నాటి నవలా రచయితలలో ప్రధానం గా పెర్కోదగిన రచయిత దాశరథి రంగాచార్య కలం జాలువార్చిన నవల మోదుగు పూలు.

అసఫ్ జాహి వంశం లో చివరివాడైన ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుండి 1948 వరకు నిరంకుశం గా రాజ్యం పాలించాడు .నిజాం రాష్ట్ర విస్తీర్ణం 82 వేల చదరపు మైళ్ళు .రాష్ట్ర వ్యాపితం గా ఉన్న 1167 జాగీర్ల వైశాల్యం 11000 చదరపు నిజాం బంధువులకు చెందిన పాయె గాళ్ళ విస్తీర్ణం 3262 చదరపు  మైళ్ళు .నైజం నవాబును తలదన్నిన నిరకుశత్వం  జాగీర్లది.

అలాంటి ఒక జాగీర్దార్ జాగీర్ లో జరిగిన కథ ఇది .రచయిత ఈ నవలకు మోదుగు పూలు అని పేరు పెట్టడం లోనే  గొప్ప ఔచిత్యం ఉంది .

మోదుగు పూలు అడవిలో ఉంటాయి .ఎర్రగా ఉంటాయి .ఈ పూలను విప్లవానికి సంకేతించారు దాశరధి రంగాచార్య.

దాశరధి ద్వయానికి ఈ పూలు చాల ఇష్టం .

మహాకవి దాశరధి కృష్ణమాచార్య (ఈ రచయిత అన్నయ్య ) మోదుగు పూలను ‘’పూచిన మోడుగుం పువుల పుక్కిటినుండి వసంత రాజు ,రక్తాచమనంబు సేయు సమయంబిది , అని కవిత్వీకరిస్తాడు .

నవలలో మౌలికమైన కథాశం ఇది .

రఘు అభ్యుదయ భావాలు గల నవయువకుడు .హైదరాబాద్ లో చదువు ముగిస్తాడు .తన ఊరికి ఆంగ్ల దిన పత్రిక తో వస్తాడు . దినపత్రిక చేతిలో కనబడడమే ప్రభుత్వం దృష్టిలో పెద్ద నేరం .పోలీస్ అమీన్ ఎదురుపడి రఘుని చెంపదెబ్బ వేస్తాడు .సహనం,  తార్కికాలోచన రఘు సొత్తు .అతనిలో ఆలోచన మొదలవుతుంది .పరిస్థితుల ఆకళింపు పెరుగుతుంది .ప్రత్యమ్నాయం స్పురిస్తుంది .ఉద్యమం వైపు నడుస్తాడు .అతనిది అహింసా మార్గం .రఘు ఉద్యమానికి నగేశ్ తోడ్పడుతాడు .కాని నగేశ్ ది హింసా మార్గం .ఇద్దరిలో చాలా సార్లు అభిప్రాయ భేదం కలుగుతుంది .అయినా ఇద్దరూ కలిసే పని చేస్తారు .రఘు మేనమామ వీరయ్య ,అతన్ని బాల్యం నుండి ఆరాధించే మరదలు జానకి కూడా  ఉద్యమానికి తోడ్పడుతాడు .రఘు విముక్త రాష్ట్రం లోనే ఆమెను పెళ్ళాడుతానని చెబుతాడు .షావుకారు వెంకయ్య కూతురు రుక్మిణి .ఆమె నగేశ్ ని ప్రేమిస్తుంది .నగేశ్ కూడా ఆమెకి మనసు ఇస్తాడు .

అధికారుల దౌర్జన్యాలు ,ప్రజల కస్టాలు చూసి రఘు కదలి పోతాడు .ప్రజలకు అధికారులు విధించే శిక్షలు చాలా భయంకరం గా ఉంటాయి .స్త్రీ లకు రక్షణ లేదు .ఏ అధికారి కన్నైనా ఎ స్త్రీ పైన పడిందో అంతే సంగతి .ఎటువంటి శిక్షనైనా నోరు మూసుకొని అనుభవించడమే  ప్రజలపని .వాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకోవడం అయిన దానికి కానిదానికి కోపగించుకోవడం ,కట్టు కోయ్యలకు కట్టి కొట్టడం ,ఎండలో నిలబెట్టి వీపు మీద బండలు ఎక్కించడం ,మనిషిని గుర్రానికి కట్టి ఈడ్చుకు పోవడం ,దూలానికి తలకిందులు గా వేలాడదీయడం లాంటి శిక్షలన్నీ అధికారుల వేడుకలు .చివరికి ఈ దుర్మార్గాలన్నే చూసి విచలితుడైన రఘు హింసా మార్గం తోక్కుతాడు .తహసీల్ దార్ కొడుకు రషీద్ రజాకార్ల నాయకుడు .అతడు రుక్మిణి ని మాన భంగం చేస్తాడు .రుక్మిణి ఆత్మ హత్య చేసుకుంటుంది .రషీద్ జానకి ఇంటిపై అర్ధ రాత్రి దాడి చేసి చెరచ ప్రయత్నం చేస్తాడు .జానకి తనను మాన భంగం చేయ ప్రయత్నించిన రషీద్ ను కత్తి తో పొడిచి చంపుతుంది .చివరికి ప్రజల తిరుగు బాటు జరుగుతుంది .

