అస్తిత్వ చైతన్యం పిప్పారుతున్న ఈ క్రమంలో తెలంగాణ సాహిత్యం వెలుగులు నిర్మాణాలు చేసుకుంటున్నది. మరుగున పడిన ప్రాచీన కవయిత్రుల గురించి తెలుసుకుంటూ సాగే ఈ వ్యాసం తెలంగాణ సాహిత్య కీర్తి పతాకకు రెపెరెపాల సొగసులద్దుతుంది. మన నిర్లక్ష్యం, వాళ్ళ వివక్ష ఇంకా ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటుకోవాల్సిన పరిస్థితులే ఉన్నాయి. మన ప్రముఖ సాహితీవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. చరిత్ర పరిశోధిస్తున్నప్పుడు కేవలం సత్యాలనే చెప్పాలి. కత్తి మీద సాము వంటిదే ఇది. అసూర్యంపశ్యంగా ఉన్నస్త్రీల రచనలను శోధించి, వెలుగులోకి44 తేవాలి. సూర్యలోకనం చేయించాలి. వేల సూర్యులు ప్రభవిస్తున్న తెలంగాణ నేలపై తెలుగు సాహిత్యంలో స్త్రీల సాహిత్య కేతనం ఎగురవేయాలి.

తెలంగాణ కవయిత్రుల సాహిత్యాన్ని ఒక పద్దతిలో చర్చించుకోవడానికి సులువుగా కాల విభజన చేసుకున్నట్లైతే 1. ప్రాచీన యుగం, 11 నుండి 14వ శతాబ్దం వరకు అంటే క్రీ.శ 1000 నుండి 1500 వరకు 2. మధ్యయుగం, 15 నుండి 18 వ శతాబ్దం వరకు అంటే క్రీ.శ. 1500 నుండి 1900 వరకు 3. ఆధునిక యుగం 19 నుండి 20 వ శతాబ్దం వరకు అంటే 1900 నుండి 2000 వరకు 4. అత్యాధునిక యుగం 21 వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు అంటే మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలం నుండి ప్రస్తుతం వరకు అని గ్రహిస్తే కొంత అవగాహనకు వస్తుందన్న ఆలోచన. ఇంకా ఏమైనా మెరుగైన సూచనలు, ప్రాతిపదికలు ఉంటే, ఇంకా సాహిత్య విశేషాలు లభిస్తే మరింత గొప్పగా తెలంగాణ స్త్రీల సాహిత్య చరిత్ర నిర్మాణం చేయవచ్చు.

సాహిత్యంలోని అన్ని అంశాలను క్రోడీకరించుకుంటూ నిర్మాణం జరగాలి. కవిత్వంలో కావ్యాలు, శతకాలు, పద్య సాహిత్యం, అవధాన విద్య, వచన కవిత్వం, ఇందులో అన్ని ప్రక్రియలూ రావాలి. వచన సాహిత్యంలో కథలు, నవలలూ, నాటకాలు, లేఖా సాహిత్యం, పత్రికా సాహిత్యం, వ్యాసాలు వంటివీ, జానపద సాహిత్యం వంటివీ చేర్చుకుంటూ సాగాలి. కవయిత్రుల, రచయిత్రుల వివరాలతో బాటు వారి వారి సాహిత్య కృషిని ఉటంకిస్తూ సాగాలి. అప్పుడే తెలంగాణ స్త్రీల సాహిత్యం సమగ్ర రూపానికి వస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాసం తెలంగాణ స్త్రీల కవిత్వంలో ప్రాచీన యుగ, మధ్య యుగ కవిత్వానికి సంక్షిప్త పరిచయాలతో కూడింది.

ఇన్ని సౌకర్యాలు ఉన్నా, ఇంత గొప్ప సందర్భాలు ఉన్నా ఇప్పటికీ ఈ కాలంలోనూ స్త్రీలంతా విద్యావంతులై, చైతన్యవంతులై మనలేకపోతున్నారు. ఆనాటి ఆ గడ్డు కాలంలో సమాజ సంకుచిత భావాలలో, ఆధిక్యతల్లో విద్యకు అవకాశాలు లేక, అధికార, ఉన్నత వర్గాలలో కొందరు సాధారణ స్త్రీలు అందరూ కూపస్త మండూకాలుగా బ్రతికే ఉండి ఉంటారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతి తక్కువ స్త్రీలు చదువుకోగలిగి ఉంటారు. అందులో రచనలు చేసినవారు మరీ తక్కువ అయి ఉంటారు. కొందరి వివరాలు, రచలను మాత్రమే దొరుకుతున్నవి. ఇంకా విస్తృతమైన పరిశోధనలు జరగాల్సి ఉన్నది. సాహిత్య చరిత్ర పరిశోధకులు అభినందనీయులు.

పనిచేస్తూ శ్రమనుమరిచేందుకు పాడుకున్న ఇల్లాళ్ల పాటలూ, జానపదుల గీతాలు, శ్రమజీవుల మౌఖిక సాహిత్యమంతా వెలగట్టలేని ఎన్నో ఉన్నాయి. ఏదో ప్రామాణికత లేనిదే ఇది ఫలానా వాళ్ళు రాశారు అని చెప్పుకునే స్థితి. వాళ్ళ పేర్లు సాహిత్య చరిత్రలోకి ఎక్కవు. తెలిసినవి రాసుకోవడమే ఇది. ఇంకా తెలియాల్సినవి ఎన్నో ఉన్నవి. ఒక గోలకొండ కవుల సంచిక సవాల్ కూడా ఋజువుగా నిలుచున్నది!

