శ్రమ లో పుట్టి శ్రమలో పెరిగి శ్రమనే జీవనంగా బతికే మహిళల కోసం ఏర్పడిందే మార్చి 8. 1910 నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ సోషల్ కాన్ఫరెన్స్ లో కమ్యూనిస్టు నాయకురాలు క్లారీ జుట్కీన్ శ్రామిక మహిళల పోరాట దినంగా చేసిన ప్రకటన నే మార్చి 8 గా యీనాడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మార్చి 8 అంటే శ్రామిక మహిళలు చేసిన అసాధారణ పోరాటాలకు సంకేతంగా కొనసాగాలనే ప్రతిపాదనలతో మొదలైంది.

ప్రపంచవ్యాప్తంగా వేల యేళ్ల తరబడి మహిళలు మానవ హక్కుల కోసం, రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక, సమానత్వాల కోసం పోరాడుతూనే వున్నారు. పారిశ్రామిక విప్లవం తో అమెరికా, యూరప్ దేశాల్లో ఎనిమిది గంటల పని దినాల కోసం, సమాన వేతనాల కోసం, కనీస వేతనాల కోసం మహిళా కార్మికులు తమ నెత్తుటిని ధారపోసి, ప్రాణ త్యాగాలు చేసి పోరాటాల స్ఫూర్తి నందించారు ప్రపంచ శ్రామిక మహిళలు. 1857 మార్చి 8 న్యూయార్క్లో మహిళా కార్మికులు చిందించిన నెత్తుటి దినమే అంతర్జాతీయ మహిళా పోరాట దినంగా ప్రకటించబడింది.

చికాగోలో చిందిన కార్మికుల నెత్తురు మే 1 1886. అయితే అంతకన్నా 30 యేండ్ల ముందే న్యూయార్క్లో చిందిన మహిళా కార్మికుల నెత్తుటి రోజు మార్చి 8 1857. చికాగోలో నెత్తురు చిందిన మూడేండ్లకే (1889) మేడే ప్రపంచ కార్మిక దినం గా ప్రకటిస్తే… న్యూయార్క్ మహిళా కార్మికులు చిందించిన నెత్తుటి రోజు మార్చి 8 ని ప్రపంచ కార్మిక మహిళా పోరాట దినంగా ప్రకటించడం అర్థ శతాబ్దం పట్టింది(1910). యివీ! ప్రపంచ జెండర్ రాజకీయాల చారిత్రక వివక్షలు.

మే డే అంటే ప్రపంచ కార్మికుల రోజు గా కార్మికులే ఎట్లా జరుపుకుంటున్నారో, మార్చి 8ని ప్రపంచ శ్రామిక మహిళా దినం గా జరుపుకోవాలి. మేడేను యాజమాన్య సమూహాలు జరుపుకో వు. కానీ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవమైన మార్చి 8 ని యాజమాన్య మహిళలు, శ్రమ యెరుగని మహిళలు వేడుగ్గా జరుపుకోవడము చూస్తున్నాము. వ్యాపార సంస్థలు కూడా మహిళా ఉత్సవాలు చేస్తూ శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. యిక మనదేశంలో మార్చి 8 ని అగ్రకుల మహిళా సంస్థలు, యాజమాన్యాలు ఒక ఉత్సవంగా, ఫ్యాషన్ పరేడ్ గా మార్చేసి శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తిని, వారి శ్రమ సమస్యల్ని, వాల్లెదుర్కుంటున్న సామజిక సమస్యల్ని అవాచ్యంజేస్తున్నాయి.

భారతదేశంలో శ్రామిక మహిళలంటే బహుజన కులాల మహిళలే. అంబేద్కర్ చెప్పినట్లు ఇక్కడ కులము శ్రమ విభజనే కాదు, శ్రామికుల మధ్య కూడా విభజన సృష్టించినట్లు గానే ఒకే జెండర్ లో (ఆడ) కూడా విభజన సృష్టించింది.

భారతదేశ మహిళలంతా ఏక చదరంగా, ఒకే సమూహంగా, ఒకే సామాజికంగా లేరు. అనేక భిన్న సామాజిక కుల మత అస్తిత్వాలు గా వున్నారు. ఎండ కన్నెరుగని మహిళలుగా, ఎండనే జీవితాలు గా వున్న మహిళల జెండర్ రాజకీయాలు ఒకటిగా లేవు. సామాజిక శ్రమల్లో లేని మహిళలు ఆధిపత్య కులాలు గా వుంటే సామాజిక శ్రమలే జీవనాలైన మహిళల లు బహుజన కులాలు గా వున్నారు.

