అజో-విభొ పురస్కార గ్రహీత అనుమాండ్ల భూమయ్య
అజో – విభా – కందాళం ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం ఇచ్చే ‘విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారం’ 2021 సంవత్సరానికి డా.అనుమాండ్ల భూమయ్య గారికి ఇచ్చారు. పురస్కారంగా యాభైవేల రూపాయలు, ప్రశంసా పత్రం అందజేశారు. ‘సాహితీ వైజయంతి’ సమ్మానోత్సవ విశేష సంచికను వెలువరించారు. పురస్కార సభ 10, ఏప్రిల్ 2021 నాడు రవీంద్రభారతి, హైదరాబాదులో జరిగింది.
ఉదయం జరిగిన సాహిత్య సదస్సులో అజో..విభొ. కందాళం ఫౌండేషన్ పురస్కారక ప్రదాత ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు భూమయ్యగారిని ‘అరుదైన సత్కవి’ అన్నారు.
సభాధ్యక్షులు శ్రీ సన్నిధానం మాట్లాడుతూ – పాండిత్యానికి సంబంధించిన వ్యుత్పత్తి, గ్రంథ రచనలకు చెందిన ఉత్పత్తి రెండూ స్వార్జితాలైన గొప్పకవి భూమయ్య అని వారి తేటగీతి నడకల్లో పద్యవాక్యాంత శబ్దాలు, అక్షరాలు రెండవ వాక్యాల ప్రారంభ శబ్దాలు, ప్రారంభ అక్షరాలు అయి చిన్న చిన్న పక్షిపిల్లల పదాలు లేత ఆకులపై ఆనడాన్ని మనోహరంగా తలపిస్తాయన్నారు.
సాహితీవేత్త, విదుషీమణి శ్రీమతి సి.హెచ్. సుశీల భౌమమార్గ విమర్శ అనేది అంతర్మథనం నుండి వెలువడిన అమృతతుల్య పద్ధతి అని, సామాన్య పాఠకునికి అర్థమయ్యే విమర్శనా పద్ధతి అని, ఆకాశం నుండి భూమికి దిగిన విమర్శనా పద్ధతి అని, భౌమ అంటే భూమికి సంబంధించినదీ, భూమయ్యకు సంబంధించినదని ఈ పద్ధతిలో ఆయన నుండి ఏడుగ్రంథాలు వచ్చాయని అన్నారు. పుస్తకాన్ని విశ్లేషించి వివరిస్తూ మాట్లాడారు.
తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన గుమ్మన్మగారి బాల శ్రీనివాసమూర్తి భూమయ్యగారి నవలా విమర్శపై సాధికార ప్రసంగం చేశారు.
ఓరుగల్లుకు చెందిన సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర బాబు అనుమాండ్ల వారి తాత్విక కవిత్వంపై విశేషాంశాలు గల ప్రసంగం చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్.రఘు – భూమయ్య గేయకావ్యాలపై మాట్లాడుతూ స్వీయముద్ర ఏవిధంగా కలిగి వుంది, లయ, గీతి రీతి, కథాకథనం , గానయోగ్యత వంటి అంశాలపై మంచి వివరణలతో ప్రసంగించారు.
సాహితీవేత్త, భూమయ్య శిష్యురాలు శ్రీమతి కె.ప్రియదర్శిని ప్రసంగిస్తూ పాఠాలు చెప్పడంలో, పద్యాలు చదవడంలో, సందేహాలు తీర్చడంలో, జ్ఞాన విషయాసక్తి పెంచడంలో, ఆత్మీయతను వాత్సల్యాన్ని కలిగివుండడంలో భూమయ్య నభూతో నభవిష్యతి అనిపించారని వారి వద్ద విద్య నేర్వడం మహానుభూతిప్రదం అన్నారు.
తొలుత వివేక సొసైటీ (బాపట్ల) నిర్వాహకులు, రసజ్ఞులు అంబటి మురళీకృష్ణ ఆత్మీయ వచనాలతో స్వాగతం చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన పూర్వ ఉపకులపతి ఆచార్య సి.ఆర్.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ భూమయ్యగారు లోచూపు కలిగిన విమర్శకుడని, సాహిత్య విమర్శలో భౌమ మార్గవిమర్శను ప్రవేశపెట్టాడని తెలిపారు.
ఆత్మీయ అతిథిగా పాల్గొన్న డా.గండ్ర లక్ష్మణరావుగారు భూమయ్యగారు పద్యపఠనం వల్ల హైస్కూల్లోనే పద్యాల భూమయ్య’గా పేరు పొందినారని అనంతర కాలంలో వేయినదుల వెలుగు మొదలైన పద్యకావ్యాలను రాశారన్నారు.
ఆ తరువాత అప్పాజోస్యుల సత్యనారాయణగారు అజో.విభో కందాళం ఫౌండేషన్ వారి ‘విశిష్ట సాహితీ మూర్తి జీవితకాల సాధన పురస్కారం’ అనుమాండ్ల భూమయ్యగారికి అందజేశారు. ప్రశంసా పత్రాన్ని, యాభైవేల రూపాయలను, జ్ఞాపికను అందజేశారు. శాలువతో సత్కరించారు.
ఆ తరువాత పురస్కార గ్రహీత డా.అనుమాండ్ల భూమయ్యగారు తమ స్పందన తెలియజేస్తూ, తన తల్లిదండ్రులను, గురువులను స్మరించారు. తెలుగు అధ్యాపక వృత్తిలో కొనసాగటం వల్లనే కవిత్వాన్ని, విమర్శను రాయగలిగినానన్నారు. ఈ పురస్కార సభకు అంబటి మురళీకృష్ణగారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.