కుప్పాంబిక తెలంగాణ తొలి కవయిత్రే కాదు, తెలుగు తొలి కవయిత్రి. గోన బుద్ధారెడ్డి సోదరి. మల్యాల గుండనాథుని భార్య. ఆమె భర్త మరణించినప్పుడు 1276 లో బుద పూర శాసనం( మహబూబ్ నగర్ జడ్చర్ల సమీపంలోని భూత్ పూర్) వేయించింది. అనుమకొండ పురవరేశ్వర కాకతీయ రుద్రదేవ( రుద్రమదేవి) మహారాజుల ఓరుగంటను పృథ్వి రాజ్యం సేయుచుండంగాను, వేయబడిన శాసనం ఇది.‌కాబట్టి ఈమె కాలం 135 వ శతాబ్దమని నిర్థారింపవచ్చు.

వన జాతాంబకు డేయు సాయ కములన్ వర్ణింపగారాదు, నూ

తన బాల్యాధిక యౌవనంబు మదికిన ధైర్యంబు రానీయ, ద

త్యాను రక్తిన మిము బోంట్లకున దులుపనాహా! సిగ్గు మైకోదు, పా

వన వంశంబు స్వతంత్ర మీయదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే!

యవ్వనవతివై మన్మథుడు మోహాన్ని కలిగిస్తే ఆ అవస్థలను ప్రియ సఖులకూ చెప్పుకోలేదు. తకు పుట్టిన గొప్ప వంశం పరువు మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత అది అన్నట్లున్న ఈ పద్యంలోని కవిత్వమూ, భాషా విశిష్టత, విరహ వర్ణనలోని కూర్పు, శైలిలోని రమ్యత కావ్య పద్దతిలో సాగింది. కుప్పాంబిక భర్త రాజు. ఇతని ఆస్థాన పండితుడుగా ఈశ్వర భట్రోపాధ్యాయుడనే ఉద్దండుడు ఉండేవాడు. ఆమెకు తండ్రి వారసత్వమూ ఉన్నది. విద్యావంతురాలు. తప్పక ఈమె కావ్యం ఏదో రచించే ఉంటుంది. బహుశా ఈ పద్యం అందులోనిదే కావచ్చు. తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూతురిదే అనే సందేశాన్నిచ్చిన ఈ పద్య సాహిత్యం ఆదర్శమైంది. కుప్పాంబికను తొలి తెలుగు కవయిత్రిగా సంగిశెట్టి శ్రీనివాస్ ( ఆంధ్రజ్యోతి 21- 9 -2008) ఉగ్గడించారు. కుప్పాంబిక కావ్యాలు లభించలేదు. అయ్యల రాజు తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక రచించిన ఈ పద్యాన్ని ఉదహరించడం వలన ఇది దొరికింది.

గంగాదేవి పండితురాలు. ఓరుగల్లు నివాసి. 14 వ శతాబ్దం రెండవ ప్రతాపరుద్రుని కాలంలో అగస్త్యుడు అనే గొప్ప సంస్కృత కవి ఉండేవాడు. ఇతని మేనల్లుడు, కవి పండితుడైన విశ్వనాథుని శిష్యురాలు గంగాదేవి. కాకతీయుల ఆడబిడ్డ, ఆంధ్ర కోడలు.విజయ నగర బుక్కరాయల కొడుకు కుమార కంపరాయల భార్య. ఇతడు మధుర నగరాన్ని జయించిన చరిత్రకాంశంతో మధురావిజయం అనే సంస్కృత కావ్యాన్ని రచించింది. సార్యభౌమునిగా కంప భూపాలుని వర్ణిస్తూ రచించింది.

శ్లో|| మహాకవి ముభామ్భోజ మణి పంఞజరి శారికామ్

చైతన్య జలధి జ్యోత్స్నాం దేవీల వన్డే సరస్వతామల్ ||

మహాకవుల ముఖ పద్మాలను రత్న పంజరాలలో విహరించే గోర్వంకై, జ్ఞాన సముద్రాన్ని ఉపోంగ చేస్తున్న కౌముదీ మహోత్సవమై అలరు సరస్వతీ దేవికి నా నమస్కారము అంటూ ప్రారంభ శ్లోకంలో రాసిన గంగాదేవి, తదుపరి వాల్మికీ మహర్షి, కాళీదాసు, భారవి,తిక్కన, అగస్త్యుడు, విశ్వనాథుడు వంటి కవులనూ స్మరించుకుంటుంది.

శ్లో|| ఉపహరన్ కుసుమాని మహీరుహం, కిసలయై కలితాఞలి బన్ధన:

మధుర కోకిల కూజిత భాషితో మధుర ధైన ముపాసితు మాసదతే ||

చేయితిరిగిన కవయిత్రి, సంస్కృత పండితురాలు అనడానికి మచ్చుతునకలు ఈ శ్లోకాలు, ఈ కావ్యంతో తమ భర్త కంపభూపతి శత్రురాజుల మనస్సుల్ని కంపింపజేసేలా, మలయ పర్వతం ఒక అపూర్వ చిహ్నంగా తేజరిల్లుతుంటే దక్షిణ దిశకు ప్రయాణించాడనీ, యుద్ధ సమయాన ఘాతకులైన తురుష్కులను సంహరించినపుడు రాజు తేజస్సు అనే తెల్లదనం వ్యాపించింది అని వర్ణిస్తుంది. ఛందో వైవిద్యంతో సాగిన ఈమె రచన బుద్ధి కుశలత కలిగిన కవి హృదయ సత్య దర్శనం చేసినట్లున్నది.

