చారిత్రక వస్తువుతో కూడిన కథాకావ్యం విశ్లేషణ…

ప్రాచీన తెలుగు సాహిత్యంలో మహాకవి పోతన్నతో పోల్చదగ్గ ఆధునిక కవి గుర్రం జాషువా. పోతన ఏ రాజకీయాల ప్రమేయం లేకుండా, మత ఉద్యమాల ప్రభావం లేకుండా స్వతహాగా శైవుడై వైష్ణవ గాథలు రాసాడు.

‘చేతులారంగ శివుని పుజించడేని’ అన్న సులభ సుందరమైన గీతమూ, ‘ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీ’డన్న అచ్చికమూ, ‘క్షోణీతలమ్ము నన్నెదురుసోకగ మ్రొక్కి నుతింతు’నన్న సంస్కృత పదభూయిష్టమైన పద్యమూ అలవోకగా చెప్పి ప్రజల నాల్కల మీద చిరకాలం నిలిచిపోయాడు పోతన. ‘వాని రెక్కల కష్టంబు లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు’ అన్న సులభ సుందరమైన గీతమూ, ‘రాజు మరణించె నొక తార రాలి పోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె’ అన్న సంస్కృతాంధ్రాల మేలి కలయిక, ‘నా కవితా వధూటి వదనమ్ము నెగాదిగ జూచి’ అన్న పద్య గాంభీర్యమూ చూపించి సామాన్యుల మనస్సులో నిలిచిపోయాడు జాషువా.

జాషువా కులం వల్లనో, వంశ ప్రతిష్ట వల్లనో కాక తన వాక్పటిమ వల్ల గుర్తించబడ్డాడు. ఉద్యమాల వల్లనో, రాజకీయాల వల్లనో కాక కరుణ రస హృదయం వల్ల కవితాపతాక నెగురవేసాడు. ‘నాల్గు పడగల హైందవ నాగరాజు’ బుసల నడుమ స్వశక్తితో ఎదిగాడు. అయినా తనను చిన్న చూపు చూసిన అవ్యవస్థ పట్ల తాను ప్రేమ దృష్టినే ప్రదర్శించాడు. తనను అనేక ఇబ్బందులకు గురి చేసిన కన్నఊరిని, ‘నను మరచిన నిను మరువను, వినుకొండా నీకు నా పవిత్ర ప్రణతుల్ అని ప్రస్తుతించాడు.

జాషువా బహు గ్రంథకర్త. గబ్బిలము, ముంటాజమహలు, కాందిశీకుడు, స్వప్నకథ, నేతాజీ, నాకథ, కొత్తలోకం, ముసాఫర్లు, స్వయంవరం, బాపూజీ, నాగార్జునసాగర్, తదితర కృతులతో పాటు అనేక ఖండ కావ్యాలు రాసాడు. అయన పద్యం రసవద్గుళిక, కరుణామాలిక. అయన పద్యరసం పొంగులు వారిన గొప్ప కావ్యం పిరదౌసి.

దళితుడిగా, కవిగా జాషువాకు అనేక అవమానాలు, దెబ్బలు తగిలాయి. కవిని గొప్పవాడిగా, రాజును చరిత్రహీనుడిగా చూపించాలన్న బలమైన కాంక్ష ఆయన మదిలో ఉండి ఉంటుంది. అందువల్ల చరిత్రలో ఒక చిన్న కథను ఏరి ఆ కథ మిషతో తాను చెప్పదలచుకున్న భావాలన్నీ చెప్పాడు. కవి ఘనత, కవిత్వం ఘనత, కవి ఔదార్యం, రాజు కాఠిన్యం, అబద్ధాల కోరుతనం పిరదౌసి ద్వారా చెప్పాడు. వేగవంతమైన కథన శిల్పంలో దిట్ట అయిన జాషువా ఈ కావ్యంలో కరుణ ఒలికించగల సన్నివేశాలు అనేకం కల్పించుకున్నాడు.

