రమంలో ఆయన మాటే పాటయింది. పాటే పలువు రాడుకునే మంచి మాటయింది. అందుకనే ‘మాటకు దండం పెడతా | పాటకు దండం పెడతా / మాటను పాటను నమ్మిన మనిషికి దండం పెడతా’ అన్నాడు. ఇందులో మాట, పాట అనేవి ప్రాసలు. ‘దండం పెడతా’ అనే పదం మనలను పల్లెలకు పట్టుకొని పోతుంది. తన మాట, పాట జానపదం అనే ధ్వని ఈ మాటలో ఉంది. ఈ రెంటినీ నమ్మిన మనిషికి అనడం కళాకారునికి, పల్లెటూరి శ్రమజీవికి, భాషావేత్తలకు, పశుత్వం కాక పరవశత్వం పొందే హృదయానికి అనేంత అర్థయుక్తి ఉంది. అర్థ వ్యాఖ్యానం ఇంత చేయడానికి ఆ వాడిన పదాలు, వాటి తీరే కారణం కదా!

గేయాల గతులను, సినీ గేయాల శ్రుతులను గురించి వివరించకుండా, వాటిలోని రచనా శిల్పాన్ని గురించి కొంత ప్రస్తావిస్తాను.

గేయాలలో అంత్యప్రాసలతో పాటు అనుప్రాసలు, అంత్య ప్రాసలు కూడా పడి వాటి నడకల్లో సరికొత్త అందాలు, గానం లో మాధుర్యాలు తొణికిస లాడినాయి.

రాలలోపల పూలు పూసిన రామ మందిర లీలా

ఆ రామ మందిర హేలా! రాలలో హృదయాలు మోసిన రాసకేళిశాల

రామ మందిర లీల….. అనే ఈ గేయంలో ఎన్ని ‘ర’, ‘ల’ లు జతకట్టుకొని రాలిపడ్డాయి. అవే ఒక లీలను ధ్వనింపజేస్తాయి. ‘రాల’లో ‘రామ’

మందిర, ఆ ‘రామ’ సుందర

రాలలో……… రాసకేళీశాల………… అనేక చోట్ల ‘రామ’, రాలు మధ్యలో రావడం వల్ల పద్యాల్లో యతివలె, ప్రాసయతివలె, నడకకు లయనూ అందాన్ని కూర్చాయి. ఇట్లా గేయాలలో అనేకం చూపవచ్చును.

కనురెప్పల దుప్పట్లు, చిక్కుముళ్లలో తొక్కిసలాట… మొదలైనవి.

సినీగేయాలలో నన్ను దోచుకుందువటే నుండి అన్నింటిలోను ఈ ప్రాస యతుల నియమాలు నియమంగా కాక సహజంగా కనిపించడం సినారె పదశిల్పం.

కవితాశిల్పంలో కవితా నిర్మాణం, కావ్య నిర్మాణం రెండూ ఉంటాయి. కథాకావ్యాల్లో, దీర్ఘ కవితల్లో వస్తుపరమైన నిర్మాణం విభాగాలుగా అంతస్సూత్రంతో బంధించబడి ఉంటాయి. భూమిక, మట్టిమనిషీ ఆకాశం, మొదలుకొని విశ్వంభర దాకా ఈ అంతస్సూత్రం ఉంది. ఇది కథాకథన శిల్పంగా భావించాలి. విశ్వంభరను మానవేతిహాసంగా ఐదు ఖండాలుగా విభజించాడు. ఇవి మనిషి దశలు. బాల్య కౌమార యౌవన వార్లక్య అవసాన దశలు, చతురాశ్రమాలు – తరువాత జీవన భ్రమణం – జననమరణాల పునశ్చరణం – అయిదవ ఖండంలో తనదైన మానవతా సిద్ధాంతంతో ముడివేసి “తరలిపోయే జీవితం – తిరిగి చూడని చిరపథం’ మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి, అని ముగించడంలో మనిషి మనసు ప్రకృతి అనే మూడింటి అనుబంధాలు విడదీయరాదని బోధించారు. ఒకటి ప్రపంచ చారిత్రక మానవేతిహాసం.

రెండు మనిషి ఆబాల్య జీవనాంతం దశల గమనం.

మూడు ‌ప్రకృతి జీవుల అవినాభావ సంబంధం.

