18 జులై 1936 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లా తాలుకాలోని హనుమాజీపేట గ్రామంలో జన్మించిన గూడూరి సీతారాం గారికి తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రత్యేక స్థానం ఉంది. సి.నారాయణ రెడ్డి గారు పుట్టిన హనుమాజీపేటలోనే వారి పక్క ఇంటిలోనే పుట్టారు సీతారాం. సెలవులు వచ్చినాయంటే, వూరి పక్కనుండి పారే మూలవాగు ఇసుకలో కూర్చొని సీతారాం, కనపర్తి లక్ష్మీ నర్సయ్య, ఆది రెడ్డి లాంటి 10 మంది సాహిత్యాభిమానులు కలసి, నారాయణ రెడ్డితో సాహితీ కాలక్షేపం చేసేవారు. కనపర్తి కవిగా మారితే నారాయణరెడ్డి గారి సలహాపై సీతారాం కథకుడిగా మారారు. వేంకట లక్ష్మీ, లక్ష్మయ్య ఈయన తల్లిదండ్రులు. ఖచ్చురాలపై సిరిసిల్లకు వచ్చిన సీతారాం కుటుంబం, చేనేత కేంద్రమైన సిరిసిల్లలోనే స్థిరపడింది. హైస్కూల్ సిరిసిల్ల లోను, కాలేజీ చదువు నిజాం కాలేజీలోనూ పూర్తి చేశాడు సీతారాం. హైస్కూల్ మేగజైన్ “తరంగిణి”కి, నిజాం కాలేజీ మేగజైన్ “విధ్యార్థి”కి , రెడ్డి హాస్టల్ మేగజైన్ “ఉష” కు తాను చదివేటప్పుడు సంపాదకుడిగా వ్యవహరించాడు సీతారాం. 1952 లో స్థాపించబడ్డ “తెలంగాణ రచయితల సంఘం” సిరిసిల్ల శాఖకు స్థాపకుడి గాను, శాఖ ద్వారా వెలువరించిన “వివాదం” అనే పత్రికలో “స్త్రీ స్వాతంత్ర్యం” అనే సీతారాం కథ అచ్చయింది. 1953 లో కథా రచయితగా సీతారం ప్రవేశం అలా జరిగింది.

మానేరు రచయితల సంఘం, ముఖ్యంగా పత్తిపాక మోహన్ పూనుకొని, ప్రయత్నించి, 14 కథలు లభించగానే, “గూడూరి సీతారాం కథలు” పేరుతో అచ్చు వేయగా మనం సీతారాం కథలు మళ్ళీ చూడగల్గుతున్నాం. మరో రెండు, మూడు కథలు తరువాత లభించాయి.

2005 లో సీతారాం జీవిత విశేషాలను, సాహిత్య కృషిని వివరిస్తూ, మంచి ఆలోచనాత్మక వ్యాసాలతో “కానుగు చెట్టు” పేరుతో 2005లో వ్యాసాల సంకలనం వచ్చింది. సీతారాం గురించి ఈ తరం రచయితలు తెలుసుకోవడం, కలుసుకోవడం, సాహిత్య చర్చలు మొదలైయ్యాయి. 1997 నుండి 2011 దాకా, హైదరాబాద్ లో కొడుకు వద్ద ఉంటున్న సీతారాం గారు, బీఎస్ రాములుతోనూ, నాతోనూ సాయంత్రం పూట సాహిత్య సమావేశాలలో సినారేను కలుసుకోవడానికి, సారస్వత పరిషత్తుకు పోవడమూ సర్వసాధారణమైపోయింది. మిగతా సమయంలో తెలుగు సాహిత్య అకాడెమీలో కొత్త పుస్తకాలతో, కొత్త రచయితలతో గడపడం అలవాటైపోయింది.