చారిత్రక వస్తువుతో కూడిన కథాకావ్యం పిరదౌసి. గజనీ మహమ్మదు బారతదేశం మీదికి 18 సార్లు దండయాత్రచేసి ధనరాశులను కొల్లగొట్టి జగజ్జేతగా స్వదేశం వెళ్ళిపోతాడు. తన జైత్రయాత్రకు స్థిరత్వం కల్పించాలంటే ఒక కావ్యం రాయించాలని సంకల్పించి మహాకవి పిరదౌసిపై ఆ కార్యభారం మోపుతాడు. పారశీకంలో ఉద్ధండుడైన పిరదౌసి రాసే ప్రతి పద్యానికి ఒక బంగారు నాణెమిస్తానంటాడు. కావ్యం పూర్తయిన పిదప మాటతప్పి వెండి నాణేలను బహూకరిస్తాడు గజనీ మహమ్మదు. కవి దాన్ని తిరస్కరిస్తాడు. రాజు దాన్ని అవమానంగా భావిస్తాడు. సభాసదులు ఆజ్యం పోయడంతో కవికి మరణ శిక్షను ప్రకటిస్తాడు రాజు. కవి తప్పించుకొని స్వస్థలానికి పారిపోతాడు. చివరికి తన తప్పు తెలుసుకున్న రాజు తిరిగి బంగారు నాణేలను పంపిస్తాడు. అప్పటికే కవి మరణిస్తాడు. కవి కూతురు బంగారు నాణేలను తిరస్కరిస్తుంది. రాజు ఆ ధనంతో తూసులో ఒక ముసాఫిర్ ఖానా కట్టిస్తాడు. ఇది కావ్య కథ. మూడు ఆశ్వాసాలతో నడిచిన ఈ కావ్య పద్యాలు కొన్ని భారతిలోను కొన్ని ఆంధ్రపత్రికలోను వచ్చాయి. ఆర్థికలేమి వల్ల 1932లో గాని ఇది పుస్తక రూపంలోకి రాలేదు.

ఈ కావ్యంలో ప్రధాన పాత్రలు రెండు; పిరదౌసి, గజనీ మహమ్మదు. పిరదౌసి, గజనీ మహమ్మదులిద్దరూ చారిత్రక వ్యక్తులు. పర్షియాలో పేరెన్నికగన్న మహాకవి పిరదౌసి. ఈయన పూర్తిపేరు హాకీ అబుల్ కాసీం పిర్ధౌసి తూసీ. క్రీ.శ. 940-1020 మధ్య జీవించాడు. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఈయన రాసిన ప్రసిద్ధ గ్రంధం ‘షానామా’. ఇదికాక ఈయన ఇతర రచనలేవీ అందుబాటులో లేవు. 977 నుండి 1010 వరకు రాయబడ్డ షానామా ఇరాన్ మహేతిహాసం. 50 వేల డిస్టిచ్ లు (ద్విపదల్లాంటివి) ఉన్న పర్షియా జాతి పురాణం. పిరదౌసీ కవి అంతిమ దినాలు ఎలా గడిచాయో చారిత్రక ఆధారాలు లేవు. ఇక షానామాకు ప్రేరకుడైన గజనీ మహమ్మదు జగజ్జేత. క్రీ.శ. 970-1030 మధ్య జీవించిన ఈయన 18 సార్లు భారత్ పై దండయాత్ర చేసాడు. చివరిసారి దండయాత్రలో సోమనాథ్ ఆలయాన్ని కొల్లగొట్టాడు.

చిన్న చరిత్ర శకలాన్ని తీసుకొని కావ్యం అల్లడంలో గుర్రం జాషువా తర్వాత కాలంలో వచ్చిన చాలా మంది కవులకు మార్గదర్శకుడయ్యాడు. పిరదౌసి చారిత్రిక కథకు తనదైన సున్నితమైన చేర్పులతో కరుణ రసం ఒలికించాడు. ఈ కథలో సత్యం పాక్షికంగానే ఉంటుందన్న సంగతి మనం మరవలేం. కవి అట్లా మలుచుకుంటాడు. పిరదౌసి ననుసరించి నార్ల చిరంజీవి భాగ్యనగరం నాటకం, కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం కావ్యం, విద్వాన్ విశ్వం పెన్నేటి పాట, డా. సినారె కర్పూర వసంత రాయలు రాయడం జాషువా విజయాన్ని సూచిస్తుంది.