ఇంత సీరియస్ కథను దాశరధి రంగాచార్య ఆకర్షణీయమైన శైలితో పాఠక ప్రియం గా రచించాడు .అలతి వాక్యాలతో  పఠిత ను తన తో తీసుకెడతాడు.ఆయన చిత్రించిన  నాటి తెలంగాణ జీవన సంస్కృతి కనుల ముందు కదలాడుతుంది .

ఆ గ్రామంలో ప్రతాపరుద్రుని పాలన నాటి ఙ్ఞాపకాలు ఎన్నో ఉన్నట్టు రచయిత పేర్కొంటాడు .వేయి స్తంభాల గుడికి  నమూనా లాంటి శిధిల దేవాలయాలు అక్కడ ఉన్నాయి .సముద్రాల్లాంటి మహాతటాకాలు ఉన్నాయి .

ఒక దృశ్యం లో ఒక పల్లె మనిషి ని అమీన్ సాబ్ తనకు కోళ్ళు ఎందుకివ్వవని బెదిరిస్తాడు .ఆ మనిషి చెప్పిన సమాధానం ‘’యాడ మిగిలినయ్ కాల్మొకుత ,ఊరి బయటనే పోలీసాయనొకటి గుంజుకున్నడు,తాహసీల్దార్  దొర బంగ్లా ముందు జవాన్ ఒకటి పట్టుకున్నడు, బుట్టకోడి గుంజుకొన్నడు,కాల్మొక్త ,కాలు కడుపులు తెచ్చుకొని బుట్ట తెచ్చుకొన్న బాంచెను ,మల్ల తెచ్చినపుడిచ్చుకుంట ,గులాపోన్ని, మూడు కోడిపిల్లలు తెస్తిని ,మూడు గుంజుకొనిరి ,ఎం జేయమంటరు?

ఒక్క పల్లె వాసి నిర్మల హృదయం ,నిసర్గ భాష ,అతని దైన్యం ,మన కళ్ళముందు పెడతాడు రచయిత .

అనేక కులాల జీవన విధానం కతాసంవిదానానికి ఏ మాత్రం ఆటంకం లేకుండా కొనసాగుతాడు   రచయిత .

తెలంగాణ ప్రజాజీవితం లో పీరీల పండుగ ఒక గొప్ప అనుభవం .హిందూ ముస్లింల ఐక్యత కు అదొక గొప్ప నిదర్శనం .పండుగకు సంబంధించిన ఐతిహ్యం ముస్లిమ్ ల దే అయినా హిందువులు చాలా ఎక్కువగా పాల్గొంటారు.హసన్ సోదరులు యాజిద్ దౌర్జన్యానికి బలి అవుతారు . వారు బలి అయింది మొహరం నెలలోనే .అది మహమ్మదీయులకు అందునా షియాలకు పవిత్ర మాసం .

తాషా మార్చా మ్రోగుతుంది .ఆశుర్ ఖానా లోన బయట జన సమర్ధం ఎక్కువగా ఉంది .ముల్లా వచ్చాడు .అతడు కట్టుకున్నది ధోవతి .వేసుకున్నది కమీజు .నెత్తిన కుచ్చు టోపీ వుంది .పెట్టెలోంచి పీరీలను తీసేముందు చేత్తో వెనుక గోచీ లాగేశాడు .తాశామార్చ్ జోరు గా సాగింది .పీరీలను పీట మీద నిలబెట్టాడు .బట్టలు కట్టాడు .వీటి పక్కన నెమలి ఈకెల కట్టలు పెట్టాడు .అగ్ని గుండం చుట్టూ తిరుగుతూ ‘’హసన్ హుసేన్ లిద్దరూ అన్నదమ్ములంటా . అంటూ వారి కథను పాట లో చెబుతున్నాడు .

నవల  లో పీరీల పండుగ ఓ భాగం గా కనిపిస్తుంది .

