పెరట్లో వంటవాళ్ళ అరుపులు, వంటవెలదాపు చప్పుళ్ళకు మెలకువ వచ్చింది. వాళ్ళకు ఏవో ఆదేశాలిస్తున్న అన్నయ్య గొంతు వినపడుతున్నది. మా నాయనా గతించి నేటి పదకొండు రోజులయింది. ఇవ్వేళ ఆయన పెద్దకర్మ. రాత్రంతా మేలుకుని ఉండి నేటి “దశదానాల” కార్యక్రమానికి బియ్యం, కూరగాయలు, బట్టలు, పాత్రలు నగదు వగైరా సామానుల్ని మూటలు కట్టి ఉంచాం. ఆలస్యంగా పడుకోవడం వల్ల నిద్రలేమితో కళ్ళు మండుతున్నాయి.

అంత పొద్దెక్కే దాకా పడుకుని ఉన్నందుకు కాస్త సిగ్గుపడుతూ, మిద్దె మెట్లు దిగాను.

నాయన పోయిన్నాటి నుంచి అమ్మ తన గది దాటి బయటకు రావటం లేదు. చుట్టాలు, పరిచయస్తులు, పొరుగూళ్ళ నుండి తెలిసినవారు పలకరించటానికి రావటం, అలా వచ్చిన ప్రతిసారి అమ్మ ‘మూడ్’ చెదిరిపోయి, నాయన జ్ఞాపకాలతో పొగిలి పొగిలి ఏడవటం జరుగుతున్నది. అమ్మ ఇలా తడవలు తడవలుగా ఏడుస్తున్నదన్న బాధతో నాకూ, ఏదో, పైకి కనబరచలేని దుఃఖం కలుగుతున్నది.

క్రిందకు దిగిన నన్ను చూసి నా శ్రీమతి రమణి “ఒక్క క్షణం” అంటూ మరుక్షణం పొగలు గ్రక్కే టీ కప్పు అందించింది.

కప్పు అందుకుంటూ “ఈ చుట్టాలు పరిచయస్తులు ఏదో ఒక సమయానికి వస్తే బావుండేది. అమ్మ ఇలా మాటి మాటికి ఏడవటం ఏమీ బాగులేదు. ఒక పని చేద్దాం. నేనూ, అన్నయ్యా ఇంటి ముందే కూర్చుని పలకరించటానికి వచ్చిన వాళ్ళను బయట నుంచి బయటే పంపిద్దాం” అన్నాను.

రమణి ముక్కున వేలేసుకుని, నాకేసి విడ్డూరంగా చూస్తూ, “అట్లా అనొద్దు. వాళ్ళు వచ్చేది మిమ్మల్ని, మీ అన్నయ్యనీ చూడటానికి కాదు. అత్తయ్యను ఓదార్చటానికి” అంది.

“అది నిజమే కావొచ్చు, కాని వాళ్ళు అలా వచ్చిన ప్రతిసారి అమ్మకు దుఃఖం ఆగటం లేదు”. బాధతో నా గొంతు పూడుకు పోయింది.

“ఈ పరిస్థితుల్లో ఎవరూ ఏమీ చేయగలిగేది లేదు. మీరు గమ్మునుండండి. ఇంటి పట్టున ఉండే వారు కాదు కనుక ఇక్కటి పద్ధతులూ, అవీ మీకు తెలవ్వు” రమణి జవాబు.

అదీ నిజమే! ఎప్పుడోగాని ఓ సారి ఊరు రావటం. వచ్చిన ఒకటి రెండు రోజులకే తిరిగి వెళ్లి పోవడం వల్ల నాకు ఇంటి సంగతులు, ఊరి పద్ధతులు అంతగా తెలియవు.

‘ఒకరిని ఓదార్చటానికి వచ్చి, వారి దుఃఖాన్ని ఎక్కువ చేయటం… ఇదేం విడ్డూరం’ అనుకున్నాను.