ఈ మూడు అంశాలు మూడు పొరలు గా సాగింది విశ్వంభర. ఇది మహాకావ్య లక్షణం ఇది కథా కథన శిల్పమయితే కథే లేని అంశాన్ని కథగా మలిచి వర్ణించడం మరో వినూత్న శిల్పం. ఈ విశ్వంభరను అనుశీలనం చేసిన మిత్రుడు గురిజాల రామశేషయ్య శాస్త్రి వ్యాఖ్యాన గ్రంథం సాహితీ లోకానికి గమనార్హం. దీర్ఘ కథా కావ్యాలలో ఒకటి కేవలం స్పృశించాను.

అర్థశతాబ్దం వెలువడిన యాభయి పైగా కవితాసంకలనాలలో కవితల నిర్మాణాలు, బహురూపాలను సంతరించుకున్నాయి.

1. భావలయలు (లయలు) 2. దృశ్య చిత్రాలు 3. నాటకీయత – సంభాషణ శైలి 4. ప్రశ్నలు – ప్రశ్నోత్తరాలు 5. శబ్ద, అర్థ ధ్వనులు 6. శ్లేషలు 7. చమత్కారాలు 8. కొత్త ప్రయోగాలు – పదబంధాలు 9. నిర్మాణ వైవిధ్యాలు 10. కొత్త రూపాలు – ప్రపంచపదులు, గజళ్ళు మొదలగునవి.

ఒక భావం కోసం ఒక లయను రెండుపాదాలుగా , లేదా రెండుమూడు నాలుగు పాదాలుగా పాదసామ్యాన్ని పాటిస్తూ నడిపించడం భావలయ.

కాలం కేలెత్తి పిలుస్తున్నది / కంకాళం లేచి నడుస్తున్నది

గిరిజనుడే పురజనుడై / ధరాచక్రమును తిప్పే

తరుణం వస్తున్నది – కాలం……

(అక్షరాల గవాక్షాలు )

సినారె కవితల్లో దృశ్యచిత్రాలు భావాలను అనుభూతం చేయడమే కాక కళ్ళముందుంచుతాయి. వాస్తవంగా కనిపించే వాటిని వర్ణించి చూపడం, లేనివాటిని ఉన్నట్లుగా చిత్రించడం రెండు రకాల దృశ్యచిత్రాలుంటాయి.

నదులు, పర్వతాలు, శిల్పాలు, జలపాతాలు, వృక్షాలు, పక్షులు, ఋతువులు, మొదలైన వాటినన్నిటినీ సహజోక్తిలో చెపుతూనే శబ్ద సౌష్టవాన్నీ, అర్థగాంభీర్యాన్ని పొదుగుతారు. వర్ణనలలో ఔచిత్యం పరచుకొని ఉంటుంది.

తడిమట్టి పొరల్లో తలదాచుకున్న / విత్తనం మొక్కగా పైకి లేచి / కాలానుగుణంగా శాఖోపశాఖలతో వృక్షమై విస్తరిస్తుంది (ప్రాకృతిక రూపాలు – అలలెత్తే అడుగులు)… ఇందులో మట్టిలో ఉన్న విత్తు మొలకై వృక్షమై విస్తరించడం చాలా సహజమైన విషయం. అయితే మట్టిలో తలదాచుకోవడం, పైకి లేవడం, విస్తరించడం అనే పదాలలో అటు చెట్టుకు, ఇటు ఎదిగే మనిషికి, లేదా ఏదైనా ఒక క్రమపరిణామం చెందే అంశానికి వర్తిస్తుంది. అర్థపరంగా కలిగే విస్తృతి ఇది. ఇక గింజ మొలకెత్తడం, పైకి లేవడం, చెట్టుగా ఎదగడం అనేది ఒక దృశ్యక్రమమే. నాలుగు పంక్తుల్లో చెప్పడం కూడా నాలుగు కాలాల వ్యాపకాన్ని తెలియజేస్తుంది.

