తెలంగాణలో సాహితీ అన్వేషణకు బీజాలు వేసిన నాటి తెలంగాణ పండిత పరిశోధకుడు…

తెలంగాణ వైతాళికుడు జమ్మిచెట్టు మీది అస్త్రం వంటివాడు. శత్రువు చుట్టుముట్టగానే గోవుల వంటి జనాన్ని, అభిమానధనాన్ని కాపాడటానికి కదనంలోకి దూకే పాండవుడవుతాడు. తాండవమాడుతాడు. మరి సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) సవ్యసాచి! రెండు ప్రపంచయుద్ధాలు చూసినవాడు. విశాల జగతిని చూసి జీవితగతి సూత్రాలను అర్థం చేసుకున్నవాడు. పాలమూరు జిల్లా బోరవెల్లి గ్రామంలో పుట్టినా కర్నూలు, హైదరాబాదు, మద్రాసులలో చదివి హైదరాబాదును కార్యక్షేత్రంగా మలుచుకున్నవాడు. అయితే ఆయన తిరుగాడిన భౌతిక ప్రపంచం కంటే మధించిన మనో ప్రపంచం సువిశాలమైనది. ‘జ్ఞానం’ – అదీ ఆయన నిక్షేపించుకున్న నిధి. హిందువుల పండుగలు, రామాయణ విశేషములు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, వెయ్యికి పైగా వ్యాసాలు, 24 కథలు – మొదలైనవి ఆ నిధిలో సగం మాత్రమే. విధి శీతకన్ను వేసింది కాని, మిగిలిన సగం అక్షరరూపం పొంది వుంటే భారతదేశంలోని గొప్ప రచయితలలో ఒకరుగా విఖ్యాతి చెంది వుండేవాడు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి శుభాకాంక్షలతో, మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిగారి సంపాదకత్వంలో వెలువడ్డ ‘సురవరం – తెలంగాణం’ అన్న ఉధ్రంధం చదివిన తర్వాత ఎవరికైనా పై భావాలు కలుగుతాయి. మనకాలపు గొప్ప వ్యక్తికి నిరంజన్‌రెడ్డి గారు సమర్పించిన నివాళి కూడా గొప్పగానే వుంది. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య జయధీర్ తిరుమలరావు, డా|| గంటా జలంధర్ రెడ్డి, డా|| సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ వంటి కార్యదక్షులు సురవరం శతజయంతిని నిర్వహించారు, అనేక గ్రంథాలు ప్రచురించారు. ఇతర సందర్భాలలో నివాళులర్పించారు. సురవరం రాసినవి మామూలు పుటలు కాదు. చరిత్ర పుటలు. ఇన్నేండ్లు గడిచినా వారి ‘

రామాయణ విశేషములు’, ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ వంటి గ్రంథాల మీద సమగ్ర పరిశోధనలు వెలువడలేదన్నది విజ్ఞుల అభిప్రాయం. ఈ గ్రంథంలో సురవరం ‘నేను చేసిన కృషిని ఎవ్వరును గమనింపకపోవుట నా దౌర్భాగ్యము’ (పుట 98) అని ఆవేదన వ్యక్తంచేశాడు. ఇందుకు చారిత్రక కారణాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే తెలంగాణలోని గొప్ప రచయితలంతా మరుగునపడే దుస్థితి దాపురించింది. మన పండిత పరిశోధకులకు గ్రహణకాలపు సూర్యచంద్రుల గతి పట్టింది.

‘సురవరం-తెలంగాణం’ గ్రంథంలో – కవిత్వం, సంపాదకీయాలు, వ్యాసాలు, పీఠికలు, ప్రముఖుల లేఖలు, సమకాలీనుల స్మృతి కవిత్వం, సురవరం పై వ్యాసాలు, సురవరంపై నేటితరం, సురవరం బాటలో – అన్న తొమ్మిది విభాగాలున్నాయి.

సురవరం కవిత్వంలో చెప్పుకోదగ్గది ‘వెట్టివానిపాట’. ఇది గోలకొండ పత్రికలో 1931 మార్చిలో వచ్చింది. నిమ్నకులాలకు చెందిన వెట్టివాండ్లు కట్టుబానిసలు. సురవరం కవిత ఉత్తమ పురుషలో వెట్టివాడి సహజమైన కులమాండలికంలో హృదయవిదారకమైన జీవితచిత్రణతో కనిపిస్తుంది. ముగింపులో వెట్టివాడు దుర్భరమైన వ్యవస్థమీద తిరుగుబాటు ప్రకటిస్తాడు. శ్రీశ్రీకి కూడా తట్టని కవితా వస్తువిది. 15 సంవత్సరాల ముందే రైతాంగపోరాట పరిణామాన్ని సురవరం ఊహించాడు. సురవరం ఈ కవితను రచించిన రెండేండ్ల తర్వాత ఆంధ్రా