మా నాయన ఆ ఊరి పెద్దరైతు. పటేలు, పట్వారి సదా లేకున్నా అందరి మన్నన పొందేవాడు. అందరితో కలిసిపోయే వాడు. తాను నొవ్వకూడదు, మరొకరిని నొప్పించకూడదు అని అనుకునే మనిషి. ఎక్కడ స్థిరంగా ఉండాలో, ఎక్కడ ఎదుటి వారి ఆలోచనలతో ఏకీభవించాలో తెలిసిన మనిషి, గొప్ప ముందుచూపు ఉన్నవాడు. అన్నయ్యను, నన్నూ బాగా చదివించాలనుకున్నాడు. పొలం పనులంటే ఆసక్తి కనబరిచే అన్నయ్యకు చదువు అబ్బలేదు. అదీ ఒకందుకు మంచిదే అయింది.

నలభై ఎకరాల వరి పొలం, ఇరవై ఎకరాల చెలక భూమి, అయిదెకరాల మామిడితోట – ఇవన్నీ నాయనకు సాయంగా అన్నయ్య చూసుకుంటున్నాడు.

ఇంటినిండా ధాన్యం బస్తాలు, ఎరువుల సంచులు,

దొడ్లో పశువుల అంబారావాలు, పాలేర్ల పిలుపులు ఇల్లంతా సందడిగా ఉంటూ, నాకెందుకో ఉక్కిరి బిక్కిరి అయినట్లనిపించేది.

స్కూల్ ఫైనలు, డిగ్రీ, ఆ తరువాత ఎం.ఎస్సీ, లెక్చరర్ ఉద్యోగం, డాక్టరేట్, ప్రొఫెసర్గా ప్రమోషన్ – ఇలా అంచెలంచెలుగా నా కెరీరు అభివృద్ధి పరుచుకున్నా, మా ఊరు, ఊరి జనాలు, నా కెప్పుడూ కొత్తగానే తోచేవి.

మట్టి మిద్దెలు, గూన పెంకుల ఇళ్లు, గతుకుల ఇరుకు రోడ్లు, సరిగ్గా వెలగని వీధి దీపాలు, వచ్చి పోయే వారిని అరుగుల మీంచే పలకరింపులు నాకెప్పుడూ కొత్తే!

ఎవరింట్లో చూసినా గరిసెల నిండా ధాన్యం, పాడి – సగం జనాభా కళకళలాడుతూ కూడుగుడ్డకు లోటులేకుండా ఉంటారు. టీవీ, సెల్ఫోన్ల పుణ్యమా అని ప్రపంచ జ్ఞానం పుష్కలం. అలాగే రాజకీయాలు, ‘కొంచెపు’ ఆలోచనలు కూడా సమృద్ధిగానే ఉంటాయి.

ఏదేమైనా – మా ఊరు, ఊరి జనాల మనస్తత్వాలు మాత్రం ఎదగలేదు అన్నమాట వాస్తవం.

నాయన దహనం అయ్యాక, మరునాడు అమ్మ ప్రక్క ఊరిలో ఉండే బ్రాహ్మణ పంతులును పిలిపించింది. జరిపించాల్సిన ‘అపకర్మ’ లేమిటో ఆయన ఏకరువు పెడుతున్నాడు.

‘ఇంత తతంగం అవసరమా’ అనిపించి ఆ మాట పైకే అన్నాను.

అమ్మ కోపంగా “ఒరే చిన్నాడా! ఈ పది రోజులు ఏమీ ప్రశ్నలు వేయకుండా అన్నయ్య వెంట ఉండి వాడు చేస్తున్నట్లు నువ్వూ చెయ్యి. అదీ ఇదీ అంటూ వాదించకు ఊళ్ళో తల ఎత్తుకు తిరగాల్సింది మేము. చుట్టాలు, ఊరి జనం -అదీ, నాయన విషయంలో తప్పుపడితే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. కర్మకాండ ఆయన హెూదాకు తగ్గట్లు ఘనంగా జరగాలి. ఏ విషయంలో కూడా ఎంత మాత్రం లోటు రానివ్వద్దు” అంది.

రెండో తరగతి చదువే. అయినా అమ్మకు లోకజ్ఞానం అపారం. చనిపోయిన నాయన ఆత్మశాంతి కన్నా బ్రతికి ఉన్న అమ్మకు మనఃశాంతి కలిగించటం ముఖ్యం. నేనేమీ బదులు చెప్పలేదు.

