( రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అఖండ హనుమాన్ చాలీసా పారాయణం )

శిశువు నిద్రలో ఉలిక్కిపడి ఏడిస్తే ఆ లోకం తెలియని పాపల భయాలను పోగొట్టడానికి అభయహస్తంగా హనుమాన్ రూపాన్ని చేయించి మెడలో వేస్తారు తల్లులు. హనుమాన్ గుడి దగ్గర కొని తెచ్చిన మొలతాడు సకల భయాల నుండి రక్షిస్తుందని మనందరి నమ్మకం. అనేక మానసిక బలహీన సంధర్భాలలో బజరంగ్ భళి పేరు ఒక ధైర్యం. కలియుగంలో ఉపాసకులకు పిలిస్తే పలికే భవిశ్యద్ బ్రహ్మ అభయాంజనేయుడు. పిల్లలకు పెద్దలకు అత్యంత ప్రీతిపాత్రుడు వీరాంజనేయుడు. దేశంలో దాదాపు ప్రతీ గ్రామంలో హనుమంతుని గుడి ఉండడం సహజం. తెలంగాణలో ఐతే ఏ గ్రామమైనా సరే వాడకు ఒక ఆంజనేయుడి విగ్రహం ఉండాల్సిందే. అది స్వామితో ఈ నేలకు ఉన్న అనుభంధం.

హనుమంతుని గుడులు ఎక్కడ ఉన్నా పెద్ద పెద్ద నిర్మాణాలు ఉండవు. చాలా చోట్ల చిన్న అరుగు తప్ప గుడే ఉండదు. కేవలం ఆ స్వామిపై భక్తే ప్రధానం ఇక్కడ. కాశాయ రంగులో చంద్రం (సింధూరం)తో వెలిగిపోతున్న అంజనీపుత్రుడంటే తెలంగాణ పల్లెలకు అంతులేని ధైర్యం, అపారమైన భక్తి. గ్రామీణ ప్రాంతాల్లో హనుమాన్ దేవాలయాలు సామూహిక జీవనానికి వేదికగా ఉంటాయి. అందరూ వచ్చి పూజించుకోవడం, వారం వారం సామూహిక భజనలు చేయడం, ఏడాదికోసారి దీక్షలు తీసుకోవడం ఇవన్నీ స్వయం క్రమశిక్షణకు దోహదం చేస్తాయి. సామాజిక అంతరాలు లేని సామూహిక జీవనశైలికి బాటలు వేస్తుంది. మానవ సంబంధాలను బలీయం చేస్తుంది. గ్రామాలలో చాలా మంది చిన్నతనంలో నేర్చుకున్న అద్యాత్మిక జ్ఞానమంతా హనుమాన్ దేవాలయం నుండే మొదలవుతుంది. హనుమంతుడి గుడులలో సహజంగా శనివారం జరిగే భజనలలో అందరు దేవతలపై పాటలు పాడడమే కాదు జీవిత సత్యాలను ఆవిష్కరించే పాటలు కూడా ఉంటాయి.

కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. వాయుదేవుని వరంచే పరమశివుని అంశతో జన్మించారు. సప్త చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి హిమాలయాల్లో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారనేది భక్తుల విశ్వాసం. “

“యత్ర యత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం”

” ఎక్కడ రామనామ సంకీర్తనం జరుగుతుందో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలు కారుస్తూ చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు.

మహాబలుడు ఆంజనేయుడు సదా శ్రీరామ దాసుడు. అమిత విక్రముడు. శతయోజనాలంత విస్తారమైన సముద్రమును ఒక్క ఉదుటున దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడు. క్లిష్ట సమయాలలో రాముడి వెంట నడచినవాడు. అందుకే హనుమంతుడి దారిలో నడచిన వారికి సకల శుభాలు, సర్వత్రా విజయం లభిస్తుంది.

