“మీ కొత్త కోడల్ని ఎప్పుడు తీసుకొస్తున్నారు సుశీలమ్మ గారు” అంటూ వచ్చింది వరలక్ష్మమ్మ సుశీలమ్మ ఇంటికి. “రండి… రండి… వరలక్ష్మమ్మ గారు… ఎక్కడికో వెళ్ళిస్తున్నట్టున్నారు….” అంది సుశీలమ్మ.

“ఈ కరోనా టైమ్ లో ఎక్కడికీ వెళ్ళేట్టు లేదుకదమ్మా! ఇంట్లోనే ఖైదీలమైపోయాం కదా… హౌస్ అరెస్టంటే ఇదేనేమో…” అంది వరలక్ష్మమ్మ.

– ‘ఔనౌను… ఎక్కడికీ వెళ్ళేట్టు లేదు. ఎవరింటికైనా కాస్సేపు కబుర్లు చెప్పుకుందామని వెళ్తే “కరోనా టైమ్ లో వీళ్ళెందుకొచ్చారన్నట్టు”గా చూస్తున్నారు… ఎన్నో జబ్బుల్ని చూశాం గానీ ఇలాంటి పాడు జబ్బునెప్పుడూ కనీవినీ యెరుగమమ్మా… ఎన్నోసార్లు నేనోసారి వరలక్ష్మమ్మ గారింటికి వెళ్ళేద్దామని అనుకున్నాను. కానీ మీరేమనుకుంటారో అనుకొని రాలేదు” అంది సుశీలమ్మ

“నేనేమీ అనుకోను లెండి! ఇరుగుపొరుగు అన్నాక ఒకర్నొకరం కలుసుకొని వ్యధ కధ చెప్పుకోకపోతే ఎలా? అని నేనూ ఎన్నోసార్లు అనుకున్నాను. ఈ పాపిష్టి జబ్బొచ్చి ఎవరమూ ఎవరికీ కాకుండా పోయాం ” అంది వరలక్ష్మమ్మ.

ఇద్దరూ సుశీలమ్మ వాళ్ళ డ్రాయింగ్ రూంలో కూర్చొని మాట్లాడుకోసాగారు.

“మీ అవినాష్ పెళ్ళయి ఐదారు నెల్లయినట్టుంది కదూ! ఈ పాపిష్టి కరోనా రాకముందే మీవాడి పెళ్ళి అయిపోవటం మీ అదృష్టమమ్మా! ఈ రోజుల్లో అయితే మీవాడి పెళ్ళిని అంత గ్రాండ్ గా చేసేవారు కాదనుకుంటాను…” అంది వరలక్ష్మమ్మ.

“మీరన్నది నిజమే వరలక్ష్మమ్మ గారూ! మా బంధువర్గం చాలా పెద్దదే! బంధువర్గంతో పాటు మావాడి ఫ్రెండ్స్… మా ఆయన ఫ్రెండ్స్… అందరూ వచ్చారు. వెయ్యిమంది దాకా భోజనాలు చేశారు. ఈ రోజుల్లో అయితే ఓ వందమంది కూడా వచ్చేవాళ్ళు కాదు…” అంది సుశీలమ్మ.

“నిజమే లెండి! పెళ్ళయి నాల్గునెల్లయినా మీ కోడల్ని తీసుకురాలేదేమిటి?” అంది వరలక్ష్మమ్మ.

“మా కోడలు బి.టెక్. చదువుతోంది కదా… ఫైనలియర్ పరీక్షలయ్యేదాకా రాదని పెళ్ళికి ముందే చెప్పారులెండి… ఈ పాడు కరోనా చెయ్యబట్టి ఎప్పుడో జరగాల్సిన ఆ పరీక్షలు వాయిదా పడ్డాయట… అయితే మొన్ననే ఆ పరీక్షలు ఆన్ లైన్ లోనే జరిగాయట… అదేం చిత్రమో… ఇంట్లో కూర్చొనే కంప్యూటర్ ముందు పెట్టుకొని పరీక్షలు రాసెయ్యొచ్చట…” అంది సుశీలమ్మ.

