ఎందుకు దుర్మార్గానికి బలి అవుతావు

నీ హత్య అమ్మాయిలను మరింత బేలగా చేయడం కన్నా

అందులో ఒక్కడిని చంపినా

చేసిన పనికి వాడు జీవితాంతం పశ్చాత్తాప పడేటట్లు

ఒక్కడినన్నా కోలుకోలేకుండా నువ్ గాయ పరిచినా

నీతోపాటు చితికి నలుగురు దుర్మార్గులను

తీసుకుపోయావు అనే వార్త

మహిషాసుర మర్దినిలా నిన్ను నిలిపేది కదా

ఇప్పటికైన… ఇప్పటికైనా వీటికి మూలం ఎక్కడుందో గ్రహించు

కీలెరిగి వాత పెట్టు

ఆడది పడుకోవడానికే తప్ప దేనికీ పనికిరాదు

అని వాగిన చెంప చెళ్లుమనిపించు.

అటువంటి చెత్తగాళ్ళకు

కుటుంబ, సంఘ బహిష్కరణ జరిగేలా చూడు.

టివిలు, సినిమాలలో నిన్ను అసభ్యంగా చిత్రీకరిస్తున్నప్పుడే

నీ వ్యతిరేకతను తెలియజెప్పు

పుట్టిన నుంచీ ఓర్పు, సహనంతో తలొంచుకుని ఉండు

వంటి వేదాంతాలు వల్లిస్తుంటారు

వాడికేంటి వాడు మగాడు

మొగుడు కొట్టవచ్చు చంపవచ్చు

మగాడు ఆడదాన్ని చెప్పుచేతల్లో ఉంచుకోవాలంటూ

నీతిలేని అధర్మాలను వారికి కట్టబెడుతుంటే మౌనంగా ఉండకు

నిన్ను తగ్గిస్తున్న చర్యలకు అక్కడే బీజం పడుతుందని తెలుసుకో

తేడాల పెంపకాలను, పుట్టుకతోనే మగవాడికి కట్టబెట్టే ఆధిపత్యాన్ని

నిరసించు అక్కడే నిరోధించు

అమ్మ, ఆలి అనే బూతు పదాలను వర్షిస్తూ

సభ్యతను సంస్కారాన్ని వారు గాలికొదిలేస్తుంటే

నిన్ను వంటింటి కుందేలుగా, అజ్ఞాన వంతురాలిగా తూస్తుంటే

తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా అడ్డుకో

నిన్ను 90 ఏండ్ల వాడికి నాలుగో భార్యగా అమ్మినపుడు

నువు తినే మెతుకుకి లక్షల కట్నాలతో వెల కడుతున్నపుడు

నిన్ను సన్యాసినిగా చేసి వాడి ప్రకోపాలను తీర్చుకుంటున్నప్పుడు

ఆడ బ్రతుకు ఇంతే అని దిగులు పడుతూ కూర్చోకు

వారంతా ఇంట్లో నిన్ను సభ్యత, పరువులతో కప్పి పెట్టి

బయట నీతో అందాలు ఆరబోయిస్తూ, అర్ధ నగ్న నృత్యాలు చేయిస్తూ

నిన్ను దిగజార్చి చూస్తున్నవారే

రాత్రయితే ట్రిపుల్ X సంస్కార వంతులే

అత్యాచారం కోసం నిన్ను ఆడదానిగా మాత్రమే చూస్తున్నారనే

ఇంగిత జ్ఞానం వదిలి

స్వార్థం తో అందలాలు ఎక్కే యే నాయకుడైనా

దళితవనో అగ్రవర్ణమనో పేలుతూ తమ ఓటుబ్యాంకుకు

నిన్ను పావుగా వాడుకుని తేలిక చేస్తారు

రాత్రుళ్ళు ఏం తిరుగుడు ఆ బట్టలేంది అని నిన్నే

నిన్ను మాత్రమే తప్పు పట్టే ప్రజలే కానీ

ఎవ్వరూ నీకు సహకరించరు

నిర్బలవు అనే నిర్వేదం వీడి ఇకనైనా నిర్భయంగా పోరాడు

ఈనాడైనా పోరాడకుంటే రేపటికి నువ్వు మిగలవు

నువ్వు కాపాడమని అరిస్తే

ఆదుకునే కృష్ణులు లేరు.

అడుగడుగునా దుర్యోధనులే ఇక్కడ

ధర్మం కోసం కొడుకునైనా సంహరించిన సత్యవు నువ్వే

బలంతో విర్రవీగినవాణ్ని భస్మం చేసిన మోహినివి నువ్వే

యమునితో కూడా పోరాడి సాధించగల సావిత్రివి నువ్వే

నీ శక్తిని నువ్వు తెలుసుకో

నీ మానప్రాణాలను హరించిన వానికి

శిక్ష వెయ్యాలా వద్దా అనే అహింసలకు నిరాశ పడకు

ముల్లును ముల్లుతోనే తియ్యి

నీకు నువ్వే సత్వర న్యాయం చేసుకో

తక్షణ శిక్షను నువ్వే అమలు చెయ్యి

నిర్భయ చట్టంతో నిన్ను దశాబ్దాలుగా ఆడుకున్నప్పుడు

ఈరోజు మనీషా నిన్న టేకుల పల్లి లక్ష్మి మొన్న దిశ

లెక్కకు అందని ఎన్నో కేసులతో

నిన్ను చిద్రం చేస్తున్నప్పుడు మౌనంగా రోధించకు

నీపై చూపు పడినప్పుడే

కన్నీళ్లకు బదులు నిప్పులు కురిపించు

మధిస్తున్న మహిషాలను మర్దించు పరాశక్తీ

రుద్రమ, ఝాన్సీవై కరవాలం చేతబూని

రావణ కాష్టం మరలా రగిలించు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com