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న రామకోటి స్థూప నిర్మాణం దశాబ్దాలుగా హనుమత్ భక్తులు ఎదురు చూస్తున్న మహా ధార్మిక కార్యక్రమం. అత్యంత ప్రభావ శిీలమైన ఈ స్థూప నిర్మాణం శ్రీ రామాంజనేయుల కృపాకటాక్షాలను తెలంగాణపై ప్రసరింప చేయగలదు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం విలక్షణమైనది. దాదాపు 400 సంవత్సరాల పూర్వం ఇక్కడ కోరంద పొదల మధ్యన పవన సుతుడు, రామ భక్త ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశాడు. సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం సింగం సంజీవుడనే వ్యక్తి ఆవులను మేపుతూ ఈ కొండకు రాగా, ఒక ఆవు తప్పిపోయింది. వెతికి వేసారి చివరికి ఓ చింతచెట్టు కింద సేదతీరుతుండగా స్వప్నంలో స్వామి కనపడి ‘నేను కోరంద పొదల్లో ఉన్నాను. నాకు కాస్త ఎండ.. వాన.. ముండ్ల నుండి రక్షణ కల్పించు. నీ ఆవు ఇదిగో, ఇక్కడే ఉంది’ అని చెప్పాడు. సంజీవుడు నిద్రలోంచి లేచి చూడగా ఆవు ఎదురు వచ్చింది. వెంటనే తన వద్ద ఉన్న గొడ్డలితో కోరంద పొదలను తొలగించి చూడగా శంఖు, చక్ర గదాలంకరణతో ఆంజనేయ స్వామి విశ్వరూపం దర్శనమిచ్చింది. నాటి నుండి స్వామి వారు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్నాడు. కొండగట్టులో వెలసిన ఆంజనేయ స్వామి… నారసింహస్వామి, ఆంజనేయస్వామి రెండు ముఖాలతో ఉంటాడు. నరసింహస్వామి అంటే సాక్షాత్తూ విష్ణుస్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీత ఉండడం విశేషం. అలాగే ప్రస్తుతం ఉన్న దేవాలయం కృష్ణరావు దేశ్ముఖ్ అనే వారిచే 160 సంవత్సరాల క్రితం పునరుద్ధరించబడింది. ఒకే మంటపంలో మూడు వేర్వేరు గర్భగుడులున్నాయి. మధ్యలో ఆంజనేయ స్వామి, కుడిపక్కన వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులు, ఎడమ పక్కన అమ్మవారు వెలిసి ఉండగా, ఆలయానికి పడమరవైపు క్షేత్ర పాలకుడు భేతాళస్వామి ఆలయం ఉంది.

అలాగే త్రేతా యుగంలో జరిగినట్లుగా పండితులు చెప్పే మరో కథ కూడా జానపదులలో ఉన్నది. రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఆంజనేయస్వామి సంజీవని పర్వతం తీసుకొని వెళ్తుండగా అందులోంచి ఒక ముక్క రాలి ఈ కొండలలో పడిందని, అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని, అందుకే శారీరక, మానసిక బాధలు, ఇతర గ్రహ బాధలున్నవారు స్వామిని దర్శించుకోగానే తొలగిపోతాయని పూర్వీకులు చెబుతుండేవారు. దేవాలయానికి సమీపంలో రాతి బండల మధ్య 30 గజాల లోతు పుష్కరిణి ఉంది. తపస్వీకులు స్నానాలు చేసి, స్వామిని సేవించి, సమీపంలోని గుహలో తపస్సు చేసేవారు.

కొండగట్టు ఆంజనేయస్వామికి నాలుగు వందల ఏళ్లుగా నిత్య హారతులు కొనసాగు తున్నాయి. అనారోగ్యం, దీర్ఘకాల పీడితులు, మతిస్థిమితం లేనివారు, స్వామి సన్నిధిలో 11, 21, 41 రోజులు నిష్టతో పూజలు చేయడమే కాక, మూడుపూటలా భజనలు చేస్తున్నారు. బేతాళస్వామి ఆలయం వద్ద గ్రహపీడితులు విగ్రహానికి మొక్కి, అల్లుబండను ఆలింగనం చేసుకుంటారు. స్వామి కలలోకి వచ్చి గ్రహ బాధ నుండి విముక్తి కలిగిస్తున్నట్లు భక్తులు చెబుతుంటారు. స్వామిని సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని భక్తుల విశ్వాసం.

శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామ తత్వం…

అవకాశం ఉన్నా భర్త వెంట నడవడం సీత తత్వం….

కష్టాల్లో అన్నకు తోడుగా ఉండడం లక్ష్మణ తత్వం…

నమ్మిన వారి వెంట కడవరకూ నిలవడం హనుమ తత్వం.. అదే ఎల్లలులేని భక్తి తత్వం.

కొండగట్టులో మార్చి 17న ప్రారంభమైన రామకోటి స్థూప నిర్మాణ పనులు వడివడిగా జరుగుతున్నాయి. మరో వైపు ఇదే సమయంలో రామ కోటి లిఖించడాలు, హనుమాన్ చాలీసా పారాయణాలు విస్తృతంగా జరగాలన్నది ధర్మాచార్యుల అభిమతం. సుమారు అర్ధ శతాబ్దం క్రితం తెలుగు నేలపై హనుమాన్ దీక్షలను ప్రారంభించి, యాభై ఏళ్లలో హనుమాన్ దీక్షలను మారుమూల గ్రామాలకు, తండాలకు సైతం చేర్చిన హనుమద్దీక్షా పీఠాధిపతులు శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ వంటి పెద్దలు, కొండగట్టు ప్రధాన అర్చకులు డా. తిరుక్కోవెల జితేంద్రప్రసాద్ గారి వంటి పండితులతో పాటు లక్షలాది దీక్షాధారుల చిరకాల వాంఛ రాష్ట్ర వ్యాప్త అఖండ హనుమాన్ చాలీసా పారాయణం.

ఈ నేపథ్యంలో పూజ్య స్వామీజీల, ధర్మాచార్యుల ఆశిస్సులతో, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి చొరవతో ఏర్పాటైన కొండగట్టు అంజన్న సేవా సమితి హనుమాన్ భక్తులతో ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. కొండగట్టు అంజన్న సేవా సమితి అభ్యర్థనతో తెలంగాణ వ్యాప్తంగా మార్చి 17 నుండి జూన్ 04 వరకు 80 రోజుల పాటు వందలాది ఆలయాలలో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతూ ఉంది. ఆలయాలే కాక ఇళ్లలోనూ సామూహికంగా చాలీసా పారాయణం పెద్దయెత్తున నిరాటంకంగా జరుగుతూ ఉండడం పవనపుత్రుని అనుగ్రహమే. అంతే కాక కొండగట్టు అంజన్న సేవా సమితి వివిధ ఆలయాలలో హానుమాన్ దీక్షాధారుల కోసం మధ్యాహ్న భిక్ష ఏర్పాటు చేస్తుంది. అలాగే భక్తులకు అవసరమైన వివిధ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తోంది.

రామ కోటి స్థూపం నిర్మాణం కోసం ఇప్పటికే 5 కోట్ల రామనామ పత్రాలు సిద్దం కాగా మరిన్ని కోట్లాది రామ కోటి పత్రాలను ఈ మాహా ధార్మిక క్రతువులో సమర్పించేందుకు సమాయత్తమయ్యారు భక్తులు. ఈ పవిత్ర ధార్మిక కార్యక్రమంలో భాగమవ్వాల్సిందిగా భగవద్బందువులందరినీ ఆహ్వానిస్తున్నాం. మీ మీ ప్రాంతాలలో రామకోటి పుస్తకాలు భక్తులకు అందించి వ్రాయించండి. విరివిగా హనుమాన్ చాలీసా పారాయణాలు జరపండి. మహా రుద్ర హనుమానుని విశాల కృపకు పాత్రులు కండి.

జై శ్రీరామ్..! జై హనుమాన్..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com