“ఏం రాజమ్మత్తా ! బాగున్నవా గట్ల కూసున్నవేంది బుగులుగా, ఒంట్లో బాగుండలేదా?“…

“ఎవరే ! బుచ్చమ్మనా? బాగేముంది బిడ్డా, గిట్లున్న సూడు! మీ చిలకమ్మత్త కనబడ్తలేదేమే ?!” ఆరా తీసింది రాజమ్మవ్వ .

“మంచం దిగేటట్టున్నాది ఆమెకు. పచ్చవాతం పట్టుకున్నపట్నుంచి ఇంటి గడప దాటితే కదా ముసల్ది. పానానికి పెద్ద యాష్టయి పాయె. చెయ్యలేక , సూడలేక సస్తున్న. తప్పేటట్టున్నాది.!” అంది బుచ్చమ్మ కాస్త విసుగు, అసహనం కలగలిపి.

“గట్లoటవేందే? పెద్ద పానం, అందరికీ వూడిగం చేసి చేసి గీ పొద్దుకు చేరింది ముసల్ది. దాని చేతుల ఉందా! దాని రాత , కర్మ ఎట్ల కాలిందో అట్లనే తీర్తది, తీ రాదు!..” అంటూ రాజమ్మ సర్ది చెప్పింది .

“అంతేలే, మన చేతులున్నాది . పొద్దెక్కింది వస్త. కాంటకు పోవాలత్తా. వడ్ల బస్తాలొచ్చినయంట, గీ పిల్ల జానమ్మ ఇంట్ల ఉందో లేదో ? తోల్కొని పోదామని చూస్తున్న?“ అంటూ ముందు సందుల కెళ్ళి పోయింది బుచ్చమ్మ.

అరుగు మీద కూచోనున్న రాజమ్మకు బుచ్చమ్మ పిలుపుతో తెగిపోయిన జ్ఞాపకాలు మళ్ళీ అతుక్కున్నాయి .

అరుగు మీద కూచోవడం ఈ రోజు కొత్తేమి కాదు. గత డెబ్భై సంవత్సరాలనుండి ఈ అరుగు తోటి అనుబంధం. పిల్లలు మాట్లాడుకోంగ విన్నది గాని తనకి ఎనభై రెండేళ్లు దాటినయని తెలిసేది కాదు. ఈ ఇంటికి పది, పదకొండేళ్ల వయసులో పెళ్ళై కొత్తకోడలిగా వచ్చినప్పటినుంచి ఈ అరుగుతో సంబంధం. వచ్చిన కొత్తలో అరుగు అరుగులా వుండేది కాదు. మట్టి దిబ్బలా వుండేది. దాన్నే ఎప్పటికప్పుడు చదును చేసి పేడ, ఎర్ర మట్టితో అలికి ముగ్గులేసి అలంకరించేది. ఇంటి ముందు భాగం డoగు సున్నం తో కట్టిన అర్రలు, వెనుక వైపు కవేలి కప్పుతో, మట్టి గోడలతో కట్టిన వంటిల్లు, జాలాట్ల తోటి విశాలం గానే ఉంటుంది. ఇంటిమధ్యలో కాస్త ఖాళీ జాగా అక్కడినుంచి పైకి సిడీలు , సిడీల పక్కనే మోరీ. మోరీ దగ్గర తానాలకు, కాళ్ళు చేతులు కడుక్కోడానికి పరిచిన గ్రనైటు బండ పక్కనే సిమెంటు గోలెం, ఇత్తడి గంగాళం నీళ్లతో నిండి ఉండేవి. ఇప్పటిలా అప్పుడు శాబాదు బండలు పరిచి వుండేవి కావు, అంతా మట్టి నేల. అలుకు పూత చేయాల్సిందే .