ప్రాంతపు కవికొండల వెంకటరావు ఇట్లాంటి ఇతివృత్తంతో ‘నక్కాసామిగాడు’ (1933) అన్న గేయం రాశాడు. దీన్ని విమర్శకులు ప్రస్తావించారు తప్ప అంతకన్నా ఉత్తమంగా ఉన్న సురవరం రచనను ప్రస్తావించలేదు!

సురవరం సంపాదకీయాలు’ అసంఖ్యాకాలు. ఎక్కువగా ‘గోలకొండ పత్రిక’ పాలిసీని తెలియజేసేవి. ఎవరో ఆంధ్రప్రాంతపు విమర్శకుడు తెలంగాణ భాష గ్రామ్యము’ అని సంకర స్వభావం కలిగిందని రాస్తే ఆత్మాభిమాన దురంధరుడైన ప్రతాపరెడ్డి కోస్తాంధ్ర

ప్రాంతపు భాష ఆంగ్ల భాషాసాంకర్యం పొందలేదా? అని ప్రశ్నించాడు. అక్కడి స్త్రీలు కూడా దైనందిన వ్యవహారంలో వాడే – ‘అసలు, కబుర్లు, సరదా, హద్దు, రోజు’ వంటి మాటలు

ఉర్దూ పదాలు కావా? అని కూడా ప్రశ్నించాడు. కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్లు

మొదలైన అన్ని తెలంగాణ జిల్లాలలో అచ్చమైన తెలుగు వ్యవహారికం వుందని తెలియజేశాడు. 1929 లో సురవరం చేసిన ఈ సూత్రీకరణ పునాదిగా ఆ తర్వాతి కాలంలో కాళోజీ వంటివారు “రెండున్నర జిల్లాలదె దండిబాస అయినప్పుడు/ తక్కినోళ్ళ నోళ్ళయాస తొక్కి నొక్కబడ్డప్పుడు / ప్రత్యేకంగా రాజ్యం పాలుగోరడం తప్పదు” అని అన్నారు.

ప్రతాపరెడ్డి వెయ్యికి పైగా వ్యాసాలు రాశాడు. భాష, సాహిత్యం , సంస్కృతి, విజ్ఞానం, రాజకీయం, సమాజం, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అనేక అంశాలమీద విజ్ఞాన సర్వస్వ స్వభావం (encyclopedic nature) వున్న వ్యాసాలు రాశాడు. ‘తందానకథలు’ అన్న వ్యాసంలో మూలాలలోకిపోయి చారిత్రక నేపథ్యాన్ని వివరించటం కనిపిస్తుంది. ‘మార్గ కవిత వచ్చి దేశి కవితను

ముంచిపోయింద’ని, అనటమే కాదు, సంస్కృతము వలన తెలుగు భాషకు అంతగా లాభము చేకూరలేద’ని కూడా వ్యాఖ్యానించాడు. అధిక సంఖ్యాకులైన పామరజనుల మీద, మాతృభాష అయిన తెలుగు మీద అపారమైన ప్రేమాభిమానాలున్నవాడు మాత్రమే ఇంత

నిర్భయంగా చెప్పగలడు. ‘దేశింగురాజును, తాండ్రపాపారాయని, బ్రహ్మనాయని, సదాశివరెడ్డిని జనులెంత ప్రేమింతురో అందు సహస్రాంశము కూడా వసురాజును, స్వారోచిషమనువును, నలుని, తుదకు పారిజాతాపహరణములో మెత్తని తన్నులు తినిన కృష్ణుని ప్రేమింపరు’ అని వ్యంగ్యోక్తితో ఆగకుండా, జాతిలో – ‘సన్నగిల్లుచుండిన ఉత్సాహ శౌర్య ధైర్యములను నిలబెట్టినదేదన తందాన సాహిత్యమే యనవలెను’ అంటూ సంస్కృతి జాతి ఔన్నత్యానికి ఎట్లా దోహదం చేయగలదో స్పష్టం చేశాడు. 1921 నాటికి విద్యార్థిగా ఉన్న సురవరం దృష్టి ప్రజాసాహిత్యం , కళల మీద పడింది! భవిష్యత్తులో బిరుదురాజు రామరాజు వంటి జానపద పరిశోధకులకు కొత్త తోవ చూపించింది సురవరం పరిశోధన వ్యాసాలే. అంతేకాదు, వామపక్ష భావాలకు ఆటపట్టయిన అభ్యుదయ రచయితల సంఘం స్థాపన (1943)కు 20 సంవత్సరాల ముందే ప్రతాపరెడ్డి ప్రదర్శించిన ప్రగతిశీల భావాలు ఇతర భాషల్లో చాలా అరుదు.

