సరిగ్గా ముప్పై ఏళ్లకు…

పల్లెకు పోవాలనే కోరిక కలగడం.. నా భార్యాపిల్లలు నన్ను అనుసరించడం .. అంతా అప్పటికప్పుడు జరిగిపోయింది.

ఇన్నాళ్లకు మాఊరికి బయలుదేరడం ఉన్నపళంగా తీసుకున్న నిర్ణయమే అయినా.. నాలో ఎప్పటినుండో పల్లె వాతావరణాన్ని ఆస్వాదించాలనే కోరిక క్రమక్రమంగా బలపడడమూ కారణం కావచ్చు. అయితే పుట్టిన గడ్డకు సుదీర్ఘకాలంగా దూరమయ్యాననే భావనకంటే, ఈ నగర జీవనానికి నాల్రోజులు దూరంగా వెళ్లి గడపాలనే ఆలోచనవల్ల కావచ్చు… మా ఈ ప్రయాణం

రణగొణ ధ్వనులు, కాలుష్యపూరిత వాతావరణం మధ్య, ఏళ్లతరబడిగా ఉరకలు పరుగుల ఉద్యోగ జీవితం ఉల్లాసాన్ని దూరం చేస్తున్నట్లుగా అనిపిస్తుంటే .. ఈ యాంత్రిక జీవితం నుండి కొంతకాలం విముక్తున్ని కావాలనిపించింది. పచ్చని ప్రకృతిలో స్వాంతన పొందాలన్న కోరికను భార్యాపిల్లలు కూడా సమ్మతించడంతో ఏకంగా నెలరోజులపాటు ఉద్యోగానికి సెలవు పెట్టి పల్లెబాట పట్టాము .

బెంగుళూరు నుండి ఫైట్లో హైదరాబాదుకు, అక్కన్నుండి టాక్సీలో మా ఊరు బయలుదేరాం. కారు కరీంనగర్ శివార్లుదాటి తమ పల్లెవైపు పరుగులు తీస్తుంది. రోడ్డు సౌకర్యం మెరుగుపడినట్లుంది. పెద్దగా గతుకుల్లేవు. ప్రతి ఊరికి పల్లెవెలుగులు పరుగులు పెట్టడం మొదలెట్టాక పల్లెలన్నీ తారురోడ్లకు నోచుకున్నాయి .

జిల్లా కేంద్రానికి నలబై ఐదు కిలోమీటర్ల దూరంలో, చుట్టూ గుట్టలు, వాగులు వనాల మధ్య ఉంటుంది మా ఊరు. ఇప్పుడు మాఊరుకూ తారురోడ్డు

వేయబడింది. ఇదో నిర్మాణాత్మకమైన మార్పు. తను ముప్పై సంవత్సరాల కితం కాలు బయట పెట్టాడు. ఇప్పటికీ ఊరు అట్లాగే ఉంటుందని అనుకోలేం కానీ, పట్టణాలతో పోల్చితే పల్లె పల్లే! పట్టణాల్లో పొందలేనివి చాలా పల్లెల్లో దొరుకుతాయి.

వేసవి సెలవుల్లో పిల్లల్ని కనీసం వారం పది రోజులన్నా ఎక్కడకైనా తిప్పాలి. భార్యామణిని ఉన్నచోటే ఉంచితే బోర్ ఫీలవుతుంది. ఊటీలు, కొడైకెనాళ్లు, దైవక్షేత్రాలు సరేసరి! ఈసారి కొత్తగా…ఇంకేదో కొత్తగా ప్రయత్నించాలని పించింది.

ఏకంగా మనూరు వెళ్తే..?

షాక్ తగిలినట్టు ఉలిక్కిపడ్డారు నా భార్యాపిల్లలు.

మా ఆవిడ స్రవంతికి కొంతసేపు ఏం చెప్పాలో తెలియలేదు కానీ… ఆలోచిస్తుంటే ఆవిడకూ నచ్చినట్లనిపించింది. “మీరేమంటారూ…?” అంది పిల్లల్లో

నా కూతురు చైతన్యకి పదమూడేళ్లు. ఎనిమిదో తరగతి చదువుతుంది కొడుకు విష్ణుకు పది. తనిప్పుడు ఆరోతరగతి. నగరంలో సిమెంటు రోడ్లు, మల్టీ ఫ్లెక్సులు, మెట్రో వాహనాలు, అపార్టుమెంట్లు, లిఫ్టులు… పుట్టినప్పట్నుండి వాటిలోనే మునిగితేలిన మాపిల్లలు, కొత్తగా పల్లెవాతావరణం గురించి వర్ణించగానే అదో వింతలోకంలోకి వెళ్తున్నట్లుగా భావించారు.

