కాలంతో పనిలేకుండా కాలమే వారైనా, కనుమరుగైన జీవితాల గురించి వర్తమానంలో అధ్యయనం ఎంతో సంతోషకరం. ‘‘హరిజనులు గిరిజనులు అందరు నేడు పురజనులే’’ అన్న సినారె వాక్య నేపథ్యంలో మనలో చేర్చుకోవడానికి, మనమున నిలుపుకోవడానికి తోడ్పడే మూలకం పరిశోధనే. ఆ పరిశోధనలు 21వ శతాబ్దం తొలి రెండు దశకాల్లో మరింత వృద్ధి పొందిన కారణంగా వచ్చిన వినూత్న ఫలాలలో డా. కపిల భారతి కొండరెడ్డి గిరిజనుల జీవనం-భాషాసాహిత్యాంశాలు పరిశోధన.

నిజానికి ఈ పరిశోధన రెండు ప్రధాన విషయాలలో సఫలత సాధించిందనవచ్చు అని నిర్దిష్ట ప్రణాళిక, క్షేత్ర పర్యటన. ఈ రెండు విషయ పరిధిలో అకడమిక్ సైన్సులో లక్ష్యాన్ని సాధించాయనడం ముఖ ప్రీతికి చెప్పింది ఏ మాత్రం కాదు.

ఈ వేగవంతమైన దైనందిన జీవితంలో వ్యక్తులు యాంత్రికంగా తయారవుతూ వారి మీద వారికే శ్రద్ధ లేకుండా బతుకుతున్నారు. చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అన్నమాట. మనిషి ఆలోచనాపరిధిని తగ్గించివేసింది. జంతు, బుద్ధిజీవులుగా విడివడిన సమాజాల నేపథ్యంలో బుద్ధిజీవుల విస్మృతిలో మానవ సమాజానికి ఆదిమూలాలైన గిరిజన సమాజాల సంస్కృతి సంప్రదాయాలు, భాషాసాహిత్యాలు కనుమరుగౌవుతున్న తరుణంలో భారతిగారి ఈ పరిశోధనను తలభారంగా కాక, ఇష్టపూర్వకంగా చేశారనే విషయం ఈ సిద్ధాంత వ్యాస గ్రంథం ప్రతిపుటలో దర్శనమిస్తుంది.

ఆచార్య కసిరెడ్డి గారన్నమాటలు స్ఫురణకు తెచ్చుకుంటే ‘‘కొండరెడ్లది తెలుగుభాషే కాని ఆ భాష వేదాల్లోని సంస్కృతంలాంటిది. అష్టాధ్యాయి వంటి వ్యాకరణానికి వేద సంస్కృతం లొంగనట్లే. ఈ కొండరెడ్ల గిరిజన భాష బాలవ్యాకరణానికి వంగదు’’ నిజంగా ఈ మాట శ్లాఘనీయం.

ఇక భారతి గారి పరిశోధనలో భూమిక వహించిన అంశాలు.

ఉమ్మడి కుటుంబ భావన, గౌరవ మర్యాదలందించే సభ్యతాసంస్కారం, స్నేహబంధాన్ని పాటించడం. ఈ కారణంగా కొండరెడ్లు కోయ, నాయకపోడులతో సాన్నిహిత్యం కలిగి వుంటారనే అంశాలన్నీ భారతిగారి పరిశోధనాఫలాలే అన్న విషయం స్పష్టమవుతుంది.

పుట.53లో పరిశోధకురాలు కొండరెడ్ల పెళ్ళి ప్రస్తావనలో (3 రోజుల పెండ్లి) పెండ్లి 3వ రోజు వసంతాల నిర్వహణ వివరణ తెగపరంగా నూతనాంశంగా తెలియజేశారు. అయితే ఈ తెగలో మనకు రాని, మనం ఊహించని సమసమాజ భావన ప్రధానంగా ఆర్థిక, అనార్థిక భేదాలు లేకుండా జరుపుకోవడం తెలియజేయడం ద్వారా ఈ తెగ ఉన్నతత్వం, ఉత్తమత్వాన్ని బహిర్గతం చేశారు భారతి గారు.