రాజమ్మ కూర్చున్న ఆ ఇంటి అరుగు పెద్ద చరిత్ర కలిగినది. ఎండాకాలo సాయంకాలాల్లో పిల్లలకు ఆట మైదానం, చీకటి పడ్డ తరువాత ఆడ పిల్లలకు చెమ్మ చక్కాలాటలకు, కాళ్ళగజ్జ .. ఆటలకు రంగస్థలం . పెద్ద ఆరిందాలకు బాతఖాని చోటు. ఎన్ని పెళ్లిళ్లకు గద్దె అయ్యింది. ఎన్ని చివరి స్నానాలకు పీటమయ్యింది. ఎన్ని జ్ఞాపకాల మూటలు విప్పి పరుచుకున్న చద్దెర ఈ అరుగు. వీటన్నింటికి సజీవ సాక్ష్యాలు అరుగుకు రెండు వైపులా వున్న ఆ వేప చెట్లు. అరుగుకు, వేప చెట్లకు అక్కా చెల్లెళ్ళ బంధం. అరుగు రూపుదిద్దుకున్న ఆరు నెల్లకే చెట్లు నాటుకున్నయి. కాలంతో పాటు అరుగు ఎత్తు వెడల్పు పెరిగింది. రాజమ్మ పెళ్ళైన కొత్తలో సాన్పి తానమాడేది అరుగు. మెల్లమెల్లగా ఎర్ర మన్ను, పేడతో అలుకు పెట్టించుకుని ముగ్గులు వేయించుకుంది . రాజమ్మలాగే అరుగు అలంకారాలు చేసుకుంటూ వుండేది. కాలం మారింది. సంసారం రొంపిలో రాజమ్మ బండబారింది. మట్టి అరుగు మీద శాబాదు బండలు పరుచుకున్నయి. అరుగు మీద ఇప్పుడు సాన్పి లేదు, అలుకు పూత లేదు. ముగ్గులు లేవు. రాజమ్మ ఒంటిమీద అలంకారాలు లేవు. పెనిమిటి కాలం చేసి ఇరవై సంవత్సరాలకు పైనే దాటింది.

నెమ్మదిగా సూర్యుడు నెత్తిపై కొస్తుండు. ఎండ సెగ పెరిగింది . రాజమ్మ చూపు, మనసు వేపచెట్ల పైకి మళ్లింది. రెండు వేపచెట్లు. గంభీరంగా అరుగుకు రెండు వైపులా చివరంచున నిలబడివున్నయి. పెళ్ళైన కొత్తలో ఈ ఇంటికొచ్చినపుడు మామ వెంకోజి మహా ఇగురంగ నాటిండు. “ వేపచెట్లు నాటుకుంటున్నవేందయ్యా సుతారంగా! “ యని అత్త గొణుక్కు నేది మనసులోనే.

“ వేపచెట్టు గాలి, నీడ సోకితే ఒంటికి, ఆరోగ్యానికి మంచిదే పిచ్చిదానా, నీకేం తెలుసు గాని పొద్దుగాల, పొద్దుమీకి గిన్ని నీళ్లు పోస్తే అవే పానం పోసుకొని నిలబడతయి. కోడలు పిల్లకు చెప్పు మేకలు తినకుండా జాగ్రత్త పడమని ..” అంటూ మామ చెప్పుకొచ్చేది .