బియ్యం ఏ చెట్టుకు కాస్తుందో తెలియగానే.. ఏకంగా బియ్యపు చెట్లతో ఆడుకోవాలన్నంత కుతూహలానికి లోనయ్యారు. గుట్టలు, చెరువులు, నీటిచెలిమెలు, మామిడితోటలు, పశువుల పాకలు.. ఇవన్నీ వింటుంటేనే ఆకర్శితులయ్యారు. తాము ఇప్పటి వరకూ చూసిన లోకానికి కొత్తగా అనిపించ గానే “వెళ్దాం.. వెళ్దాం..” అని తొందర పెట్టారు. ఫలితంగా తాజ్ మహల్లు, ఎర్ర కోటలు గోవాబీచ్లు, హౌరా బ్రిడ్జ్ లు వంటివి సందర్శించాల్సిన మా వేసవిట్రిప్ మా ఊరివైపు మళ్ళింది. నెలరోజులు సెలవు పెట్టుకొని మరీ బయలుదేరదీశాన్నేను.

ఐదేళ్ల క్రితం మా నాన్నగారు పోయినప్పుడు దంపతులిద్దరమూ మాఊరు వచ్చినా ఉన్నది నాల్రోజులే! చదువుల దృష్ట్యా పిల్లలిద్దర్నీ అక్కడే అత్తవారింట్లో ఉంచి రావడంవల్ల ఐదోరోజు అన్ని కర్మలూ పూర్తిచేసుకొని, మళ్లీ హైద్రాబాద్ బస్, అక్కన్నుండి బెంగుళూరు ఫైట్ ఎక్కేశాం అమ్మతో సహా! మేమిద్దరం మాకిద్దరు అన్నట్లుగా సంసారం సాగిపోతున్నా ఆ మహానగరంలో ఏదో వెలితి. ప్రశాంతత కరువవుతున్న భావవ. లక్షల్లో జీతం, కారు, అపార్టుమెంటు, అనుకూలవతి భార్య, ఆణిముత్యాల్లాంటి పిల్లలు.. ఇంకేం కావాలి

ఇంకా ఏదో కావాలి

కారణం సరిగా తెలియదు. కానీ అప్పుడప్పుడూ అనిపిస్తుంది. ముప్పై ఏ ళ్లక్తితం చదువు పేరుతో పుట్టినూరు వదలి సిటీ చేరాడు తను. ఆతర్వాత ఐ దేళ్లకు ఉన్నత చదువులని అమెరికా వచ్చేశాను. మరో ఐదేళ్లకు చదువు పూర్త యినా ఇండియా రాకుండా అక్కడే ఉద్యోగంలో చేరిపోయాను. అప్పుడే బెం గుళూరు అమ్మాయితో పెళ్లి కూడా అయిపోయింది. పదేళ్లు అమెరికాలో ఉద్యోగజీవితం ఎట్లాంటి ఆనందాన్ని ఇచ్చిందోకాని.. తర్వాత నాదేశం, నా భారతమాత అని దేశాభిమానం పెరిగి ఇండియా వచ్చేశాను. తను చదివిన చదువుకు సరైన ఉద్యోగం దొరకాలంటే మళ్లీ మహానగరాలే కావాలి. అట్లా పదేళ్ల క్రితం బెంగుళూరులో సెటిలైపోయాం. నాలుగైదేళ్ల క్రితం నాన్న చనిపోయినపుడు అట్లావచ్చి ఇట్లా వెళ్లాం. ఇంటికి తాళంకొట్టి అమ్మను బెంగ్లూరు తీసుకెళ్లాక స్వగ్రామం జాడలే గుర్తుకురాలేదు. సంవత్సరం క్రితం అమ్మకూడా పోయారు.

ఇప్పుడు… ఇప్పుడు మా ఊరు జ్ఞాపకం వస్తుంది. నేను ఊళ్లోనుండి కాలు బయట పెట్టేనాటికి చాలా ఏళ్ల ముందునుండే మానాన్నగారు ఆ గ్రామానికి సర్పంచుగా ఉన్నారు. నాకు మాత్రం సుదీర్ఘకాలంగా మా ఊరితో సత్సంబంధాలు కొరవడ్డాయి.