“ఔనమ్మా… ఇప్పటోళ్ళంతా కంప్యూటర్లు… ల్యాప్ టాప్ లు… స్మార్ట్ ఫోన్లు…. స్మార్ట్ టీవీలతోటే కాలం గడుపుతున్నారు… కాస్సేపయినా మనతో మామూలుగా మాట్లాడుతున్నారా? వాళ్ళదో లోకం… మనదో లోకం… మా అమ్మాయి కూడా ఈ సంవత్సరమే బి.టెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి జాబ్ లో జాయినయింది. ఎప్పుడూ దానికి కంప్యూటర్తోటే పని… ఓ మాటాలేదు… ముచ్చటా లేదు…” అంది వరలక్ష్మమ్మ.

‘ఇప్పటోళ్ళు ముప్ఫయేళ్ళొచ్చినా పెళ్ళి చేసుకోవటం లేదు. మా పెద్దమ్మాయి హైద్రాబాదులో చదువుతోంది. 28 యేళ్ళాచ్చాయి. పెళ్ళెప్పుడు చేసుకుంటావే అంటే గయ్యిమని లేస్తోంది… అప్పుడే పెళ్ళేంటని… పెళ్ళన్నా, పిల్లలన్నా వీళ్ళు మహా చిరాకు పడిపోతున్నారు….” అంది సుశీలమ్మ.

వాళ్ళిద్దరూ ఇలా మాస్కులు పెట్టుకునే చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు. “అయితే తొందర్లోనే మీ కోడల్ని తీసుకొస్తారన్నమాట…!” అంది వరలక్ష్మమ్మ.

“యేమోనమ్మా… మనం వాళ్ళకేమన్నా చెప్పేటట్టుందా? మావాడు గచ్చిబౌలీలో యేదో పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు కదా! రోజూ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు… మావాడు మొన్ననే వాళ్ళ నాన్నగార్ని ‘మంచి రోజులెప్పుడు?” అని అడిగాడు. ‘ఎందుకురా?’ అంటే ‘నందినిని తీసుకొద్దామనుకుంటున్నాను’ అన్నాడు.

‘పరీక్షలయిపోయాయా?’ అని వాళ్ళ నాన్న అడిగితే ‘పదిరోజుల క్రితమే అయిపోయాయ’న్నాడు మా అవినాష్ గాడు. మా ఆయన అయ్యగార్ని అడిగితే ఈనెల పదో తేదీ మంచిది అని చెప్పాడట… బహుశాః అప్పుడు తీసికొచ్చుకుంటాడేమో…”

“పదో తారీకంటె ఇంకో వారం రోజులున్నట్టుంది. కోడలొస్తే మీ పనిభారం చాలా తగ్గుతుందిలే…” అంది వరలక్ష్మమ్మ.

“యేం తగ్గుతుందో యేమో… ఈరోజుల్లో కోడళ్ళు పనిచేస్తారా? మనతోటే పని చేయిస్తారు” అంది సుశీల. “అదీ నిజమే లెండి! ఇది కోడళ్ళ రాజ్యం కదా!” అంటూ వరలక్ష్మమ్మ వెళ్ళటానికని లేచింది. “మా ఆయన ఆఫీసు నుండి వచ్చే టైమయింది… వెళ్ళిస్తానమ్మ… కరోనా కాస్త తగ్గిందంటున్నారు కదా… మీరూ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండండి… ఇలాగే కాస్సేపు కబుర్లు చెప్పుకుందాం” అంటూ “వెళ్ళిస్తా” అని చెప్పి వరలక్ష్మమ్మ వెళ్ళిపోయింది.

అనుకున్నట్టుగానే సుశీలమ్మ కొడుకు అవినాష్ మంచిరోజు చూసుకొని భార్యను తీసుకొని వచ్చాడు. నందిని తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు.

