మనదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం.. జ్ఞాన్‌పీఠ్. దీన్ని ఏటా భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ప్రదానం చేస్తోంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషలకు సంబంధించిన సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును అందిస్తారు.

కేరళకు చెందిన ప్రముఖ సాహితీవేత్త అక్కితమ్ అచ్యతన్ నంబూద్రి 2019 జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. మలయాళ  సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్, కుమారనెల్లూర్‌లో 1926, మార్చి 18న జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. వాటిలో 45 పద్యాలతో కూడిన ‘ఖండ కావ్యాలు’, ‘కథా కావ్యాలు’, ‘చరిత కావ్యాలు’, పాటలు ఉన్నాయి. ఆయన రచించిన వాటిలో ‘వీరవదమ్‌’, ‘బలిదర్శనమ్‌’, ‘నిమిష క్షేత్రమ్‌’, ‘అమృత ఖటిక’, ‘అక్కితమ్‌ కవితక’, ‘ఎపిక్‌ ఆఫ్‌ ట్వంటీయత్‌ సెంచరీ’, ‘అంతిమహాకలమ్‌’ బాగా ప్రాచుర్యం పొందాయి. అక్కితమ్‌ కవిత్వం కరుణను ప్రతిబింబిస్తుంది. భారతీయ తాత్విక, నైతిక విలువల ముద్రలు కనిపిస్తాయి. సంప్రదాయ, ఆధునికతకు మధ్య వంతెనలా ఉంటూ.. వేగంగా మారుతున్న సమాజంలోని మానవ భావోద్వేగాలను లోతుగా వివరిస్తాయి. ఆయన రచనలు అనేక భారతీయ, విదేశీ భాషల్లోనూ అనువాదమయ్యాయి.

మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డు అందించింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలను అక్కితమ్ అందుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com