ఎదుటి వ్యక్తికి చెప్పడానికే నీతులు ఉన్నాయి అనుకునే మనుషులు…
పిండి వంటలు పూర్తి కావడంతో ఊపిరి సల్పినట్లైంది చందనకు. ఇక మిగిలింది డ్రై ఫ్రూట్స్ కొనడం. పిండి వంటలు సంప్రదాయానికి సంబంధిస్తే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్య సంబంధం. భర్త అనురాగ కు ఆ పని అప్పచెప్పాలనే ఆలోచన వచ్చినా ఒకటికి పదిసార్లు చెప్పినా ఏదో ఒకటి మరిచిపోయే మేళంతో లాభం లేదని తానే బయలుదేరింది. ఆటోవాడికి షాప్ లొకేషన్ చెప్పి కూర్చుందే కాని మెదడు నిండా చెయ్యాల్సిన పనుల లిస్టులు. ప్రొద్దున్నే ఎనిమిదింటికల్లా బయలుదేరాలె. పన్నెండు లోపలే సీమంతం కార్యక్రమం పూర్తి చెయ్యమని బ్రాహ్మణుడి ఆదేశం. ఆలోచనల పరుగులలో ఆటో పరుగును గమనించనే లేదు.
“మేడమ్ గీషా పేనా?” ఆటో డ్రైవర్ మాటలు ఆమె పరధ్యానాన్ని పటాపంచలు చేసినై. చందన డ్రైవరకు అమౌంట్ పే చేసి షాపులో దూరింది. కాజు.. బాదామ్.. పిస్తా.. ఆక్రోట్.. కిష్మిష్.. అంజూర్… కర్జూర్ అన్నీ లిఫ్ట్ చేసి బాస్కెట్లో వేసి బిల్ కౌంటర్‌కు చేరుకుంది. తన ముందు ఒకే ఒక కస్టమర్ ఉండటంతో తొందరగా పనైపోతుందని ఫీలైంది. కానీ క్షణంలో ఆ సంతోషం పటాపంచలైంది. బహుశా ఇద్దరు పాత పరిచయస్తులేమొ.
“మీరన్నది నిజమే. మన మీ సారి చంద్రమౌళినే గెలిపించాలె.”
“కాకపోతే రోజు రోజుకు విశ్వనాథం అవినీతికి హద్దు పద్దూ లేకుండా పోయింది.
ఒడ్డెక్కేదాక ఓడ మల్లన్న అన్నట్లు ఎలక్షన్ల ముందు ఇండ్ల చుట్టు తిరిగి గెలిచిన తర్వాత ముఖం చాటేసిండు.” “ఎన్నికల ముందు వాగ్దానాలన్ని గంగలో కలిపిండు”
“అసలు ఊళ్ళోనే లేడాయె పెద్ద మనిషి, మకాం సాంతం పట్నానికే మార్చె”
“ఎన్నుకుంది మనం. ఉంటున్నదేమొ పట్నంల.”
“శంకుస్థాపనలకు తప్ప ఊరి మొకం చూసుడే లేకపాయె”
“చెరువు పూడిక తీస్తననె ముచ్చటే మరిసిండు.”
“గవర్నమెంట్ కాలేజ్ సాంక్షను చేయిస్తనని ఏతులు చెప్పె”
“మొన్న మా గుమస్తా తన భూమి విషయంల మాట్లాడుదామని పోతే మాట్లాడుడు కాదు కదా! ముఖం కూడా చూడలేదట. అసలు ఆయనెవరో తెల్వనట్లే చేసిండట.”
“ఇంతకు మీ గుమస్తా ఆయనకు తెలుసా?”
“అయ్యో ! గట్లంటరు. ఓట్లప్పుడు వాళ్ళ వాడకట్టుకు తీసుకపోయి వాళ్ళందరిని కలిపిచ్చుడే కాదు, గెలిసెటందుకు మస్తే తిప్పలు పడ్డడు.”
“ఔనా! గీ నాయకులే గింత. అందుకే ఈ సారి హిజ్ విశ్వనాథాన్ని గెలువనీయొద్దు.”