మధురావిజయం పీఠికతో తెలుగు కవి తిక్కనను స్తుతించింది గంగాదేవి. ఆమె పుట్టి, తిరిగిన నేల ప్రజల భాష తెలుగు. సంస్కృత కవయిత్రిగా పేరు పొందిన ఈమె తెలుగు కవయిత్రి కాదు అని అనకూడదు. ఈ ఒక్క సంస్కృత కావ్యమే దొరికి ఉంటుంది. తప్పుకుండా ఈమె శతకాలో, తెలుగు కావ్యాలో రచించే ఉంటుంది. కాల ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటాయి.

వరంగల్ జిల్లాలో గంగదేవపల్లి అనే ఊరు నర్సంపేటకు వెళ్ళే దారిలో ఉన్నది. ఎందుకు ఈ పేరు వచ్చి ఉంటుంది…? అంతర్జాలంలో ఆదర్శ గ్రామంగా మెరిసిపోతున్న ఈ ఊరు వెనుక ఏమైనా దొరుకుతాయా అని ప్రయత్నిస్తే..? మరిని ఊళ్ళకు ఆదర్శం కావచ్చు. కవయిత్రి ఆనవాళ్ళూ దొరకవచ్చు.

మహంతమ్మ క్రీ.శ. 1833 ప్రాంత కవయిత్రి. మఠం మడి వ్యాళయ్య భార్య. ఇతనూ సహజ రచయిత, వీర శైవ మతాభిమాని. వీరి పేరున మఠము సికింద్రాబాదునందున్నది అని సుంకిరెడ్డి నారాయణరెడ్డి అంటారు.

శ్రీ సదాశివ చిత్త సరసిజవాస గురనందీశ్వరా

వాసవాది గిరీశ సన్నుత దాసపాలక శ్రీకరా

వ్యాస భజయుగ వార్థి కుంభజ యేశభువ నాధీశ్వరా

భాసుర ప్రర బొరళాచల మందిరా బసవేశ్వరా దయసేయు పుత్రసంతకం

అంటూ రాసిన మహంతమ్మ కవిత్వం గీతయోగ్యమైన కవితా ధారతో ఉన్నది చక్కని కవిత్వం.

కోటి మూగవారు నీపై జెప్పిరో బహుకవనముల్

వారిపై కృప జేసి యుస్తిరి కోరి వేడిన వరములన్

సారముగా జేయించి జగముల పేరు వెలసెను కీర్తించెన్

అంటురాన మహంతమ్మ సాహిత్యమూ, సామాజిక ఆదర్శ భావజాలమూ, భర్త రచనా సామర్థ్యంపై నున్న నమ్మకమూ తెలియజేస్తున్నది. మహంతమ్మ పాండిత్యంపై పరిశోధనలు జరగాల్సిన అవసరమున్నది.

రూప్ఖాన్ పేట రత్నమ్మ గారు రంగారెడ్డి జిల్లా పర్గి, ఇప్పటూరులో జన్మించారు. వేంకటరమఠణ శతకం, శ్రీనివాస శతకం రచించారు. ఈమె రాసిన శివకురువంజ యక్షగానానికి చెందిన రచన. తెలంగాణ నుండి ఇది ఒక్కటే ఉన్నదంటారు.

1847 -1929 వీరి కాలం ఈమెను రత్నమాంబ, రత్నదేశాయి అని అంటారు.

కం|| పలుమరు సంసారంబను

వలలో బడి పక్షి విధము వాపోవుచు బల్

కల హములు పూని యమ బా

టలు పట్టరి జనులు వేంకటాద్రి విహారా! అంటూ కలహాలు,

కన్నీళ్ళూ నరకప్రాయాలని చెప్పిన రత్నబాయి గారు, భగవంతుని కృపా కటాక్షం లభించాలంటే కల్మష రహితులుగా ఉండాలి అనీ అంటారు. ‘శ్రీకృష్ణుని దశావతార వర్ణన’ అనే వీరి అముద్రిత రచన ఉన్నట్టు తెలుస్తున్నది. 72 ఏళ్ళ రత్నమాంబ గోల్కొండ కవుల సంచికలో ‘సంసారతరణము’ అనేన కవితాను రాశారు. జనకంటకుల గురించీ, అకళంకుల గురించీ ‘వేంకటాద్రివిహారా’ అనే మకుటంతో శతకంలో అధ్భుతంగా రాశారు. ఒద్దిరాజు సోదరులు నడిపిన ‘తెనుగు’ పత్రికలో ‘శ్రీ గాంధీ మహాత్మునకు’ అనే ఈమె కవిత వచ్చింది. కులమతాల ఆచారాలను కుదురు పరచుకోవాలని, బాల్యవివాహాలు రద్దు చేయాలనీ, బ్రిటీష్ ఆంధ్రలో జరుగుతున్న గ్రంథాలయోద్యమాలు ఇక్కడ కూడా జరగాలనీ ఈ కవితలో రాస్తూనే, నా ఘటమున్నంత వరకు స్వాతంత్ర పోరాటాలకు 12 రూపాయలు సమర్పిస్తాననీ అన్నారు. బాలబోధ, దశావతార వర్ణన వీరి మంత్ర రచనలని తెలుస్తున్నది.

హిత బోధిని పత్రికలోనూ వీరి రచనలు అచ్చయ్యేది.

“మనకు దెలియకున్న మనదారి మనసాటి/ప్రజల జూచియైన బడయరాదె/ సాధుజనుల గూడి సంఘ మేర్పాటుగా/వించి దుర్గుణముల దృంచరాదె” ఎంత చక్కగా సెలవిచ్చారు రత్నమ్మ గారు. కవి హృదయమెప్పుడైనా సమాజ శ్రేయస్సుకొనే కోరుతుందనడానికి ఇదొక నిదర్శనం.