కవులంతా అటు దేశభక్తి ఇటు ప్రణయాసక్తితో రాస్తున్న కాలంలో నిమ్నజాతి వస్తువును కవిత్వం చేయడం జాషువా చేసిన సాహసం. ఈ కావ్యరచన కూడా గౌరవ ప్రదమైన వస్తువు మీద రాసిందేం కాదు. ఎందుకంటే కథ విదేశీయం, పైగా తురక రాజు కథ, డబ్బుపై మోజుపడి భంగపడ్డ కవి. పారశీక వస్తువు. ఆ రకంగా జాషువాది అప్పటికి ఒక ప్రయోగమే. ‘మాతృభూమిక మరవని విశ్వమానవ దృష్టి, సంప్రదాయ సంస్కారం వదలని ఆధునికత, అస్తిత్వాన్ని తిరస్కరించని హేతువాదం, ద్వేశపూరితం కాని ఆగ్రహ ప్రకటన, వెరసి జాషువా’ అన్న పాపినేని శివశంకర్ అభిప్రాయం నూటికి నూరు పాళ్ళూ నిజం. రూపంలో ప్రాచీనత, వస్తువులో ఆధునికత, దృష్టిలో నవ్యత జాషువా తత్త్వం.

పద్యం సంప్రదాయమే కాని ఆధునికత జాషువా విశిష్టత అని మనం చెప్పుకున్నాం. దానికి అనేక ఉదాహరణలివ్వవచ్చు. కావ్యారంభంలో శ్రీకారం లేదు. దేవతార్చన లేదు. సుకవిస్తుతి, కుకవి నిందా లేదు. నేరుగా కథలోకి వెళ్ళి

‘మును గజనీ మమూదు డభూత పరాక్రమశాలి, వీరవా

హినుల బలంబుతో పదియునెన్మిది మారులు కత్తిదూసి, చి

క్కని పదిరంబులో భరత ఖండంబు నార్ద్రమొనర్చి సోమనా

థుని బెకలించి, కైకొనియె తొమ్మిది వన్నెల రత్నరాసులన్’

అంటాడు.

కథాగమన సూచన చేయడం మహాకవి లక్షణం. గజనీ మహమ్మదు పిరదౌసికి కావ్యరచనా బాధ్యత అప్పగించిన పిదప అతనికి ఒక కల పడుతుంది. ఆ కలలో పిరదౌసికి ఒక అందమైన పారశీక రాజవనిత ఎదురవుతుంది. అతనికి సహచరిని అవుతానంటుంది. అతను పులకరించి కౌగిలించుకోబోగానే ఎవరో కత్తితో పొడిచినట్లవుతుంది. కలచెదురుతుంది. ఇది పిరదౌసి కావ్యంలో కథాగమన సూచిక. విశ్వనాథ సత్యనారాయణ తెలుగు భారతారంభాన్ని సూచిస్తూ ‘శ్రీవాణీ’ శ్లోకం తర్వాత వచ్చే మొదటి తెలుగు మాట ‘అని’ని ప్రస్తావిస్తూ దాన్ని కథా గమన సూచికగా చెప్పాడు. ‘అని’ అంటే వ్యాసుడు చెప్పిన దాన్ని చెప్పడం ఒక అర్థం; పరంపరగా ప్రజలు ఒకరికొకరు చెప్పుకోవడం అని ఒక అర్థం; యుద్ధం అని ఒక అర్థం అంటాడు విశ్వనాథ. కావ్యగమనంలో ద్వితీయాశ్వాసంలో ఒక సుందరి కలలో వచ్చి నన్ను అత్యున్నత పర్వతాగ్రము నుండి కూలదోసి పోయింది. దాని భావం నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటాడు పిరదౌసి.

