
ఆశ్వయుజం వస్తున్నదంటే చాలు
ఆత్మ పూలవనమై పోయేది.
వెన్నెలసైతం–పూలపరిమళాలద్దుకొని
మాతోపాటుగా బతుకమ్మ పాటైపోయేది.
పురాణగాధల పల్లవులు
భారతకథల చరణాలు
రామాయణగాథల అక్షరవరుసలు
బతుకు తీపిచేదు జ్ఞాపకాలు
ఒడిదుడుకు జీవిత సత్యాలు
అన్నీ బతుకమ్మ పాటలై
నవరసాల ఏకపాత్రాభినయాలై
ఉమ్మడి గొంతుల సంగీత ప్రవాహపు ఏకతాళంలోకి ఒదిగి పోయేది.
వెండి కంకుల గునుగు వరుసలు,
పసుపు నక్షత్రాల తంగేడు జిలుగులు
ముద్దబంగారాల బంతిఅందాలు
నీలాకాశవర్ణపు కట్లపూల శోభలు
అమ్మ చేతి వేళ్ళ నైపుణ్యపు రుజువుగా.
పువ్వుపైన పువ్వుగా ఒదిగి
గౌరమ్మను శిఖరంపై అధిరోహించుకున్న
పూలగోపురమై సాక్షాత్కరించేది బతుకమ్మ.
అర్థరాత్రి దాటే వరకు ఊరంతాపరుచుకునే
తీరొక్కగొంతు తీపిరాగాలతేనె ప్రవాహాలు
వాడలన్నీ పూలరంగులతో పోటీ పడే తీరొక్కరంగులచీరల ఉద్యానాలు,
కట్టపైన నిండుతంగేడు వనాన్ని నింపుకొని,
నిమర్జన దినానికి తన చల్లని ఒడిలోకి
ప్రేమగా బతుకమ్మను స్వీకరించే వూరిచెరువు
నెర్రలుతీసి దిగులుగా చూసే
అటువైపుగా వెలుతున్నప్పుడల్లా.
నీళ్లులేని చెరువు మట్టిపైన వాడిపోయిన బతుకమ్మను చూసినప్పుడు..
నీళ్లులేక పంటరాక వడలిపోయిన మా నాన్న కనిపించేవాడు.
వీడ్కోలు పాటలతో చేతుల నిండా
నిండు బతుకమ్మని మోసుకొని వెళుతుంటే
మారాకకోసం చెరువంతా పసుపు వెన్నెల పసిడికాంతులతో ముస్తాబయిన చెరువు.
ఎండిన గుండెగా,ఎడారి రేగడిగా
ఏ ఆలంబనకోసమో ఎదురు చూసేది
ఇన్నాళ్ళకు బతుకమ్మలోమళ్ళీ పసిడినవ్వుల చిలిపి గంతులను చూసాను.
తన లోని ఎడారి ఎత్తిపోసుకొని.
చిరుసముద్రమైపోయి పసిపాప నవ్వుల నురగలై కట్టతో సయ్యాటలాడుతున్న చెరువు
అలలను చూస్తున్నాను.
ఇప్పుడు మళ్ళీ చెరువు ఒడిలో చేరడానికి బతుకమ్మ.
బతుకమ్మ రాక కోసం ఒళ్ళంతా నీటి ఒడిని సవరించుకుంటున్న చెరువు.
ఈ ఇద్దరి కలయికల కళాత్మక ప్రేమ
సంగమం అద్భుత దృశ్యంకోసం నేను.
ఇప్పుడొక గాఢ ఆనందానుభూతిని గుండెల్లో మోస్తూ
నేను, బతుకమ్మ, చెరువు…
సీహెచ్. ఉషారాణి
9441228142