
లెవీస్ గ్లుక్ ..సాహితీ విభాగంలో నోబెల్ పొందిన అమెరికా కవయిత్రి
అమెరికా కవయిత్రి లెవీస్ గ్లుక్కు, సాహితీ విభాగంలో నోబెల్ పురస్కారం-2020 లభించింది. 2006లో గ్లుక్ రచించిన ‘అవెర్నో’ కవితా సంకలనం నోబెల్ బహుమతికి ఎంపికైంది. తన కవితలలో, కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి వివరించారు కవయిత్రి గ్లుక్.
లెవీస్ గ్లుక్ 1943, ఏప్రిల్ 22న న్యూయార్క్లో జన్మించారు. 1968లో ‘ఫస్ట్బోర్న్’ పేరుతో మొట్టమొదటి కవిత రాసిన గ్లుక్ అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. 1980లో వచ్చిన డిసెండెంట్ ఫిగర్ ఆమెను విస్మరించలేని కవయిత్రిగా నిలబెట్టింది. లెవీస్ గ్లుక్ రాసిన కవిత్వం “ద ట్రయంప్ ఆఫ్ ఎకిలీస్” (1985) లోని మాక్ ఆరెంజ్ కవిత స్త్రీవాద గీతమై నిలిచింది. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా
సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను గ్లుక్ రచించారు. తన జీవితంలో ఎదురైన వైఫల్యాలు, చేదుఅనుభవాల గుర్తులను తన సంపుటిల్లో ప్రతిబింబించారు లెవీస్ గ్లుక్. ‘హృద్యమైన, స్పష్టమైన ఆమె కవితా స్వరం వ్యక్తి ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తుంది’అని నోబెల్ బహుమతి ప్రకటన సమయంలో, స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి మాట్స్ మామ్ పేర్కొన్నారు.
చిరుప్రాయంలోనే రచనలు ప్రారంభించిన లెవీస్ గ్లుక్, 77 ఏళ్ల వయసులోనూ అవిరామంగా రాస్తూనే ఉన్నారు. మార్పు కోసం తపన పడుతూ, మళ్లీ అదే మార్పు ఎదురైనప్పుడు విలవిల్లాడుతూ అచ్చం సగటు మనిషిలాగే ఆమె కవిత్వం ఉంటుంది. తను రాసే ప్రతి సంపుటిలోనూ, కొత్తదనం, ప్రత్యేక శైలితో పాఠకులను ఆకట్టుకుంటారు లెవీస్ గ్లుక్