రోజూ ఉదయం తొమ్మిదింటికల్లా సుశీలమ్మ భర్త, కొడుకు వాళ్ళు పనిచేస్తున్న ఆఫీసులకు వెళ్ళిపోతుండేవాళ్ళు. వాళ్ళ కూతురేమో ఇంట్లోనే ఉండి కంప్యూటర్ ద్వారా పనిచేసుకునేది.

ఇంట్లో సుశీల, నందిని, సువర్ణ – ముగ్గురే ఉంటుండేవాళ్ళు. పనిమనిషి వచ్చి అంట్లు తోమటం, ఇల్లు ఊడ్వటం, బట్టలుతకటం లాంటి పనులు చేసి వెళ్ళిపోతుండేది.

వాళ్ళ కోడలు నందిని రోజూ తొమ్మిదింటి దాకా పక్కమీది నుండి లేచేదే కాదు. కూతురు సువర్ణ ఎనిమిదింటి కల్లా లేచి కంప్యూటర్ ముందు కూర్చునేది. కోడల్ని తను వెళ్ళి లేపుదామంటే సుశీలకు భయమేసేది. బాగా గారాబంగా పెరిగిన పిల్ల… “అత్తారింటికొచ్చి అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొంచెం ఆలస్యం అవుతుందిలే” అనుకుంది.

కొడుక్కు భర్తకు, కూతురికి టిఫిన్లు, కాఫీలు అందించి, భర్తకు కొడుక్కేమో లంబ్లీ బాక్సులు ప్రిపేర్ చేసివ్వటానికి కోడలేమన్నా సహాయం చేస్తుందేమోనని సుశీల ఆశపడింది. వచ్చి రెండు వారాలైనా అలాంటిదేమీ జరగలేదు.

ఒకరోజు భర్తతో “కోడలమ్మ రోజూ తొమ్మిదింటి దాకా లేవడం లేదు. చిన్నచిన్న పనిలేమన్నా చేస్తుందేమోననుకుంటే యేమీ చెయ్యటం లేదు” అంది సుశీల.

“నువ్వు పని చెబితేకదా ఆమె చేసేది… నువ్వేమీ చెప్పకుంటే ఆమె యేం చేస్తుంది…” అన్నాడామె భర్త పరమేశ్వరరావు.

“అదసలు పక్కమీంచి లేవందే యేం చెప్పను?” అంది సుశీల.

“లేవకపోతే లేపాలి. కోడలన్నప్పుడు తన బాధ్యతను తెలుసుకోకపోతే ఎలా? కోడలంటే ఎందుకంత భయపడ్తున్నావు…” అన్నాడామె భర్త.

“భయపడటం లేదండి… గారాబాల పిల్ల కదా… యేమంటే యేం తప్పోనని ఆలోచిస్తున్నా…” “ఇలాగే ఆలోచిస్తూ కూర్చోకు…. రోజూ కనీసం యేడింటికల్లా లేవాలని చెప్పు… ప్రతిరోజూ మార్నింగ్ మీ ఆయన్ను, మా ఆయన్ను వాళ్ళ ఆఫీసులకు పంపించటానికి నాకు చాలా కష్టమౌతున్నదని చెప్పు” అంటూ పరమేశ్వరరావు ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

ఆ మర్నాటి నుండి సుశీల నందినిని యేడింటికే లేపడం మొదలెట్టింది. చిన్నచిన్న పనులు చెయ్యమని చాలా మొహమాట పడ్డూనే చెప్పసాగింది. కూరగాయలు కోసి పెట్టమనో, బాక్సులు రెడీ చెయ్యమనో, ఆమె భర్త స్నానం చేసి వచ్చాక అతనికి కావలసినవి అందించమనో చెబుతుండేది. అప్పుడప్పుడు పనిమనిషి రానప్పుడు “ఇద్దరం కలిసి అంట్లు తోముకుందామని, బట్టలు పిండుకుందామ”ని చెప్పేది. “ఇల్లు ఊడ్చేపని కూడా నువ్వే చెయ్యా”లని చెప్పేది. ఇలా