ఇప్పుడు అచ్చులో లభిస్తున్న సీతారాం 16 కథల్లో “మారాజు”, “రంగడు”, “రాజమ్మ రాజరికం”, “నారిగాని బతుకు”, “పిచ్చోడు”, “లచ్చి కథలు” తెలంగాణ మాండలికంలో రాసినవి.మిగతా కథలు ప్రామాణిక భాషలో ఉన్నాయి. పల్లెటూరులో పుట్టి పెరిగిన సీతారాం 1950, 60లలో పల్లెల్లో మెల్ల మెల్లగా వస్తున్న మార్పుల్ని, పట్టణ నాగరికత పల్లెల్లో ప్రవేశించడాన్ని, పల్లె జనం పట్టణాల్లోని సినిమాలను, రంగుల జీవితానికి ఆకర్షితులవడం గమనించాడు. జీవితంలో వస్తున్న మార్పుల్ని తన కథల్లో చిత్రించాడు. ఈయన కథల్లో నాటకీయత కంటే సూటిగా చెప్పె కథనమే ఎక్కువ. ఈయన మన పక్కన కూర్చుండి చెప్తున్నట్టుగా కథ, కథనం నడుస్తుంది. వాస్తవిక జీవిత చిత్రణ ఉంటుంది. నిరాడంబరంగా, నిసర్గ సరళంగా ఉంటాయి కథలు. తెలంగాణలో అప్పటికీ మధ్య తరగతి ఆవిర్భవించనందున, ఆయన కథల్లో పల్లె పడుచులు, సామాన్యులే ఎక్కువ.

“మారాజు” బొంబాయి వలసలకు సంబంధించిన కథ. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి అప్పుడు బొంబాయికి బతుకు దెరువు కోసమై వలసలు సాగేవి. “మారాజు” కథలో రంగడు, బొంబాయి పోయి, భాష తెలియక, దిక్కు తోచక, అక్కడ ఇమడలేక మళ్ళీ పల్లెకు తిరిగి వస్తాడు.

“పిచ్చోడు” కథలో రంగడు బొంబాయి వెళ్ళాలని మూడు సార్లు ప్రయత్నిస్తాడు. ఒకసారి పోలీసుల భయంతో, మరోసారి రైలుకు భయపడి ప్రయాణం మానుకుంటాడు. ఎలాగైనా బొంబాయికి వెళ్ళి, డబ్బు సంపాదించాలని, ధృడ నిశ్చయంతో మూడోసారి టికెటు కొని కూడా, రైలు ఎక్కలేక చతికిలపడతాడు. పల్లెటూరి జనం అమాయకత్వాన్ని, పేదరికాన్ని, సంపాదన కోసం వాళ్ళు బొంబాయికి వెళ్లే ప్రయత్నాన్ని సీతారం గారు చాలా బాగా చిత్రించారు ఈ కథలో.

కానీ “మారాజు” కథలో రంగడు పేదరికాన్ని తట్టుకోలేక, ఎలాగైనా బొంబాయి వెళ్లి, అక్కడ పనిచేసి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఇంట్లో వాళ్లకు తెలియకుండా డబ్బులు తీసుకుని, భార్యకు, తల్లికి చెప్పకుండా బొంబాయి వెళతాడు. మొదటిసారిగా రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. బొంబాయికి చేరాక, అక్కడి భాష తెలియక ఇబ్బందులు పడతాడు. దొంగలు ఇతడ్ని మోసం చేసి డబ్బు లాక్కుంటారు. చిన్నాయన కొడుకు కనిపించి, పోలీసుల సహాయం అంది, రంగడు తేరుకుంటాడు. కానీ, ఏ ఆధారం లేనందున, విధి లేక ఊరికి తిరిగి వస్తాడు.

“రంగడు” కథలో బతుకు దెరువు కోసం బిలాయి వెళ్లిన రంగడు అనే పశువుల కాపరి, ఏండ్ల తరువాత గ్రామాన్ని చూడటానికి వస్తాడు. ఊర్లో ఎవ్వరూ అతడిని గుర్తుపట్టరు. ఆఖరకు, చిన్నాయన ఇంట్లో కూడా, 20 ఏండ్ల కథ చెప్పినంక గుర్తు పడుతరు.

రంగనికి ఆరేండ్ల వయసు ఉన్నప్పుడు, కాస్తున్న బర్లు దొరగాని చేన్ల పడ్డాయని, దొరగాని పాలేరు రంగన్ని గుంజకు కట్టి, రక్తం వచ్చేటట్లు కొడతాడు. అపుడు రంగన్ని దొరసాని చూచి, ఇడిపిచ్చి, అన్నం పెట్టి, పాలేరుతో రంగన్ని ఇంట్ల విడిచిపెట్టి రమ్మని పంపుతది. అట్ల రంగన్ని పాలేరు దౌష్ట్యం నుంచి కాపాడుతది దొరసాని. దొరసానిని ఎట్లన్న కలువాలని, చిన్నాయన కొడుకుని తీసుకుని బయలుదేరుతడు రంగడు. కానీ దొరసాని చచ్చిపోయి ఎన్నో యేండ్లు అయిందని తెలిసి, దొరసాని కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని తెలిసి, బాధతో తిరిగి ప్రయాణమవుతడు రంగడు బిలాయికి.

