తగువులు మేల్కొంటాయి

పరువులు బరువులు తగ్గి

వేగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది

చెట్టుపైన వాలిన చిలుకలు చేదిరిపోయి శబ్ద కాలుష్యం లో కరిగి విలుప్తమై చరిత్రలో అతుక్కుని పోతాయి

సముద్ర ప్రశాంతతను దెబ్బతీసే తుఫాన్ బడబాగ్ని సృజియించి చీకటి మండలంలోని జీవుల్ని దహించివేస్తాయి

చెట్టాపట్టాలేసుకున్న చేతులలో కత్తులు మొలచి కుత్తుకలను నరుకుoటూ

రుధిర విన్యాసం జరుగుతుంది

మంగలం లో వేయించిన మక్కగింజలా మనసు ముక్కలు ఎగిరిపడి

తలలు మోకాళ్లపై నిలబడుతాయి

గొంతుకు గండిపడి మాటల చేప పిల్లలు మనసు గాలానికి చిక్కి విల విల లాడుతాయి

ముఖ కుహరం లోంచి అవిర్లు విడివడితే

మేఘాలు సభ జరిపి ఉరుముల నజరానా ప్రకటిస్తాయి

భాష కరుకెక్కి పెట్టిన చురకలకు గాయం కనపడని నొప్పులు లేచి నిలబడి నిశ్శబ్దంగా నిలదీస్తాయి

మాటకు తాళం వేయక పోతే ఆలి ఓపిక కొంగు భంగపడుతుంది ఆత్మీయత వంటింట్లో ఆమ్లెట్టవుతుంది

ఇంటికి గడియ పెట్టకున్నా

లాకర్ గది మూయకున్నా

మాటలు కొన్ని మూతకట్టుకొని హృదయపెటికలో దాచుకోవాల్సిందే లేకుంటే

వెన్నెల వెలుతురు మీద మనిషి నీడ పడకుండా

గ్రహణం గూడు కడుతుంది

తాళo వేయటం తప్పితే

దొంగల మాట అటుంచి ఇమాన్ దార్ జీబ్ కూడా

వజీఫా పొందాల్సిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com