శ్రీమతి లక్ష్మీ కామేశ్వరమ్మ ‘శ్రీదేవి స్తుతి కదంబం’ రాశారు. ఈమె భర్త కొత్తపల్లి వేంకటరామలక్ష్మీ నారాయణ శర్మ. 1875 లో సంస్థానాన్ని స్వీకరించిన రాజాపార్థసారథి అస్వరామ పండితుడు. ఈయన దగ్గర విద్యాధికారిగా పనిచేశాడు. ఈమె రచనలూ వెలుగు చూడాలి.

బిజినేపల్లి చెన్న కృష్ణమ్మ 19 వ శతాబ్ది కవయిత్రి. సత్యనారాయణ కథ కల్పం, బువ్వ బంతి, పెండ్లి పాటలు రచించారు. చంద్రమమౌళీశ్వర స్వామి శిష్యురాలు. పాలమూరు సాహితీ వైభవంలో వీరి గురించి లభించింది. వీరి సాహిత్యమూ తెలియాలి.

తిరుమల బుక్కపట్నం కృష్ణమ్మ ఆత్మకూరు సంస్థాన విధ్వాంసురాలు .బుచ్చివెంకటాచార్యుల రెండవ కూతురు .శ్రీనివాసాచార్యుల సోదరి .సంస్కృతాంధ్ర భాషల్లో , జ్యోతిషంలో పండితురాలు -19 వ శతాబ్ది కవయిత్రి .

మన్నాదేవి త్రిభువనమల్లు ఆరవ విక్రమాదిత్యుని పట్టమహిషి .ఈమె వేయించిన ఆలంపుర శాసనం 1107 -08 లో “మృధుమధుర వచన రచనా చతుర కళాప ” గా రాసి ఉన్నది . పాలమూరు సాహితీక్షేత్రం శాసనకవుల కృషికూడా గొప్పదే .శాసనపాఠాలు ,మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వంలో 881 నుండి 1148 పుటలలో ఉన్నవి .”వీటిలో కొన్ని శాసనాలు పాండిత్యాన్ని చాటే శాసన రచనలున్నవి ” “ఆ శాసన కవులలో ఈమె కుడా ఉన్నది ” అని S .v రామారావు ఆంటారు .

మన్నాదేవికి ‘ అభినవ సరస్వతి ‘ అనే బిరుదు ఉన్నది .ఈమె రచనలు వెలుగు చూడాల్సి ఉన్నది .

జ్ఞానాంబ గారి జన్మస్థలం ఖమ్మం మెట్టు , వరంగల్ జిల్లా.” సూర్యనారాయణ స్తోత్రం ” రాస్తూ ” నా భర్త పేరు సూర్యనారాయణుడగుటచేతను , నా యుపాస్వదేవత సూర్యనారాయణుడగుటచేతను వీరియందు నాకుగల ప్రేమ చేతను ద్వార్దిగా సూర్యనారాయణ మకుటముచే వ్రాసితిని ‘” అన్నారు .” స్వామీ ! నీ పాదపంకజద్వయమే సంభావించి సేవింతు …….నాధా సూర్యనారాయణ “! అంటూ రాసిన మొదటి పద్యంలో పదపంకజాలను సంభావిస్తానని , అవ్యాజమైన కృపను జూపమని రాస్తుంది .’ హృదయేషుడవు ,నా మనసే నీ అర్పణ చేశాను ‘అంటుంది .

శా|| నిన్ను జూచిన తోడ నే తమము నా నేత్రద్వయంబాయు శు

భ్రౌన్నత్వంబగు దారి దోఁచుమని స్నేహాక్షీయ మానంబుగా

దెన్నాండూన్ వినునాకు నీ యెడల నిన్నే నేత్ర మూర్త్యాత్మకం

డన్నంజిత్తము సంతసించెడిని నాథా ! సూర్యనారాయణా !

ఓ నాథా ! నిన్ను జూస్తుంటేనే నాకళ్ళలోని చీకట్లు తొలగిపోయి” శు భ్రౌన్నత్వంబగు” అంటే ,శుభ్రమైన ,ఉన్నతమైన దారితోస్తుంది అంటు చక్కని విశేషాణలను వేసిందీ కవయిత్రి .శుభ్రం అంటే సూర్యుని ప్రకాశమంత తెల్లంది అనీ ,ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న భర్త అనీ పొగడడం చూస్తాం , ఇదే ద్వర్థిగా చెప్పడం .కవికి ఊహ అనేది ఉండాలి .అదే చూపారు వీరు . ఎంతోప్రతిభావంతంగా విశేషణాలని , ఉపమానాలని రాసారు జ్ఞానమాంబ.

శ్రీమతి లక్ష్మీబాయి వన్నాజీపేట గ్రామంలో పుట్టారు.నివాసము హైదరాబాద్. ఆలా వేంకటరామిరెడ్డి పుత్రిక. వీరి మరణచింతతో ‘మహాపురుషప్రశంస’ అని రాసిన కవితలో

ఉ౹౹ ధారసలాది వర్గములు తల్లడ మల్లడ మందుచుండగా…నధిక శోభారహించితిరయ్యా నాయనా!” అంటూ తండ్రిని ‘నాయనా’ అని సంభోధించిన పదాన్నే మకుటంగా తీసుకుని రాసింది. వారు పరలోకగతులై అక్కడ శోభగూర్చారు అంటూనే, వారి సత్యపాలనను కీర్తిస్తుంది.

