భావ భౌతిక వాదాలు ఏకముఖంగా చూపెడుతూ…

ఆత్మవత్ సర్వభూతాని భగవంతుని వాక్యం. తన వలనే తన చుట్టూ ఉన్న ప్రాణి సమూహం ఉన్నది అని దీని అర్థం. భగవంతుడు తన వలెనే మిగిలిన ప్రాణులు అనడంలో నేను అన్ని ప్రాణులలో ఉన్నానని అని చెప్పడం అక్కడి ఉద్దేశం. మరి మానవులు నేను అన్న మాటను తమ వైఖరిని చెప్పే ఉద్దేశంతో వాడుతారు. నేను ఈ మాట అన్నాను, నేను ముందే చెప్పాను, నేను అనుకున్నది ఇదే. నేనే ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టాను అన్న ఈ మాటల సందర్భం లో ని నేను లక్ష్యం వేరు అని తెలుస్తూనే ఉంది. నేను శ్రీ శ్రీ సామూహిక చైతన్యం అన్న అర్థంలో ఉపయోగించే విమర్శకులు అంటారు . కాల్పనిక అభ్యుదయ విప్లవ యుగాలలోని నేను ఇచ్చిన అర్థం సమాజం సమూహాలను కేంద్రంగా చేసుకున్నట్లయితే వాసిలి వసంతకుమార్ నేను అన్న యౌగిక కావ్యం అంతర్ బహిర్జగత్తుల సంవాదం. అయితే ఇది ఆత్మవిశ్వాస మాధ్యమంగా ఎలా వ్యక్తం అవుతుంది అని పరిశీలించడం ఈ చిరు వ్యాసం లక్ష్యం.

ఆత్మవిశ్వాసము అన్నది భౌతిక స్థైర్యం ద్వారా వచ్చే స్వభావమా? అంతశ్చైతన్యం ద్వారా వ్యక్తమయ్యేస్వరూపమా? అని ముందు ప్రశ్నించుకోవాలి. అతడిలో ఆత్మవిశ్వాసం ఉంది అని మనం గుర్తించేది అతడి భౌతిక స్వరూపం వల్లనే. భౌతిక స్వరూపం అలా ఉండడానికి కారణం మానసిక సంతులన. మనసు ప్రభావం శరీరం మీద ఉంటుంది. శరీరం మనసు స్థితిని వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఆత్మవిశ్వాస మాధ్యమ నేను అంతర్భహిర్జగత్తుల సమన్వయం అని ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ తాత్పర్యం ఏమిటి అంటే మనసు స్థితిని శరీరం వ్యక్తం చేస్తుంది. అది ఇతరులకు ఆత్మవిశ్వాసంగా శరీరం ద్వారా మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆత్మ విశ్వాసం తనకు ( నేను) అంతస్సు నుంచి బాహ్యానికి ప్రయాణించేది కాగా ఇతరుల చూపుకు బాహిర, స్థితినుంచి అంతస్సుకు ప్రయాణించేది. ఇది ఎటునుంచి ఎటు ప్రయాణించినా దాని స్వభావం మాత్రం అంత శ్చేతనకు సంబంధించినదే.

