సాహిత్యానికి ఖచ్చితమైన విలువ వుండాలి. ఆ విలువ ఖచ్చితంగా ప్రజల పెయిన్ ను వ్యక్తీకరించాలి. ప్రజలు పడుతున్న బాధను ఎత్తి పట్టి గాయానికి మందు పూయాలి. ఒక సమస్యను తార్కికంగా ఆలోచించి పరిష్కారంతో పాటు, మనోధైర్యాన్ని కూడా పాఠకుడికి ,సమాజానికి కవి ఇవ్వాలి.అప్పుడే సాహిత్య లక్ష్యం పరిపుష్టి అవుతుంది. ఈ పని ఖచ్చితంగా నందిని సిధా రెడ్డి రాసిన “అనిమేష” కావ్య చేసింది.అనిమేష అంటే రెప్పవాల్చనీయని పరిస్థితి అని అర్థం. ప్రపంచం అంతా కంటికి కునుకు లేకుండా అనుభవించిన చిత్రమైన భయానక స్థితి కరోనా వల్ల కలిగింది. మొత్తం మానవ జీవన విధానమే తల్లడిల్లీ తలకిందులుగా ఆసనాలు వేసింది.మహా సామ్రాజ్యాల ఆర్థిక వ్యవస్థలను కరోనా పీక నొక్కిపోయింది. దేవుఁడ్లు అంత తుస్సు అని చెప్పింది.వ్యవస్థలన్నీ తలకిందులై గబ్బిలం వేలాడినట్ల వేలాడాయి .రెప్ప మూసి ప్రశాంతంగా నిద్రించిన మనిషేలేడు. కనుకనే పుస్తకానికి “అనిమేష” పేరు పెట్టి ఉంటారు కవి.

సిధారెడ్డి స్పందన రహితంగా ఉండలేని మనిషి. కాళీ మెదడును కోరుకోని మనిషి. ప్రభావ రహితంగా కూడా ఉండలేని మనిషి. వ్యక్తిగత దినచర్యలతో కాలం గడిపే మనిషి అసలే కాదు .సగటు జీవుల స్పందనతో ఒక మేనిఫెస్టోను నిర్మించుకున్న మనిషి అని ఆయన సాహిత్య జీవితాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది.

సిధారెడ్డి ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి. 40 సంవత్సరాల పాటు ఏదో ఒక ఉద్యమంతో జీవితాన్ని అల్లుకున్న వ్యక్తి.ఒక 20 సంవత్సరాల పాటు ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్నాడు. ఇంకో ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంతో కలిసి నడిచాడు. అన్ని సందర్భాల్లో అగ్గి గొంతుతో మాట్లాడిన వ్యక్తి.

తనే చెప్పుకున్నట్లు సిధారెడ్డికి ఊరు అంటే ఇష్టం. కలలంటే ఇష్టం. కవులంటే ఇష్టం .ప్రకృతి అంటే ఇష్టం పక్షులు అంటే ఇష్టం .అక్షరాలు ఇష్టం. హక్కులకై పోరు చేసే సంఘాలు అంటే ఇష్టం .తన జీవితమంతా అక్షర ప్రయాణమై సాగిపోయాడు.ఎక్కడ ఆగిపోలేదు.అందుకు సాక్ష్యాలు తాను రాసిన పుస్తకాలే. “భూమి స్వప్నం”, ‘సంభాషణ’ ,’ ప్రాణహిత’ ఒక బాధ గాదు, నది పుటువడి ,ఇక్కడి చెట్ల గాలి నీటి మనసు లాంటి కవితా సంపుటాలు నిదర్శనం.’ నాగేటి

చాల్లల్లా’ పాటలుగా ప్రవహించాడు. ‘చిత్రకన్ను’ కథలై అలుగేల్లినాడు.

నూరు పూలు, ఆవర్తనం, కులవృత్తులు తెలంగాణ సాహిత్యం లాంటి వ్యాస సంకలనాలు ఇప్పటికే ప్రచురించి ఉన్నారు. ఇదంతా ఎప్పుడు సాధ్యం అంటే అక్షర తపస్వి అయితేనే సాధ్యం.

మనుషుల మధ్య ఉండవలసిన నైతిక పునాదిని, ప్రకృతి అవగాహనను, పరిశీలనాత్మక దృష్టిని ఒక ఒక జీవన మార్గంగా ఉండవలసిన ఆవశ్యకతని అనిమేష కావ్యం నొక్కి చెపుతున్నది.