మట్టి గోడల్తోటి కట్టినా ఇల్లు పెద్దగానే ఉండేది. వెనకాల పెద్ద దొడ్డి కట్టి మామ అండ్ల యాటల్నితెచ్చి వదిలేటోడు. మర్క పిల్లలు , గొర్రె పిల్లల్ని గట్ల గాలి కొదిలేస్తే వాకిట్లోకొచ్చి తిరిగేవి. నాటిన వేప మొక్కల్ని యాడ మేస్తయోనన్న భయం. ఆగలేక దొడ్ల వున్న పాత తడికల్ని తెచ్చి గుండ్రంగ సుట్టి సుత్లీ తాడుతో గట్టిగ కట్టి మొక్కల చుట్టూ గింత లోతు మట్టి తీసి నిలబెట్టిన అడ్డంగా. ఎట్ల కాలం తిరిగిందో తెల్వదు గాని చెట్లు గట్టిగనే నాటుకున్నాయి . ఆడపిల్లలు , మగ పోరగాళ్ళు పెరుగుతుండ్రు. వేపచెట్లు పెరుగుతున్నయి . పిల్లల సాదుడు బరువు ఎక్కువయిపోతుండే. అప్పుడు ఆ కాలంల మగ పిల్లల చదువులకు అంత తండ్లాట లేదు గాని ఆడపిల్లల పెళ్లిళ్లకు యాతనై పోయేది. నల్లగొండ అంత పెద్ద టౌను కాదు. గట్లని చిన్న వూరు కాదు . గిప్పుడంటే దగ్గర దగ్గర పల్లెలు కలిసినట్లయిపాయె . రోడ్లు పడ్డయి. బస్సులొచ్చినయి గాని , అప్పుడున్న చుట్టుపక్కల వూర్లంటే పేర్లకు వూర్లు. పానగల్లు, గొల్లగూడెం, మర్రిగూడెం, చర్లపల్లి, గట్ల ముందుకు పోతే ఎల్లారెడ్డిగూడెం. గీ వూరు దాటక పోదుము. పెద్దగట్టు, చెర్వుగట్టు జాతరల పుణ్యమాని బయటికెళ్లుడు తప్పితే ఇంటి చాకిరి తోటే పొద్దు గడిచిపోయేది. పెద్దపిల్ల రాంబాయమ్మ పెళ్లీడుకు, వేర్లు బలిసి మనిషెత్తు పెరిగిన చెట్లు గ్యాపకమే. పచ్చగా కొమ్మల లేత మండల తోటి కళ కళ లాడుతుండేవి . రాంబాయమ్మ పెళ్ళి సందట్ల బోనాలు జరిపితే బోనం కుండ మీద ఈ వేపచెట్ల మండలే తెంపి పెడ్తిమి . సాకబోసిన కాడ , దర్వాజ తోరణాలు కట్టిన కాడ ఈ చెట్ల కొమ్మలే పనికొచ్చే. ఎంత సంబురమంటే మా కన్నా ఆ చెట్లే మురిసినట్లు కనబడేవి గావూ ! యాది కొస్తే పానం గిలగిల్లాడ్తది . ఒక్క పెళ్లిళ్లు పేరంటాలకేనా , బోనాల పండక్కి అరుగు వేపచెట్లే దిక్కు. ఇప్పటి మాటా, యాభై ,అరవై యేండ్ల కిందటి మాట. ఎండకాలం వస్తే రాత్రి అరుగు మీద వేపచెట్ల కిందే మగోళ్ళందరికీ పడక. పగటి గాడ్పుకి పోయిన పానం ఈ చెట్ల గాలికి తిరిగొచ్చేది . గాడ్పంటే మామూలు గాడ్పు కాదు . పక్కనున్న లతీఫ్ షా వలి గుట్ట రాళ్లు, పరుపు బండలన్నీ వేడెక్కి సెగనెగదోసేయి. అరుగు మీదే ఓ మూలకు జాగా చేసుకొని పక్క సందులోని గౌండ్ల పోరగాళ్ళు కూడా పక్కేసుకునేది .

“ఎండ పొద్దెక్కింది అన్నం తింటావమ్మా?” కోడలు పిలవంగనే యాదిలకెళ్లి బయటికొచ్చింది రాజమ్మ .

“వస్తున్న పెట్టు“ – అన్నది ముభావంగా.

మనుషుల మీదే మనసిరిగిపోయింది. ఆకలి సోయి వుండటమే లేదు. కళ్ళముందు పిల్లలు తిర్గాడిన ఆత్మకు తృప్తి లేదు. పిల్లలెదురుగానే వున్నా ఎడం వుంటుంది. ఎవ్వడూ సక్కగ మాట్లాడడు . మందలించడు . మాట వరసకి ‘తిన్నవా అంటే తిన్న’ అంతె. యాడికి పోయింది గా మనుషుల మాట తీరు, మర్యాద. ఎక్కడ చూసినా డొల్లతనమే. సంసారం చేసినన్నాళ్లు ఇంట్ల ప్రతి ఒక్క వస్తువు జవాబిచ్చేది – గోలెం, గంగాళాలు, చెంబులు, గిన్నెలు, అంట్లు ఇరవై నాల్గు గంటలు వీటి తోటే బత్కు తెల్లారే. తెల్లారక ముందే చీకట్లనే ఇంటి చుట్టూ వున్న రెండు వాకిళ్లు ఊడ్చి సాన్పి చల్లి సుబ్బరంగా వున్నదాన్ని కంటినిండా చూసుకొని మురిసిపోయేదాన్ని. ఎండకాలమైతే వేప చెట్ల గాలి చల్లదనం పానానికి హాయినిస్తూ వుంటే చెట్ల మొదళ్ళ చుట్టూ శుభ్రం చేసి అలికి గొలుసు ముగ్గు వేస్తె అది వాకిట్లో వున్న పందిరి ముగ్గు తోటి పోటీ పడి నవ్వుకునేది.