అట్లాగే మంగలి వృత్తి ,వీళ్ళు సమ్మె చేస్తే తాహసీల్దార్ బతుకే స్తంభిస్తుంది . ఊరంతా నిర్వీర్యమౌతుంది .మంగలులకు సమ్మె చేసే చైతన్యం రఘు ,నరేశ్ లనుండి లభిస్తుంది .ఈ సంఘటనల వల్లకులవృత్తులు సమాజ జీవన పునాదులు అని అన్యాపదేశం చేస్తాడు రచయిత .వీళ్ళు క్షురకర్మ చేయడమే కాదు ,వైద్యాలు చేయడం ,బెణుకులు సరి చేయడం ,వాయిద్యాలు వాయించడం ,లాంటి పనులన్నీటి లోనా సిద్దహస్తులే .మంగళ్ళు ,చాకల్లు ,కమ్మర్లు ,కుమ్మర్లు ,గ్రామజీవితం లో అతి ముఖ్యమైన స్తంభాలు .అందుకే మడులిచ్చి ,మాన్యాలిచ్చి ,వాళ్ళను  ఊరిలోకి తెచ్చి పెట్టు కున్నారు ఆ కాలం లోని గ్రామ నిర్మాతలు .

ఇక కోయ సంస్కృతి, జీవన విధానం ,వివాహ పద్ధతి ,ఆచారాలు ఒక చలన చిత్రం లాగా మన ముందుంచుతాడు రచయిత .ఈయన స్వయం గా అడవికి వెళ్లి వాళ్ళ జీవితాన్ని పరిశీలించి చిత్రించిన అంశాలు ఇవి .

సింగి ,సింగడి ప్రేమ తండ్రి కొడుకు సింగని కోసం పెట్ట ( సింగిని వేటాడడం ,) తరువాత పిల్ల ,పిల్లగాని తరపు వాళ్లకు యుద్ధం (ఉట్టుట్టి) తరువాత రాజీ , పెళ్లి ,కోయ గూడెం విందులు వినోదాలు ,ఇప్పసారా ,నెమలి మాసం తో సహా వివిధ రకాలైన మంసాహారాలు, సింగని తల్లి మరణించి దేవత కావడం ,దేవతకు జంతు బలి, ఇట్లా కొయెల ప్రసవం ,వివాహం ,మరణం .లాంటి అనివార్యమైన జీవన గతులలో జరిగే ఆచారాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి .

అల్లాంటి కోయల ,ఒడేరల  శ్రామిక జీవన సౌందర్యం ,తాహసీల్దార్ ,ఆమెన్ ,గిరిదావర్, వాళ్ళమీద చేసే దౌర్జన్యం ,చివరికి రఘు నగేశ్ ల ప్రభావం తో వాళ్ళు తిరుగబడిన తీరు  పాఠకులను కదలిస్తుంది .

ఊరిలో కలరా వ్యాపించినపుడు ఊరి వాళ్ళ నమ్మకాలు ,బైండ్ల వాళ్ళ పాటలు ,తరువాత దున్నను బలి ఇవ్వడం ,లాంటి వన్నీ ఆశర్యం కలిగిస్తాయి .ఆ కాలంలోని గ్రామాల్లోని విశ్వాసాలు కళ్ళముందు కదలాడుతాయి .

వర్షం రావడానికి హిందువులు ,ముస్లిం లు చేసే పూజలు ,కప్పతల్లి ఆటలు ,అందులోను అంతరంగికమైన బేధాలు ,వెరసి మానవుని మనస్తత్వాన్ని పరోక్షం గా చూపిస్తాడు రచయిత .

చివరికి గిరిదావరి మాంత్రికుని మాటల ప్రభావం తో ధనాశతో నరబలి కూడా చేయిస్తాడు .

పేద ప్రజల భాధలు ,ఆకలి ఇట్లా ఉంటె ధనవంతుల ముస్లిం పాలకుల  విలాసాలకు కొదవే లేదు .భోజనం లో పది రకాల మాంసాహారాలు ,అయిదు రకాల కూరగాయాలు ,పచ్చళ్ళు ,పెరుగు వెన్న ,మీగడ ,హల్వాలు (తహసీల్దార్ ) వాళ్ళ భోజనాలు .

సమాజం లోని ఈ రకమైన అంతరాలే విప్లవానికి ,తిరుగు బాటుకి దారి తీశాయి .

ఇన్ని రోజులు గడచినా ఈ నవల ఇప్పటికీ ప్రాసంగికంగా ఉన్నదంటే రచయిత సామాజికకోణం తో శిల్ప దృష్టి మేళవించడమే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com