ఇట్లాంటి పంక్తుల్లో సూర్యుడు, మబ్బు, గాలి, నీరు అంశాలను గురించి కూడా నాలుగేసి పంక్తుల్లో చిత్రించి చివరకు వృక్షం, సూర్యబింబం, నీలిమేఘం, మారుతం, సాగరం అనే పదాలు వేరు

వేరు పాదాలుగా విరిచి చివర “విశ్వానికి స్థితి కారకంగా ఉన్న / ప్రాకృతిక రూపాలు” అని ముగింపులో రాశారు. పైన నాలుగు పాదాలలో చెప్పిన వాటికి క్రమంగా వాచ్యం చేసి క్రమాలంకారం పాటించారు. అంతేకాదు పంచభూతాలను ప్రాకృతిక రూపాలుగా నాలుగు, తరువాత ఒకటి చొప్పున ఐదేసి పంక్తులుగా పేర్చడం వలన పంచభూతాల పంచీకరణ ధ్వనిస్తుంది.చివరి మాటల్లో స్థితికారకాలు అని ప్రాకృతికాలు అంటే మూలాలు అనీ ప్రకృతి సంబంధాలు అనీ ఎప్పటికీ ఉండేవి అని స్పష్టం చేశారు. ఈ మాటలతో పై పాదాలను మరలా చదివితే కలిగే అర్థవ్యాకోచం మరోవిధంగా ఉంటుంది. ఉత్తమ కవిత్వానికుండాల్సిన లక్షణాల్లో ఒకటి అది మరలా చదివింపజేసేదిగా ఉండడం. భావవ్యక్తీకరణలో రూపనిర్మాణ శిల్ప వైశిష్ట్యం ఇది. ఇదంతా దృశ్యమానం కావడం మరొక విశేషం. ఇది ఒక మచ్చుతునక మాత్రమే. ఇట్లాంటివి ఇంకా అనేక రకాల శిల్పాలు సినారె కవితల్లో కనిపిస్తాయి.

నాటకీయ పద్ధతిలో కవిత్వం సంభాషణా రూపంలో సాగిస్తారు కొన్ని చోట్ల….

రోజులు గడుస్తున్నాయి / పూలు వాడిపోతున్నాయి

గత్యంతరం లేక / తీగల్ని బతిమాలుకున్నాయి

“మమ్మల్ని మీలో పొదుగు కుంటారా?” అనగానే తీగలు జాలి చూపులు ప్రసరించి “వేళ దాటిపోయింది

అనాలోచితంగా మీరు తీసుకున్న నిర్ణయం మీ అవసాన దశకు దారితీసింది, ఇప్పుడు నేనేం చేయలేను” ఇదంతా పూలకు తీగలకు జరిగిన సంభాషణ. నాటకంలో పాత్రలు మాట్లాడుకున్నట్లుగా పంక్తులు ప్రశ్నలు, జవాబులుగా ఉండటం, వాటి తీరు తెన్నులు కూడా హావభావాలను ప్రకటిస్తున్నట్లు చూపడం కనిపిస్తుంది. తీగ జాలి చూపులు చూపడం వంటివి మానవీకరణ చేసినట్లుగా ఉన్నాయి. ఇట్లాంటివి కూడా సినారె కవితల్లో ఎన్నో ఉన్నాయి.

ప్రశ్నలు సంధించి సమాధానం రాబట్టటం. ఇక్కడ పాత్రల వలె కాక కవియే ఒక సన్నివేశంలో ఒక ప్రశ్నను సంధించడం దానికి సమాధానం కూడా తానే సూచించడం.

ఏం చేసుకోను ఈ వెండి కంచం? / ఏవేవో క్రిములు కదలుతున్నాయి

ఎలా పట్టుకోను ఈ మధుచషకం/ ఏ వికట స్మృతులో తొణకుతున్నాయి (విశ్వంభర)…. వీటిలో ప్రశ్న సమాధానమూ రెండూ ఉన్నాయి. పాత్ర కవి ఒకరే. ఒకవేళ ప్రశ్నలేకుండానే చెపితే “కంచం వెండిదే అయినా క్రిములు కదులుతున్నాయి” అని చెపితే అంత బలంగా వ్యక్తం కాదు. ఎవరో తనకు వెండి కంచమే ఇచ్చారు, కాని చూస్తే అందులో క్రిములున్నాయి, అంటే ఆ కంచం శూన్యం కాదు అందులో ఏవో పదార్థాలున్నాయి. వాటికి చీమలు పట్టినాయి, వెండి అయినా బంగారం అయినా ఆరగించే పదార్థానికి చీమలు పడితే వ్యర్థం కదా! అనే అర్థం ఈ ప్రశ్నతోనే సాధింపబడింది. అట్లే రెండవ ప్రశ్నలో తీసుకునే చషకంలో ఉన్న మధువులో లోపం లేదు, కాని తీసుకుంటే వికట స్మృతులు కలవర పెడతాయనే భయంలాంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకటి భౌతికమయింది, రెండవది మనస్సుకు చెందింది. మామూలు ప్రశ్నల వలె కనిపించే ఈ చరణాలలో ఇంత్ అర్థాన్ని ఇమిడించాడు సినారె. ఈ ప్రశ్నోత్తరాల నిర్వహణ కూడా నిర్మాణంలో ఒక భాగమే.