ఓ రోజు ఉన్నట్టుండి నెత్తి మీద పెద్ద బండ పడినట్లయింది. కోడలు చెప్తుండగా విన్నది .

“వాకిట్ల అరుగు మీదున్న చెట్లు పెరిగి చాలా పెద్దగయినయి! చూస్తివి గదా ! వేర్లన్నీ భూమిలోకి పోయి పునాదుల్ని లేపుతున్నట్లున్నయి. అరుగు మీదున్న శాబాదు పలకల్ని చూస్తే తెలుస్తది . అరుగును మడత పెట్టినట్లయితుంది. బండలన్నీ పగిలి పోతున్నయి. వేర్లు గోడల కిందికి వచ్చి గోడలు పగిలితే ఇంటికే గండం ..” చెప్పుకుపోతుంది రాణి బాయి. అవతల్నుంచి జవాబు లేకపోయేసరికి ‘వింటున్నావయ్యా?!’ గొంతు రెట్టించిoది.

“ఆ, వినబడ్తనేవుంది చెప్పరాదు ? “ అన్నడు వీరాజీ , విసుగు బయటికి కనబడకుండా.

“ చెప్పేదేముంది ! ఆ మున్సిపాలిటోళ్ళతో మాట్లాడి చెట్లు కొట్టించే పని సూడు. పైన కరెంటు వైర్లు , పెద్ద లైను కూడా పోతున్నది . ఎత్తుకు పెరిగిన పెద్ద చెట్లు. ఆషామాషీ కాదు. కరెంటోళ్లు రావాలి. మున్సిపాలిటోళ్లు రావాలి . మనం ఒక్క చేతి మీద కూలోల్లకు చెప్పి చేసే పని కాదు “ అని పని కాస్త మెడకంటగట్టింది రాణి బాయి.

చిక్కువడ్డ చాంతాడులా సమస్య వుండేసరికి చిరాకేసింది వీరాజీకి . “ అడిగి చూస్త తీయరాదు ? “ అంటూ మాట దాటేసి బయటికెళ్లిపోయాడు .