అట్లాంటి మా ఊరు ఇప్పుడేట్లా ఉందో…

మేం తిరిగిన చేలూచెలకలూ, చెరువుకట్టలు, మామిడితోటలు, ఈతకొ లనులు, చేపలవేటలు.. ఒకటేమిటి.. పల్లె అందాలన్నీ బాల్యసృతుల్తో కల్సి మనసులో తిరుగాడుతుండగానే ట్యాక్సీ మా ఇంటి ముందుకొచ్చి ఆగింది.

***

గంట గడిచేసరికి చుట్టుపక్కల కొందరు సన్నిహితులు మాఇంటికి చేరారు.

నా చిన్నతనంలో మానాన్నగారు సర్పంచుగా చేసిన కాలంలో ఆయన అనుయాయులు, అభిమానులు ఎక్కువగానే ఉండేవారు. వాళ్లతోపాటు మా వీధిలోని వారందరికీ మా కుటుంబం మీద ఇంకా గౌరవభావం అట్లానే ఉన్నట్లుంది. అందుకే ఆడామగా తేడాలేకుండా వచ్చి పలకరిస్తున్నారు. నేనూ మర్యాదకోసం మా ఆవిడతో కల్సి వాళ్ల యోగక్షేమాలు విచారిస్తున్నాను.

“నిన్ను చూస్తుంటే మీనాయనే గుర్తుకొస్తున్నాడయ్యా..” అంది నా పక్కనే కూచున్న ఓ పెద్దావిడ నాతల నిమురుతూ.

ఈ ఆప్యాయతలు, అనుబంధాలు నాకు కొత్త. అయినా “ఊరు బాగుందా అమ్మా..?” అన్నాను ఆప్యాయంగా

“ఆ.. ఏంబాగోలే..! అయినా మీలాంటి సదువుకున్నోరంతా ఊరిడిసిపెట్టి ఎత్తే ఇంకా ఊరెట్లా బాగుంటుందయ్యా?” అంది అవ్వ అదోరకంగా.

నేను నవ్వాను. “చదువుకు, ఊరు బాగుపడడానికి పెద్ద సంబంధం లేదమ్మా..” అన్నాను.

“ఏదైనా.. మీ నాయిన సర్పంచుగా ఉన్న రోజులు రావయ్యా..” అన్నాడు ఆశాలు. ఆశాలు మాఇంటికి సమీపంలోనే ఉంటాడు. నాన్న సర్పంచుగా చేసినపుడు కుడిభుజంగా, వ్యవసాయపు పనుల్లో చేదోడుగా ఉండేవాడు. తను చనిపోయే నాటికే చాలా భూములుఅమ్మేశాడు నాన్న. ఏవో ఒకటి రెండు మిగిలాయంతే!

పరిచయం పెద్దగా లేకున్నా అందరూ కల్సివెళ్తుంటే అదోరకం ఆనందం అనిపించింది. ఆశాలు ఆరోజు రాత్రి వరకూ మాతోనే ఉండి పొద్దున్నే కలుస్తానని వెళ్లాడు.

మర్నాడు ఉదయమే వచ్చాడు.

“ఆశాలూ..! కచ్రo తీసుకొనిరా..! ఈరోజు ఊరంతా చుట్టేసొద్దాం..” అన్నాను ఆశాలు రావడంతోనే.

ఆశాలు నవ్వాడు. “కచ్రమా..??”

“అవునూ! చిన్నప్పుడు మనం పొలంకాడికి, చెరువుకట్టకు ఎడ్లబండి మీదనే వెళ్లేవాళ్లం కదా!” అన్నాన్నేను అతన్నే చూస్తూ.

ఐదునిముషాల తర్వాత వాహనం తెచ్చి ఇంటిముందు నిలిపాడు ఆశాలు.

“ఇంకా ఎడ్లబండ్ల కాలమా బాపూ… అవెప్పుడో పోయినయ్..”

మేం విస్తుబోయి చూశాం. “టాటా మేజికా..? ఇవి మేం రోజూ చూస్తున్నవే కదా!” ఉసూరుమంటూ ఎక్కి కూచున్నారు పిల్లలు. ఎడ్లబండిలో పయనించలేకపోతున్న అసంతృప్తిని బయటకు ప్రదర్శిస్తునే “చెరువుకట్టకు పోనీ” అన్నాను ఎక్కి కూర్చుంటూ. స్రవంతి ఇంటిపట్టునే ఉండి వంటపనులు చూసుకొంటుంది.