పది నెలలు గడిచినా ప్రపంచం

తేరుకోని కన్నీటి దుస్థితిని

ఇగో ఇలా పలవరిస్తున్నారు..

ఇగో ఇలా పలవరిస్తున్నారు..

“జీవితం జీవకళ కోల్పోయింది/ప్రయోగశాల వెలవెలబోయింది/విజ్ఞానశాస్త్రాలకు చెమట పడుతుంది/అధికారం తలపట్టుకుంది…అంటూ

జరుగుతున్నదేదో/జరగవల్సిందేదో/అంతుపట్టక /జగమే చిన్నబోయింది”..అంటూ సతమత స్థితిని బాధగా వలపోస్తున్నారు.

భారత రాజ్యాంగ ఆత్మగా ప్రవేశికను బాబా సాహెబ్ అంబెడ్కర్ ఎలా రూపొందించారో ,ఆలాగే అనిమేష కావ్య ఆత్మను కూడా సిధారెడ్డి గారే ముందు పేజీలో తక్కువ పదాలతో ఎక్కువ అర్థాన్ని ,భావాన్ని ఇచ్చే విధంగా రాసినారు.

కరోనా కాలంలో ప్రభుత్వాలు ప్రజలకు శాస్త్రీయంగా అండగా నిలబడడం మరిచిపోయి ,చప్పట్లు కొట్టండ్రి పళ్ళాలు కొట్టండ్రి అనే పిలుపుకు ఇలా స్పందించారు..

“చప్పట్లు కొడితే/పక్షులు లెవయి/గంటలు మోగిస్తే/ధైర్యం పలుకది..”

అంటూ ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపినారు.

మనుషుల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి కనుకనే, సిధారెడ్డి కోవిడ్ కాలంలో ఎంతో మదన పడ్డాడు, వేదన పడ్డాడు,దుఃఖితుడయ్యాడు. బాధాకరమైన స్థితిగతులను కూడా బాధాతప్త హృదయంతో ఒక కళా కృతిగా మలిచి ‘అనిమేష’ దీర్ఘ కావ్యాన్ని అందించాడు.

“కడ చూపు కాకపోయినా/కడకు నిప్పు పెట్టడానికి వీలు కాకపోయినా/కొడుకొచ్చాడు కడుపంత దుఃఖంతో/అక్కలుంటారు తమ్ములుంటారు/భారంగా బంధువులుంటారు/ఎవరి మీద పడి ఏడవటానికి ఉండదు” అంటూ కనీస బాధను కూడా వ్యక్తం చేయలేని పరిస్థితిని కళ్ళ ముందు చూపి అందరిని ఏడిపిస్తారు.

ఎవరూ ఎవరిని నమ్మడం లేదు.తన చేతులను తానే నమ్మడం లేదు.తన రక్త సంబంధీకులను తానే నమ్మడం లేదు.”అనురాగలకు అనుమానమే” అంటుకుంది అంటూ “అనుమానం వెంటాడే చోట అరణ్యమే మేలు” .అంటున్నారు.

“ఊరికి రాత్రి కాపలా/రాత్రికి రాతి గోడ కాపలా..”

“రోమ్ నగరం కన్నుల/మాడిపోయిన వెన్నెల” లాంటి వ్యక్తీకరణలతో

సిధారెడ్డిలోని కవి ఆకాశమంత ఎత్తుగా కనిపిస్తున్నాడు.

‘అనిమేష’ కావ్య నిర్మాణం చూస్తేనే సిధారెడ్డి టెక్నిక్ కనిపిస్తుంది . కోవిడ్- 19 కరోనా కావ్య వస్తువు కాబట్టి ఈ పుస్తకంలో బాధలను 19 గాథలుగా విభజించి, ఒక్కో బాధకు ఒక్కో గాథగా కేటాయించారు. అన్ని గాథలలో బాధలనే వ్యక్తపరిచారు.

అనుకోకుండా వచ్చే ఉపద్రవాలను కావ్య వస్తువుగా ఎంచుకొని తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ కావ్యాలే వచ్చి ఉంటాయి. ప్రతీ ఉపద్రవాన్ని కావ్యంగా మలిచే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ప్రపంచం అంతా కూడా ఒక ఉపద్రవంగా బావించింది మాత్రం కరోనానే అని చెప్పవచ్చు. దేశానికి పరీక్ష కాలం దాపురించింది. ఈ పరీక్ష కాలంలో కవి చైతన్యం, కవి చూపు చాలా ముఖ్యమైనవి.

