పద్మపురాణోత్తరఖండము – మడికి సింగన

చం. కదలని క్రొమ్మెరుంగు కసుగందని కెందలిరాకు నాచుతో

జొదువని తూడు బంగరవు పుత్తడి మవ్వపు బువ్వ భర్గుతో

నెదురని కామునమ్ము ఫణి యెంగిలికాని సుధాంశురేఖనా

నొదవుచునుండె రుక్మిణి పయోరుమనాభుని భాగ్యరేఖగాన్

కం. తెరచీర సట్టుయిరువురు

నిరువంకల నిలువబెట్టి యింపుదలిర్పన్

సురయక్ష సిద్ధ కిన్నర

నరకాంతలు మము భజించి నలిగర్తింపన్

సీ. సుముహూర్తమనుచు భూసురులు నల్గడ నిల్చి

లలిమంగళాష్టకములుపఠింప

నిత్యమంగళమని నిఖిలార్థవరులును

చెలువార గౌవారములు వచింప

జయజయధ్వనులకు సకలదేవతలును

చదలనెల్లెడ నిల్చి సంస్తుతింప

నత్యంత కళ్యాణమనియు పేరంటాండ్రు

పాటించి పెండలి పాటపాడ

గీ. దేవదుందుభులును దివ్యగానంబులు

పుణ్యకీర్తనములు భూరి నుతులు

రూఢిజెలగెనపుడు రుక్మిణీ కృష్ణుల

వరవివాహ వైభవంబు వొలిచె

సీ. తరుణి చేతను ప్రాలు వరుమౌళి బోయుచో

జనుగ్రేవ మెరుగులు చౌకళింప

నన్యోన్య ముఖవీక్షణాసక్తులైనచో

కలువలు తమ్ములు చెలిమి సేయ

ప్రథమ సంగమకాంక్ష ప్రసరింపు దలపులు

పొదవి మేనులయందు పులకలలయ

కన్నియ పతి కరగ్రహణంబు సేయుచో

పంచబాణుడు పునర్భవుడుకాగ

గీ. కల్పతరువును లతయును కలిసి మెలసి

యొక్క కుదుటను మొలచి పెంపొదవినట్లు

బెండ్లి పీఠంబు పైనుండి ప్రేమలొలయ

నవ్వధూవరులొప్పారి రపుడు చూడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com