అప్పటి వలసలు ఇప్పుడు బొంబయి, బొగ్గు బాయి, దుబాయికి వలసలుగా మారి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుండే లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం నేటి విశాదం. షోలాపూర్, సూరత్ లకు వెళ్లి అక్కడే స్థిరపడ్డ వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.

“లచ్చి” కథలో పిచ్చకుంట్ల అనే బిచ్చగాండ్ల ఊరిలో పరిస్థితులు తట్టుకోలేక, పట్టణానికి పోయి బతుకుదామని లచ్చి….. దాని భర్త రంగడు అక్కడ రంగడు దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్యను రోజూ తాగి వచ్చి కొట్టడం చేస్తాడు. ఆక్సిడెంటులో దెబ్బలు తిని చావు తప్పి పాత జీవితానికి మరలడం కథా వస్తువు.

ఈ నాలుగు కథల్లో కథా నాయకుని పేరు రంగడు అని పెట్టడం పల్లె మనుషులు అందరూ అమాయకులే అని సీతారాం చెప్పడంగా భావించవచ్చు.

“రాజమ్మ రాజసం” కథలో రాజమ్మ పల్లెటూరు యువతి. కొత్తగా వస్తున్న అలంకార వస్తువుల మోజులో, వ్యమోహంలో రైతుగా ఉన్న భర్తపై వైముఖ్యంతో పట్టణ సంస్కృతికి అలవాటు పడి, సేరుదారు కొడుకు ఇచ్చే స్నో, పౌడర్ లకు ఆశపడి అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. ఊరి వారు అసహ్యించుకుంటారు. భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు. రాజమ్మ కొన్ని రోజులు ఊరి నుండి మాయమై మళ్ళీ ఊరు చేరుతుంది.

తెలంగాణ పల్లెలకు, పాకుతున్న సినిమా ప్రభావం అలంకరణ వస్తువుల ప్రభావం, ఆశల్లో చిక్కుకున్న స్త్రీ పతనం ఈ కథల్లో వివరిస్తాడు రచయిత. రాజమ్మ మీద సానుభూతితో, జాలితో కథ ముగుస్తుంది.

“నారిగాని బతుకు” కథలో గీత కార్మికుని జీవితంలోని సాధక బాధకాలు, చిత్రితమయ్యాయి. గ్రామీణ వృత్తి కులాలు దిగజారిపోవడం,కుల వృత్తిలో నిలదొక్కుకోవడానికి పడే పాట్లు చిత్రితమయ్యాయి. ఈ వృత్తిలో స్త్రీ కల్లు అమ్మడం, భర్తకు చేదోడు వాదోడుగా ఉండటం కనిపిస్తుంది.

మొదటి భార్య లసుము భర్తకు వృత్తిలో సహకరిస్తూ, చేదోడు వాదోడుగా వుంటుంది. రెండో భార్య ఎల్లి నారిగాన్ని మోసం చేసి వెళ్లిపోతుంది. ఒక వృత్తి ధర్మంగా కల్లు వంచుతున్న మూడో భార్యను కల్లు తాగుతున్న వ్యక్తి కొంగు పట్టి గుంజగా, నారిగాడు వాణ్ని కొట్టి, భార్యను కల్లు పోయవద్దంటాడు.

కానీ చివరికి తన వయస్సు మీద పడి, కొడుకుకు వృత్తి అప్పచెప్పినాక, కోడలు అలాగే కల్లు వంచడం చూసి బాధపడుతాడు. పల్లె జీవనం, వృత్తిలపై మంచిగా చిత్రించిన కథ నారిగాని బతుకు.

సీతారాం కథల్లో తెలంగాణ భాష:-

1.సీతారాం తన కథల్లో ధ్వని ప్రధానమైన పదాలు, చక్కని పదబంధాలు వాడుతాడు. ఉదాహరణకు తినబోయిండు, తేకపోయిండు, తీసుకురాకపోయిండు.

2. గజ్జ గజ్జ , బుగులు బుగులు, దబదబ, గప్పు గప్పు, జెప్ప జెప్ప

3. నాలుగుతికిండు, కుదువబెట్టిండు, బుదురకిచ్చిండు, సంపాయించిండు, రానిస్తుండు, పటాయించిండు

4.పెయ్యి, నెత్తి, బువ్వ, దీపంత, సమరు, కొట్టము, పోరి, సోపతి, పైసలు లాంటివి.