అత్తగారు పని చెప్పినప్పుడల్లా నందినికి చిరాకు వేసేంది. ఇలాంటి పనుల్ని తన తల్లిగారింట్లో ఎన్నడూ చెయ్యలేదు. వాళ్ళమ్మ ఆమెతో ఎన్నడూ ఇలాంటి పనులు చేయించలేదు. “అత్త అయినంత మాత్రాన ఈమె తనతో ఇలాంటి చెత్తపనుల్ని చేయించటం యేమిటి?” అనుకునేది నందిని.

బి.టెక్. రిజల్ట్సు రాగానే తను యేదన్నా ఉద్యోగం చూసుకొని తన భర్త, మామలాగే ఆఫీసులకు వెళ్ళిపోవాలి. సాయంత్రం దాకా మళ్ళీ ఈ ఇంటి మొఖం చూడొదు” అనుకునేది. ఆడబిడ సువర్ల కూడా ఇంట్లో ఉండే ఉద్యోగం చేస్తున్నది. ఆమె కంప్యూటరూం విడిచి బయటికి రాదు. అత్తగారు ఆమెకేమీ పని చెప్పదు. వంట పనంతా సుశీలే చేసేది. కూరగాయల్ని శుభ్రం చేసి కోసిచ్చే పని మాత్రం నందిని చేసేది. పనిమనిషి రానిరోజు అతికష్టంగా ఇల్లు ఊడ్చినట్టు చేసేది. కొంచెం తీరిక దొరకగానే తన బెడ్ రూంలోకెళ్ళి యేదన్నా టీ.వీ. సీరియలో, సినిమానో పెట్టుకొని గానీ, లేదా యేదన్నా పుస్తకమో, ఆరోజొచ్చిన పేపరో చదువుతూ పడుకునేది. సువర్ణ, నందిని ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్ళు కారు. తన కూతురి పెళ్ళని చెప్పి పనిమనిషి వారం రోజులదాకా రానని చెప్పింది. అసలు కరోనా వచ్చినప్పట్నించి వాళ్ళ పనిమనిషి ఇదివరకటిలా రావడమే లేదు. బస్సులు బంధయినప్పుడైతే అస్సలు రాకపోయేది. యే పుట్టలో యే పాముందో అన్నట్టు ఎవర్ని ముట్టుకుంటే ఈ కరోనా మనకొస్తుందేమోనని అందరూ ఇంట్లోంచి బయటకు రావటం పూర్తిగా మానేశారు. “ఈ పాడు జబ్బేమన్నా తగ్గినట్టనిపిస్తే వస్తా… అప్పటిదాకా రాను” అని చెప్పేది వాళ్ళ పనిమనిషి. ఈ మధ్యనే కరోనా కాస్త తగ్గటం, బస్సులు మళ్ళీ తిరగటం వల్ల పనిమనిషి వస్తోంది.

వాళ్ళ పనిమనిషి కూతురి పెళ్ళని చెప్పినప్పట్నించి నందిని మీద పనిభారం ఎక్కువైంది. అంట్లు తోమటం, బట్టలుతకటం, ఇల్లంతా ఊడ్వటం… ఇవన్నీ నందినిని చెయ్యమని వాళ్ళ అత్తగారు చెబుతుండేది. అత్తగారు పని చెప్పినప్పుడల్లా నందినికి భలే కోపమొచ్చేది. “నాకేమో ఇన్ని పనులు చెప్పడానికి ఈమెకీ అధికారం ఎవరిచ్చారు. అత్తయినంత మాత్రాన ఈమె అనుక్షణం నామీద పెత్తనం చెయ్యటమేనా? ఆమె కూతురికి ఏపనీ చెప్పదెందుకని? ఆమెక్కూడా యేదన్నా పని చెప్పొచ్చుకదా!” అనుకునేది. .

