అనుచితమైన భర్త కోరికను తీరనీయని భార్య మార్గం…

నిజామాబాద్ లో జాయిన్ అయి వారం రోజులు దాటుతుంది. చాలా కేసులు పెండింగ్‌లో వున్నాయి. భార్యా భర్తల మధ్య వున్న కేసులు కూడా ఎన్నో చాలా సంవత్సరాల బట్టి విచారణలో వున్నాయి. ఆస్తి తగాదాల కేసులు, క్రిమినల్ కేసులు వేరు. భార్యాభర్తల మధ్య వున్న కేసులు వేరు. రెండు జీవితాల వ్యవహారం. రెండు జీవితాలే కాదు ఆ రెండు జీవితాలలో మరెన్నో జీవితాలు ముడిపడి వుంటాయి‌.

ఆ కేసుల వైపు నా దృష్టిని కేంద్రీకరించాను. ఆ కేసులని సత్వరం పరిష్కరిస్తే వాళ్ళు మరో వివాహం చేసుకోవడమో లేదా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం చిక్కుతుంది. యవ్వనంలో వున్న వాళ్ళ కేసులని ఆలస్యంగా పరిష్కరిస్తే వాళ్ళకి అన్యాయం చేసినట్టుగా వుంటుంది.

విడాకుల కోసం కోర్టులకి వస్తున్న వ్యక్తులు ఎందరో. ఎందుకిలా జరుగుతుంది.?

ఏమో. మారిన జీవన సరళి, ఆర్థిక స్వాతంత్ర్యం, వ్యక్తిగత స్వాతంత్ర్యం, సున్నిత మనస్తత్వం ఇట్లా ఎన్నో కారణాలు. ఆలోచనలు ఎగురుతూ వున్నాయి.

ఆ రోజు శనివారం. కోర్టు పని వుండదు. ఆఫీసు పని వుంటుంది. కేసు ఫైళ్ళు చదువుకోవడం, తీర్పులు చెప్పడం ఇలాంటి పనులని శనివారం చేస్తూ వుంటాం.

సోమవారం వాదనల కోసం వున్న ఓ నాలుగు ఫైళ్ళని నా ముందు పెట్టాడు బేంచ్ క్లర్క్.

వాటిని తీసి చదవడం మొదలుపెట్టాను. చాలా కాలంగా విచారణ లో వున్న ఫైలుని తీసి చదవడం మొదలుపెట్టాను‌.

సాక్ష్యాలను పరిశీలించాను‌.

భర్త విడాకుల కోసం కేసు దాఖలు చేశాడు. అయిదు సంవత్సరాలు దాటింది కేసు వేసి. భార్య దాన్ని వ్యతిరేకిస్తుంది .

వాళ్ళిద్దరూ గత 25 సంవత్సరాలుగా వేరుగా వుంటున్నారు. మరి భార్య ఎందుకు వ్యతిరేకిస్తుందీ -అతన్ని సాధించడానికని అన్పించింది.

ఫైలుని క్షుణ్ణంగా చదివేశాను. మంగళవారం ఆ కేసు లో తీర్పు చెప్పాలని అనుకున్నాను. ఇరుపక్షాల వాదనలని విని తీర్పు ప్రకటించడమే మిగిలి వుంది.

సోమవారం నాడు ఆ కేసుని పిలవగానే ఆమె వచ్చి నిల్చుంది. అతనూ వచ్చాడు.

మధ్యాహ్నం రెండు గంటలకి తమ న్యాయవాది వచ్చి వాదనలని చెప్పుతాడని ఆమె కోర్టు కి విన్నవించింది. తమ న్యాయవాది కూడా మధ్యాహ్నమే వస్తాడని అతనూ కోర్టు కు చెప్పాడు.

లంచ్ తరువాత ముందుగా వారి కేసు వాదనలనే వింటానని చెప్పాను.

ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు.

లంచ్ తర్వాత మళ్ళీ బేంచి మీదకు వచ్చాను. ఆ కేసులోని భార్యభర్తలూ , వాళ్ళ న్యాయవాదులూ లేచి నించున్నారు. హైదరాబాద్ మాదిరిగా కాదు. జిల్లాల్లో న్యాయవాదులు ఎప్పుడూ రెడీగా వుంటారు. చెప్పిన టైంకి మరీనూ.