“ఏమైనా… ఇంటి పరిసరాలన్నీ బాగా మారిపోయాయి ఆశాలూ..” అన్నాను వెళ్తుంటే. ఆశాలు తలఊపాడు డ్రైవింగ్ చేస్తూ. ఇంటిచుట్టూ విస్తరించుకొనిఉండాల్సిన నాలుగు చింతచెట్లూ, ఇంటిముందు వేపచెట్లూ అన్నీ పోయినట్లున్నాయి. స్వాగత స్తంభాల్లా ఉండే రెండు కొబ్బరి చెట్లలో ఒకటే మిగిలింది మోడువారిపోయి.

వ్యాన్ వెళ్తుంటే పిల్లలు మహాసరదాగా ఉన్నారు. “చెరువులో ఈదడమా.. వావ్…” అంది థ్రిల్లింగా చైతన్య. “చెరువంటే.. సము ద్రంలా ఉంటుందా నాన్నా?” అన్నాడు విష్ణు

“లేదు నాన్నా! సముద్రం పెద్దది. చెరువు చాలా చిన్నది”

“స్విమ్మింగ్ ఫూలంత ఉంటుందా..??”

“కాదు, పెద్దదిగా ఉంటుంది. అయినా తినబోతూ రుచులడగడం దేనికీ.. ఇప్పుడు డైరెక్టుగా చూడబోతున్నాంగా..”

పిల్లలు ఎక్సైటింగ్ గా చూస్తున్నారు ముందుకు.

చిన్నప్పుడు ఆశాలుతో మా స్నేహితులం అంతా కల్సి చెరువులో ఈ చివర్నుండి ఆ చివరకు ఈదాలని పోటీలు పెట్టుకునే వాళ్లం. నేనైతే అరగంటలో అవతలికి ఈదేవాన్ని”

“ఔనా..!” అంది చైతన్య ఆశ్చర్యంగా. వాళ్లలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది ఎప్పుడు చెరువులో ఈద్దామా అని. నాకూ ఉత్సాహంగానే ఉంది. పది

పన్నెండేళ్ల వయసులో స్నేహితుల్తో కలిసి చెరువుకట్టమీద చిలుకలు వాలిన రావిచెట్టు, కడిమిచెట్టు ఎక్కి నీళ్లలోకి దూకిన సంగతులు, కట్టకింద నీటిగుంతల్లో చేపలు పట్టిందీ అన్నీ.. అన్నీ గుర్తుకొచ్చి మనసు పరవశించింది.

ఆశాలు నేరుగా వాహనాన్ని చెరువుకట్ట పైకి తీసుకెళ్లాడు. చెరువువైపు చూసిన నా మొహం తెల్లగా పాలిపోయింది. అప్పటివరకూ పిల్లల మొహంలో తాండవమాడిన ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. కట్టకింద.. చెరువు స్థానంలో నా మొహంలా తెల్లగా పాలిపోయి నెర్రలిచ్చిన నేల కనిపిస్తుంది. అక్కడక్కడ రెండు మూడు బురద గుంతలున్నాయి అంతే! లోతుగా పరికిస్తే.. అసలక్కడ చెరువు ఉంటేగా! రెండువైపుల్నుండీ చెరువులోకి చొచ్చుకొచ్చి ఇండ్ల నిర్మాణాలు చేశారు. ఇంకొంత భాగం ఎవరో పొలమో, చేనో వేశారు. డెబ్బై శాతం మేర ఆక్రమణకు గురైన ఆ చెరువు మిగ తాభాగం పూడిక నిండి, అక్కడక్కడ గుంతలతో.. చెర్నాకోలతో కొట్టుకొన్న ముష్టివాని వీపులా తయారైంది.

నా హృదయాన్ని ఎవరో పారతో కెలికినట్లైంది.

“ఇది ఏకాలం బాపూ… ఇంకా చెరువు అట్లనే ఉండనీకి..?” అన్నాడు ఆశాలు.

వ్యాను లోనుండి పిల్లల్తో సహా కిందకు దిగి చెరువు ఆ చివరివరకు చూశాను. గతంలో మేము ఆడుకున్న చిలుకలు వాలిన చెట్లు లేవు. చెరువుకు ఆవలివైపున విస్తృతంగా పరుచుకొన్న మామిడి తోటలూ లేవు. క్రమక్రమంగా కరిగిపోయి, భూమికి సమతలంగా అవుతూ ఒకనాడు నేనుండేదాన్ని అనే ఆన వాళ్లను గుర్తుచేస్తున్నట్లుగా మారింది కట్ట.