అనుభావ కావ్యం తాత్విక కావ్యం యౌగిక కావ్యం అన్న మాటలు పరి భాషలుగా కొంత స్థిరపడటానికి జరుగుతున్న ప్రయత్నం ఇటీవల కనిపిస్తుంది. అనుభావ కావ్యం మార్మిక కవిత తోడిదైతే , తాత్విక కావ్యంలో జీవిత పరమార్థ బోధన, ఉనికి పట్ల అవగాహన సత్య అన్వేషణ అన్నవి ఉంటాయి. మరి యౌగిక కావ్యంలో ఏముంటుంది. కేవలం బాహ్య జగత్తో అంతర్ జగత్తో ఉండదు. యోగ శారీకరంగా చేసే ఒక సాధన దాని పరమార్థం మానసిక సంతులన. స్థిత ప్రజ్ఞత. ఇది దైవికం అని యోగ శాస్త్రం చెప్పదు. ఇది అభ్యాసం సాధ్యం మాత్రమే. అభ్యాసం శారీరక మానసిక అంశాల సమ్మేళనా రూప ప్రక్రియ. ఇది ప్రయత్న సాధ్యమూ, సాధనే తప్ప తాంత్రిక విద్య కాదు. ఈ విషయాన్ని నేను అన్న యౌగిక కావ్యం బోధిస్తుంది . అదిే యౌగిక కావ్యం అన్న సాహిత్య ప్రక్రియకున్న స్వభావం. కావ్య స్వభావమే ఆత్మవిశ్వాస మాధ్యమం అని తెలుస్తుంది. ఈ ఆత్మ విశ్వాసాన్ని మనలో మనం పరీక్షించుకోవాలంటే దానికి అభ్యాసం కావాలి. సాధన కావాలి. దీని వలన జ్ఞాన కర్మేంద్రియాలపై నిగ్రహం, స్వీయ నియంత్రణ అన్నవి మనిషి పొందుతాడు. భోజరాజీయం లోని వశిష్ట అగస్త్య సంవాదానికి సంబంధించిన కథ ఇటువంటి స్వీయ నియంత్రణని చెబుతుంది. దేనిమీద విపరీతమైన యావలేని తనాన్ని చెబుతుంది. స్వీయ నియంత్రణ అభ్యాస సాధ్యమైనది అందుకు యోగ దారి చూపుతుంది. ఆ స్థిరమైన చిత్తం ప్రయత్న సాధ్యమే కానీ అయత్న సిద్ధి కాదు. ఆ సత్యాన్ని బోధించడానికి ఆధునిక చేతనతో వాసిలి వసంతకుమార్ నేను అన్న యౌగిక కావ్యం రచించారు.

నేను కావ్యంలో 7 పథాలున్నాయి. పథం అంటే దారి. దారిని నడక ద్వారానే, ప్రయాణం ద్వారా మాత్రమే కొలవవచ్చు, తెలుసుకోవచ్చు. ఇవి పరిణామ, ప్రమోద , ప్రమాణ, ప్రస్థాన, ప్రయోగ, ప్రవిమల, పరమ పథాలు. ఇవి భౌతిక స్థితి నుంచి ఆత్మిక స్థితికి ప్రయాణించిన యోగి మార్గానికి చిహ్నాలు. పరిణామంలో మనిషి పెరగడం, ప్రమోదంలో చింతనలో ఎదగడం, ప్రమాణంలో సాంస్కృతికంగా వైజ్ఞానికంగా జీవన ప్రమాణాలను ఉన్నతీకరించుకోవడం, ప్రస్థానం ప్రయోగం ప్రవిమలం పరమ పథకాలలో భౌతికం మొదలు ఆత్మిక ఆధ్యాత్మికత తత్వాల దాకా ఎదిగిన, ప్రయాణించిన మానవుడు కనిపిస్తాడు. భౌతికం పరిణామంలో, ప్రకృతిలో ప్రమోదం శాస్త్రంగా ప్రమాణం, ప్రమాణం ద్వారా ప్రస్థానం మొదలై ప్రయోగానికి దారితీసింది. అందులోని ప్రవిమలత్వం మనిషిని పరమ పథానికి చేర్చింది. మనిషి పుట్టి పరిణామంలో ప్రకృతితో మమేకమై తన జీవితానికి ఒక ప్రామాణికతను తెచ్చుకుని తన ప్రస్థానం మొదలుపెట్టి ఈ జీవన ప్రయాణంలో జీవిక కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాల నుంచి విమలత్వాన్ని పొంది జీవనంలో ఉత్కృష్ట స్థితిని చేరుకుంటాడు. ఇది భౌతికంగా కనిపిస్తున్న పరిణామం కాగా ఆత్మికంగానూ ఇదే రీతిలో తనను తాను మలచుకుంటాడని నేను ద్వారా ఆత్మవిశ్వాస బోధన చేస్తున్నారు వాసిలి వసంతకుమార్.