వాదనలు మొదలు పెట్టమని భర్త న్యాయవాదిని కోరినాను. విడాకుల కోసం కోర్టు కి వచ్చిన వ్యక్తి భర్త.

అతని న్యాయవాది తన వాదనలని మొదలు పెట్టాడు. ఇద్దరం విడిపోయి 25 సంవత్సరాలు దాటింది. ‌రెండు మూడు సార్లు పంచాయతీ లు అయినవి. కానీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఎలాంటి కారణం లేకుండా ఆమె అతని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళకి సంతానం ఒక్కడే.‌ అతనూ అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆకారణంగా ఆమె వెళ్ళిపోయింది, వారి వివాహం భావోద్వేగం లేకుండా చచ్చిపోయింది. అందుకని విడాకులని మంజూరు చేయాలని అతని ‌న్యాయవాది కోర్టు ని కోరాడు.

అతని వాదనలు విన్న తరువాత వాళ్ళిద్దరి వైపు నిశితంగా చూశాను. ఆమెకు యాభై అయిదు సంవత్సరాలుంటాయి. మనిషి చాలా గంభీరంగా వుంది. వినయంగా నిల్చోనుంది. అతనికి అరువై సంవత్సరాలుంటాను. ఈ మధ్యే పదవీ విరమణ చేశాడు. తెల్లటి దుస్తులు వేసుకొని వచ్చాడు. అతనూ వినయంగా నిల్చొని వున్నారు. విడాకులు త్వరగా మంజూరు చేస్తే బాగుంటుంది అన్నట్టు వున్నాయి అతని చూపు లు.

25 సంవత్సరాల నుంచి వాళ్ళు వేరుగా వుంటున్నారు. ఆ విషయంలో ఎలాంటి వివాదం లేదు. వారి వివాహం భావోద్వేగం లేకుండా చచ్చిపోయింది. విడాకులు మంజూరు చేయకపోయినా వాళ్ళిద్దరూ కలిసి జీవించే పరిస్థితి కన్పించడం లేదు. అతని న్యాయవాది వాదనలు చెబుతున్నప్పుడు అతని సాక్ష్యాన్ని గమనిస్తే అదే అనిపించింది.

.అతని ‌న్యాయవాది వాదనలు పూర్తి అయిన తరువాత ఆమె ‌న్యాయవాది వైపు చూసి అతని వాదనలని క్లుప్తంగా చెప్పమని కోరాను.

తన వాదనలని పూర్తి చేయడానికి ఓ గంట టైం పడుతుందని అతను చెప్పాడు.

సమయం మూడవుతుంది. ఇంకా రెండు కేసుల్లో వాదనలని వినాలి.

ఆ న్యాయవాది వైపు చూశాను. దాదాపు డెబ్బై అయిదు సంవత్సరాలు వుంటాయి. ఆ వయస్సులో కూడా గంటసేపు వాదనలని చెబుతానని అనడం ఆశ్చర్యం కలిగించింది.

25 సంవత్సరాలుగా వారు వేరువేరుగా వుంటున్నారు. వారి వివాహం తో భావోద్వేగం లేదు. అది చచ్చిపోయింది. ఆమె టీచర్‌గా పని చేస్తుంది. కొడుకు అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఆ కేసులో వాదనలు వుంటాయి. అనవసర కాలయాపన అని అన్పించింది.

అతను చాలా సీనియర్ అడ్వకేట్. అయినా ఇలా అన్నాను.

“వాళ్ళిద్దరి మధ్య భావోద్వేగం లేదు. 25 సంవత్సరాలుగా వేరుగా వుంటున్నారు. కలిసి వుండే అవకాశం లేదు. ఇంకా ఏమి వాదనలు వుంటాయి సార్!”.

” మీరన్నది నిజమే యువరానర్! మా క్లయింట్ తన వాదనలని మీకు విన్పించమని కోరింది. మా వాదనలు విని మీరు ఎలాంటి తీర్పు చెప్పినా పర్వాలేదు. కానీ మా వాదనలని పూర్తిగా చెప్పనివ్వండి సార్!” అన్నాడు చాలా వినయంగా.

