
ఉన్నట్టుండి
ఎవరోతరిమినట్టే పడుతుందీ వాన!
ఈ ఇరుకు సందుల్లో దీనికేం పనో
బండలపై మొక్కలు కూడా మొలవని మరిచిపోయినట్టుంది
రోజుకో నాలుగు గట్టిచినుకులు చాలిక్కడ
ఈ కాలుష్యపు నేలపై అలుకుచల్లడమే పెనుతుఫాను!
*****
వర్షమా
నువ్వెందుకు కురుస్తున్నావో గానీ
ఇక్కడిక్కడే కట్టివేయబడుతున్నావ్
అప్పండబ్బాలాడినట్టు
మ్యాన్ హోల్స్ లో దుంకుతావ్
సందుల్లో తోచకుండా పరుగు తీసి
ఆటోల్లో…. కారుల్లో…బస్సుల్లోకీ దూరి పోతుంటావ్
నిశ్శబ్దంగా నిద్రిస్తున్న ఇళ్లల్లోకి
అతిథిలా చొరబడి
నీ ప్రేమతో అన్నిటిని అందరినీ ముంచి పడవలను చేసి ఆడుకుంటావ్
ఇది నీ స్థావరం కాదనితెలిసినా మళ్ళీ ఇక్కడిక్కడే తిరుగుతున్నావ్
నిన్నని ఏంలాభం….
ఆ వేడి మేఘాలకే చెప్పాలి
మా పల్లెల పొలిమేరల్లో తిరగమని
ఐనా….
నాకు పది చేతులుంటే బాగుండును
ఈ వర్షపు మేఘాలను ఎత్తుకుపోయి
వానలేనిచోట స్వేచ్ఛగా తిరగమని వదిలేసి వచ్చేదాన్ని!
పిచ్చివాన మురికిలో మునిగిపోతుందిక్కడ
మట్టిలేదని తెలియదనుకుంటా!
మా పల్లెల నేలన్నా రమ్మనదీ వానను
చల్లగ తడిసేందుకు!!
అరుణ నారదభట్ల