నిరాశానిస్పృహలు నిండిన గొంతుతో “ఆశాలూ..! ఇంక చేసేదేముంది? నువ్వు ఇంటికెళ్లిపో. మేమట్లా కాలినడకన తిరిగేసొస్తాం..” అన్నాను. “తిరిగి సూడ్డానికి ఈడ ఏముంటది బాపూ!” అంటూ “సరే! ఫోన్ చేయుండ్రి తీసుకెళిపోనీకొత్తా.” అంటూ బయలుదేరాడు.

నేను తలూపాను. పిల్లలిద్దరూ నిరాశకు లోనైంది తెలుస్తూనే ఉంది. “ఎండాకాలం కదా! చెరువులో నీళ్లు ఎండిపోయాయి అయినా చెరువులో లేకుంటేనేం.? మన వ్యవసాయబావి ఉంది కదా! అటెళ్దాం.” అంటూ పిల్లల్ని తీసుకొని కట్టకింద పొలాలవైపు బయల్దేరాను.

నాకూ బాధగానే ఉంది. ఎంతటి ఎండాకాలమైనా నిండుగా కళకళలాడుతూ, ఎప్పుడూ ఈతలు కొట్టేవాళ్లు, చేపలుపట్టేవాళ్లతో సందడిగా ఉండేది చెరువు. ఇపుడు పూర్తిగా ఆనవాళ్లే కోల్పోయింది.

మేము కట్టదిగి, కట్టకింది రోడ్డును దాటి కిందివైపు పొలాలుండే ప్రాంత వైపు నడిచాము. గట్లమీంచి లోనికి అర కిలోమీటర్ నడిచెల్తే మా వ్యవసాయభూమి, పెద్దబావి ఉంటాయి. విశాలంగా పరుచుకొన్న ఆ బావినీళ్లు గట్టునుండి ఒకటి రెండు అడుగులు మాత్రమే కిందికుంటాయి. హైస్కూల్ చదువుల రోజుల్లో తోటి స్నేహితుల్తో కలిసి మా బావిలో విచ్చలవిడిగా దుమికే వాళ్ళం. మేమే కాదు, ఊల్లో చాలామంది మా బావిని ఈతకు వినియోగించేవాళ్లు.

మేం బావిగట్టు వరకూ వచ్చాం. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. అక్కడ.. బావి ఆనవాళ్లు తప్ప బావి లేదు. విస్తృతంగా పరుచుకొని, నీళ్లు గట్టు

పైకి ఉబికివచ్చేలా ఉండే బావి స్థానంలో ఓ బురదగుంత ఉందంతే.

అదికాదు నేను చూస్తున్నది. దాన్నానుకొని ఉండాల్సిన మా పొలం స్థానంలో ఓ పౌల్టీఫాం, పక్కనే కర్రకోత మిషనూ వెలిశాయి. డెబ్బైశాతం మా పొలాన్ని పౌల్టీఫాం వాళ్లు ఆక్రమించారు. నా మనసు చెదిరిపోయింది.

అసలీ చుట్టుపట్ల పొలాలేవి ? ఒకనాడు వరిపైర్లు, వ్యవసాయ బావులు, పారేవాగులతో కళకళలాడిన ఈ ప్రాంతమంతా ఇట్లా వట్టిపోయిందేమిటి? ఊళ్లోకొచ్చే రోడ్డుకిరువైపులా పచ్చని పంట పొలాలు, నీటిచెలిమెలు ఉండేవి. ఏవీ ఇప్పుడవన్నీ.? అసలు నీటి జాడే కనిపించదే! పొలాలన్నీ ప్లాట్లయిపోతే అసలు జనం ఎట్లా బతుకుతున్నారని..?

నా మనసు విచలితం అయింది.

దొరలూ, భూస్వాముల వేలాది ఎకరాల భూములు ఏండ్ల తరబడిగా నిరు పయోగంగా పడిఉన్నా పట్టించుకోని పల్లెల్లోనేడు పట్టణాలను మించిన దురాక్రమణ సంస్కృతి విస్తరించిందా? చెరువునూ, మాపొలాన్ని చూస్తుంటే అదే అని పిస్తుంది. ఈ ఆక్రమణదారులు ఎవరో అరా తీయాలనే ఉద్దేశంతో పిల్లలో కదిలి ఇంటిదారి పట్టాను.

***

మర్నాడు… ఆశాలును తీసుకొని మా ఊరి సర్పంచును కలిశాను.