ఆధిపత్య కులాల మహిళలు విద్య ఉద్యోగ రంగాల్లో గౌరవనీయ వృత్తుల్లో ముందు వుంటే.. శ్రామిక కులా లైన అంటరాని, ఆదివాసి, బీసీ, మైనారిటీ మహిళలు కూలీలుగా, రోడ్లూడిసే మున్సిపల్ వర్కర్లుగా, కక్కోసులు కడిగే సఫాయి కర్మచారీలుగా , అడ్డా కూలీలుగా, నిర్మాణ రంగంలో తట్టలు మోసే లేబర్ గా, ఎట్టి ఏసినోల్లుగా, మట్టిపనోల్లుగా గౌరవంలేని శ్రమలు, ఆర్థిక విలువల్లేని హీన రూపాయిగా చూడబడుతూ… మార్జినలైజ్ చేయబడినారు. సామాజిక కుల జెండర్ హెచ్చు తగ్గుల్ని మాట్లాడకుండా, మహిళలంతా ఒక్కటేనని బుకాయిస్తూ… ఒక మోసపూరితమైన వ్యవస్థీకృత ప్రచారాన్ని విస్తరింప జేయడం జరిగింది.

భారత సామాజిక ఉత్పత్తి రంగంలో వున్న వర్క్ ఫోర్స్ అంతా బహుజన కులాల మహిళా శ్రామికులు. శ్రమ లో వున్న మహిళా సమస్యల్ని, శ్రమ బైట వున్న విశ్రాంతి మహిళా సమస్యల్ని ఒక గాట గట్టి చూడడం వల్ల లబ్ధి పొందిందంతా అగ్రకుల నీడ పట్టునుండే మహిళలైతే నష్టపోయింది అభివృద్ధి ఆవల వున్నది శ్రామిక కులాలైన బహుజన మహిళలు.

భారతదేశంలో మహిళా సమస్యలంటే అగ్రకులాల మహిళల సమస్యలనే ప్రాతిపదికగా తీసుకొనడమైతున్నది. అవే సమస్యలు మహిళలందరి సమస్యలుగా ఎజెండా చేయడం జరుగుతుంది. బహుజన కులాల మహిళల అభివృద్ధికి ప్రతిబంధకంగా వున్న కులం, మెట్టి, బాల్య వివాహాలు, జోగినీ, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అంటరానితనాలు, దొర పెత్తనాలు, దొర్సాని పెత్తనాలు, మగ పెత్తనాలు వంటి అనేక సమస్యల్లో పితృస్వామ్యం ఒకటి. కాని పితృస్వామ్యమే బహుజన శ్రామిక మహిళకు ప్రధాన సమస్య కాదు. కానీ విశ్రాంతి, నీడపట్టున వుండే ఆధిపత్య కులాల మహిళకు పితృస్వామ్య సమస్యనే ఎజెండా జెండా గా వుంది. పితృస్వామ్య విముక్తి అని బహుజన శ్రామిక మహిళల్ని భ్రమ పెడ్తున్నారు తమ ఆధిపత్యాలతో. ఆధిపత్య మహిళలు డాక్టర్లుగా, లాయర్లుగా, ప్రొఫెసర్లుగా, రచయిత్రులుగా, ఉద్యోగినిలుగా, అకాడమిస్టులుగా, ఎన్ జీవో మేనేజర్లుగా, ఆఫీసర్లుగా, ప్రాజెక్టు మేనేజర్లుగా, వ్యాపార సీఈవోలు వంటి అనేక గౌరవ ప్రద వృత్తుల్లో వుండి తమ పితృస్వామ్య ఎజెండానే శ్రామిక‌ కులాల మహిళ ఎజెండాగా నియంత్రిస్తున్నరు. వీరి యి నియంత్రణ వల్ల అణచివేతల వల్ల శ్రామిక కులాల మహిళా సమస్యలు వాటి అస్తిత్వాలు , చర్చలు, గుర్తింపు లు, ప్రత్యేకతలు, విస్తృతులు అభివృద్ధి అట్టడుగున పడిన అంధకారమైనయి. యుట్లా అంధకారంలోకి నెట్టి వేయబడడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. యిదంతా వ్యవస్థీకృతమే.

మహిళలంతా ఒక్కటేనని నినదించే నీడపట్టులు, పబ్లిక్ కక్కోసులు కడిగేకాడ, పీతిబకెట్లు మోసేకాడ, అడ్డకూలీగా, నిర్మాణ రంగ కూలీగా ఒక్క అగ్రకుల మహిళ ఎందుకు లేదో చెప్పరు. తట్టలు మోసేకాడ, యెట్టికాడ బాంచ పనుల కాడ అధిపత్య కులం మహిళ కనిపించని కుల కుల జెండర్ రాజకీయాల్ని మాట్లాడరు, అప్రస్తుతం చేస్తారు.