ఇట్లా వాళ్ళిద్దరి సంభాషణ రంజుగా సాగుతున్నది. ఒకవైపు వీలైనంత తొందరగా ఇంటికి చేరుకోవాలని మనసు పీకుతున్నా వాళ్ళ మాటల్లోని సత్యం చందనను కట్టి పడేసింది. అనాలోచితంగానే వాళ్ళ మాటల్లో లీనమైపోయింది. షాపు గోడ గడియారం ఐదు గంటల చాటింపుతో చందన ఈ లోకంలోకి వచ్చింది. ముందున్న కస్టమర్ తన పిచ్చాపాటి చాలించి బిల్ పే చేసి వెళ్ళిపోవడంతో చందన ముందుకు కదిలింది.
“మాజీ కా బిల్ బోలో” అంటూ సర్వీస్ బాయ్ ని అడిగిండు కాష్ కౌంటర్ లో కూర్చున్న యజమాని. ఇంత వరకు తెలుగులో అఘోరించిన ఆయన హిందీలోకి ఎందుకు జంపైండో చందనకు ఏ మాత్రం అర్థం కాలేదు. ఐనా ఆయన ఏ భాషలో అఘోరిస్తే తనకెందుకట అని తనకు తానే సర్ది చెప్పుకుంది.
“ఫోర్ థెసెండ్” అతని సమాధానం.
“మాజీ ఆప్ కా పైసే “అంటూ అతను చెయ్యి ముందుకు చాచిండు.
“మేరీ బిల్” చందన ప్రశ్నకు సమాధానంగా నాలుగు వేలు అని ఫిగర్లో రాసిన ఓ కాగితం ఆమె ముందుంచిండు యజమాని. నిర్ఘాంతపోవడం చందన వంతైంది. అది కేవలం నాలుగు వేలు అని రాసిన ఓ కాగితం ముక్కని ఆయన బిల్ అంటున్నడు.
“నేను బిల్ అడుగుతున్న. నేను చెల్లించాల్సింది నాలుగు వేలని నేను ముందే లెక్కేసుకున్నాను. ఆ విషయం నాకు తెలుసు.” కొంచెం కోపంగానే అంది చందన. ఆమె కోపాన్ని గమనించిన యజమాని తన గుమస్తాను వివరాలు అడిగి మరో తెల్లకాగితంపై విడివిడిగా వేసి టోటల్ గా నాలుగు వేలుగా రాసి ఆమె ముందుంచిండు.
దాన్ని తేరిపార చూసిన చందన కోపం నసాళాని కంటింది.
“ఇది బిల్ రిసీట్ కాదు కదా!” తిరిగి ప్రశ్నించింది చందన.
“మేడమ్ జీ! బిల్ సే క్యా ఫాయిదా మిత్రే. ఫిర్ జియపీ.. వగైరా…..” అంటూ ఏదో చెప్పబోయిండు. షాపతను.
“అంతసేపు మీ స్నేహితుడితో రాజకీయ నాయకుల నిబద్ధత
అవినీతులపై ఏకధాటిగా మాట్లాడిన మీరు టాక్స్ ఎగొట్టడం నేరం కాదా! నేను రాజకీయ నాయకులను సమర్ధించడం లేదు.
కానీ మరి మీరు చేస్తున్న పని? ఏదో నేనడిగినందుకు ఓ కాగితం ముక్క నా మొహాన పడేసిన్రు. అడగకపోతే అదీ లేదు. ఎదుటి వాళ్ళను అడిగే ముందు మనం నిజాయితీతో నడుచుకోవాలె. అది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ నాకు కరెక్ట్ బిల్ ఇవ్వండి కొంచెం ఘాటుగానే అడిగింది.” దాంతో యజమానికి బిల్ ఇవ్వక తప్పలేదు. బిల్ తీసుకొని చందన విస విసా ఇంటి దారి పట్టింది. కోపంతోనో శాంతించో ఆమె బిడ్డ సీమంతం సవ్యంగానే జరిగినా షాపు యజమాని తన వ్యాపారం తను తిట్టిన రాజకీయ నాయకుల అండదండలతోనే జీరో వ్యాపారం చేస్తూ దేశ అవినీతులను దుయ్యబడుతూ ఎంతెంత దూరం ముందుకు సాగిండో….?