పీవీ పాండితీ ప్రతిభను చెప్పిన వ్యాసం…

“ఎవరీ పాములపర్తి వంశంలో! ఇగోరోత్తిన చిరంజీవి

ఎవరో కాదు భాషా పరశేష భోగి!

కలములో లేమిలో తలపెంచని, వంచని కర్మయోగి”

అని డా. సి.నారాయణ రెడ్డి పి.వి.నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవీ స్వీకారం చేసిన సందర్భంలో ప్రస్తుతించారు.

పి.వి.రాజకీయాలలో చాణక్యుడు. ఆయన సాహితీ రచనలు లోకానికి అంతగా తెలియవు. వివిధ సాహితీ ప్రక్రియ లలో తలస్పర్శిగా రచనలు చేసి కవి పండితుల ప్రశంసలందుకొన్న విద్వన్మణి. ఛందోబద్ధమైన పద్యం, భావ గర్షితమైన రచన కవిత, సంభాషణాత్మకమైన కథ, సన్నివేశ కల్పితమైన నవలిక ..ఇలా అన్ని ప్రక్రియలలోనూ పి.వి. తనదైన శైలి ప్రకటించాడు.

‘జయచంద్రా! హైందవ ధ్వంసకా!” అనే ఛందోబద్ధ కవిత్వాన్ని చిన్నతనం లో ప్రచురించాడు. ప్రేమ- ప్రణయం అనే ఖండకావ్యం అమలిన శృంగార రస సృష్టి. ఆశు కవితా సరళిలో సాగింది. “కథనునికైన ఆగునే కంట నీరు”. అప్పట్లో కాకతీయ వార పత్రికలో ‘జయవిజయ’ అనే కలం పేరుతో ఎన్నో వ్యంగ్య రచనలు చేశారు. స్వాతంత్ర్యం అర్థరాత్రి వచ్చింది. దీనిని సూచిస్తూ…

‘ఆనిద్రాణ నిశీధుని మానిసి మేల్కొంచినాడు’ అనే సుదీర్ఘ వచన కవితను శాసనసభ లో స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా 1972 ఆగష్టు లో ముఖ్యమంత్రి గా చదివి వినిపించారు పి.వి.

పి.వి. శతజయంతి సభ:- హైదరాబాద్ లో 2020 జూన్ 28న పి.వి. శతజయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైభవోపేతంగా నిర్వహించింది. ఆ సభలో ముఖ్యమంత్రి గా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వయంగా భాషావేత్త అయిన శ్రీ‌.కె.చంద్రశేఖర రావు పి.వి. బహుముఖ ప్రజ్ఞను కొనియాడారు. విశ్వనాథ వారి వేయి పడగలు నవల క్లిష్టమైనదనీ దీనిని హిందీ లోకి పి.వి. తర్జుమా చేయడం అనువాదం కాక ‘అనుసృజన’ అన్నారు. పి.వి. రసజ్ఞత గల వ్యక్తి అని వర్ణిస్తూ ముఖ్యమంత్రి భర్తృహరి సుభాషితాన్ని గుర్తు చేశారు.

‘చదువది ఎంతకల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ

చదువు నిరర్థకంలో -గుణ సంహితులెవ్వరు మెచ్చ రెచ్చటన్”

అంటూ పి.వి. రసజ్ఞత గల వ్యక్తి గా పేర్కొన్నారు.

భావావేశపూరిత కవిత:- ఆయన కవిత ను ఆస్వాదిస్తుంటే కవితా సౌందర్యం పురివిప్పి నృత్యం చేసిన వాసంత మయూరం వలె భాసిస్తుంది. ఆయన భావు కూడా పరిణత రాజనీతిజ్ఞుడు, కర్మయోగి‌. బహుభాషావేత్త. అత్యంత సున్నిత హృదయుడు. స్వాతంత్ర్య రజతోత్సవ శుభ సందర్భంలో వినిపించిన కవితతో ఎన్నో ప్రశ్నలు గుప్పించి వాటికి తానే సమాధానం పలికాడు ‌

“భూమి దీన గ్రహమై పోవ రోదసిని మధించి

మానవతా వాహనకై పూనుకొన్న రాజ్యేందిర

జయదుంధుభి విని ఉత్తేజము పొందునా పౌరుడు” అంటూ సమాధానం గా “అవునని, అవునని, అవునేనని జన వాక్యాలు’ అని శుభాశంసన.

వ్యంగ్య భరిత కవితా స్పూర్తి:- వరంగల్ లో పివి, కాళోజీ ఆత్మీయ మిత్రులు. కాళోజీ షష్టి పూర్తి ని మిత్రులు ఘనంగా జరిపారు. శుభాకాంక్షలు కవితాత్మకంగా పంపారు. పి.వి. అందులో కాళోజీ నిర్మొహమాట ధోరణిని వ్యంగ్యంగా ప్రస్తావించారు.