నేను అన్న దానిని కొందరు అహం గా చూస్తారు. అహం అన్నది “నేనే” అవుతుంది కానీ నేను కాదు. కాలేదు. నేను ఆత్మవిశ్వాస చిహ్నం మాత్రమే. ఈ యౌగిక కావ్యంలో భౌతికంగా వైజ్ఞానికంగా సాంఘికంగా ఆర్థికంగా ఎదిగిన నేను అహంతో ఎదిగిన రీతికి గుర్తు. భౌతిక స్థితి దీనికి పునాది. దీన్ని జయించాలంటే యోగమార్గం అనుసరించాలి. అది చిత్త వృత్తి నిరోధం, కర్మ కౌశలంతో కూడింది. నైతికంగా, జ్ఞానంగా, సాంస్కృతికంగా, నిస్వార్థంగా ఎదిగిన నేను ఆత్మవిశ్వాస చిహ్నం. ఈ రెండిటికీ ఇదే స్పష్టమైన వ్యత్యాసం. ఈ కావ్యమంతా ఇదే అంశం నేనుగా పరచుకుని ఉంది. అందుకు ఈ కింది కవితా పంక్తులు ఉదాహరణగా నిలుస్తాయి.

కవి చెప్పుకున్నట్లు ఇది మనసు కథనం. – ఇది మనుగడ కథనం ఇది.

మనిషి మనుగడ కోసం చేసే ఒక పోరాటం వలన ఆత్మవిశ్వాసం పొందుతాడు ప్రకృతి రూపం, ప్రకృతి లో తన రూపం రెండు భౌతికమే కానీ ఆ రూపం వెనక ఉన్న చేతనం ఆత్మవిశ్వాసాన్ని బోధిస్తుంది.

నాభి నుండి నాడీమండలం వరకు రూపా విష్కరణ

మత్స్యం నుండి మనువు వరకూ ఇహ ఆవిష్కరణ

నేను జీవితపు దారుల్లో బాలుణ్ని

సంయమనం లో వార్థక్యాన్ని

యోగికంగా కౌమారాన్ని అని అనడంలో భౌతిక మానసిక స్థితుల సమతౌల్యతను కవి భావిస్తున్నారు.

పరిణామానికి

తొలి బీజం గా నేను

తొలి ఇజంగా నేను

తొలి నిజంగా నేను అని అనడంలో బీజం పునాది అయితే ఇజం ఆలోచన నిజం ఆత్మవిశ్వాసానికి సంకేతాలు. ఇది బోధించడానికి ఆ మార్గంలోకి ఆహ్వానిస్తున్నది ఈ యోగిక కావ్యం. నేను లో ఈ ఆత్మవిశ్వాసం ఎన్ని రీతులుగా వ్యాపించి ఉందో ఇందులోని 7 పథాలు తెలియజేస్తాయి. ఈ ఏడు పథాలు షట్చక్రాన్ని ఊర్ధ్వలోక సప్తకాన్ని సూచిస్తున్నాయి.

ఆధారం – భూలోకం – పృథ్వి భూత స్థానం

స్వాధిష్ఠానం -భువర్లోకం- జలభూతం స్థానం

మణిపూరకం- సువ ర్లోకం- అగ్ని భూత స్థానం

అనాహతం- మహ ర్లోకం- వాయు భూత స్థానం

విశుద్ధ చక్రం -జన లోకం- ఆకాశభూత స్థానం

ఆజ్ఞా చక్రం -తపో లోకం -జీవాత్మ స్థానం

సహస్రారం- సత్యలోకం- ప్రమాత స్థానం పంచ భూతాలు, జీవేశ్వరుల నాభి నుండి బ్రహ్మ కపాలం వరకు వ్యాపించి ఉండడాన్ని యోగ మార్గం చెబుతుంది. ప్రకృతి అసమత్వం మన ఆత్మ విశ్వాసాన్ని తగ్గించడం ప్రస్తుత కరోనా పరిస్థితులలో చూస్తున్నాం. దానికి విరుగుడు యోగ అని ఒక అభిప్రాయం వినిపిస్తున్నది. శారీరక స్వస్థత మానసిక ధైర్యానికి కారణం అవుతుంది. అది బాహిర ప్రకృతి నుండి అంతర ప్రకృతి లోకి తెచ్చుకునే మార్గాన్ని యోగ బోధిస్తుంది. అది అంతర్బహిర్జగత్తులోని వసంతంగా మన ముందునిలపడం కోసం ఋషులు ప్రయత్నం చేసారు. . దానికి తన లోపలి విశ్వాన్ని బయటి విశ్వాన్ని భూమికగా చేసుకున్న విశ్వర్షి అందించిన ఒక యౌగిక కావ్యం నేను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com