నుడికారపు సొంపులు:-

1. ఆకాశానికి, భూమికి ఉన్నంత ఎడం కనబడ్డది

2. గట్టు మీదేసిన సామానే కొట్టుకున్నడు

3. రాచ్చసంటోళ్లు నిండా నూరెళ్లు బతుకుతరు. గోవసోంటోళ్లు మాయిల్లనే జత్తరు

4. దినాలు ఎడ్ల కచ్చరం గీరలోలె తిరుగుతున్నయ్

5. కండ్లకెళ్లి ఊరూరినట్టు నీళ్లు కారినయ్

6. మంచోళ్ళకే సావు జెప్పనత్తది

7. పొద్దంతనేమో అప్పులోల్ల బాధ. రాత్రంతనేమో మొగనితో బాధ

8. తోటంత మొఖం మోటంత అయింది

9. నూతిలో పడ్డోని మీద నూరు రాళ్లన్నట్లు

10. కచ్చురం మంచిగ పోయినట్లే పోయి పోయి బొందల పడేదాక తెలువది

గూడూరి సీతారాం కథన రీతులు:-

1. ప్రథమ పురుష కథనం

లచ్చి, మారాజు, పిచ్చోడు, అంబోతు, అమ్మాయి, అందని ఆకాశం, దెబ్బ తిన్న అహంభావం, మేడిపండు, ఏకాంతం.

2. ఉత్తమ పురుషలో రాసిన కథలు

ఎవని పువ్వు

3. ఫ్లాష్ బ్యాక్ లో రాసిన కథలు

నారిగాని బతుకు, రాజమ్మ రాజరికం, రంగడు

పాత్రోచిత సంభాషణలు, వర్ణణలు, ఎత్తుగడ, ముగింపుల విషయంలో సీతారాం చాలా శ్రద్ధ తీసుకున్నాడు. గూడూరి సీతారం 1965 అనంతరం ఉద్యోగంలోకి ప్రవేశించాక కథా రచన పూర్తిగా వదులుకున్నాడు. ఉద్యోగం కూడా కొంతకాలం చేసి రాజకీయం రంగంలోకి వెళ్లాడు. దానిని వదిలి పెట్టి వ్యాపార రంగంలోకి వెళ్లాడు.

1997 నుండి అన్ని వ్యవహారాలు బందు పెట్టి హైదరాబాద్ లోని బర్కత్ పురలో పెద్ద కొడుకు కుటుంబంతో ఉన్నాడు.

1999 నుండి 25-09-2011 వరకు విశాల సాహిత్య సదస్సు వేదికగా సీతారాం గారు సాహిత్య కార్యక్రమాల్లో మునిగి తేలారు. యువ రచయితలతో చర్చలు, కొత్త రచయితలను ప్రోత్సహించడం, పాతకాలపు సాహిత్య విషయాలను అడిగి తెలుసుకుంటున్న ఔత్సాహిక రచయితలతో చర్చలు జరపడం, పుస్తకాలు సంపాదకత్వ బాధ్యతలు ఎత్తుకోవడం అప్పుడప్పుడూ సినారేను సారస్వత పరిషత్తు కార్యాలయంలో కలవడం, రచయితలతో సమావేశమవడమనేవే వ్యాపకాలు. సాయంకాలాల్లో రవీంద్ర భారతి, సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, త్యాగరాయ గాన సభ ఎక్కడో ఒక చోట సాహిత్య కార్యక్రమాలకు బీఎస్ రాములు గారితో వెళ్లడం ఆయనకు అలవాటయింది.

ఇలా హాయిగా కొనసాగుతున్న ఆయన జీవితంలో క్యాన్సర్ ప్రవేశించి, అకస్మాత్తుగా ఆయనను 25-09-2011 రోజు ఆయనను మన నుండి వేరు చేసింది.

మరణం తప్పించలేనిది. ఆయన మరణంలో ఏర్పడ్డ చీకటిలో, స్పష్టతతో ఆయన రాసిన కథలు, కథా సాహిత్యానికి ఒక మూల మలుపుగా, ముందు మార్గం చూపూ ఒక దివిటిగా ధైర్యం చెప్పే ఒక్క వెన్నుతట్టడంగా మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com