కొన్ని చోట్ల ప్రశ్నలే ఉంటాయి, సమాధానం వ్యక్తం కాదు, ఊహకు వదిలేస్తారు,

నా మదిలో విరిసిన ఆమనివో? నా కన్నుల మెరిసిన పున్నమివో?… ఈ ప్రశ్నలో నీవు ఆమనివా? పున్నమివా? అని ఆమె సౌందర్యాన్ని సందేహాలం కారంగా ప్రకటించారు. ఈ రెండుగా నాలో నిండి ఉన్నావనే ధ్వని మాత్రమే ఉంది. ఇవి నిజంగా సమాధానం ఆశించిన ప్రశ్నలు కావు.

కొన్ని చోట్ల ప్రశ్నలు నిశ్చయార్థాన్ని తెలుపుతాయి.

ఎన్ని రంగులు పులుముకున్నా / ఎపుడైనా గెలిచిందా చీకటి ?

ఏ ఆంక్షలు నిషేధించినా | ఉద యించకుంటుందా కిరణ సంపుటి?

ఈ ప్రశ్నలను విశేషణాలతో సహా ప్రయోగించారు. చీకటి గెలువదు, ఉదయం ఆగదు అనే నిశ్చయార్ధాన్ని చెప్పడానికి చీకటికి రంగులు పులిమే విశేషణం, ఆంక్షలు ఆపలేని లక్షణాన్ని కిరణాలకు విశేషణం, ఈ రెండూ అసాధ్యాలని స్థిరమైన అర్థమే ఇందులో సూచితం. అజ్ఞానం చీకటికి అహంకారాది రంగులు పులమటం వ్యర్థం, వెలుగు కిరణాలకు వేళ్ళు అడ్డు పెట్టడం కూడా వ్యర్థం అనే నిషేధాలను కూడా ఇందులో వ్యంజింపజేశారు. విశ్చయాన్ని, నిషేధాన్ని నిర్వచనంలా కాకుండా ప్రశ్నలా వేయడం వలన పాఠకుడు కూడా అవును కదా! అని సమాధానం తానే చెపుతున్నట్లుగా అనుభూతిని పొందుతాడు. ఒక భావాన్ని బలంగా చెప్పడానికి వాడుకున్న నిర్మాణ మార్మికత ఇది.

నిన్న లేని అందమేదో / నిదుర లేచె నెందుకో?

ఈ సినీగీతం ప్రశ్నతో మొదలై ఒక ఆశ్చర్యార్ధాన్ని, ఒక ఆనందాన్ని, ఉద్వేగాన్ని ప్రకటిస్తున్నది. ఈ ప్రశ్నలో కవి, లేదా నాయకుడు సమాధానం ఆశించడం లేదు. తరువాతి చరణంలో “ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో?” అంటాడు. ఇక్కడ కూడా ఎప్పుడూ ఉన్నవే అయినా ఇవాళ శోభాయమానంగా కన్పడుతున్నాయనే

భావననే వ్యక్తమవుతుంది కాని ప్రశ్న సమాధానాన్ని ఆశించింది కాదు. ప్రశ్నలను అనేక విధాలుగా ప్రయోగిస్తూ కవితా నిర్మాణంలో కొత్త దారులు చూపించారు సినారె. దాశరథి, శ్రీశ్రీ మొదలైన వారిలో కూడా ఈ ప్రశ్నల రూప కవిత్వం ఉంది, అయితే వైవిధ్యం, నూతనత్వం ఎక్కువగా ప్రవేశ పెట్టాడు సినారె.

కవిత్వంలో రసధ్వనులు ప్రధానాలు, ప్రాణాలు అని ఆలంకారికులు చెప్పినారు. సినారె అలంకార శాస్త్రాలు చదివారు. బోధించారు. ఆయనలో చాలా విషయాలు జీర్ణమయినాయి. అందువలన అవి ఆయన కవిత్వంలో అప్రయత్నంగానే దొర్లుతుంటాయి. వాటిలో ధ్వని ఒకటి.