ఆమె కూడా అలాగేనన్నట్టుగా నా వైపు చూసింది.

సీనియర్ న్యాయవాది అలా అన్న తరువాత నేను కాదని అనడానికి ఏముంటుంది?

‘సరే సార్ చెప్పండి’ అన్నాను.

మిగతా రెండు కేసుల్లో ఒక కేసు వాయిదా వేశాను.

ఆ సీనియర్ న్యాయవాది తన వాదనలని మొదలు పెట్టాడు.

“వీళ్ళిద్దరూ టీచర్లు. హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అయ్యింది. రెండు సంవత్సరాలు‌‌ మాత్రమే వాళ్ళు కలిసి జీవించారు. ఆమె గర్భవతి అయిన తరువాత ప్రసవాని కోసమని ఆమె తల్లిగారింటికి వెళ్ళింది. ఓ పిల్లవాడికి జన్మనిచ్చింది. నామకరణానికి వచ్చి అంటి ముట్టనట్టుగా వుండి పోయాడు. రెండు మాసాలు గడిచినా కూడా ఒక్కసారి కూడా వాళ్ళని చూడటానికి రాలేదు. ఆమెనూ కొడుకునీ తీసుకొని వెళ్ళలేరు. చివరికి ఆమె తల్లిదండ్రులే వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి ఆమె భర్త ఇంట్లో వదిలి వెళ్ళారు. మా క్లయింట్ ఎంత అడిగినా అతను ఏ కారణమూ చెప్పలేదు. ఆమెతో ముభావంగా వుండటం మొదలు పెట్టాడు.

వాళ్ళ అబ్బాయి కి గ్రహణం కారణం మూతి మీద మొర్రి ఏర్పడింది. ఆ కారణంగా అలా ముభావంగా వుంటున్నాడని ఆమె అనుకొని ఓ ఆరు నెలలు అతన్ని అలాగే భరించింది. ఆ తరువాత వాళ్ళ స్కూల్లో పని చేస్తున్న మరో టీచర్ తో ప్రేమలో పడ్డానని మా క్లయింట్ కి తెల్సింది. రోజూ సాయంత్రాలు ఆమె ఇంటికి వెళ్ళడం, తన ఇంటికి ఆలశ్యంగా రావడం మొదలుపెట్టాడు.

మా క్లయింట్‌ అతన్ని నిలదీసింది. గొడవ పడింది. ఇలా చేయడం సరైందేనా అని ప్రశ్నించింది.

” నేను ఇలాగే వుంటాను. నీకు ఇష్టం అయితే వుండు లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఒక్కరోజు అయినా కొంతకాలం భరించింది. అతను ఇంటికి రావడమే మానేశాడు. భరించలేక చివరకి ఆమె తన తల్లిగారింటికి వచ్చి వుండటం ప్రారంభించింది. ఆ తరువాత పెద్దవాళ్ళు పంచాయతీ పెట్టారు. ఆమె తనకిష్టం లేదని అన్నాడు. విడాకులు కావాలని అన్నాడు. అది మా క్లయింట్‌ ఇష్టం లేదు. పోలీసు కేసు కూడా పెట్టింది. కేసు పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అతను రెండో వివాహం చేసుకున్నాడనడానికి సాక్ష్యాలు లేక, వరకట్న డిమాండ్ లేదన్న కారణంగా ఆ కేసుని కోర్టు కొట్టివేసింది నిజమే!

ఆమె ఇంటి నుంచి తనకు తానుగా వెళ్ళలేదు. తన భర్త మరో అమ్మాయి తో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఆమె వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా అతనితో కలిసి వుండటానికి ఆమె చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో పంచాయతీ లు జరిగాయి. కానీ ప్రతి పంచాయతీ లో విడాకులనే కోరాడు. ఆమె భర్త కూ క్లయింట్ ని తీసుకొని వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు.