మ౹౹ శరణంబందు వచించు శత్రుసమితిన్ శీఘ్రంబుగా బ్రోచితౌఁ

పరనారీ మణులెల్లఁ దల్లులనుచున్ భావించి రక్షించితౌ

గురుపాదంబులు నాత్మతో, దలఁచుచున్ గోరక్షగావించితౌ

ధర నీరూపము నేటితో ముగిసే నా దైవజ్ఞయో నాయనా!

గొప్పగుణాలుగల తండ్రిని అంతే గొప్పగా వర్ణిస్తూ స్మృతికవిత్వంగా రాశారు.

శరణువన్న శత్రువును కాపాడాలనీ, సత్యవచనాలే వాడాలనీ, పరాయిస్త్రీలను తల్లులుగా భవించాలన్నట్లు జీవించిన తండ్రిగారిని వర్ణిస్తూ శీర్షికకు తగినట్టు రాసింది. ‘తల్లడ మల్లడ మైనం’ అనే తెలంగాణ పద సోయగాన్ని కూడా పంచిన ఈ కవయిత్రి పసిడికి సువాసన అచ్చినట్లు రాసింది.

శ్రీమతి చి. లక్ష్మీనరసమ్మగారిని రామాయంపేట, అంబర్ పెట్ తాలూకా.ఈమె స్త్రీల పాటలను, భక్తవత్సల శతకాన్ని వ్రాశారు.

ఉ౹౹ ఎమ్మెల వేలరామ! భవదీయ పదాంబుజ గోరన

న్నిమ్మెయి చిక్కులంగలంచ నెవ్వరి వేడుదు నెందుఁబొదునో

యమ్మక చెల్ల! యిట్లు తన యాత్మజ నేనియుఁగావలేనివా

రిమ్మ హిషందురే కృపవహించదేటికి భక్తవత్సలా!

ఈమె భగవంతుణ్ణే తండ్రి అంటూ, ‘పూర్ణ కృపాకరంబురాశిగా పోలుస్తూ ప్రేమోర్థివ పూర్ణ భక్తితో కొలుస్తానని కీర్తిస్తుంది. ‘వృజినవినాశ’ అని సంబోదిస్తూనే త్రిజగద భీష్టదాయుడైన దీన జనొద్థారున్ని కొలుస్తుంది. వృజినవినాశ అంటే పాపాలను, క్లేశాలను పోగొట్టేవాడని అర్థం మనశ్శాంతిని ఇచ్చి పరంధామానికీ చేర్చుమని,లౌకికవిషయాసక్తులు లేకుండా చేయమని వేడుకుంటుంది. ఇరవై ఏళ్ళకే ఇంతటి పాండిత్యాన్ని ప్రదర్శించిన ఈ కవయిత్రి తండ్రి కూడా విద్వాంసులేనట ! “శ్రీకర ధీనభందు సరసీరుహలోచన..”

అంటూ ప్రారంభించి, “సర్వ దుఃఖ హారణా కారుణామాయ భక్తవత్సలా అంటూ భక్తి కవితా మాలికలల్లింది. “ఎమ్మెల రామా?” అంటే, మనోహర -త్వంగలవాడైన ఆ భగవంతుని పొగుడుతూనే తన గోడును చెప్పుకుంటుంది.

“నెందుఁ బోదును/యమ్మక చెల్లె యిట్లు తన యాత్మజేయూ …”

అమ్మ+ఆక+చెల్లెలు, కృపచూపకుంటే ఎట్లనీ ‘ఆత్మజ’కు నీ పుత్రికకు అని భగవంతుణ్ణి నిలదీస్తుందీ కవయిత్రి, సర్వ సౌందర్యశోభితం ఈమె భాషా పాండిత్యం.

సీతాపిరాట్టమ్మ నల్గొండ జిల్లా ఈమె కలికాలం చేసే విపరిత్యాన్ని వర్ణించారు. వీరు ఉపాధ్యాయులుగా పనిచేశారు.

‘కలిరాజు’ అనే కవితలో సీ౹౹యజ్ఞయాగాది నిత్యాగ్ని హోత్రముల్లెలఁ జుట్టబీడీలలోఁ జుట్టబడియే వేదపురాణముల్ విపరీతములటంచు నందఱి భావంబుల మరియుండే భక్తివిజ్ఞానముల్ పరిపూర్ణమై తలన్ గ్రాపురూపంబుతో, గ్రాలుచుండె నేయింటిపైఁ జూడ నింగ్లీషు భాషలో బేర్లను జెక్కించి పెద్దలైరి.

గౌ౹౹ యాడువారలు మగవారి లందరెల్ల

నొక్క సీమంతమున నైక్యమొందిరిపుడు

సెప్పగా లేము నీయొక్క గొప్పఁదనము

లేరా! కలిరాజు నీ మహిమాద్భుతంబు!

అంటూ ఫ్యాషన్ ప్రపంచంలో కొట్టుకొనిపోతూ, తమదైన దేశీయతను మరచిపోతున్నారని వాపోతుందీ కవయిత్రి. ఇంత వ్యంగ్యాపూరితమైన కవిత్వం ఆ కాలంలోనే వ్రాశారంటీ అశ్చర్యమే! “1920 లలో ‘శోభావాతి’ నవల రాసిన పిరాట్టమ్మ వీరు ఒకరేనా? పరిశోధించవలసి వుంది” అని కాత్యాయిని విద్మహే అంటారు. ఇంకా కలాలకు చాలా పని మిగిలే ఉన్నది.

రాణీ వేంకట లక్ష్మాయమ్మ సర్ దేశాయిది ఇప్పటూరు. భర్త రాజావేంకట దుర్గారెడ్డి. వీరు పాపన్న పేట సంస్థాన పరిపాలకులు. గోల్కొండ కవుల సంచికకు పద్యాలు పంపినప్పుడు ఈమె వయస్సు 49 ఏళ్ళు.