గ్రామపంచాయితీ కార్యాలయంలో దర్జాగా కూచున్న సర్పంచ్ చంద్రం ఎవరికో ఫోన్ చేశాడు. నిజానికి సర్పంచ్ చంద్రం కాదు, ఆయన భార్య. పల్లె ల్లో భార్యల పేరుమీద భర్తలు అధికారం చెలాయించడం ఇంకాపోలేదు అను కున్నాను. నిజానికి ఆడవాళ్లు తమ పదవీ బాధ్యతలు నిర్వహించలేక కాదు, వాళ్లనలా ఉంచి ఆ అధికారాన్ని భర్తలే లాగేసుకుంటారంతే! చంద్రం పెద్దగా చదువుకున్నోడుకాదు. ‘చదువుకున్నోళ్లంతా మీలా బయటకెళ్లిపోతారు, చదువు లేనివాళ్లు ఊళ్లో రాజకీయాలు చేస్తుంటారు’ అని మొన్న రాత్రి ఎవరో అన్నట్లు గుర్తు.

ఇరవై నిముషాలు ఎదురుచూశాక ఓ పెద్దమనిషి మరోవ్యక్తితో కల్సివచ్చా డు. ఊరివాళ్లు నాన్నగారికి తెల్సుంటారు. నాకు అంతగా పరిచయం ఉండదు. వస్తూనే ఆ పెద్దమనిషి “ఏ భూమి.? చెరువుకట్ట కిందిదా? అదెప్పుడో మీ నాయిన మాకు అమ్మేసిండు”. చాలాతేలిగ్గా అన్నాడు

నేను విస్తుబోయాను. “అదేంటీ..? మానాన్న ఏవేవి అమ్మేశాడో, ఏవి మిగిల్చాడో నాకు స్పష్టంగా తెలుసు. ఆ భూమి ఎవ్వరికీ అమ్మలేదు..” గట్టిగా వాదించాను.

సర్పంచ్ ఆపాడు. “చిన్నప్పుడెప్పుడో చదువు పేరుతో బయటకుబోయి, ఇరవైముప్పై ఏండ్ల తర్వాత గిప్పుడొచ్చి నాకు గంతుంది.. గింతుంది అంటే ఎట్లా? మీ నాయిన ఏమేం అమ్ముకున్నడో నీకెట్టా తెలుసుద్దీ..?” అన్నాడు ఊరతనికి సపోర్టుగా.

“ఇది అన్యాయం. ఊళ్లో లేకుంటే మాత్రం మా నాన్నకు ఏయే ఆస్తులున్నాయో తెలియకుండా పోతాయా? అసలు ఆ భూమి అమ్మిన తాలూకు డాక్యుమెంట్లు తెమ్మనండి…”

అతనెళ్లి అరగంట తర్వాత డాక్యుమెంట్లు పట్టుకొచ్చాడు. అంతా మోసం. మానాన్నగారు రాసిచ్చినట్లు వంద రూపాయల స్టాంపు కాగితం మీద రాసిన పత్రం అది. వాళ్లే రాసుకున్నారు. సంతకం కూడా పోర్జరే!

“ఇది కాదు.. రిజిస్టేషన్ పత్రాలు కావాలి..”

సర్పంచ్ అన్నాడు. “ఇంకా రిజిస్ట్రేషన్ ఏందయ్యా..? ఇక్కడన్నీ అంతే. ఆడికి అమ్మినట్లు మీ నాయిన సక్కగ రాసిత్తే ఇంకేం గావాలే?”

“మరి నేనెళ్లత్తానయ్యా..” విషయం తేల్చకుండానే వచ్చినఇద్దరూ వెళ్లిపోయారు.

“పట్నంలో బాగా సంపాదిత్తున్నవటగా.! అయినా నీ భూమి నీగ్గావాలంటే… ” సర్పంచ్ నాకు దగ్గరగా వంగి “పది లక్షలు ఖర్చు పెట్టుకుంటే నీది నీకిప్పిత్తా.” అన్నాడు.

నాకు షాక్ తగిలినట్లనిపించింది.

భూదందా.. సెటిల్ మెంట్లు.. సిటీల్లో ఎప్పుడూ ఉండేవే! నేడు గ్రామాలకు విస్తరించాయా?? పదిలక్షలు ! తన భూమి విలువ కూడా అంత చేస్తుందో లేదో! నేను ట్రాన్స్ లో ఉన్నట్లు లేచి బయటకు నడిచాను.

“ఆళ్లను ఏంజేయలేం బాపూ…” అంటున్నాడు ఆశాలు నావెమకే నడుస్తూ.