నాయన మరణంతో మాకు, మరియు టౌనులో ఉన్న మా చిన్నాయన కుటుంబానికి ‘సూతకం’ వచ్చింది. ‘మైల’ పడిపోయాము. పెద్ద కర్మ రోజు పిండోదకాలు, దశదానాలుంటాయి. బంధువుల భోజనానంతరం, శయ్యదానం దీప దానం ఇవ్వాలి. నాయన ఆత్మ దేవతలలో కలిసిపోతుంది. అప్పుడు ‘సూతకం’ తొలిగిపోతుంది.

ఒక మనిషి పోతే విచారించాలి. కాని- దానాలు షడ్రసోపేత భోజనాలు -ఇదంతా “త్రాష్” అనిపించింది. కాని అమ్మ చేసిన కట్టడి వల్ల నేను మౌన ప్రేక్షకుడినయిపోయాను.

పెరంట్లోంచి వంటకాల వాసనలు వాడ అంతా క్రమ్ముకుంది. అన్నయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ‘మెనూ’ ఖరారు చేశాడు. టౌను నుండి వంటవాళ్ళను మరియు సరంజామాను తెప్పించాడు. వాళ్ళు నిన్ననే నాలుగు రకాల స్వీట్లు తయారు చేశారు. ఇవ్వేళ్టి భోజనంలో ప్రత్యేకంగా పాయసం, పప్పుగారెలు ఉండాలట. చిక్కని పాలు మరుగుతున్నాయి. ఎండుద్రాక్ష, బాదం, కాజు లాంటి డ్రైఫ్రూట్స్ చేతిలో వేగుతున్నాయి. రెండు ఆకుకూరలు, రెండు కాయగూరలు కోసి పెట్టుకున్నారు. గుమ్మడి పులుసు మరుగుతోంది. పాలు నిన్ననే కాచి తోడు వేసి మట్టిపాత్రల్లో ఉంచారు. డబల్ పాలీషు పెట్టిన మసూరి బియ్యపు అన్నం ఉడుకుతోంది. బాస్మతి బియ్యంలో మాంసం ముక్కలు, తాజాగా పొడిచేసిన మసాలాతో బిర్యాని ఘుమఘుమలాడుతోంది. సారా పేకెట్లు, ఫారిన్ మందు సీసాలు నిన్ననే వచ్చాయి. వాటిని అన్నయ్య ఓ గదిలో ఉంచి తాళం వేశాడు.

బంధువులు, ఊరివారు, పరిచయస్తులు బ్యాంకులు వస్తున్నారు. లడ్డూ, జిలేబీ బగారా అన్నం తప్ప మరేమీ తెలియని వాళ్లకు ఈ వంటకాలు అబ్బురపరుస్తున్నాయి. చిన్న పిల్లల్ని అదుపులో పెట్టడం కష్టం అవుతోంది. పెద్దవాళ్ళే ఆ వంటకాలకు ప్రలోభపడుతోంటే పిల్లల సంగతి చెప్పాలా!

ప్రొద్దుటి బస్సుకు చిన్నాయన కుటుంబం అంటే – చిన్నాయన చిన్నమ్మ ఇద్దరు కొడుకులు కోడళ్లు వచ్చారు. కూతుళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. చిన్నాయన హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆయన కొంచెం తలతిక్క మనిషి. అన్నదమ్ముల పంపకాలప్పుడు మా నాయన ఆస్తినంతా రెండు భాగాలు చేసి చిన్నాడివి ఏవాటా కావాలో

ముందు నువ్వు తీసుకో అన్నాడు. అందుకు చిన్నాయన “నాకు నలుగురు సంతానం, అందునా ఇద్దరు ఆడ పిల్లలు, కాబట్టి నాకు నాలుగు వాటాలు నువ్వు రెండు వాటాలు తీసుకో” అన్నాడు.