గౌ|| అంగమా యిది కడు క్షణభంగురము

సంపదది యెన్న మిగుల చంచలము గాంచ

గాలుడు సమీపనర్తియై కాచుచుండ

హరిని ధ్యానించు మానంద మబ్బు మనసా!

గౌ|| బాహ్య శత్రు జయంబున బ్రాభంబు

గలుగ దెప్పుడ జగతి నిక్కంబు సుమి

మెదుగు కామాది షడ్వర్గ మదిమి భక్తి

హరిని ధ్యానించు మానంద మబ్బు మనసా!

చక్కని చిన్ని మకుటంతో రాసిన పద్యాలవ్వి. ఈ శరీరం క్షణభంగగురమైనదనీ, అరిషడ్వర్గాది అంతశ్శత్తవులైనా, బాహ్య శత్రువులైనా, హరి భక్తితో జయించవచ్చుననీ అంటారీ కవయిత్రి. ఇంత అని చెప్పలేని జీవితాలు. ఎంతకాలం బ్రతికామా అన్నది కాదు, ఎట్లా బ్రతికామా అన్నది ముఖ్యం. మనశ్శాంతి ఉండాలి. “కాలుడు సమవర్తిమై కాచుచుండ” అంటుందీమె. గొఱ్ఱెలను కాసేవాడిగా కాలుడు వెంటే ఉంటాడు అని ఈమె భావం. ఆలోచనాత్మకమైన కవిత్వం ఈమెది. ‘మానస బోధ’ అనే వేదాంతపరమైన పద్యాలకూ రాసిందీ కవయిత్రి.

సోమరాజు ఇందుమతో దేవి 1910-15 ల మధ్య కాలంలో జన్మించారు. 1984 సెప్టెంబరులో స్వర్గస్తులయినారు. ఖమ్మం జిల్లా వీరిది. భక్త సోమరాజు రంగారావు వేణుగోపాల శతకం, పతిభక్తి శ్రీరంగనాథ స్తుతి, శాకుంతలాభ్యుదయబు అనేవి వీరి రచనలు. శాకుంతలాభ్యుదయము దొరకడం లేదు. చిలకమర్తి లక్ష్మీ నరసింహకవి చదివించుకొని విన్నానని రాయడం వలన తెలిసింది.

“చిదిమిన పాల్గారు చెక్కిళ్ళు గలిగి/మురిత యశోదకున ముద్దైన రంగ పొట్టనిండను మెక్కి పొవరిండ్ల డాగి/దిట్టమై మెలోగిన ధీను తరంగ అంటూ శ్రీరంగ నాథ స్తుత కావ్యంలో సరళసుందరమైన అచ్చతెలుగు పద ప్రయోగాలెక్కువగా చేస్తూ రాసినా అఖిల మౌక్తిక రత్న హరచేయూర/ నిఖిల తత్వాల నిఖిలా త్మరంగ అంటూ ప్రాఢమైన శైలిలో వ్రాసినందుకేనెమో పీఠికలో ఈమె కవిత్వపు శైలి చూచిన సంస్కృత భాషాసన యేకాంచెమోకాక విశషించియున్నట్లు తెలియకయ్యేడిని” అంటూ శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి రాసినారు. వేలూ శివరామశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి ఈ కావ్యానికి ముందు మాటలు రాశారు. తానే స్వయంగా తెలుగు, సంస్కృత భాషలు బాగా చదివి పాండిత్యాన్ని సంపాదించుకున్న ఇందుమతి గారు ఒక కవితలో..

“తల్లి ప్రేముడి మరిపించి తండ్రిగాని/గారంబును విస్మృతి గలుగజేసి/ సోదరీ సోదరులు నన్ను వాదించు/ కంటె నెక్కుడుగా మీరుగారు చుంద్రు అని చెప్పుకోగలిగేంత భర్త ప్రేమను పొందారు కాబట్టే, “అతి విశాల సంసరణ మహాబుధిని నన్ను ధరియింపజేసెది నావమరె” అనీ “విమల రాకా సుధాకర సమమనోజ్ఞమైన మీమూర్తి నెడబాయనార్తి కాదె” అని వర్ణించగలిగారు. తను ప్రేమించే భర్త కంటే, తనను ప్రేమించే భర్తపైన గౌరవమెక్కువ ఉంటుదన్నది వీరి కవిత్వం ద్వారా తెలుస్తున్నది. మంగళగిరీ వ్రతంపై పద్యాలు రాసిన ఈమె కావ్యావళి రచనను గురించి వేటూ ప్రభాకర శాస్త్రి గారు “మెల్లమాంబ, వెంగమాంబల రచన ములదలపించుచు లలితమైయున్నది” అన్నారు వేణుగోపాల శతకంలో

“శ్రీకరముల చెలువున కుద్దియై విలసిల్లు కెందమ్మి విరులదెచ్చి/క్షీరసాగర కన్య చిఱునవ్వు చాయకునొరమై తెలిమల్లై సరుల గూర్చి” ఇట్లా సాగిన ఈ వర్ణనా చాతుర్యం భాష్యాభిమానులకు తృప్తినిస్తుంది.