” సూక్తులు, శాపములును పునరుక్తి దోహమందకుండ

జగత్తు నభిశంసించుచు శతవత్సరములు దాటుము”

అని శతాయుష్మాన్ భవ అని ఆకాంక్షిస్తూ చివరి పంక్తు లిలా మలచారు.

“బ్రహ్మ నీకు పొరపాటున పాపుల వీయమిచ్చు గాక

కాలుడు .అ కాళయ్యను కలకాలము మరచు గాక” అను

పాపీ చిరాయుః అనే నానుడిని గుర్తు చేశారు.

మంగయ్య అదృష్టం: ఇది ఒక సృజనాత్మక నవలిక. అంధ్ర ప్రభ వార పత్రిక దీపావళి ప్రత్యేక సంచిక (1999 నవంబరు) లో ప్రచురితమైంది. పి.వి.ఎంతటి గంభీరుడో అంతటి చతురుడు. వ్యంగ్య ధోరణిలో మంగయ్య పాత్ర ను సృష్టించారు. మంగయ్య ఒక నిరుపేద. అనాకారి. దౌర్భాగ్య జీవనుడు. కాలం, కర్మం కలిసి వచ్చాయి. అతడు ‌ముఖ్యమంత్రి స్థాయి కి ఎదిగాడు.లోక సహజమైన సన్నివేశాలతో పి.వి.కథను మలిచాడు. సాంఘిక ఇతివృత్తానికి పౌరాణిక స్పర్శ కల్పించాడు. బ్రహ్మ దేవుడు మంగయ్య జాతకం లో అదృష్ట రేఖను లిఖించాడు. ఆయనది భాగ్యలేఖన శాఖగా వర్ణించారు. సాధారణంగా ప్రభుత్వోద్యోగాలలో ఒక శాఖ వారిపై మరొక శాఖ వారు కక్ష గడతారు. పీత మనస్తత్వం సహజం. కిందికి దిగలాగడం అలవాటు. మంగయ్య జీవితం లో అదే జరిగింది. బ్రహ్మ మీద మిగిలిన దేవతలందరూ తిరుగుబాటు చేశారు. ఆ వర్గం లో బ్రహ్మ గారి భార్య సరస్వతి కూడా చేరింది. మంగయ్య వ్యక్తిగత జీవన పోరాటం అద్భుతంగా చిత్రించారు పి.వి.

కథాకథన శిల్పి:- కాకతీయ పత్రిక సహసంపాదకత్వం నెరపుతున్న రోజుల్లో పి.వి.వయస్సు 28 సంవత్సరాలు. ‘విజయ’ అనే కలం పేరుతో 1949 ఆగష్టు 15 సంచికలో ‘రామవ్వ’ కథను పి.వి.ప్రచురించారు‌. కథ చదివినంత సేపు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. మారుమూల‌ కుగ్రామమది. నిజాం పరిపాలన కాలం. ముసలి రామవ్వకు మల్లి అనే మనుమరాలుంది. ఓ అర్థరాత్రి వేళ ఆ అవ్వ యింటి తలుపు చప్పుడయింది. రజాకార్ల ఆగడాలతో భయకంపితులవుతున్న రోజులవి. ఆమె సందేహిస్తూ తలుపు తీలేదు. కిటికీ గుండా కటిక చీకటి లో ఓ యువకుడు ఇంట్లో జొరబడ్డాడు. మనుమరాలి శీలం చెరచవద్దని అతడి కాళ్లు పట్టుకొంది. అతడు పోలీసులకు భయపడి వచ్చాడు‌ ఆమె అతనికి ఆరణునిచ్చింది.

అతడు అప్పుడే ఇద్దరు పోలీసుల్ని చంపి వచ్చాడు. వీళ్లు గాలుస్తూ రామవ్వ ఇంటి తలుపు తట్టారు. ఆమె అతనికి గొల్లోని వేషం వేయించింది. మల్లిని అతని మంచంపై దగ్గరగా పడుకొని పైన చేయి వేయమంది‌ దీపం ఆర్పి వేసింది. పోలీసులు లోపలికి ప్రవేశించారు. అతడు తన మల్లడనీ, వారిద్దరూ భార్యాభర్తలనీ బొంకి వారిని నమ్మించింది. వీరు వెళ్లిపోయారు. ధైర్య సాహసాలకూ, యుక్తి నైపుణ్యానికీ ప్రతీకగా రామవ్వను పి.వి.చిత్రించారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అ యువకుని రక్షించింది మ ఆసాంతం చదివించే కథనం పి.వి‌.సొత్తు.