కావ్య గమన క్రమంలో సార్వ జనీన, సార్వ కాలీనమైన నీతి వాక్యాలను ఒదిగించడం గొప్ప కావ్యకళ. ఇందులో గజనీ మహమ్మదు వెంట ధనం తరలి పోయిందని చెబుతూ, బలం వెంట వెళ్ళే తుంటరిది ధనo అని అతికినట్లు చెబుతాడు జాషువా.

‘హిందువుల దోర్చలము నాశ్రయించి బ్రదుకు

ద్రవ్య సంపద, తురక భూధవుని జేరి

కాపురంబుండె నతని ఖడ్గమును వలచి

సిరిని నిజంబుగ వట్టి టక్కరిది సుమ్ము’

ప్రకృతి చర్యలకు మనవ లక్షణారోపణ చేయడం కవి ప్రతిభ. కవి పిరదౌసి స్వస్థల యాత్రను వర్ణిస్తూ ప్రకృతి చర్యలకు మనవ లక్షణారోపణ చేయడం కవి ప్రతిభ. కవి పిరదౌసి స్వస్థల యాత్రను వర్ణిస్తూ

ప్రకృతి చర్యలకు మనవ లక్షణారోపణ చేయడం కవి ప్రతిభ. కవి పిరదౌసి స్వస్థల యాత్రను వర్ణిస్తూ

“ జలదంబుల్నలు పెక్కి యాకసమునన్ సంచారముంజేసె, భూ

లలనారత్నము స్నానమాడునని వేళా ఘంటికల్ మ్రోసె గ్రొం

జలి గాడ్పుల్ చెలరేగి దేహముల నంటన్, గూండ్లలో బండి కూ

నలపై రెక్కలుగప్పి కన్ను మలిపెన్, నానా శాకుంతచ్చటల్’

అంటాడు జాషువా. మబ్బులు నల్లనై ఆకాశంలో తిరిగాయట, భూదేవి స్నానమాడుతుందని వీచే గాలి ప్రకటిoచిందట. పక్షులు పిల్లలపై రెక్కలు గప్పి పడుకున్నాయట. అలారం అనే ఆంగ్ల పదానికి “వేళా ఘంటికల్” అని ఒక చక్కటి మాట ఉందని జాషువా కంటే ముందెవ్వరూ చెప్పలేదు. ఇంకో పద్యంలో వాన, కవిని కాపాడే ఉద్దేశ్యంతో మెల్లగా కురిసిందంటాడు.

రాజు మోసానికి కారణం తన పాపమేనంటాడు కవి ఒకచోట. ఇతరుల శరీరాలను ఆహారంగా స్వీకరించే కత్తిని ఆయుధంగా ధరించిన రాజులను తన పద్యంతో పొగిడిన పాపం ఊరికే పోలేదనడం గొప్ప వ్యాజస్తుతి.

‘పూనికరాసికి మనుజభుక్తి నొసంగెడు రాతిగుండె సుల్తానుల

కస్మదీయ కవితాసుధ జిందిన పాతకంబు నాపై నటనంబొనర్చినది’

అంటాడు.