“పండుటాకుల రాల్చి పల్లవించినతీవ

కొసలల్లు పొదరింట కసవు జిమ్మి

పునుగు జివ్వా జివా పొలుసు వస్తుల నీట

ముంపెత్తి కొని వలయంపి జల్లి

ఘనసార తరువుల తనుదాన రాలుక

రూపంబు పొడి జిల్గు మ్రుగ్గు పెట్టి…ఇంతటి అల్లిక ఎంతగొప్పగా సాగిందో. స్త్రీలు వాకిళ్ళఉ ఊడుస్తారు. భాన్పు జల్లుతారు, ముగ్గులేస్తారు. వీటిల్లోని కళానైపుణ్యాన్ని కవిత్వీకరించారు. ఇందుమతిగా మనుమడి పెళ్ళికి కవత రాసి ఆశీర్వదించింది. ఇది ఈ మధ్యనే లభించింది. అదే వీరి ఆఖరి హస్త సాక్షం అయి ఉంటుంది. “ఎవ్వరు నేర్పిరే చెలియ యిగతి వాయన మిచ్చి పల్కనీ/నవ్విన పువ్వులో దెలుగు నాలి మనోహర కీర్తి వల్లికల్ / పువ్వులు పూచెనమ్మ” అంటూ ఆడవాళ్ళ ఆచారాలను అందంగా వర్ణించినది. ఆంధ్ర కవయిత్రులు పుస్తకంలో ఉంటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారు, “దక్కను సారస్వతమున బాగుగా ప్రసిద్ధురాలయిన కవయిత్రి గా అభివర్ణించారు. ఇందుమతి గారు ‘గౌరి’ అనే ఖండ కావ్యాన్ని రాసినట్లు తెలుస్తున్నది. ఎప్పుడో 1936 లో వచ్చిన వీరి కావ్యావళిని ఇందుమతి కవిత్వం అనే పుస్తకంగా ముద్రణ లోకి వచ్చింది. కుటుంబం కోసం భార్యాభర్తలిద్దరూ సమానస్కంధులుగా మంచి భావంతో ఉండాలనీ, గుణవంతుడైన పతిని దేవునితో సమంగా కాలవాలనీ చెప్పిన ఇందుమతి గారు ఆదర్శనీయులు. తెలంగాణలో భావ కవిత్వం ఎంత గొప్పగా వచ్చిందో ఈమె కవిత్వాన్ని చదివితే తెలుస్తుంది.

భో.ఆండాళమ్మ గద్వాల జన్మస్థానం. వీరి భర్త కీ,శే.బి. వేంకటాచార్యులు. గోలకొండ కవుల సంచికలో ప్రబోధము అనే అంశానికి భరతమాత అనే శీర్షికతో కవిత రాశారు.

గౌ|| బూర్వమును బోలె నిపుడేల పొడుచు జేసి

నీదు విఖ్యాతి దిక్కుల నివ్వటి ల్ల

జేయు వేలొకో! జేలవో! చిత్రమగును

పరమ కల్యాణ గుణపూత! భరతమాత! అంటూ సమర సతా భావ సిద్ధాంతాన్ని చూపే బిడ్డల్ని కనుకుంటుంది దేశమాతను! శంకరరామానుజులు వంటి కొడుకుల్ని భరతమాత కనమంటుంది. “యమని యమా సనధ్యన.. దైవర్ణి కార్స నారంభ సంవర్థిత భద్ర సంయుక్తులౌ శూద్రకులు” అంటూ సామాజిక అంశాలను స్పృశిస్తూ, చైతన్యవంతంగా ఉండాలన్న ఆకాంక్ష ఉన్న వారు ఈమె! ఇంకా అంటరాని తనం సమస్య సమసిపోనేలేదు ఈ కవయిత్రి ఉంటే ఎంత దు:ఖిస్తుండేదేమో!

శ్రీమతి వి. లక్ష్మీ దేవమ్మ గారిది మహబూబ్ నగర్ లోని అమరచింత. ‘నళ’ నామ సంవత్సరంలో జన్మించారు. దేశమాత కవితతో పూర్వ కవుల పాండిత్యాన్ని, చారిత్రాక విషయాల్ని స్పృశిస్తూ, “ఎండిన మ్రోడులే నిగురుతొత్తగా గీతికల, బాడరేల త్యాగయ్య పగది..దివ్వ విఖ్యాత గుణ జాత దేశమాత” అంటారు.

గౌ౹౹ వీర ధర్మంబు దివికేగి విశ్రమించే/బ్రహ్మతేజంబుడస్సి విశ్రాంతి గనియే భారతీయులు దౌర్భాగ్య పరతగనిరి/తిరిగి మమ్ముద్ధరింపుమొ దేశమాతా!

కవిత్వం సామరస్యాన్ని, దేశపురోగతిని, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించాలి. వీరు భారతదేశ పూర్వవైభవమంతా పునరాగమనం కావాలనే రాశారు. కోటికొక్కడైన భరతమాత పుత్రుల్లో వీరుడూ, సమజోద్ధారకుడు పుట్టాలని అభిలషిస్తూ కవిత్వీకరించారు.

పులిగోటి ఆనందమాంబగారి జన్మస్థలం కొడిమేల, జగిత్యాల తాలూకా, కరీంనగర్ జిల్లా. వీరి తండ్రి పులిగోటి మంగారావు గారు. ఆనందబాయిగారు వేలమంది పృచ్ఛకులతో అష్టావధానం చేసిందని ప్రతీతి.

13 ఏళ్ళ ప్రాయంలోనే అవధానాలు నిర్వహించేవారట. గోల్కొండ కవుల సంచికలో ‘స్త్రీవిద్య’ అనే అంశంపై కవితరాశారు. దైవభక్తి, దేశభక్తి నుండి మరో అడుగు ముందుకేసి మహిళాశాధికారతవైపు ఆలోచన సారించారు. ఆనాటి సామాజిక పరిస్థితులపై చురకలూ వేశారు.

