పి.వి.శతజయంత్సువ సంవత్సరంలో భాగంగా పి.వి.ని స్మరిస్తూ తెలంగాణ జాగృతి బుక్ క్లబ్ ఫిబ్రవరి 27, 2021 న జూమ్ మీటింగ్ నిర్వహించింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ కవి, విమర్శకుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ సాహిత్య విమర్శ అనే అంశం మీద ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం లో నిర్మించిన చైతన్యం మళ్ళీ ఆ వేళకే విస్మరణకు గురౌతున్నదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. మానవలి రామకృష్ణ కవి, వనపర్తి గ్రంథాలయంలో చేసిన నాటి పరిశోధన ఆయన వివరించాడు. ఇంకా సురవరం ప్రతాపరెడ్డి, లక్షణాచార్యలు, ఆదిరాజు వీరభద్రరావు, బుక్కపట్నం సుబ్బాచార్యులు, గడియారం వేంకటశాస్త్రి లాంటి అనేకమంది విమర్శకులు చేసిన దోహదాన్ని ఆయన వివరించారు. సీ.రంగాచార్య, రవ్వా శ్రీహరి, మలయశ్రీ, రంగానాథాచార్యల వంటి విమర్శకులను పేర్కొంటూ తనదనంతర కాలంలోనే విమర్శను కూడా స్పృశించారు.

ఈ కార్యక్రమంలో దాసరి మోహన్, వాసరచెట్టు జయంతి, దేవకీ దేవి, సీదెళ్ల సీతాలక్ష్మి దంపతులు, దాస్యం సేనాధిపతి మొదలైన 40 మంది సాహితీవేత్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి సంచాలకులుగా జాగృతి బుక్ క్లబ్ అధ్యక్షులు డా.కాంచనపల్లి గో.రా.వ్యవహరించారు.

ఎన్నీల ముచ్చట్లు

తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27న పున్నమినాటి రాత్రిపూట 94వ ఎన్నీల ముచ్చట్లు జరిగాయి. ఇటీవల మరణించిన కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖులు వినియోగదారుల మండలి, లోక్ సత్తా ఉద్యమ నేత నరెడ్ల శ్రీనివాస్ మరియు కేంద్ర సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కార గ్రహీత వాసాల నర్సయ్య ల చిత్ర పటాలకు పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. వారి సేవలను వక్తలు శ్లాఘించారు. కవులు సమకాలీన సమస్యలు ఇతివృత్తంగా రాసిన కవితలను గానం చేశారు. ఈ కార్యక్రమంలో గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్, కూకట్ల తిరుపతి, కందుకూరి అంజయ్య, వారాల ఆనంద్, సంగనభట్ల నర్సయ్య, సి. వి. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

లక్షెట్టిపేటలో పుస్తకావిష్కరణ మహోత్సవం

తండ్రీకొడుకుల పుస్తకాలు ఒకే రోజున ఒక వేడుకగా ఆవిష్కరించుకోవడం సాహితీ చరిత్రలో అరుదైన ఘటన అనీ ఇందుకు లక్షెట్టిపేట లాంటి ఒక చిన్న పట్టణం వేదిక కావడం ఆనందంగా ఉందని ప్రముఖ సాహితీవేత్త యక్కలూరి శ్రీరాములు మరియు సుప్రసిద్ధ చిత్రకారులు శేషబ్రహ్మం యేలూరి అన్నారు. 28 ఫిబ్రవరి2021 ఆదివారం నాడు స్థానిక జి. పా.సె. బాలికల పాఠశాల ఆవరణలో జరిగిన నూటెంకి రవీంద్ర కవితా సంపుటి ‘అతడే అలిగిన్నాడు..’ ను యక్కలూరి శ్రీరాములు మరియు ఏ థ్రిల్లర్ బై అవనీశ్’ ఇన్స్టంట్’ను శేషబ్రహ్మం యేలూరి గారలు ఆవిష్కరించి ప్రసంగించారు. తండ్రీకొడుకుల సాహితీ సృజనను వారూ ఇంకా వక్తలు కొనియాడారు. సాహితీ స్రవంతి లక్షెట్టిపేట ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు గోపగాని రవీందర్ అధ్యక్షత వహించారు. పుస్తకాలను ల్యాదాల గాయత్రి, నుటెంకి సత్యనారాయణ, ధవళేశ్వరపు జగదీశ్ లు విశ్లేషించారు.

కార్యక్రమం లో ప్రముఖ కవులు అన్నవరం దేవేందర్, ఉదారి నారాయణ, నాంపల్లి సుజాత, శిరిసెనహల్ నీళాదేవి, కందుల తిరుపతి, జి హన్మండ్లు, వేనంక చక్రవర్తి, రాచకొండ శ్రీనివాస్, ముత్యం మల్లేశం,కొండు జనార్దన్, రాజేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com