ఉత్పత్తి రంగ పరిశ్రమల్లో నలిగే బహుజన కులాల మహిళల కే చదువులు ఎందుకు లేవో, మెరుగైన జీవితాలు, ఉద్యోగాలు, మానవీయ విలువలు, హక్కులు ఎందుకు లేవో చర్చ జరిగేది. శ్రమ కులాల మహిళలకే ఆకలి, అవమానాలు అత్యాచారాలు, హింసలు, అంటరానితనాలు ఎందుకు చుట్టుకున్నామో వాటి పరిష్కారాలు మాట్లాడని మౌనాలు.

శ్రామిక కులాల మహిళల మీద కులాధిపత్యాలు, అసమానతలు మగాధిపత్యాలు ఎంత నిజమో, అగ్రకుల మహిళాధిపత్యాలు, అణచివేతలు, అసమానత్వాలున్న యనేది కూడా అంతే నిజము.

పితృస్వామ్యాల విముక్తి జరిగితే.. శ్రామిక మహిళల ఆకలి, అంటరానితనాలు, అవమానాలు కులాధిపత్యాలు, దొరతనాలు, మలాన్ని ఎత్తిపోసే చేతులకు విముక్తి దొర్కుతదా, జోగినీ పేరుతో దళిత కులాల ఆడవాల్లని వ్యవస్థీకృత వ్యభిచారంలోకి నెట్టబడ్తున్న దురాచారానికి విముక్తి జరుగుతదా! పితృస్వామ్య విముక్తి అంటరాని, ఆదివాసీ కులాల మీద జరిగే అత్యాచారాలకు, అఘాయిత్యాలకు, హింసలకు, ధ్వంసాలకు విముక్తి కల్పిస్తుందా! అనే అంశాలు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినము మార్చి 8 న అయినా మాట్లాడుకోవాల్సిన సందర్భము‌.

శ్రమ ‌కులాలైన బహుజన మహిళల్ని, శ్రమబైట వున్న సంపదలు ఒనగూడిన ఆధిపత్య కుల మహిళల్ని ఒక్కటేనని ఒక్కగాట గట్టి జరిపే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు శ్రమకులాల మహిళల్ని వారి సమస్యల్ని, అణిచి వేయడానికి జరిగే ఉత్సవాలుగా మారినాయి. శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న కనీస వేతనాలు, అసమాన వేతనాల వివక్షలు, పని గ్యారంటీ లేని పరిస్థితులు, ఉపాధి రంగంలో ఎదుర్కొంటున్న వివక్షల మీద పోరాడే స్పూర్తిగా మార్చి 8 మహిళా దినోత్సవాన్ని జరపాలి. అసంఘటిత రంగాల్లో వున్న వివక్షలు కోకొల్లలు. నిర్మాణ రంగంలో మహిళలు పారకాల్లె, ఆడమేస్త్రీ కనబడదు. అట్లనే వైరింగ్, ప్లంబింగ్, బస్సు, లారీ ‌డ్రైవర్లు, నాగలి దున్నెపని, సింగరేణి బొగ్గుబాయి కార్మికురాలిగా, డప్పు, బ్యాంకు మేళం లాంటి అనేక వృత్తి పనుల నుంచి దూరం పెట్టడం వల్ల ఉపాధి అవకాశాలు శ్రామిక మహిళల కు తగ్గి పోయినయి. ఎవరూ చేయని హీన వృత్తులే యీ మహిళల కు ఆధారమైన పరిస్థితులు. వీటి పరిష్కారాల కోసం అంతర్జాతీయ మహిళా పోరాట దినోత్సవమైన మార్చి 8 స్పూర్తి కావాలి.

కమ్యూనిస్టు విప్లవ శక్తులు కూడా పేరుకు మార్చి 8 ని శ్రామిక మాహిళా పోరాట దినమని పిలుపునిస్తున్నా, మహిళలంటే మహిళలే అనే గంపగుత్త రాజకీయమే చేస్తున్నాయి గానీ మగవాల్ల లాగనే మహిళలు కూడా సమానంగా లేరనీ చేస్తున్నాయి‌గానీ, మగవాల్ల లాగానే మహిళలు కూడా ‌సమానంగా లేరనీ సామాజికంగా ఆధిపత్య, అణచి వేత కుల జెండర్లుగా వున్నారనే వాస్తవాల్ని శ్రామిక కులాల మహిళల పక్షాన మాట్లాడకపోవడం కూడా శ్రామిక ‌కులాల మహిళల మీద అణచివేతగానే చూడాలి.

మెజారిటీ మహిళలు గా, ఉత్పత్తి శక్తులుగా వున్న బహుజన శ్రమకులాల మహిళలుగా యీదేశ అభివృద్ధి కి, యీ సమాజ సంపత్తి కి అనేక రంగాల్లో రాల్లెత్తిన పోరాట మహిళల స్పూర్తి గా జరుపుకోవడమే, నిజమైన అంతర్జాతీయ శ్రామిక మహిళల దినోత్సవము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com