
వీపు లెక్క వెనుక వెనుకనే ఉంటది
చెల్కమీద వాలిన గడ్డిచిలక లెక్క రుసరుసమంటది
కండ్లు కోల్లాగ చూపేసుకొని వెతకాలి
పెయ్యి జలజలమనే దుఃఖాల పొంటి నడవాలే
ఎండిపోయి చిగురుపెడుతున్న చెట్టు కింది నుంచి
ఇన్ని కట్టెపోగుల్ని ఏరుకున్నట్టు
పొద్దును నడపాలె
మొగురానికి చీరజుట్టినట్టు,
వాసాలకు పెండ్లినాటి భాషింగాలు కట్టినట్టు
రామసక్కని దునియా కాదు ఇది
పొక్కిలైన వాకిలిలెక్క
ముక్కలైన ముఖాలు రోజూ అగుపడతై
కానికాలం కాళ్ళల్ల కట్టెలువెడుతనేవుంటది
బలుసాకుమీద నీటి బిందువు బుక్కెడు బువ్వలెక్కనే గొట్టొచ్చు
జారిపోవచ్చు, జాగ్రత్తగ దోసిట్ల ఒదిగిపోవచ్చు
పేంన్తనే ఉండాలే,
నేస్తనే ఉండాలే
బతుకు బిడ్డా ఇది
ఒంటిని అంటిపెట్టుకునే వెత బిడ్డా ఇది
సుఖాలతోని గట్టిపడొచ్చు,
మిడ్తలు పచ్చని చేనును చుట్టేసినట్టు
యుద్ధాలు రావచ్చు
వత్తిలా వెలగాల్సిన పత్తి నల్లరేగడిల ఉట్టిగనే
రాలిపోవచ్చు
ఒర్రె సూపుండాలే
మిర్ర మనసుండాలె
జీవితమంటేనే గిది బిడ్డ
ఎత్తింపుల వ్యధబిడ్డ