ఒకరోజు భర్తతో “ఈ పనులన్నీ చెయ్యటం నాకు రాదండి… నన్ను మా పుట్టింట్లో దింపిరండి… నేను మీ అమ్మగారితో వేగలేను…” అంది నందిని.

“పనులన్నీ రావంటే ఎలా? ఎలా చెయ్యాలో అమ్మ చెబుతుంది. నేర్చుకోవాలి… పరిస్థితులను బట్టి మనం మారాలి… అడ్జస్ట్మెంట్ అంటారు. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. ఆమెతో వేగలేనని, పుట్టింటికి పోతానంటావా? బుద్దుండే మాట్లాడుతున్నావా? పెళ్ళయ్యాక అత్తగారిల్లే సర్వస్వం అనుకోవాలి. అత్తన్నప్పుడు యేదో ఒకపని చెబుతుంది. తను కూడా చాలా పనులు చేసూనే ఉందికదా! పనుల్ని ఇదరూ షేర్ చేసుకోవాలి. నథింగ్ రాంగ్ ఇంట్… మన పని మనం చేసుకోవటంలో ఎలాంటి తప్పులేదు. ఎప్పుడూ పనిమనుషుల మీదనే ఆధారపడ్డే ఎలా? ఇండియా కాబట్టి పనిమనిషులు దొరుకుతారు… అదే అమెరికా లాంటి దేశంలో అయితే పనిమనుషులే దొరకరు… పనులన్నీ మనమే చేసుకోవాలి…” అన్నాడామె భర్త.

“తెలుసు” అంటూ మూతి మూడు వంకర్లు తిప్పిందామె.

వాళ్ళింట్లో అంట్లు తోమటం, ఇల్లు ఊడ్చటం లాంటి మామూలు పనులు చెయ్యటానికో పనిమనిషుంటే, వాళ్ళింట్లోని టాయిలెట్స్ క్లీన్ చేసిపోవటానికి వారంలో రెండు రోజులకొకసారొచ్చే వేరే పనిమనిషి కూడా ఉండేవాడు. మామూలు పనిమనిషి రావటం ఆగిపోయాక టాయిలెట్స్ క్లీన్ చెయ్యటానికొచ్చే టాయిలెట్ క్లీనర్ కూడా వారం రోజులు రావటం నాకు వీలుకాదని, తన కూతుర్ని హాస్పిటల్ లో కరోనా కారణంగా జాయినం చేశారని చెప్పాడు.

“మన టాయిలెట్స్ మనమే క్లీన్ చేసుకోవలసిన గడ్డు పరిస్థితొచ్చింది…” అంది సుశీల నందినితో. “ఈ వారం రోజులకు వేరే క్లీనర్ ని చూడండి” అంది నందిని.

“ఈ కరోనా రోజుల్లో కేవలం వారం రోజులకోసం వేరే క్లీనర్ మాత్రం ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు? మనమే ఎలాగో ఆ పనికూడా చేసుకోవాలి” అంది సుశీల.

ఆరోజు నందిని భర్తతో “మీ అమ్మ నన్ను టాయిలెట్స్ ని కూడా క్లీన్ చెయ్యమంటోంది… చూశారా?” అంది. “చెప్పానుగా… మనపని మనం చేసుకోవటంలో తప్పేముంది…”

“మీరిలాంటి నీతులు నాకు చెప్పకండి… వేరే ఎవరినైనా చూడండి” అంది నందిని. “ఇంత అకస్మాత్తుగా వేరే క్లీనర్ ఎవరూ దొరకరు నందినీ!” అన్నాడామె భర్త. “అయితే మీ అమ్మనే ఆ క్లీన్ చేసే పని చేసుకొమ్మనండి… నేను మాత్రం ఆ పని చెయ్యలేను” అంది నందిని.