‘మన రాజ్యాంగము’ అన్న పీఠికను చదివితే ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞ తెలుస్తుంది. 1950 జనవరి 26 నుండి అమలులోనికి వచ్చిన భారత రాజ్యాంగానికి హిందీలో వచ్చిన అనువాదాలను చదివాడు. అవి ఆయనకు నచ్చలేదు. అందుకు కారణాల్లో ఒకటి – ‘అడ్డదిడ్డిగా హిందీవాదులు సృష్టించిన పదములు సరికానివైన తక్కిన భాషలవారేల స్వీకరింతురు?” అంటూ అవతలివారి నిర్లక్ష్య నిరంకుశత్వాలను తన మాతృభాషాభిమానంతో పరాస్తం చేస్తాడు. తెలుగులో కొన్ని సంస్థలు చేసిన ప్రయత్నాలు ఆయనకు నచ్చలేదు. చివరకు పర్చా వెంకటేశ్వరరావు గ్రంథం ఆయనకు నచ్చింది. ఈ సందర్భంలో దేశదేశాల స్వాతంత్ర్యోద్యమాలను గూర్చి, రాజ్యాంగాలను గూర్చి అనేక అంశాలను ప్రస్తావించి పాఠకులను అబ్బురపరుస్తాడు. దీన్ని ఒకరకంగా జ్ఞానదానం అనవచ్చు.

‘ప్రముఖుల లేఖలు’ అధ్యాయం విశ్వనాథ సత్యనారాయణ, దీపాలపిచ్చయశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి ఆనాటి గొప్ప రచయితలు ప్రతాపరెడ్డికి రాసిన లేఖలున్నాయి. వీటన్నిటిని చదివితే 1940 దశాబ్దంలో మొత్తం తెలుగుదేశపు సాహిత్యరంగానికి ప్రతాపరెడ్డి కేంద్రబిందువుగా ఉన్నాడనేది అర్థమవుతుంది.

ఆధునిక రచయితలు చాలామంది సురవరం బహుముఖశేముషిని గూర్చి రాశారు. వాటిలో ముఖ్యమైన వ్యాసాలను ‘సురవరం పై నేటి తరం’ అన్న శీర్షికకింద ప్రచురించటం జరిగింది. సాహిత్య సామాజిక రంగాలకు నిబద్ధతతో సేవలందించిన తెలంగాణ తేజోమూర్తులను గూర్చి వివిధ రచయితలు చేసిన రచనలను ‘సురవరం బాటలో’ అన్న శీర్షిక కింద ప్రచురించారు.

గోలకొండ పత్రికలో ‘స్త్రీలకు స్వాతంత్ర్యము అనవసరము” అన్న వాదం బయలుదేరినప్పుడు యెల్లాప్రగడ సీతాకుమారి నాయకత్వంలో రచయిత్రులు ప్రతివిమర్శలు గుప్పించారంటున్నారు ఇల్లిందల సరస్వతీదేవి (పు.227). అలజడి కొంత చల్లారిన తర్వాత ఆ రెచ్చగొట్టే వ్యాఖ్య తానే చేసినట్లు ప్రతాపరెడ్డి ఒప్పుకొని, ‘ఒరిపిడి వల్లనే కదా బంగారానికి మెరుగువచ్చేది’ అని జవాబిచ్చాడట! బంగారమంటే స్త్రీలకుండే సెంటిమెంట్

తెలిసిన ప్రతాపరెడ్డి పనిలో పనిగా గోలకొండ పత్రిక సర్క్యులేషన్ కూడా పెంచుకొని ఉంటాడు.

సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిగారి సంపాదకత్వంలో వచ్చిన ‘సురవరం – తెలంగాణ’ అన్న ఉదంథం చిరకాలంపాటు సాహితీ దాహార్తుల పాలిటి జీవనదిగా ప్రవహిస్తుందనటంలో సందేహం లేదు. పనిలో పనిగా ఆయన రచించిన వెయ్యి వ్యాసాలను పుస్తకంగా ప్రచురించే పక్షంలో అది సురవరం మాగేసిన మధురఫలాలను పాఠకులకు అందుబాటులోకి తెస్తుందని ఆశిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com