అవును. ఏం చేయలేం! అవసరమైతే డాక్యుమెంట్లు సృష్టిస్తారు. ఊరిని నిత్యనిత్య జలకళతో రక్షించే చెరువునే కబ్జా చేసినోళ్లకి ముప్పై ఏళ్ల తర్వాత వచ్చి ఆస్తుల గురించి ఆరాతీస్తే తనను పట్టించుకునే వారుంటారా?

లీగల్ గా పోరాడడానికి లోతుగా వెళ్లినా.. తను ఏ ఆనందాన్ని అనుభవించ డానికి పల్లెటూరుకొచ్చాడో ఆ ఆనందం దొరకదు సరికదా.. ఉన్న నెలరోజులూ మానసికంగా, శారీరకంగా ఈ సమస్య మీదే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పటికి సమస్య తీరదుకూడా.

నేను అలా ఊరి మధ్యనుండి నడుస్తూ వెళ్తున్నాను. వెంటే నన్ను గమనిస్తూ ఆశాలు.

అదేంటి..? పల్లెట్లా అయ్యాయా..??

తానేదో ఆనందం.. ఆహ్లాదం అని వచ్చాడుకదా! ఏవవి? ఎక్కడున్నాయ్..? ఒకనాడు ఊళ్లో సమస్యలెదురైతే ఊరిమధ్య నాలుగురోడ్ల కూడలిలో రావిచెట్టు కింద పంచాయితీ పెట్టేవారు. ఏదా రావిచెట్టు? నాలుగు వైపులా వట వృక్షాల్లా పరుచుకున్న వేపచెట్లేవి?

అసలు మా ఊరి మట్టివాసనేది?

ఊరి శివార్లలో వస్తున్నప్పుడు కనిపించాల్సిన మామిడితోటలు, ఊరివెనక దట్టంగా విస్తరించిన చీమచింత, మోదుగు, ఇప్ప వనాలేవి? ఊల్లోకి అడుగుపెడుతున్నప్పుడు ఎదురయ్యే మత్తడి వాగేది?

వస్తున్నప్పుడు మా కూతురు అడిగింది. “నాన్నా.. పెద్ద పెద్ద గుట్టలన్నావు, ఏవీ కనిపించవే..?” నా కళ్లే నన్ను మోసం చేస్తున్నట్లు అసలు మాఊరి చుట్టూ ఉండాల్సిన గుట్టలన్నీ మాయమైపోయాయి. గుట్టలకున్న రాళ్లను క్రషర్ మిషన్లు కరిగించివేశాయి. మట్టిని ప్రోక్లైన్లు తోడిపోశాయి. ఫలితంగా గుట్టలున్న ప్రాంతంలో కూడా అక్కడక్కడా కాంక్రీటు భవంతులు, ఇందిరమ్మ ఇండ్లూ వెలిశాయి. పంటపొలాలన్నీ చేన్లు చెలకలయ్యాయి. వ్యవసాయబావులు పోయి బోరుబావు లొచ్చాయి. రోడ్డుపక్క పంటభూములన్నీ ప్లాట్లయిపోయాయి.

అవునూ.. ఊరు ప్రధాన కూడళ్లలో ఉండాల్సిన సర్కారు బావులేవి? అసలు ఇంటింటికీ ఉండాల్సిన నూతులేవి?

కమ్మరి కొలిమి

కుమ్మరి చక్రం

సాలెల మగ్గం

జాలరి పగ్గం

గొడ్డలి, రంపం, కొడవలి,నాగలి..

సమస్త వృత్తుల సహస్ర చిహ్నాలేవి ??

ఇదంతా గ్రామాలు సాధించిన అభివృద్ధి అనుకోవాలా?

ఇది నిజంగా పచ్చదనం కోల్పోయిన పండుటాకులా, ఆడతనం కోల్పోయిన అమ్మలా, పల్లెతనం కోల్పోయిన మొండి గ్రామంలా ఉందిప్పుడు.

ఇంటివైపు నడుస్తుంటే పెద్ద డిజె శబ్దాలు వినిపించాయి. పెళ్లిమేళం ఏమో! ఇక్కడా తప్పడం లేదు. సాయంవేళలో మా ఊరి తురకసోదరులు ఓచోట చేరి బ్యాండు వాయిద్యం నేర్చుకునేవాళ్లు. ఇప్పుడా బ్యాండుమేళం పోయి డిజెలొచ్చాయి. ఇంటిముందు పందిళ్లేసి పెళ్లీలు చేసే సంస్కృతి పల్లెల్లోనూ అడుగంటింది.

ఇంకా ఏం మిగిలిందని?

భారమైన మనసుతో ఇల్లు చేరాను.