వాళ్ళ మాటలిన్నపట్నుంచి బెంగవడ్డ మనసుతో సగం తను సచ్చింది. ఆకలి పూర్తిగా సచ్చి వూర్కుంది. తనకా వయసు పై బడింది. చెపితే వినే వారెవ్వరూ లేరు . “ఎప్పుడారిపోతానా !? “ యని ఎదురు చూడటం తప్ప ఏముంది ఈ బతుక్కిక అనుకుంటూ సమాధానపడిపోతూనే వున్నది రాజమ్మ. అలా జీవితమంతా రాజీ పడుతూనే వస్తున్నది . రాళ్ళ మాదిరిగున్న ఇత్తడి గంగాళాలు ఇప్పుడేమవసరమని అమ్మేసినా గులుక్కుంటూ కూర్చుంది వినా చేసిందేమి లేదు. రాగి బిందెలు పాయె, ఇత్తడి బిందెలు పోయాయి. సెమ్మెలు పోయాయి. కంచు తలెలు మాయమయ్యాయి. “ఇప్పుడు వాటిని కొనే తాహత్తుoదా !? అమ్మి తినడమంతా సులువా! మళ్ళీ కొనాలంటే “. ఇంటి లచ్చిమంతా పోయినట్లనిపించే . ఇప్పుడేమో చెట్లమీదికి గాలి మళ్లింది. మనుషుల గాలి మళ్లింది . “మామ వేపచెట్ల గాలి ఆరోగ్యానికి మంచిదని సందు దొరికిన ప్రతిసారి చెప్పేటోడు. తెల్లారితే వేప్పు ల్ల తోటి పళ్ళు తోముకునేటోడు . మేము పొట్టు పొయ్యిల నుంచి కాలిన పిడకల బూడిద తీసి తోముకునేది. కట్టెల బూడిద అంట్లు తోముడుకయ్యేది. ఈ కాలం మాదిరి పళ్ళ పొడులు , పేస్టులు ఎక్కడివి. అంట్లు తోమే పౌడర్లు , సబ్బులెక్కడివి ?” కలికాలం, పొయ్యేకాలం కాకపొతే !. చెట్ల గాలి సోకి మేము బాగానే ఉంటిమి. ఇగ ఈ చెట్లకే వచ్చింది ఆపతి. మనుషుల విషపు గాలి సోకుతుంది. నా పిల్లలతోబాటు పిల్లల్ని చూసుకున్నట్లు చూసుకున్న. కడుపుల పుట్టిన కొడుకులకన్నా ఎక్కువ. కన్నపేగులా ధైర్నం ఇచ్చేవి కదా ఈ వేప మాన్లు. ఉగాది , బోనాల పండక్కి ఆసరా అన్నట్లు నిలిచేవా ! పిల్లలకు అమ్మోరు పోస్తే వేప మండలు, దోమల పోరు ఎక్కువై యాష్ట పెడితే వేపాకు కాల్చి పొగ వేసేదాన్ని. వేపకాయలు సేర్ల కొద్దీ పోగు చేసి అణా బేడకు అమ్ముకునేదాన్ని. అట్లొచ్చిన పైకం కూడా ఎచ్చాల కనీ, పిల్లల చిరుతిండ్ల కనీ సంసారానికే పెట్టేది. కొడుకులు పెద్దమనుషులై మనుమరా ళ్లు , మనవళ్ళోచ్చేసరికి వేప చెట్లు చేపుకొచ్చి కల్లుబొట్టు ఊట పొయ్యసాగినయి. గౌండ్ల లింగయ్య చెట్లెక్కి లొట్టి కట్టి వదిలేసేటోడు . వారం పది రోజులకోసారి లొట్టి దింపి పొతే వాడకట్టు జనాలకు ఓ వింత . వేపచెట్టేoది, కళ్ళు పోయడమేందాయని ఇచ్ఛoత్రం పోయేటోళ్లు. వేపకల్లు చేదు విషం . సక్కెర వేసి రెండు మూడ్రోజులు పులియబెట్టి తాగేది ఒంటికి మంచిదని . వాడ కట్టోళ్ళంతా అడుక్కుపోయే వారు . పిల్లా పెద్ద తేడా లేకుండా దవఖాన మoదులాగ తాగెటోల్లు. చెట్లు కొట్టేస్తరన్న మాటలు విని కాలేజి చదువులవున్న మనవడికి చెపితి …

“ ఏందిరా శంకర్ ! మీ అమ్మ చెట్లు కొట్టేసే పని పెడుతుందేమిరా ! అవుంటే నష్టమేమొచ్చే ?! అవేమైన అడ్డొచ్చినయా? బరువైతున్నయా ఎవరికైనా ? ఇంటికి నీడ పట్టి చల్లగానే వుంచే. సర్కారే చెట్లు నాటాలని చెప్తావుంటే మనం వున్న చెట్లను నరికేస్తే ఎట్లరా !? తాతల కాలం నాటివి. ఎన్ని యాది ముచ్చట్లు అంటిపెట్టుకొని వున్నయి “ అని అడిగింది రాజమ్మ.

“ నన్నడుగుతవేంది ! నాకేం తెలుసని. ఐనా చెట్లు ముసలివైపోయినై , ఇంకెందుకు. డెబ్భై ఏళ్లకు పైబడ్డయoట గదా చెట్లకు. గాలి దుమారం గట్టిగ కొడితే కూలి ఇంటిమీద పడేట్లున్నాయి . ముందే పాత గోడలు . ఇప్పుడప్పుడన్నట్లున్నాయి. మంచిదే గదా కొట్టేస్తే . నరికిన కొమ్మల తోటి చెక్కలు కోయించొచ్చు . ఇంకేదానికైనా వాడుకోవచ్చు . చెట్లు చూడు ఎట్లా ఇంటి వైపు బంగళా కప్పు మీదికి వాలిపోయి ఉన్నయో !” అని సర్రున బయటికెళ్లి పోయిండు శంకర్ .