కోవిడ్ తర్వాత వచ్చిన ప్యానిక్ సిచువేషన్ ని, ఒక నిస్సహాయ ,ఏమీ చేయలేని స్థితిని ,ప్రజలు పడ్డ అన్ని రకాల బాధని , అన్ని రంగాల పతనాల్ని, ప్రభావాల్ని, సిధా రెడ్డి లోతైన చూపుతో అక్షరబద్ధం చేయడం “అనిమేష” కావ్యంలో కనపడుతుంది.

ఉపద్రవాలు వచ్చినపుడు ప్రజలు కలిగి ఉండాల్సిన తాత్విక అవగాహనను ‘అనిమిష’ చక్కగా వివరించింది.

పుస్తకం చదివిన వారంతా సిధా రెడ్డి భావాలతో, బోధనలతో పూర్తిగా ఏకీభావo పొందుతారు. ప్రమాదాల పట్ల ఉపద్రవాల పట్ల తప్పకుండా జాగరూకతతో కూడిన అవగాహన పొంది తీరుతారు .ఒక భావాన్ని ,భావ ప్రసారాన్ని మనకు తెలియకుండానే మన పైకి ఒక కళాత్మకంగా సుతిమెత్తo గా సిధా రెడ్డి వదులుతారు.

ఒక్కో గాథ ఒక్కో లోతైన పెయిన్ ను తెలుపుతుంది .అంతిమంగా మన మనసును ఆశావాదంలోకి మళ్లిస్తారు కవి .ఎంత శక్తివంతమైన వైరస్ వచ్చినా ,వైరస్ కు లొంగని శక్తివంతమైన నమ్మకాన్ని మనిషికి ఈ కావ్యం పట్టిస్తుంది .అసలు ఈ కావ్యం నడిపించిన పద్ధతి కూడా మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది .ఆత్మశోధన ఎంతో బలంగా చేస్తే కానీ, ఇంత కమ్మని కావ్యం రూపుదాల్చదు.

సిధారెడ్డి చాలా క్లారిటీ ఉన్నకవి. అపారమైన బుద్ధి సూక్ష్మత ,ఎరుక కలిగిన కవికూడా అని ఇవిగో ఈ క్రింది కవితా పంక్తులు తెలుపున్నాయి..

“మతం ఒక వైరస్/ఎప్పుడో మెదడును కమ్మేసింది/రాజకీయం మరో వైరస్/రక్తనాళాల్లో చేరిపోయింది/వ్యాపారం వావిలేని జీవి/మనసును మత్పరించింది….

అంటూ పై మూడు రంగాల వల్ల మనిషి మాయమై పోయిన స్థితిని ఇలా చెపుతున్నారు..

“ఇవ్వాళ మనిషి ఎక్కడ దొరుకుతాడు”…అని వెతుకుతారు.

“వ్యాధులతో వ్యాపారం చేయకుండ” ప్రపంచంలోని పరిశోధనలన్నీ ఇంకా ఇంకా శక్తివంతం కావాలని అన్ని స్థాయిలలో మెడికల్ సైన్స్ ప్రగతి పెరగాలని ప్రపంచమంతా కలిసి కట్టుగా

సహకారం అందించుకోవాలంటూ

“పరస్పర సహకారం విజ్ఞత

ప్రపంచ సంరక్షణ

ప్రపంచ దేశాల బాధ్యత” అంటూ వసుధైక ప్రపంచం ఉండాలని కవి ఆశపడుతున్నారు.

అనేక గాథల్లో చర్చించిన అనేక అంశాలు విశ్వజనీనమైనవి .జీవితానికి ఏ స్థాయిలోనైనా అనువదించుకోగల గొప్ప విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

కొత్తగా చదివిన పాఠకుడికి కూడా ఈ పుస్తకం ఉద్దీపన కలిగించేదిగా ఉంది. ఆలోచనల పుష్టిని,పరిపుష్టిని అందిస్తుంది. కొత్త ,పాత పాఠకులను కూడా సంతృప్తిపరిచే కావ్యం ఇది.