“నాన్నా ! పచ్చనిచెట్లు, పంటపొలాలు, వాగులు వంకలు, బావులు చెరువులు, చింతచెట్లు, మామిడితోటలు.. సాయంకాలం వీథి నాటకాలు, భాగవతాలు… ఇంకా ఏమేమో చెప్పారు. అసలిక్కడ ఏవీలేవు.” అంది కూతురు చైతన్య ఎదురొస్తూ.

“కాలం మారింది కదమ్మా.. కాలంతో పాటు పల్లెలూ అభివృద్ధి చెందుతున్నాయి” అన్నాను నిర్వేదంగా.

“ఏం అభివృదో.. ఏమోనండీ..! పల్లెల్లో స్వచ్ఛమైన కూరగాయలు, పాలు పెరుగు, వెన్న మీగడ దొరుకుతాయనుకున్నాను. ఇక్కడ దొరికే పాలకన్నా ప్యాకెట్ పాలే బెటరు. అసలు కూరగాయలు అమ్మేవారే కనిపించడం లేదు. ఇదేం పల్లెటూరో ఏమో !” అంది మా ఆవిడ నిష్ఠూరంగా.

“ఈడ పండే కూరగాయలు పక్క సిటీకి బోయి అమ్ముకచ్చుడేనాయె. ఈడి పాలన్నీ సిటీలో పాలకేంద్రానికి బోసుడేనాయె. ఇంకేడ దొరుకుతాయమ్మా.. ” అన్నాడు వెంటే వచ్చిన ఆశాలు.

“ఇంకా ఏముందండీ ఇక్కడ.. వెళ్లిపోతేపోలా ?” మా ఆవిడకు నాల్రోజులకే తిరుగు ఆలోచమ్ల మొదలయ్యాయి.

ఏముందిక్కడ ? పుట్టినూరుంది ! కానీ నేను పుట్టినప్పటి ఊరులా లేదు. అప్పటి ఆనందం, కోలాహలం లేదు.

మళ్లీ అవే! పట్నంలోలా రాటుదేలిన రాజకీయాలు, మోడువారిన పరిసరాలు! అసలిక్కడ పల్లెతనమే లేదు.

“నానగారు సర్పంచ్ గా ఉన్న రోజుల్లో ఇట్టా తగలడలేదయ్యా! అప్పుడెంత హాయిగా ఉండేవాళ్లం. ఇపుడచ్చే సర్పంచ్ ఊరోళ్ళందర్నీ పీడించి దోసుకునుడే తప్ప ఊరును బాగుసేసిందేమీ లేదు. ఈసారి సర్పంచ్ రిజర్వేషన్లు జనరలైనయంట. మళ్లా ఎసుంటోడత్తడో! మీరెళ్లిపోతే మీకు పుట్టినూరన్న గురుతు కూడా లేకుండా ఇంటిని కూడా కబ్జా సేత్తరయ్యా..” అంటున్నాడు ఆశాలు.

అదీ నిజమే! నేనాలోచిస్తున్నది ఇక్కడ ఇల్లు కోసంకాదు. పల్లె కోసం! అంతరించి పోతున్న పల్లెతనం కోసం..!!

తను… తను… ఇక్కడే ఉండిపోతే!? తను చదివిన వ్యవసాయ శాస్త్రాన్ని ఈ పల్లెకే పరివర్తింపజేస్తే…?!

తొలిరోజు మా వీథిలోని ముసలమ్మ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. “మీలాంటి సదువుకున్నోరంతా ఊరిడిసి పోతే.. ఇంకా ఊరెట్టా బాగుంటుందయ్యా ..”

అవును…! విద్యావంతులు, మేధావులు చదువులు, ఉద్యోగాల పేరుతో బయటకు వెళ్లిపోతే గ్రామాల్లో మునగచెట్లే మహావృక్షాలుగా పాతుకుపోతాయి. ఎప్పుడో ఒకప్పుడు ప్రశ్నించేవాళ్లు, పరిష్కరించేవాళ్లు రావాలిగదా!

అది… నేనే అయితే !?

నాన్నగారి వారసుడిగా నాటి పల్లె వాతావరణాన్ని, అభివృద్ధితో కూడిన పల్లె వైభవాన్ని, ప్రజాసంక్షేమాన్ని మళ్లీ ఆవిష్కరిస్తే…

చిత్రంగా నాన్న చిత్రపటానికి పొద్దున్నే అలంకరించిన పువ్వు రాలి సూటిగా నాతలపైన పడింది.. అశీర్వదిస్తున్నట్లుగా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com