రోజులాగే తెల్లారింది . కానీ ఆ రోజు ఇంటిముందు హడావుడి వింతగా తోచింది . పదిమంది జమయ్యారు. కొందరి చేతిలో గొడ్డళ్లు, కొడవళ్లు వున్నాయి. కరెంటు వాళ్లేమో “ పవర్ లైన్ కట్ చెయ్, పవర్ లైన్ కట్ చేయ్“ అని ఒకడు అరుస్తున్నడు. ఒకడు కరెంటు స్తంభం ఎక్కి తన పని తాను చేసుకు పోతున్నడు. చిన్నపాటి క్రేన్ మున్సిపాలిటి వాళ్ళది వచ్చి నిల్చున్నది , ఎత్తు పైన వున్న కొమ్మలను విరిచి పట్టడానికి. చెట్లు నరికే కార్యక్రమం మొదలైంది . “ రాజమ్మవ్వ ఇంటరుగు మీది చెట్లు కూలగొడుతున్నారoటూ “ పిల్లలంతా సందడి చేస్తూ తమాషాలా చూస్తున్నారు. వాళ్లకు సరదాగ వుంది . కొడుకు, కోడలు, మనవళ్ళు అందరి ముఖాలు వికసించినట్లున్నయి. ఎవ్వరికీ ఎక్కడా ఏ కోశానా బాధ కనిపించలేదు . “ తనకెందుకు బాధ మరి. తన గుండె కెందుకింత ఆరాటం . రేపో మాపో ఈ చెట్టు కూడ కూలిపోతది . అప్పుడూ ఎవరికీ ఏమి పట్టదేమో ?! అప్ మరి , ఈ చెట్టు కూడ ముసలిదై పాయె . ఒక్కొక్కటి అన్నీ కళ్ళ ముందే కూలిపోయినయ్. బతుకు పంచుకున్న మనిషి పాయె. కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలు పోయిరి . ఉన్నోళ్లు దూరం పెట్టి చూస్తుండ్రి . చేసిన సంసారం రూపమే మారిపాయె. చుట్టిర్కాలు మారిపోయాయి. పలకరించేటోళ్లు కరువైపోయిరి. అంతెందుకు ఇంతకాలం సంసారం చేసి నాదనుకున్న నా ఇల్లు పరాయిదానిలా కనబడుతుంది . మనుషులు అంటీముట్టనట్లున్నరు. చివరికి ఏం మిగిలింది ” రాజమ్మ గొణుక్కుంటున్నది. అంతా శూన్యమేనన్న తలంపు . రాజమ్మ గుండె బరువెక్కింది . కడుపుల పేగులు సన్నగా వణకబట్టినయి. “గీ చెట్ల సోపతైనా తను పోయేదాక వుంటాయేమోననుకుంటి. అవి నాకంటే ముందే కూలి పోతున్నయి” .

“చెట్లు కొట్టించొద్దు బిడ్డా అనీ ఎంత పోరు పెడ్తి. ఎవ్వరూ చెవిన పెట్టక పోయిరి కదా! నేనే లెక్కలోకి రాకుండపోతి మావోళ్లకి . నా మాటొక లెక్కనా! “ ఒక బరువైన నిట్టూర్పు విడిచింది రాజమ్మ.