“మా అమ్మకు డెబ్బైయేర్ళొచ్చాయి… అతికష్టంగా కొన్ని పనులు చెయ్యగల్గుతోంది… ఆమె టాయిలెట్స్ క్లీన్ చేసే పని చెయ్యలేదు. ఆమె అసలు సరిగ్గా నడవలేకపోతోంది… బాత్ రూంలో జారిపడిందంటే ఆమె పని క్లోజ్! వృద్ధాప్యంలో కాలో, చెయ్యో, తొంటో ఫ్రాక్చరయ్యిందంటే వాళ్ళక కోలుకోరు… కొద్దిరోజులు ఎలాగో నువ్వే ఆ పని చెయ్యక తప్పదు నందిని… అర్థం చేసుకో” అన్నాడామె భర్త.

“నన్ను… నన్ను… టాయిలెట్స్ క్లీన్ చెయ్యమంటారా? నేనెవరనుకొని మాట్లాడుతున్నారు మీరు? మీ కంటికి, మీ అమ్మ కంటికి నేనింత చులకనైపోయానా?” అంటూనే ఆమె విసురుగా వాళ్ళ బెడ్ రూంలో కెళ్ళిపోయింది. ఆరోజంతా ఆమె ఆ రూంలోంచి బయటకు రాలేదు. రెండుపూటలా భోజనానికి రాలేదు. అత్త వెళ్ళి “భోజనం చేద్దువు రమ్మ”ని బతిమాలింది. అయినా ఆమె “నాకాకలిగా లేదు” అని మొండికేసింది.

ఆ రాత్రంతా ఆమె భర్తతో యేమీ మాట్లాడలేదు. అతడు కూడా ఆమెను పలకరించకుండానే పడుకొని నిద్రపోయాడు. తనను వాళ్ళు టాయిలెట్స ను క్లీన్ చెయ్యమని చెప్పిన మాట ఆమె బుర్రలో అనుక్షణం గిర్రున తిరగసాగింది.

ఆమె రెండ్రోజుల వరకు తన రూంలోంచి బయటకు రాలేదు. వాళ్ళ నాన్నగార్కి, అమ్మగార్కి, క్లోజ్ ఫ్రెండ్కు ఫోన్లు చేసుకుంది. మూడోరోజు ఉదయం సూట్ కేసు సర్దుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది. అత్తగారు “ఇలా అకస్మాత్తుగా వెళ్ళిద్దు… నువ్వేమీ టాయిలెట్స్ క్లీన్ చెయ్యొద్దులే… నేనే చేస్తాలే… ఈ లోపల క్లీన్ చేసేవాడెవరన్నా దొరక్కపోడు… పెళ్ళయిన ఆర్నెల్లకే కోడలు ఇలా వెళ్ళిపోతే ఎంత అప్రతిష్ట… లోకం యేమనుకుంటుంది… నువ్వు వెళ్ళిద్దు నందినీ” అని కాళ్ళావేళ్ళా బతిమాలి ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఆగలేదు. ఇప్పుడు టాయిలెట్స్ క్లీన్ చెయ్యమన్నారు… రేపు ఇంకేం చెబుతారో, ఇంకెంత హీనంగా చూస్తారో” అనుకుందామె.

ఆమె వెళ్ళిపోయిన నెల రోజుల తర్వాత పోలీసు స్టేషన్ నుండి ఆమె భర్తకో ఫోనొచ్చింది.

“మీ ఆవిడ మీమీద గృహహింస కేసు పెట్టింది… నువ్వూ, మీ అమ్మా, మీ నాన్నా, మీ చెల్లెలు… అందరూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పోలీసు స్టేషన్ కు రావలసి ఉంటుంది” అన్నాడు ఆ ఫోన్ చేసిన సర్కిల్ ఇన్ స్పెక్టర్.

అతడు స్తంభించిపోయాడు. నందినిని తను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇంతపని చేస్తుందా?

రెండేళ్ళదాకా ఆ కేసు నత్తనడక నడుస్తూ సాగుతూనే ఉంది. చివరకు ఆమెకో 10 లక్షల అలిమనీ ఇచ్చి పరస్పర అంగీకారంతో వాళ్ళు విడాకులు తీసుకోవటానికి నిర్ణయమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com