తన దురదృష్టానికి చింతిస్తూ ఆమె తన ఉద్యోగం తాను చేసుకుంటూ కొడుకుని బాగా చదివించి అమెరికా కు పంపించగలిగింది. ఇప్పుడూ అతను అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని చదువు కోసం, పోషణ కోసం ప్రతివాది ఇచ్చిన డబ్బులు నామమాత్రం. అబ్బాయి కి గ్రహణం మొర్రి అన్న కారణంగా అతన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రేమ గా పలకరించలేదు.

ఇప్పుడు అతనికి ఇద్దరు పిల్లలు రెండవ భార్య తో. ఒకరి వివాహం కూడా చేశాడు. సుఖంగా వుంటున్నాడు‌. ఇప్పుడు నా క్లయింట్ వాళ్ళతో ఎమీ గొడవ పడటం లేదు. పంచాయతీ లు పెట్టడం లేదు.

ఆమె జీవితం ఆమె కొనసాగిస్తుంది. తన జీతం డబ్బు లతో తాను బతుకుతుంది. తన జీవితం తాను కొనసాగిస్తున్నాడు ఆమె భర్త. ఈ విడాకుల దరఖాస్తు ఎందుకు పెట్టాడో అర్థం కాని విషయం యువరానర్!

ఒక్క నిమిషం ఆగి‌ మళ్ళీ తన వాదనని ఇలా కొనసాగించాడు.

“యువరానర్! నేను చెప్పిన విషయాలు అన్నీ సాక్ష్యాలతో వచ్చాయి‌. భర్త తప్పిదం వల్లే ఆమె వేరుగా వుంటుంది తప్ప తనకు తానుగా ఆమె వెళ్ళిపోలేదు. ఈ 25 సంవత్సరాలలో ఆమె కు వేదనే మిగిలింది తప్ప సంతోషం లేదు. తన కొడుకును బాగా చదివించుకున్నానన్న తృప్తి తప్ప ఈ వివాహం వల్ల ఆమెకు ఏమి లభించలేదు. అయినా ఆమె విడాకుల కోసం ఎప్పుడూ కోర్టుకి రాలేదు. విడాకులని కోరుకోలేదు. ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారు. అతని జీవితం లో ఆమె జోక్యం లేదు. ఆమె జీవితం లో అతని జోక్యం లేదు. ఆ పరిస్థితుల్లో విడాకులు ఎందుకో అర్థం కాదు యువరానర్!

కేసు సాక్ష్యాల ప్రకారం అతని తప్పిదం వుంది. ఆమె తప్పిదం లేదు. అందుకని అతను విడాకులు కోరడానికి అవకాశం లేదు. కోరినా మంజూరు చేయడానికి ఎలాంటి యోగ్యతా లేదు. అందుకని అతను విడాకుల కోసం పెట్టుకున్న దరఖాస్తు ని డిస్మిస్ చేయమని కోరుతున్నాను యువరానర్!

కొంచెం సమయం తీసుకొని మల్ళీ తన వాదనలని కొనసాగించాడు ఆ సీనియర్ న్యాయవాది.

25 సంవత్సరాలుగా వీరు వేరుగా వున్నంత మాత్రాన అతను విడాకులు పొందడానికి అవకాశం లేదు. వారి వివాహం కోర్టు వారు చెప్పినట్టు చచ్చిపోయింది నిజమే!

ఆ కారణంగా కోర్టు విడాకులు మంజూరు చేయదని నాకు తెలుసు యువరానర్! ఎందుకంటే అలా చేయడం చట్ట వ్యతిరేకం.

ఒకవేళ కోర్టు అలాంటి భావనకి వచ్చి విడాకులు మంజూరు చేద్దామని భావిస్తే నేను చెప్పే ఈ మాటలు విన్న తరువాత నిర్ణయానికి రావాలని ప్రార్థిస్తున్నాను యువరానర్!

ఈ వయస్సులో అతను విడాకులు తీసుకొని సాధించేది ఏమీలేదు. అమెను సాధించడం తప్ప. అతను మరో అమ్మాయి ని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు. బహుశా మనుమడు కూడా వున్నాడనుకుంటాను.

మా క్లయింట్ కోరుకునేది ఒకటే యువరానర్! ఆమె అతనితో జీవిస్తానని అనడం లేదు. దాంపత్య జీవనాన్ని కూడా ఆమె కోరుకోవడం లేదు. ఒక్క విడాకులు మాత్రమే వద్దని కోరుతుంది.