విత్తనం మట్టిలోకి విసరితే వృక్షమై పేలుతుంది….

ఈ పంక్తుల్లో ఇంతకు ముందు చూపిన గింజ చెట్టుగా మారడమనే

భావనయే ప్రధానంగా కన్పడుతుంది. కాని మట్టిలో గింజ దాక్కో వడం వేరు, లేదా మట్టిలోకి చల్లడం వేరు, ఇక్కడ విసరితే అన్నాడు పేలుతుంది అన్నాడు. ఈ రెండు పదాలు బాంబులు విసరడానికి పేలడానికి వాడేవి. ఈ రెండు మాటలతో విత్తనమంత బాంబు విసరినా చెట్టంత పేలుతుంది అని, ఒక మొలకను రాబట్టే వాడు నాటాలని కాని విసరకూడదని, దానినుండి మంచి ఫలితాన్ని ఆశించాలని కాని అది పేలిపోయి తనను తన చుట్టూ ఉన్న వారిని పేల్చేయకూడదని, విధ్వంసం కాదు, విచ్చుకోవాలని,

పిల్లలను చక్కగా పెంచాలి కాని విసరేసినట్లు వదలేస్తే వారే సమాజానికి హానిచేస్తారని , ఇట్లా అనేకానే కార్థాలను ఈ రెండు మాటలలో పొదిగాడు. ఇది ధ్వని.

నిత్య నినదిని అక్షరం / నిశ్శబ్ద ప్రాకార విచ్ఛేదిని అక్షరం

గజ్జెలా కాళ్ళకు కమ్ముకొని/ డప్పులా బాహువులను కరచుకొని

చెమట చుక్కల్లా శరీరాన్ని కప్పుకొని / గొంగడి గొంతులో చిందేసిన అక్షరాలు

దోపిడి దుర్గాలను కూల్చే ఘోషలవుతాయి / ఎర్రకారం పీల్చే | శ్వాసలవుతాయి

ఈ మొత్తంలో శ్రమజీవి, కళాజీవి, ధిక్కారస్వరం అన్నీ ధ్వనిస్తున్నాయి. ఒక జానపదకళారూపం కళ్ళముందు కదలా డుతుంది. ఎన్నో ఉపమానాలు, రూపకాలు పదాలు అర్థాలు పోటీపడుతు న్నట్లున్నాయి. దీన్నే పరస్పరాన్యోన్యతా క్రమణలు అంటారు. పదాన్ని అర్థం, అర్థాన్ని, రూపం ఒకదాన్నొకటి మించిపోవడానికి పోటీపడుతున్నాయా అన్నట్లుండడం. ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఔచితీవంతంగా, ఆకర్షణీయంగా, రూపావిష్కరణ చేసే విధంగా ప్రయోగించారు.కరుచుకొని, కప్పుకొని, కమ్ముకొని వంటి సమతూకమైన అంత్యాలు సినారెకు సహజం.

సినారె కవిత్వంలో శ్లేషలు కోకొల్లలు. సినీగీతాలలో కూడా వాటిని అలవోకగా సాధించారు.

నాదానివి, నీవే నా దానివి, కలవరించి, కల, వరించి, హరి జనుడై, హరిజనుడే, వంటివి ఇది సభంగ శ్లేషలు. ఇంకా ఉత్ప్రేక్షలు, ఉల్లేఖనాలు ఎన్నో ఉన్నాయి. ఇవి అలంకారాలే అయినా శిల్పంలో భాగాలే.

సినారె రచనల్లో కొత్త ప్రయోగా లున్నాయి. అవి ప్రక్రియా పరమైనవి, విషయ పరమైనవి. భాషాపరమైనవి.

గజళ్ళు తెలుగులో విస్తృత ప్రచారంలోకి తెచ్చింది సినారె. ప్రపంచపదులు, వంటివి రూపపరమైనవి.

ప్రబంధ కథానాయికలను రూపకాలుగా, నాటికలుగా మార్చి రచించడం కూడా విషయపరంగా ప్రయోగాలు. వరూధిని, సుగాత్రి, నాగార్జు నసాగరం, కర్పూర వసంతరాయలు. కర్పూర వసంతరాయలు గేయ కథాకావ్యంగా రూపొందించినా తిరిగి గేయరూపకంగా మలిచారు.

బుర్రకథ అదివరకున్న రూపమే అయినా వాటిలో దరువులను, ఎత్తుకునే వంత చరణాలను ఎన్నిటినో కొత్తవి ప్రయోగించారు.