జరుగుతున్న తతంగo సాగిపోతూనేవుంది . ఎవరి పని వాళ్ళు వంతుల వారీగా చేస్కుంటూ పోతు న్రు . పై నున్న చిన్న కొమ్మలనుంచి నరికేసుకుంటూ వస్తుండ్రు. చెట్ల కొమ్మలన్నీ విరిగి కింద పడ్తున్నయి . మధ్యాహ్నo దాటింది . అరుగు మీదికొచ్చిన రాజమ్మ తల పైకెత్తి చూసింది . సూర్యుడు సూటిగా మొహానికి కొడ్తున్నడు . ఎండ చుర్రుమంటున్నది . అరుగు మీద నీడ శాశ్వతంగా మాయ మైంది. మళ్ళీ చాలా కాలానికి మామ యాదిలకొచ్చిండు . లావుపాటి చెట్ల మొండెం మిగిలింది . పూరాగ చెట్లను చూస్తే నెత్తి విరబోసుకున్న అమ్మోరు నెత్తి లేకుండావుంటే ఎలా ఉంటుందో అలా వున్నయి వేపచెట్లు. ఇల్లు, ఇంటిముందు అరుగు వికారంగ కనబడ్డది . తల, చేతులు నరికిన మనుషుల్లా వేపచెట్లు విలవిల్లాడుతున్నట్లున్నాయి . ఏళ్ళ తరబడి వున్న సంబంధం మరికొన్ని గంటల్లో సమాప్తమవబోతుంది . పొద్దుగూకుతుండగా ఓ ట్రాక్టరు వచ్చింది . అందులో మెషీను వుంది . చె ట్ల లావుపాటి మొదళ్ళు నరికే మెషీనట. సర్రు సర్రు న మూడు ముక్కలుగా నరికేసింది. అంతా చదునయ్యింది . అక్కడ రెండు వేప చెట్లుండే యన్న ఆనవాళ్లను మాత్రం వదిలి మిగతా వాటిని ట్రాక్టరులోకి ఎత్తించి తీసికెళ్ళిపోయారు . చీకటిపడేలోగా చరిత్ర ముగిసిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు . పెద్ద విజయాన్ని సాధించిన ఆనందం వాళ్ళ ముఖాల్లో కనబడింది . మొద్దులన్నీ కట్టెలమండికి కోతకు పోయినయి . వయసుడిగిన పశువులు కబేళాకు తరలించినట్లు . ఇంటిముందు శవం లేచినట్లు విషాదం, వైరాగ్యం రాజమ్మను చుట్టుముట్టాయి . చీకటి పడింది . అరుగు బరిబత్తలయినట్లు ఆకాశం చుక్కల దుప్పటి కప్పింది . గాడ్పు సెగకు అరుగు మేల్కొనే వుం డగా వాడకట్టు నిద్దరోయింది . తెల్లారే సమయం, నిద్దరోయిన రాజమ్మ కప్పుకున్న పాత దుప్పటి, పైట కాస్త గాలికి పక్కకు జరిగిపోయినా సోయి లేకుండా పడుంది .

“అయ్యో ! ముసల్ది సచ్చిపోయిందంట ?! నిన్నటి దాక మాట, చూపు బాగుండి తిరుగులాడుతనే వుండే పాపం ! ” వాడకట్టు ఆడోళ్ళంతా చేరి గుసగుసలు పోసాగిన్రు. పెద్దప్రాణం. చివరి చూపుకు ఇరుగుపొరుగు చేరి తలో మాట , సానుభూతి పలుకుతుండ్రు . అరుగు మీద నీడ కోసం మొదటిసారిగా షామియాన నిలబెట్టిండ్రు. ఎండ సెగ పెరగ సాగింది.

“బయట అరుగు మీదకు తెండి. చెయ్యాల్సిన కార్యక్రమాలున్నాయి. ఆలస్యమవుతోంది .. “ నలుగురు పెద్ద మనుషులు ఆదేశాలు జారీ చేశారు.

“రావలసిన వాళ్లంతా వచ్చిన్రు గదా, ఇంకా ఆలశ్యం దేనికి..“ మరికొంత మంది వంత పాడారు.

“దగ్గరి సోపతులింకేమైనా వున్నయా రావాల్సింది ” – కొందరు ఆరా తీసిన్రు.

అంతిమ కార్యక్రమాలకు కదలిక మొదలయ్యింది . వంతులవారీగా ఎవరు చేయాల్సిన పనులు వారి ద్వారా జరుగుతూనే వున్నాయి . డెబ్భైయేళ్ల అనుబంధం కలిగి ఎన్ని శుభ కార్యాలకు, ఎన్ని కర్మ కాండలకు, ఎన్ని సంఘటనలకు రాజమ్మకు తోడుగా నిలిచిన సాక్ష్యాలు, ఈ రోజు రాజమ్మ చివరి స్నానానికి అరుగు వొడి పట్టినా ముసల్దాని శవానికి మాత్రం సాక్ష్యంగా ఆత్మలాంటి వేపచెట్లు లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com