కళ్లు తెరిపించిన సంఘటన:- సమాజంలో రకరకాల వ్యక్తులుంటారు. మానభంగాలు, దౌర్జన్యాలకు పాల్పడతారు. మతకలహాలను రెచ్చగొడతారు. వారి కళ్లు తెరిపించే ఒక అద్భుత సన్నివేశాన్ని పి.వి-“బ్లూ శిల్క్ శారీ” అనే ఆంగ్ల కథ రాశారు. దానిని ‘నీలం సిల్కు చీర’ పేరుతో తెలుగులో ప్రచురించారు. ఇందులో పరమ కిరాతకుడైన కథానాయకుడు అక్రమార్జిత విత్తం సంపాదించాడు. అతనికి వ్యభిచార గృహాలకు వెళ్లే అలవాటుంది. ఒక రోజు బొంబాయి ‘రెడ్ లైట్’ ప్రాంతానికి వెళ్లాడు. పడుపు వృత్తిలో వున్న ఓ యువతిని ఆ రాత్రికి ఎంపిక చేసుకొన్నారు. నీలి రంగు మేలిముసుగు లో వున్న ఆ యువతి అందం అతని నాకర్షించింది. ఇద్దరూ గదిలోకి ప్రవేశించారు. ఆమె నీలం ముసుగు తొలగించింది. ఆమెను చూచిన అతడు దిగ్భ్రాంతి చెందాడు. అమె తన స్వంత చెల్లెలు. కొంత కాలం ‌క్రితం మతకలహాలలో ఆమెను దుండగులు అపహరించుకొని పోయి బొంబాయిలో వేశ్య గృహానికి అమ్మి వేశారు. ఎంతకూ ఇంటికి రాని అమె దుండగుల చేతిలో మరణించి వుంటిందని కుటుంబీకులు భావించి సరిపెట్టుకున్నారు. ఈ కథలో మానవీయ కోణం‌ ప్రస్ఫుటమవుతుంది‌.

అనువాద సరళి:- విశ్వనాథ వారి వేయిపడగలను సహస్ర ఫణ్ గా పి.వి. అనుసృజన చేశారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద బహుమతి లభించింది. మరీదీ నుండి హరి నారాయణ ఆప్టే నవలను -అబలా జీవితం- పేర తెనిగించారు. ఆంఛంగా రెండు పెద్ద నవలలను అనువదించడం ద్వారా ఆయన అనుసృజన సాహిత్య ‌లోకంలో ప్రసిద్ధమైంది.ఆంగ్లానువాదం: జయప్రభ కవిత లను పి.వి. ఆంగ్లం లోకి అనువదించారు.

మచ్చుకు ఒక కవిత.

Iam untimely Death’s campaign

I cannot open the door

Into this abandoned Island

Again in Daytime

Frozen like a sea of snow

Ecsatasy like Shiva’s dance

ఇందులో వాడిన ఆంగ్ల పదజాలం పి.వి. ఆంగ్ల భాషా పాండిత్యాన్ని వెల్లడిస్తుంది.

తెలుగు నుండి హిందీ, తెలుగు నుండి ఆంగ్లం మరాథీ నుండి తెలుగు ఇలా అనువాదకుడిగా పి.వి. అగ్రశ్రేణిలో నిలుస్తారు.

మంత్రుల ఇబ్బందులు:- ప్రభుత్వంలో పనిచేసే మంత్రులకు రాజకీయ నాయకుల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. రాష్ట్ర మంత్రిగా, ముఖ్య మంత్రిగా, కేంద్ర ‌మంత్రిగా, ప్రధాన మంత్రి గా పి.వి. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం గడిపారు. నిజ జీవితంలో తాను ఎదుర్కొన్న సంఘటనలను – ‘SOR ROWS OF A MINISTER’ అనే గల్పిక్ లో చమత్కార భరితంగా వర్ణించారు. ఆత్మకథ Insider లో కూడా ఆయన ఉద్వేగభరితమైన ఎన్నో చారిత్రకాంశాలను సృజనాత్మకంగా వర్ణించారు.

ఈ గల్పిక్ లో‌ కూడా ఇక మంత్రి గారి ఛాంబర్ లో జరిగిన ఉదంతాన్ని చిత్రీకరించారు. ఆయన గదిలో గొంతెమ్మ కోర్కెలతో వచ్చిన నాయకులున్నారు. ఒకరు తన కుమారునికి ఇంజనీరింగ్ కాలేజిలో (తక్కువ మార్కులు వచ్చినా) సీటు ఇప్పించమని నిర్బంధించారు. రూల్స్ అంగీకరించమని మంత్రి చెబితే నాయకుడు ఎదురు తిరిగి – ఈ సమాధానం చెప్పడానికి గుమాస్తాలు -మంత్రిగారక్కర్లేదని వాదిస్తాడు. ఇలా రకరకాల వ్యక్తులు మంత్రి పై వొత్తిడి తెస్తారు. నిజ జీవితంలో జరిగే వేత్తాంతాల చిత్రణ ఇది.

పి.వి. కవిగా, కథకుడిగా, నవలాకారుడిగా,పద్యకవిగా, అనువాదకుడిగా, బహుభాషావేత్త గా, పత్రికా రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజకీయాలలో ఎంతటి చతురుడో, సాహిత్యం లోనూ అంతటి చాతుర్యం గల విద్వన్మణి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com