చరిత్ర పరంగా.. చరిత్ర ఘనంగా
తెలంగాణ-ఒక అక్షయపాత్ర
తవ్వుతున్నా కొద్దీ ఊరే చెలిమెలాంటిది తెలంగాణ చరిత్ర. ప్రపంచానికి తెలియని ఎన్నో వింతైన, వినూత్నమైన చారిత్రక విశేషాలు ఈ ప్రాంతం సొంతం. ఇంతటి మహోన్నతమైన ప్రాంతంలో పుట్టినందుకు గర్వపడాలి. మన చరిత్ర దాని వైభవం గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం..
చరిత్ర పొరల్లోకి, సాంస్కృతిక మూలాల్లోకి, ఇంకా లోతుల్లోకి తొంగి చూస్తే తెలంగాణ చరిత్ర ఘనం. ఒక పూలవనం. ఉమ్మడి ప్రత్యేక రాష్ట్రానికి ముందు మన చరిత్ర వినబడలేదు. కనబడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చరిత్ర పరంగా, గత కాల పు వైభవపరంగా మనం ఎంత కనుక్కున్నా, ఎన్ని కొత్త అంశాలను వెల్లడిస్తున్నా, కుప్పలుకుప్పలుగా పుట్టుకొస్తున్నాయి. అందుకే తెలంగాణ నేలను ఎందరో సాహిత్యకారులు ఒక అక్షయ పాత్రగా అభివర్ణించారు. తన గర్భంలో ఎంతో ఘనమైన చరిత్రను దాచుకొని ఈ నేల తల్లి అపురూప అద్భుత ప్రాంతంగా పరిఢవిల్లుతున్నది.
తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు రోజు రోజుకు బయల్పడుతూనే ఉన్నాయి. ఒక దగ్గర ఆది మానవుల అవ శేషాలు లభిస్తే, ఇంకోచోట శిలా శాసనాలు దొరుకుతున్నాయి. వెతుకుతున్నా కొద్ది వేల యేండ్ల నాటి ఘనమైన చరిత్ర మన కండ్ల ముందు ప్రత్యక్షమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రాచీన చరిత్ర పరిశోధన మీద పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు. చేయాల్సినంత కృషి చేయలేదనే చెప్పాలి. అది విచారకరం. అప్పటి అధికారులకు, నేతలకు అది అనవసరం అనిపించవచ్చు. కానీ ఉద్యమకారుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, ఆయనకు విజన్ ఉండడం వల్ల మన చరిత్ర, ఘన చరిత్రగా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరగడం, పనులు ప్రారంభం అవడమే అందుకు సాక్ష్యాలు. ఇప్పటి వరకు బయటపడని చరిత్ర కూడా ఇక్కడి మట్టిలో దాగి ఉండి బయటికి రావడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నాయి.
సకల కళలకు సాంస్కృతిక వారసత్వమే కాదు. వేల యేండ్ల నాటి చారిత్రక నేపథ్యం. ప్రతి కట్టడంలో అద్భుత నైపుణ్యం. ఆశ్చర్యపరిచే శిల్ప సౌందర్యం. ప్రతీ పల్లెటూరిలో విలసిల్లే సాహితీ పరిమళాల్లో కూడా తెలంగాణ చరిత్ర కనిపిస్తున్నది. వినిపిస్తున్నది. తెలంగాణ చరిత్ర భిన్నమైన జీవన విధానశైలిలో కూడా కనిపిస్తున్నది. ఇదంతా ఒక ఎత్తయితే… ఒక గల్కొండ, ఒక చార్మినార్, ఒక మేడారం, ఒక రామప్ప ఇలా చెప్పుకొంటూపోతే వందల యేండ్ల నాటి వైభవమైన ఆనవాళ్లు ఇంకా నిలిచి ఉన్నాయి. ఇక్కడి నేలలో జైనం, బౌద్దం, శైవం, వైష్ణవం వంటి చాలా మతాలు తెలంగాణ పుణ్యభూమిలో ఒక భాగమై ఉన్నవి.
తెలంగాణ నేల కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి జీవ వైవిధ్యానికి నెలవుగా ఉందని అనేక చారిత్రక ఆనవాళ్లు రుజువు చేశాయి. వృక్ష శిలాజాలు మాత్రమే కాకుండా కోట్ల సంవత్సరాల క్రితమే ఇక్కడ జంతువులు కూడా మనుగడ సాగించాయ ని లభించిన జంతు శిలాజాల ద్వారా తెలిసింది. గుహలు, గుట్టలు, రాతి చిత్రాలు, శిల్పాలు, కాకతీయులు తవ్వించిన చెరువులు, మెట్ల బావులు, తోరణాలు, కోటలు ఇలా రకరకాల పద్ధతుల కట్టడాల ద్వారా తమ చరిత్ర ఆనవాళ్లను వదిలి వెళ్లారు అప్పటి పాలకులు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత చారిత్రక ప్రాశస్త్యం ఉన్న అనేక పురాతన ప్రదేశాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధ నలు జరుగుతున్నాయి. చరిత్ర ఆనవాళ్లను వెలికి తీస్తున్నా కొద్దీ బయటపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా తన వంతుగా సహకరిస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నది. దీనివల్ల పర్యాటకంగా కూడా తెలంగాణకు ఆదరణ, ఆదాయం వస్తున్నది. ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయ వనరుగా కూడా మారుతుంది. చరిత్ర వల్ల లాభమే తప్ప నష్టం లేదని చెప్పడానికి ఈ విష యాలు, విశేషాలు చాలేమో!
(చరిత్ర వల్ల చారిత్రక ప్రదేశాల వల్ల తెలంగాణలో పెరుగుతున్న పర్యాటక శోభపై ప్రత్యేక కథనం…. వచ్చే సంచికలో….)

… అజహర్ షేక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com