అందుకు నాయన ఒప్పుకోలేదు. “మన నాయన పోయిన్నాడు మనకు ఎకరం చెక్క కూడా లేదు. ఇదంతా నా కష్టార్జితం కుదరదు” అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ ఈ విషయం తెలుసును. ఎవరూ చిన్నాయనకు మద్దతు పలకలేదు. అది మనసులో ఉంచుకుని ఊళ్ళో వాళ్లందరికీ తన అన్న తనకు ఎంత అన్యాయం చేశాడో దండోరా వేస్తూ చెబుతుంటాడు. ఈయన ప్రయోజకత్వం తెలిసిన మా చిన్నమ్మ వేరు అసలే వద్దు అంది. మా చిన్నాయన వింటేనా!

అమ్మ, నాయన, అన్నయ్యలు వంచిన నడుం ఎత్తకుండా శ్రమించి ఆస్తులను మరింత పెంపుచేశారు. అత్త కొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు అన్నట్లు, తన అప్రయోజకత్వం కంటే మా నాయన చేసిన అన్యాయమే మా చిన్నాయనకు భూతద్దంలో కనబడేది.

* *

*

పిండ ప్రదానం అయిపోయింది. మా నాయన, తాత, తాతతండ్రులకు తర్పణాలు వదిలాము. క్షణాలు పేరున దశదానాలు ఇచ్చాము.

“తర్వాతి కార్యక్రమం మొదలయ్యే ముందు మీరు భోజనాలు కానివ్వండి” అన్నాడు కర్మచేయిస్తున్న బ్రాహ్మణుడు. అందరినీ పేరు పేరునా “భోజనాలకు లేవండి” అంటూ అన్నయ్య, నేను పిలుస్తున్నాము.

చిన్నాయన, చిన్నమ్మ, వాళ్ళ పిల్లలు ఒక్కసారిగా నిశ్శబ్దం అయ్యారు. వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కినట్లు అనిపించింది. చిన్నమ్మ కల్గొత్తుకుంటుంది.

అన్నయ్య చిన్నాయన దగ్గరకు వెళ్ళి ఆయన రెండు చేతులు పట్టుకుని “చిన్నాయనా! భోజనానికి లెండి” అన్నాడు.

అన్నయ్య చేతులు విడిపించుకుంటూ “ఒరేయ్! పెదకాపులు పరాయి ఇళ్ళల్లో చావుకూడుతినరు” అన్నాడు ఎటోచూస్తూ.

నేనూ, అన్నయ్యా అవాక్కయ్యాము. వచ్చిన బంధువులు ఉత్కంఠతతో మమ్మల్నే గమనిస్తున్నారు. గాలి బిగుసుకు పోయినట్లనిపించింది.

క్షణం పాటు తెల్లబోయిన అన్నయ్య తమాయించుకుని మళ్లీ చిన్నాయన చేతులు పట్టుకుని “చిన్నాయనా! ఇది మీరు పుట్టి పెరిగిన ఇల్లు. స్వయా నయం అన్నయ్య దినాలు. ఇది మీకు వాయి లు కాదు” అన్నాడు. చిన్నమ్మ వైపు తిరిగి “నువ్వన్నా చెప్పు చిన్నమ్మా!” అన్నాడు.

ఇలాంటి ఉపద్రవం ఏదో తెచ్చిపెడతారం చూచాయంగా ఆమె ఊహించినా, ఈ హఠాత్తు సంఘటనతో ఆమె | ముఖాన నెత్తురు చుక్కలేదు. కన్నీరు ఆగటం లే

కాస్త మెత్తబడండి! అన్నట్లు చిన్నాయన వైపు చూస్తున్నది. “కుండ వేరయింది (అన్నం వండే కుండ) కనుక ఇది మాకు పరాయి ఇల్లే” అన్నాడు గంభీరంగా,

అప్పటి దాకా ఊరిస్తోన్న రకరకాల ప్రత్యేకమైన వంటకాలు తినే అవకాశం జారిపోతోందని పిల్లలకు అర్థమైనట్లుంది. వాళ్లు చిన్నాయన చుట్టూ చేరి “తాతయ్యా! ఆకలి” అంటూ మారాం చేయసాగారు.

అన్నయ్య వేడుకోవడం. చిన్నాయన మొండిపట్టుదల. చిన్నమ్మ కన్నీరు. భోజనాలకు వచ్చిన ఊరి జనాలకు ఇదో వినోదంగా కనిపిస్తున్నది. నాకు, అన్నయ్యకు తలకొట్టేసినట్లుంది.