ఎవరన్నా రవి కన్నులని, అరరే మధువొలికే గిన్నెలవి,

ఎవరన్నారివి బుగ్గలని, అరరే ఎర్రని రోజా మొగ్గలవి…. కన్నులను మధువొలికే గిన్నెలతో, బుగ్గలను రోజా మొగ్గలతో పోల్చడం సినారె చేసిన కొత్త ప్రయోగం. అంతకు ముందు కలువలు, పద్మాలు,

మీనాలు మొదలైనవాటితో కన్నులు పోల్చడం ఉండేవి.

జ్వలన శీలం కోల్పోయిన వ్యక్తిత్వం/ శ్వాసకు వేలాడే కళేబరం….. ఇందులో జీవచ్చవం అనే మాటకు బదులు శ్వాసకు వేలాడే కళేబరం అనేది కొత్త ప్రయోగం.

నదుల నందులు తరగల తలలతో / కుమ్ముకు పోతుంటాయి… ఇందులో నదులను నందులుగా , అలలు కొమ్ములుగా చెప్పడం కొత్త ప్రయోగం. అయితే గట్టు చిమ్మేయడం అనే సామాన్య లక్షణాన్ని అంటగట్టి ఇది సాధించాడు.

అగ్గిపుల్ల గీకిన శబ్దం వింటే/ తలమీద కప్పు తగలబడి పోతుంది… ఇందులో తలమీద కప్పు ఇంటి కప్పును, తలమీద అనడంతో మరో అర్థం తన నీడయైన నివాసాన్ని అని మామూలు మాటలో రెండర్థాలు పొదిగించడం.

ఎన్ని కుట్లు వేసినా | చినిగిన వాక్కులకు/ ఆ దృఢత్వం రాదు… వాక్కులను వస్త్రంతో పోల్చడం కొత్త. కావ్య దుకూలముల్ అని దాశరథి అన్నాడు అది కావ్యానికి చెందిన ప్రయోగం. ఇది వాక్కులకు సంబంధించింది.

సినారె కవిత్వంలోనే కాదు వచనరచనలో కూడా తనదైన ముద్ర ఉంటుంది. క్రియంతాలు తక్కువగా విశేషణాంతాలు ఎక్కువగా వాడి ఒక లయను సాధిస్తారు. విశ్వంభరకు రాసిన ముందు మాటలో…..

“ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం మనిషికథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి.” ఇట్లా సాగిన వాక్యాల్లో క్రియలు కనిపించవు. చాలా పుస్తకాలకు రాసిన

ముందు మాటలు గమనిస్తే కూడా క్లుప్తతతో పాటు వాక్యాన్ని ఒక కొత్త ఒడుపుగా చెప్పిన తీరు కనిపిస్తుంది. ‘నా వచనం బహు వచనం’ అన్నారొక చోట.బహు అంటే ఏక వచన, బహువచనంలోని బహువచనం అని ఒక అర్థం కాగా బహు అంటే గౌరవార్థకం కూడా అవుతుంది.

గొప్ప అనే ఆంతర్యం కూడా ఉంది.

వచనంలో కూడా సినారె రచనా శైలిని విడిగా వింగడించి చూపవచ్చు.

సినారె రచనల్లోని శిల్ప నిర్మాణాలకు సంబంధించి సంప్రదాయ దృష్టితో కొన్నింటిని మాత్రమే నేనిక్కడ ప్రస్తావించాను. ఆధునిక దృష్టితో ప్రతీకలు, శబ్దసంయోజనాలవైవిధ్యం, శీర్షికల పేర్లు , మనోవైజ్ఞానికత, కొత్త పదబంధాలు వంటివెన్నో ఉన్నాయి. వాటిని ఎవరైనా పరిశోధన చేయవచ్చు. ఒక గ్రంథంగా వ్రాయవచ్చు.

ఎన్ని సార్లు చెక్కితే శిల్పం / ఎన్ని సార్లు తీర్చితే చిత్రం

కబుర్లు చెప్పకు కాలమా / ఎన్ని సార్లు చేస్తే జీవితం……

ఆయనే చెప్పినట్లుగా కవితాశిల్పాన్ని ఎంతో జాగరూకతతో అపురూపంగా, అద్వితీయంగా చెక్కిన అసమాన ప్రతిభాశాలి సినారె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com