ఊల్లె

ఏ కులపోల్ల ఇంట్ల

ఎవల తలాపున దీప మెలిగినా

మొదటి పిలుపు అతనికే

అక్కడి వాతావరణ మంతా

ఏ రిక్టర్ స్కేల్ పైనా నమోదు చేయలేని

ఒక ఉద్విగ్నపు దుఃఖోద్వేగంతో ప్రకంపించి పోతంది

ఆరిపోయిన దీపాన్ని తలచుకొని శోకం పెడుతంది

గుండెలు బాదుకుంటూ ఆ యిల్లు

ఆత్మీయులు వచ్చినప్పుడల్లా ఆజ్యం పోసినట్టై

తారాస్థాయికి చేరుతున్న వలపోత

సునామీ కెరటాల్లా ఎగసి ఎగసి విరిగిపడుతంది

ఓ మూలన రాజేసిన కర్రమొద్దు కాలి కాలి చివరికచ్చి

ఇగ సాగనంపె యాల్లైందని పొగబెడుతంది

అప్పుడు వచ్చాడతడు

తన డప్పుల పరివారం వెంటేసుకొని

కొన్ని కట్టెలూ తాటాకులూ పట్టుకొని

చెమటస్నాన మాడిన నల్లని మట్టి శరీరంతో

ఆలస్యమైందేమని అరిచే అదిలింపుల మధ్య

వచ్చీ రావడంతోనే పనిని మొదలు పెట్టి

ఏడుకట్ల సవారీని సిద్ధం చేశాడతడు

డప్పు చప్పుళ్ళ నేపథ్య హోరులో

తనదైన ఓర్పుతో మరింత నేర్పుతో

పల్లకీ నెక్కని దేహముండవచ్చు

పడవ నెక్కని దేహముండవచ్చు

పాడె నెక్కని దేహముంటుందా?

ఒక నిష్కామ యోగిని గమనిస్తున్నాను

చివరిపాన్పులు ఎన్ని తయారు చేసివుంటాడితడు!?

ముఖం మీది ముడతలు లెక్క చెబుతాయా?

ఆరూ నాలుగూ అయిదూ కొలతలతో

ఎన్ని బొందలు తవ్వి ఉంటాడితడు?

కాయలు గాసిన అరచేతుల పొరలను

తరచి చూస్తే తెలస్తుందా?

మృత పశువుల చర్మాన్ని ఒలిచి

డప్పుగా చెప్పుగా మలిచిన రసాయనిక చేతులవి

గొల్లులూ గోవిందాల నడుమ శవయాత్ర మొదలైంది

లయబద్ధంగా ఆడుతున్న డప్పుల పాదాలూ

బాణసంచా కాల్పుల మధ్య మారుతున్న భుజాల మీద

వరదలో తెప్పలా తేలిపోతంది పార్థివ దేహం

ఎవరో ఔత్సాహికులు

పదీ ఇరువై యాభై వందా నోట్లను పొట్లం చుట్టి

ఇసుక కుప్పల నిలబెడుతున్నారు

డప్పు వాయిస్తూనే కంటి రెప్పలతో ఒడుపుగా పట్టుకొని

ఓ యువకుడు తీసిస్తుంటే

జేబులో పెట్టుకుంటున్నాడీ వృద్ధుడు దరువేస్తూనే

పొడిబారిన అతడి పెదాల మీద ఓ చిరునవ్వు విరిసింది

అతని యౌవ్వన రోజులు గుర్తొచ్చి వుంటాయా!?

ఏరుకున్న చిల్లర జ్ఞాపకాల్లో గల్లుమని ఉంటుందా?

ఆకుపచ్చని సంతకం చేసే ఏ వాడబిడ్డో

గ్రీన్ కార్డ్ హోల్డరైన వాడి బిడ్డో మదిల మెదిలుంటారా?

నెరిసిన అతని వెంట్రుకలు ఏ వెండి వెలుగులకు ఆనవాళ్ళో?

ఇతని లాంటి మరొకతనే

రేపెప్పుడో

నాకూ ఓ ఆఖరిమంచం సిద్ధం చేస్తాడా? యేమో!

ఊల్లె

ఎవలింట్ల ఏ శుభకార్యం జరిగినా

పిలువని పేరంటానికి వచ్చి

అల్లంత దూరాన ఓ పక్కన గొంతుక్కూర్చొని

ఇంత ఎంగిలిపడి పోయే అభ్యాగతుడైన అతిథీ అతడే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com