25 సంవత్సరాలుగా ఒక రకమైన జీవితాన్ని ఆమె అనుభవించింది. వాడి భార్య గా ఈ సమాజంలో చలామణి అయ్యింది. అతను ఆమెకు అన్యాయం చేసినా, ఆమె కొడుక్కీ అన్యాయం చేసినా ఆమె అట్లాగే తన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటుంది.

చివరగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను యువరానర్!

మొదటి విషయం- వాడికి అంటే మా క్లయింట్ భర్తకి హిందూ వివాహ చట్ట ప్రకారం విడాకులు పొందే అర్హత లేదు. ఇక రెండవ విషయం- నా క్లయింట్ తన శేష జీవితాన్ని డైవోర్న్ గా అంటే విడాకులు పొందిన మహిళగా జీవించదలుచుకోలేదు యువరానర్!

ఏకబిగిన ఆవేశం లేకుండా అనర్గళంగా తన వాదనలని విన్పించి తన సీట్లో కూర్చున్నాడు ఆ సీనియర్ న్యాయవాది.

వాదనలని వినిపిస్తున్న క్రమంలో, అతను చెప్పిన విషయాలన్నీ సాక్ష్యాలలో చూపించాడు. వాడికి అతని రెండవ భార్య ద్వారా పుట్టిన పిల్లల సర్టిఫికెట్లని చూపించాడు. అందులో తండ్రి గా అతని పేరే వుంది.

అతని వాదనలు విన్న తరువాత అనుకోకుండా ఆమె వైపు చూశాను. ఆయన వాదనలు సంతృప్తి కరంగా ఆమెకు అన్పించాయి. ఆమె మొఖంలో సంతోష ఛాయలు కన్పించాయి.

వాదనలు విన్న తరువాత తెల్లవారి తీర్పు అని చెబుతూ కేసు వాయిదా వేశాను.

నమస్కారాలు చేస్తూ అందరూ వెళ్ళిపోయారు. మరోకేసు వాదనలని విని నేనూ బేంచి దిగి వెళ్ళిపోయాను.

మర్నాడు ఉదయం స్టెనో బంగ్లాకి వచ్చాడు. ఆ కేసులో తీర్పు ని డిక్టేట్ చేశాను.

లంచ్ సమయానికి చాంబర్లోని నా టేబుల్ మీద తీర్పు ప్రతిని టైప్ చేసి వుంచాడు స్టెనో.

టైపు తప్పులని దిద్ది, లంచ్ తరువాత బేంచి కి వెళ్ళాను.

వాళ్ళ కేసుని క్లర్క్ పిలిచాడు.

అటెండర్ గట్టిగా వాళ్ళని పిలవకముందే వాళ్ళు కోర్టు హాల్లో కి వచ్చి నిల్చున్నారు.

ఎలాంటి తీర్పు వస్తుందోనన్నట్టు వాళ్ళిద్దరూ నిల్చోన్నారు.

తీర్పు ని ప్రకటించాను.

భర్త దాఖలు చేసిన విడాకుల కేసు ని కొట్టివేస్తూ తీర్పు ని చెప్పాను. ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

సంతోషం తో ఆమె మొఖం వెలిగిపోయింది. రెండు చేతులతో కోర్టు కు దండం పెట్టింది. సంతోషమో, బాధో తెలియదు గానీ ఆమె కళ్ళల్లో నీళ్ళు కదలాడాయి.

కేసు లోని యోగ్యత ప్రకారమే ఆమెకు అనుకూలంగా తీర్పు ని ప్రకటించాను.

ఆ సీనియర్ న్యాయవాది చెప్పిన ముగింపు మాటల వల్ల కేసు లో ఆమె వైపు యోగ్యత లేకున్నా అదే తీర్పు ని ప్రకటించి వుండేవాడినేమోనని అన్పించింది.

అతనిలో భావోద్వేగం లేదు. అయినా ఆ వివాహం చనిపోలేదు. ఆమె వివాహ బంధం లో ఏదో తెలియని బంధం వుందని అన్పించింది.

తీర్పు విన్న ఆమె మొఖంలో అదే భావం కన్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com