అనుభవం కలిగిన కవి కాబట్టి ప్రతి వాక్యంలో కవిత్వమై మెరుస్తాడు. కవిత్వం అల్లుతున్న సందర్భంలో కంటెంట్ ఎక్కడ పక్కదారి పట్టకుండా చూసుకోవడం వల్ల ఈ కవి నైపుణ్యం తెలుస్తోంది.మానవజాతి ఆనందకరమైన, ఆరోగ్య ప్రదమైన ,విజయవంతమైన జీవితం గడపాలని కవి ఆకాంక్షిస్తున్నాడు.

అంతిమంగా సాంకేతికతను నమ్ముతున్నాడు .దేవుడిని ఈ కవి నమ్మడం లేదు.డాక్టర్ల, శాస్త్రవేత్తల కృషిని మనసు నిండా అభినందించారు.ప్రకృతికి మనిషికి మధ్య ఉండాల్సిన సంబంధాన్ని ఇలా చెపుతున్నారు..

“మనిషి విజృంభించేది ప్రకృతి మీద/ప్రకృతి విజృంభించేది మనిషి మీదే అంటూనే మనిషే ప్రకృతికి భరోసాను ఇవ్వాలని చెపుతూ..

“సమస్త ప్రాణి/సహజీవనానికి/పూచి పడాల్సింది మనిషే.అంటున్నారు.

అతి వాగుడు సాహిత్య కాలుష్యం నుండి మనల్ని విముక్తి చేస్తారు సిధారెడ్డి .ఎక్కడ అస్పష్టత లేదు.ఎక్కడా వ్యర్థ పదాలు లేవు.ఎక్కడా వ్యర్థ వాక్యాలు లేవు.ప్రతి గాథలో ముగింపు చాలా అబ్బురపరిచే విధంగా, ఆలోచించే విధంగా ఉండడం నాకు చాలా నచ్చింది. క్రమానుసారంగా గాథలను వివరించుకుంటు ,మెళుకువలను నూరిపోస్తూ పోతారు.

ఈ పుస్తకం చదివిన తరువాత సిద్ధారెడ్డి ఆశావాది కాదు, నిరాశావాది కాదు .ఒక సంభావ్యత దృక్పథం,సకారాత్మకథ అభిప్రాయం కలవారు అని తెలుస్తుంది. మనిషిని “విన్నర్ సర్కిల్లో” జీవించేలా ఇష్టపడతాడు ఈ కవి.

ఈ పుస్తకం చదివితే మనిషి మనుగడకు కావలసిన మూలాధార జ్ఞానం అలవడుతుంది. తన జీవితాన్ని తానే నిర్దేశించుకొని ,ప్రకృతి ఆదేశానుసారం ఎలా జీవించాలో ఈ కావ్యం తెలియపరుస్తుంది.

ఈ కావ్యం బాధను చిక్కటి కవిత్వంగా చేసిందని చెప్పొచ్చు.అట్లని పరిష్కరాలు చూప లేదా అంటే అవి మన జీవన విధానంలోనే ఉన్నాయి అని చెప్పకనే చెప్పారు.

ప్రజల బాధ , ప్రపంచం బాధ తనకొచ్చిన బాధగా భావిస్తే తప్ప, హృదయం ద్రవించే ఇలాంటి కవిత్వం తన్నుకు రాదు.

విత్తనం ఎంత సహజంగా మొలకెత్తునో ,ఆకులు ఎంత సహజంగా చిగురిస్తాయో, పువ్వులు ఎంత సహజంగా విచ్చుకుంటాయో అంతే సహజంగా సిద్ధారెడ్డి సర్ కవిత్వం వికసించింది.

అంతర దృష్టితో కవిత్వం రాసిండు. లోతులను లోచూపుతో తడిమిండు.

అక్కడక్కడ మనుషులకు సన్న సన్నని చురకలు కూడా అంటించారు.

చివరగా “అనిమేష” కావ్యం మన జీవితాలను మార్చే అద్భుతమైన కావ్యం అని చెప్పే సాహసం చేయలేను. కానీ ఒక మనోధైర్యాన్ని, కొంత గుండె నిబ్బరాన్ని తప్పకుండా ఈ కావ్యం అందిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.ఇంత మంచి కావ్యం అందించిన నందిని సిధారెడ్డికి అభినందనలు. శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com