అలాగే పుట.55లో పండుగలు శీర్షికలో వీరికి భూమి పట్ల విశ్వాసం, భూమి తన హక్కుగా భావిస్తారనే విషయం చదివినప్పుడు ఈ తెగ పట్ల గౌరవ భావం పెరుగుతుంది. ఎందుకంటే ఆశకు పోయి, ఎండమావులను వెంబడిస్తూ, భూమిని అమ్ముకుని తాత్కాలిక సుకాలే శాశ్వతం అనుకనే నాగరిక జాతికిది ఒక చెంపపెట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాల్లో కొండరెడ్లే అధికులు అన్న భావన కలుగుతుంది. కొండరెడ్లను పాండవ రెడ్లుగా తెలియజేయడం పరిశోధకురాలి విషయసేకరణ కష్టానికి ఫలితంగా కనిపిస్తుంది. (పుట.71) ‘‘అప్పు చేయనివాడు, తప్పు చేయనివాడు ముప్పారిన పడడు’’ అన్నాడొక కవి. ఆ కవివాక్యాలు కొండరెడ్లకు నూటికి నూరు శాతం వర్తిస్తుంది. పరిశోధకురాలు పుట.102లో ‘‘అప్పు అనేది కొండరెడ్డి గిరిజనులకు తెలియని పదం’’ అని చెప్పడం ద్వారా కొండరెడ్ల తెగవారి ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టమైనదని అనిపిస్తుంది. అంటే వారిది ప్రణాళికాబద్ధమైన జీవితం అని భావించవచ్చు. అయినదానికి, కానిదానికి అప్పు చేసేవాళ్ళు ఈ తెగ నుంచి అప్పు లేకుండా బతకడం నేర్చుకోవాలన్న సత్యం ఈ పరిశోధనలో బహిర్గతమైందన్నది నిజం.

ఈ పరిశోధనలో ప్రధానంగా భారతి కొండరెడ్ల మాండలిక భాషలో కథను, తెలిపి తదుపరి తెలుగులో చెప్పడం చక్కని సంభావ్యతను కలిగిస్తుంది. ఇది నిజానికి శ్రమతో కూడింది. ఇక్కడ కూడా భారతి కష్టంతో విజయం సాధించింది. కొండరెడ్ల పాటల్లో ’లేలేలేలేలేలే’ అనే ప్రయోగిత పదం ఉత్సాహానికి ప్రతీకగా చెప్పడం కొత్త విషయం. ఇదే మనం ధ్వన్యర్థక పదంగా సంభావిస్తాయి.(పుట.165) అలాగే వీరి పాటలో (175 పుట. పాట.6) ‘వీరాపు వీరుడమ్మ’ పద ప్రయోగం. సాధారణంగా వీరాధివీరుడమ్మ అనటంగా ప్రచారంలో వుంది. వీరి పాటలో రెండు దీర్ఘాక్షరాల తరువాత హ్రస్వ ప్రయోగం అటుపాడుకోవడానికి, ఇటు ఛందశాస్త్ర పరిశీలనకు దోహదపడేదిగా కనిపిస్తుంది. (185) పుటలో ‘బెజమ్’ వివరణ బాగుంది.

ఈ పరిశోధనకు శిఖరాయమానం 5వ అధ్యాయం ‘‘కొండరెడ్డి గిరిజనుల భాషావిశేషాలు’’. కొన్ని టకారం బదులు తకారం (అంటాం=అంతాం) (పుట.187) కొన్ని పదాలు పూర్ణ బిందువు రూపం కలిగి వుంటాయి. (పుట.188) కూత=కూంత (7వ శతాబ్దం శాసన సాహిత్యంలో ఈ మాట ప్రచారంలో వుంది) అలాగే ‘లబ్బి’ వికృతిపదం (పుట.190) ఒడుపు ఉపాయం పుట (192) ఈ పదం తిక్కన భారతంలో పలుమార్లు ప్రయోగించబడింది (మాండలిక పదం).

ఈ విధంగా ఒక మంచి పరిశోధన జీవిత సార్థకతకు ఉపకరణంగా శ్రమించి, తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య భట్టు రమేష్ గారి పర్యవేక్షణలో రావడం సంతోషకరం. ఈ పరిశోధన చదువుతున్నపుడు పరిశోధకురాలి అక్షరాల్లో, అమరికలో, కృషిలో నిద్రలేని రాత్రులు, తిండి లేని పగళ్ళు, ఆమె శ్రమకు గుర్తులుగా నిలుస్తాయి.

ఏదేమైనా పరిశోధకురాలు డా. కపిల భారతి గారి ఈ పరిశోధనా కృషి అభినందనీయం. క్షేత్ర పర్యటనాపరమైన పరిశోధనలు చేపట్టే పరిశోధకులకు ఈ పరిశోధనాగ్రంథం మార్గదర్శనం చేస్తుంది అన్నది సత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com