ఎనుకట ఎల్లమ్మలు

రాజ్యాలు ఏలినారని

ఢిల్లీని ఢీ కొట్టినారనీ

వన్నియార్లు వరుసబెట్టి పాడుతుంటే

చెవులు తేనెల కోనలు అయితయి

కండ్ల కంతల్ల పండుకున్న కలల కథనాలు కదనాల పదాల పాడుతయి మన కండ్ల ముందటనే కాన్షీరామ్ బహుజన హితాయ

బహుజన సుఖాయ  అంబేద్కరీయాయ తో

ఎట్టి బిడ్డను అధికార

అందాలెక్కించిన అద్భుతాలు

కాలం కండ్లల్ల ‘మాయ’ ని చరితలు,

పియ్యెత్తిన మోతలు,

పిడికెత్తిన సేతులు ,

పీఠాలు ఎక్కాలే .

బూమికి చాతిచ్చి బువ్వ బండిచ్చినా  పుడిసెడు నేల లేని నెలువులు,

మోకాలు బంటి బురద వరదల్ల

నడుములిరిగే నాట్లు ,

కోతల మోతలు,

ఎండ పనుల్ల అంగలారిసే

ఆకలి తట్టలు,

పట్నమoతా ఆకాశంలో చంద్రుని

పొoదుకునే ఇంద్ర బవంతులనెగరేసినా

నీడలు నిలబడని తావులు,

రోడ్డు మొకమ్మీన పారే

రోత సొల్లును కసువుల్ని కడిగి

ఎత్తిపోసే సీపురు కట్టలు ,

సఫాయి తట్టలు ,

శిశిరాలు పూసే పునాసలు,

గ్రీష్మాలు మోసే అమాసలు,

పుట్టుక పునాదుల్లో

అంటరాని కంటకాలు ,

దించబడి దీపాలార్పిన దిక్కులు ,

కూటికి గుడ్డకు చదువుకు సంపదకు

ఆమడలకు తరమ బడిన అంత్యజులు,

దరిలేని దరువులు వలిగిన దప్పులు వక్కలైన ముక్కు పుల్లల మూలాలు ,

గడీల గావుల్ల పలిగిన

గాజుల గాయాలు,

పిడికిళ్ళయి పీఠాలెక్కితే..,

యీ బూగోలాన్నే  కాదు

ఏ గోళాన్నయినా శోకమ్ లేని

లోకంజేసే ఆశోకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com