కావ్య నిర్మాణంలో జాషువా ఒడుపు కూడా పేర్కొనదగింది. పిరదౌసీ మసీదు మీద రాసిన పద్యాలను కావ్యంలో రెండుసార్లు చెప్పాడు జాషువా. కవి గజనీ నుండి పారిపోతూ రాసినప్పుడు; రాజు మజీదు గోడపై చదివినప్పుడు. ఇంకో విశేషం ‘కృతికర్తగా’ కవిత కింద పిరదౌసి అని రాయడం. దైవాన్ని ప్రకృతిలోని చర్యలలో భాగంగా చిత్రించిన ‘విత్తనంబున మహా వృక్షంబు నిమిడించి’ పద్యం తర్వాత కాలంలో ఎన్నో సినిమా పాటలకు బీజ భూతంగా మారింది. ‘కవిని గన్నతల్లి గర్భంబు ధన్యంబు’ అన్న పద్యం, ‘క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప’ అన్న పద్యం ‘వసుధ శాసింప గల సార్వభౌముడగును’ అన్న పద్యం జాషువా ‘షానామా’ ఘనతను ఉద్దీపించే ఉద్దేశ్యంతో అత్యంత శ్రద్ధగా రాసినవి. ‘షానామా ఎంత లోతుగా రాసి ఉంటాడో చెప్పడానికి ‘పారశీక గ్రంథ భండారమునెల్ల’, ‘వాని డెందంబు సోకిపోవని తలపులు’, ‘శాసనములన్ని పరికించి’ పద్యాలు అల్లాడు. షానామా నిజంగా అంతటి నిసర్గ, విస్తార, చారిత్రాత్మక, కవితాత్మక మహా పురాణం అని జాషువా ఉద్దేశ్యం. అందుకే అంతటి లోతైన పద్యంతో దాన్ని ధ్వనింపజేశాడు.

అన్యదేశ్యాలను తెలుగులో కలపడంలో జాషువా తర్వాతే ఎవరైనా.

తొలి పద్యంలో

‘మును గజనీ మహమ్మదు డభూత పరాక్రమశాలి’

అని; మరోచోట

‘క్రమమొప్పన్ సులతాను మేడల నగారా మ్రోగె’

అని; ఇంకోచోట

‘నా హోట నాదముల నిండే మజీదు, లాఫ్ఘనుల స్కంధావార మందాట గుర్రము’

అని; ఇంకో పద్యంలో

‘పాదుషా తోడ నతని దర్బారుసీమ

అని ఉర్దూ, ఫార్సీ పదాలను అలవోకగా తెలుగు మాటను చేసి వేసాడు జాషువా. తయారు, హుక్కా, కూనీ, సబక్తజీను లాంటి పదాలు డజన్లకొద్దీ ఇందులో ఇముడ్చాడు.

లోకోక్తులు, నుడికారాలు, తెలుగుదనం ఉట్టిపడే పదరాశి జాషువాకు వెన్నతోనే వచ్చింది. ‘సిరి నిజంబుగ వట్టి టక్కరిది సుమ్ము’ అంటాడొక చోట, ‘నరుని సుఖదుఃఖములందు నడిచి వచ్చు నీడలే స్వప్నములు అని ఒక చోట గంభీరమైన అర్థంలో ప్రయోగించాడు. తెలుగు పద బంధాలు చాలా విన సొంపైనవి చాలా ఉన్నాయి పిరదౌసిలో. “తొమ్మిది వన్నెల రాత్నరాసులన్”, “లొట్ట పిట్టల మిద దిట్ట పరచి’, ‘తోసుకొనివచ్చు తలపు గుంపులు’ లాంటి అపురూపమైన పద ప్రయోగాలు పిరదౌసిలో చాలాఉన్నాయి. పద్య నిర్మాణ సొబుగులో జాషువాది తనదైన విలక్షణ వైఖరి. అయన ధారలో చాలా సహజసిద్ధంగా యతి, ప్రాసయతి అలవోకగా పడిపోతుంటాయి. ఈ సొగసు పిరదౌసిలో ఏ పద్యంలోనైనా కనిపిస్తుంది.

తెలుగు సాహిత్యంలో వచన కవిత్వం అరంభమయ్యాక వచ్చిన పద్యకావ్యానాలలో పిరదౌసి శ్రేష్ట కావ్యం. వచనకవిత్వం పట్ల గౌరవం లేని జాషువా పద్యంలో ఎలా ఎలా ఆటలాడవచ్చో, కథాకావ్యానికి అదెంతగా ఒదుగుతుందో పిరదౌసిలో ఆచారణాత్మకంగా నిరూపించాడు. పిరదౌసి ఒక కరుణ రస ప్రవాహం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com