కులపెద్దను సంప్రదిస్తే ‘మైల తొలిగింది కాబట్టి తినొచ్చు’ అన్నాడు.

“దీపదానం, మంచం, గొంగడి, గంపదానం ఇంకా ఇవ్వలేదు అంటే కర్మకాండ ఇంకా పూర్తి అవనట్లే కదా!” చిన్నాయన లాపాయింటు.

‘ఫారిను మందు’ రుచి చూసే అవకాశం తప్పిపోతోందని చిన్నాయన ఇద్దరు కొడుకులకు అర్థమైంది. వాళ్ళు ఆయన్ని చాటుకు పిలిచి కోపంగా మందలించారు. సాయం కాలం దాకా బస్సులేదు. అందాక ఆకలితో ఎట్లా ఆగేది అంటూ నిలదీశారు. చిన్నాయన ముఖం కందగడ్డ అయ్యింది.

ఇదంతా గమనిస్తోన్న, కర్మ చేయిస్తోన్న బ్రాహ్మడికి మా మీద, జాలి కలిగినట్లున్నది. “అయ్యా నాదో చిన్న విన్నపం, తమరు వింటానంటే…” చిన్నాయననుద్దేశించి అన్నాడు. అందరూ ఆయన వైపు తిరిగారు.

“పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు, సాయంత్రం గాని బస్సులేదు. పక్క ఇంట్లోతిని పొండి” అన్నాడు చిన్నాయననుద్దేశించి.

“వాళ్లింట్లో నైనా, కనీసం వంట కూడా, గంటకు పైమాటే” అన్నారెవరొ |

మూడు గంటలు అవవస్తోంది అందరినీ నీరసం ఆవహిస్తున్నది. కడుపులో ఆకలి కేకలు. పంచభక్ష్యాల ప్రలోభం. ఎవరికి ఏది తోస్తే అది మాట్లాడుకుంటున్నారు.

నాకు ఓ ఆలోచన తోచింది. బ్రాహ్మణుడి చెవిలో ఊదాను. ఆయన సంతృప్తిగా తలూపి ఇలా అన్నాడు.

“అన్ని మలినాల్ని హరింపచేసేది గంగ. ఇక్కడి వంటకాల్ని కొద్దికొద్దిగా పక్కింట్లోకి చేర్చండి నా దగ్గర ఉన్న గంగాజలంతో శుద్ధి చేస్తాను. అన్ని రకాల ‘మైల’ తొలిగిపోతుంది”. చిన్నాయన మాట్లాడలేదు.

పిల్లలు ‘ఆకలో’ అంటున్నారు భార్య ఎప్పుడూ ప్రతిపక్షమే. క్షణం క్రితం కొడుకులు మొహం వాచేట్లు చీవాట్లు పెట్టారు. అనుకోని సంకటంలో ఇరుక్కున్నట్లుగా ఆయన ముఖం నల్లబడింది.

ఆయన మౌనాన్ని అంగీకారంగా తీసుకుని వడ్డన వాళ్ల సాయంతో వంటకాలన్నీ కొద్దికొద్దిగా, మందుతో సహా – పక్కవాళ్లింటి పెరట్లోకి చేర్పించాడు అన్నయ్య.

అలా చేర్చబడిన వంటకాల్ని బ్రాహ్మణుడు గంగాజలంతో శుద్ధి చేశాడు.

మా చిన్నాయన కుటుంబం అలా శుద్ధి చేయబడిన వంటకాలన్నింటినీ తృప్తిగా మళ్లీ మళ్లీ వడ్డించుకుని ఆరగించారు. మరేమీ విశేషం లేకుండా తర్వాతి కార్యక్రమం ముగిసింది.

నాకో సందేహం వచ్చింది. ‘సూతకం’ అన్నది మా నాయన చనిపోవటం వల్ల మాకు వచ్చిందా? లేక అర్థం లేని ఆచారాలను పాటించి, అవసరార్థం సడలించిన మా చిన్నాయన లాంటి వాళ్ల మనసులకు వచ్చిందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com