గౌ౹౹ విద్యయన్ననూ స్త్రీలకు వెగటుగల్గ/ వనితల జ్ఞానులను చూచు వాడుకొనుట మబ్బురంబేమి ? దీపఁబునవలద్రోయ/నున్నయింటిలో,

జీకటియుండకున్నె

ఉ౹౹ కాంతలు మాతృభాషాపయి గౌరవముంచక నన్యభాషన్

శ్రాంతమునేర్చినంతటను సారము లేదిక గొప్పయైన శ్రీ

మంతముగల్గి యున్నదని మంగళ సూత్రముఁ బారవైచియ

త్యంత సుభూషణంబులను దాల్చిన రీతిని యెంచి చూడగన్! అంటూ ఏకిపారేశారు. చదువు ప్రాముఖ్యతను, “దీపాన్ని అవతల దోసిన ఇంట్లో చీకటి ఉండదా” అనడం అక్షర జ్యోతికి వెలిగించుకోని స్త్రీలు తమకుతామే అన్యాయం చేసుకుంటే ఈ తెలివి తక్కువతనాన్ని వాడుకొని వదిలేస్తున్నరు ఇందులో ఆశ్చర్యమేమున్నది? మనదైన ఆలోచన ఉండాలి కదా అంటారు. మాతృభాషపై గౌరవం లేక ఇతర భాష నేర్వడాన్ని ఒక వింతైన పొలికతో చెప్పారు. భారత దేశంలో పెళ్ళి ఘట్టానికి చిహ్నంగా ఎదో ఒకటి ఉన్నట్టే, విదేశాల్లోనూ ఉన్నది. తెలుగువాళ్ళు పుస్తెగట్టినట్టే వాళ్ళు ఉంగరాన్ని పెట్టుకుంటారు. నగలన్నీ పెట్టుకొని మంగళసూత్రాన్ని తీసేసినట్టే ఉన్నది ,తనబాషను రక్షించుకోకుండా ఇతర భాషపై మోజు మాత్రమే ఉంటే ఎట్లా అని చక్కగా సెలవిచ్చారు .పరభాషలను నేర్చుకోవద్దని అనడంలేదు అమ్మభాషను వదులుకోవద్దని అంటున్నారు .

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణను చెప్పుకుందాం .ఔరంగజేబు కూతురు జేబురున్నీసా కవయిత్రి .తండ్రికి నచ్చదు .ఎట్లాగైనా ఆమెను కవిత్వానికి దూరంబెట్టించాలి అనుకుంటాడు.ఉపాయం చెప్పమని కమలనే అడిగాడు.వాళ్లు అమెకొక సమస్యనిస్తాం ,అది పూర్తిచేస్తే ఇక అమెను ఆపలేం ,ఆపకూడదు అని అన్నారట .అతను సరే అన్నాడట .”ఎక్కడైనా నల్లని ముత్యాలు దొరుకుతాయా ?”అని సమస్యనిచ్చారట అందుకామె “దట్టంగా కాటుక ఉన్నకంటికి క్షోభ కలిగిస్తే ,ఆమె కంటినుండి నల్లని ముత్యం రాలదా ?” అన్నదట .ఇది ఆమె సహజ కవయిత్రి అని అర్థం అయ్యింది .కంటి ముత్యంలా నల్లని ముత్యం రాలదా ! అంటే అంతర్భావం ఎంత గొప్పగా ఉన్నది , ఇదన్నమాట .”కవీరేన జానాతి కవే: ప్రతిభంశం “అంటారు .కవి అనేవాడికే తెలుస్తుంది ఇంకో కవిపడే వేదన .ధ్వన్వర్థం, భావం గ్రహించి ,సమస్య ఇచ్చినవాళ్ళూ నిజంగా గొప్ప కవులేకాబట్టి పూజనీయురాలైన కవిప్రశంస చేసారు .

ఇది ! కవిత్వం రాయాలని మనస్సులో ఉత్తేజం కలగాలి అప్పుడే కవిత్వం కవిత్వంగా వస్తుంది .ఆయా కాల ధర్మాలను ఎదురించి నిత్య జీవన సమరాన్ని ఛేదించి కలం పట్టిన స్త్రీలు వీళ్లంతా .వారి వారి కళ్ళముందున్న సమస్యలనే చక్కని అర్ధవంతమైన ఉపమానది అలంకారాలతో భాషానైపుణ్యంతో ,ఆనాటి రచనా విధానాన్ని అనుసరించి పద్యాలతో కవిత్వమళ్లారు .

మంగళగిరి రాఘవమ్మ ,రాచమళ్ళ సత్యవతీదేవి ,పులికుర్తి కమలాదేవి ,పాపమ్మ (కరీంనగర్) వంటి మరికొందరి పేర్లూ తెలుస్తున్నవి .వీళ్ళగురించి తెలుసుకోవాలి .ఆధునిక యుగంలో పద్యరచనలు ఎక్కువ చేసిన కొందరు , ఆధునిక వచన కవిత్వ ధోరణులకు కొంత భిన్నంగా కవిత్వం రాసిన కవయిత్రులూ ఉన్నారు .వారి కవిత్వాన్ని మరోవ్యాసంలో చదువుకుందాం .వారిలో కొందరి పేర్లు ,చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ జొన్నవాడ రాఘవమ్మ ,మంతెన ఆండాళ్ ,శశి సుభాష్ , ఎం .సుజాత రెడ్డి ,వేదాంతం నాగరాజ్యలక్ష్మి ,రామశేషమ్మ .వి ,సుచరిత,సూరినాగమ్మ,సి హెచ్ విజయలక్ష్మి వర్ధన్ మొదలైనవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com