మిమిక్రీ సామ్రాట్, ‘నేరెళ్లకు నివాళి’

పుష్పలత ప్రేమ్ కుమార్ కు పురస్కార ప్రదానం

వడ్డెపల్లి, డిసెంబర్ 28: ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ లోని కళా ప్రాంగణంలో వేణుమాధవ్ కాంస్య విగ్రహానికి మేయర్ గుండా ప్రకాశ్ రావు, హుడా ఛైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి తదితర ప్రముఖులు, సాహితీవేత్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత సురభి కళాకారిణి రేకందార్ పుష్పలత, సీనియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ గుండి ప్రేమ్ కుమార్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల శోభా వేణుమాధవ్, రామాచంద్ర మౌళి, పొట్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

జాగృతి బుక్ క్లబ్ జుమ్ సభ

డిసెంబర్ 26 శనివారం రోజు సాయంత్రం 5.00 గంటలకు తెలంగాణ జాగృతి బుక్ క్లబ్ జూమ్ పి.వి. సంస్మరణ సభను నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పి.వి. స్మరణ సంవత్సరంగా ప్రకటించిన దరిమిలా తెలంగాణ జాగృతి పి.వి. నరసింహారావు సాహిత్యాన్ని గురించి ప్రతి నెలా సభలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆనాటి సభలో ‘సాహితీ విరాణ్మూర్తి పి.వి.’ అనే అంశం మీద విశ్రాంత అదనపు డైరెక్టర్ (దూరదర్శన్, ఢిల్లీ) రేవూరు అనంత పద్మనాభరావు ప్రసంగించారు. పి.వి. గురించి పలువురు ప్రముఖు కవులు వ్రాసిన పద్యాలను ఆయన రాగయుక్తంగా ఆలపించి వీక్షకులను అలరించారు. పి.వి. సాహితీ వ్యక్తిత్వం గురించి ఆయన కథలను గురించి పద్మనాభరావు సోదహరణంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ శర్మ, వడ్డేపల్లి కృష్ణ, దేవకీ దేవి, హరనాథ్ లాంటి ప్రసిద్ధ సాహితీవేత్తలు తమ ప్రశ్నలతో ఆసక్తివంతం చేసారు. ఇంకా చాలా మంది సాహితీవేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి జాగృతి బుక్ క్లబ్ కన్వీనర్ డా॥ కాంచనపల్లి గోరా సంచాలకులుగా వ్యవహరించారు.

ఎర్రోజు శతకం ఆవిష్కరణ

కరీంనగర్, డిసెంబర్ 25 : సమైక్య సాహితీ ఆధ్వర్యంలో ఎసి క్యాంప్ కార్యాలయంలో ఎర్రోజు వెంకటేశ్వర్లు రచించిన ఎర్రోజు శతకం పసిడి పలుకును అడిషనల్ కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ ఆవిష్కరించారు. కవి ఎర్రోజు అనేక అంశాలను ఆవిష్కరిస్తూ ఈ శతకం రచించారని, ఇది సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. కూకట్ల తిరుపతి పుస్తక సమీక్ష చేయగా సంస్థ అధ్యక్షుడు మాడిశెట్టి గోపాల్ అధ్యక్షత వహించారు.

దృశ్యం నుండి దృశ్యానికి ఆవిష్కరణ

పోచమ్మ మైదాన్, డిసెంబర్ 29 : ఓరుగల్లుకు చెందిన కవి వి.ఆర్. విద్యార్థి రచించిన దృశ్యం నుండి దృశ్యానికి కవిత్వ సంపుటిని సినీ దర్శకుడు కవి బి. నర్సింగ్ రావు ఆన్లైన్లో ఆవిష్కరించారు. ఈ జూమ్ సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి కవితలు అనుభూతి కవితలుగా పేర్కొన్నారు. విద్యార్థి కవితలు సమాజాన్ని జాగృతపరచడానికి గాఢమైన వ్యక్తీకరణతో ఉంటాయని ఆయన అన్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామాశాస్త్రి అధ్యక్షుడుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అంపశయ్య నవీన్, ఎ.కె. ప్రభాకర్, పొట్లపల్లి శ్రీనివాసరావు, బిల్ల మహేందర్ మొదలయిన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com