గం. గోపాలరెడ్డి

“అశీ ఇగరా!”

“ఏంది”

“దొరతాన్కి వోయొచ్చినావ్”

“ఆఁపోయిన అగావు జీతముండందుకు ఒకిత్తు ఇయ్యనంటుండడు. పిల్లలు మేము చస్తున్నం. దొరా అంటే చస్తే నన్నేమంటవు ఫో! అన్నడు”

వెంకయ్య ఒక్క నిట్టూరు విడిచిండు. ఆ ఒక్క నిట్టూర్పే చాలు హృదయమున్నవాన్ని కరిగించేటందుకు…….

మూడు నెలలయింది. నేటికి వెంకయ్య మంచంపట్టి. శరీరంలో రక్తపు బొట్టు లేదు. చర్మం ఎముకలు మిగిలినయి….

ఇరవై యేండ్ల నుంచి చల్మారెడ్డి దగ్గర జీతమున్నడు. ఇన్నేండ్ల లో ఒక్కసారైనా తలనొప్పి అంటే ఎట్లుంటుందో ఆయనకు తెలియలే. రాత్రింబగళ్లు కష్టించిండు. ప్రతిఫలం? ఈనాడు మందుకోసం ఒక్క చిల్లిగవ్వైనా లేదు దగ్గర. నల్గురు పిల్లలు. పెద్దవానికి ఏడేండ్లు వుంటయి. పసులెంటపోతడు.

రామి సంసారం జేయవట్టిందగ్గర్నుంచి మొగడితో సహా తాను బాగ కష్టపడ్డది. పిల్లలను సమాధానం చెయ్యడమటుంచి రోగంతో పడ్డ మొగనికి ఏమి ఆసరా కాజాలని స్థితిలో ఉన్నది. ఎంత పొతంగ సంసారం చేసినా ఏ పూటకాపూటకే అదీ సగం కడ్పుకు సరిపోతుంది.

వెంకయ్య మంచం కుక్కిలో కండ్లు మూసుకొని పడి ఉన్నాడు. పిల్లలు “అమ్మా! బువ్వ పెట్టు డుస్తున్నారు. రామి మొగని మంచం దగ్గర నిలబడి ఉన్నది. తన పిల్లలు ఆకలితో మాడడం రామి కడుపు పగిలిపోయింది. ఏంచేస్తుంది! కంటి నుంచి నీళ్ళు కార్చుట తప్ప!

వెంకయ్య కండ్లు మూసుకొని ఆలోచన చేస్తున్నాడు. తన గత జీవితమంత కండ్లకు కట్టినట్లయింది. నడుముకు రుమాలు బిగించి పొలంలో పనిచేస్తుండు. గడ్డ మీద కూర్చొని చల్మారెడ్డి సంతోషపడడం జ్ఞాపకం వచ్చింది. తను ఎవ్వరి కొరకు ఈ కష్టము చేస్తున్నానా? అనే ఆలోచనే లేకపోయింది. ప్రతి యేట గరిసె మీద గరిసె ధాన్యంతో నింపుతు వచ్చిండు. కాని ఇదంత, అనుభవించేదెవరు? ఆ ప్రశ్న వెంకయ్యకు కలిగింది. చల్మారెడ్డి ఇదంత అనుభవిస్తున్నడు. కానీ అతనికి పనిచేసే అవసరం లేదు. కాలు చెయ్యి అయినా కదిలియ్యడు. అట్టి చల్మారెడ్డి తనకేమీ – బాధ్యత లేనట్టుగ “ఫో! నన్నేమంటావు?” అంటాడు. ఈ మాట వెంకయ్య తలంపుకు రాంగానే శూలముతో పొడిచినట్లయింది. భగవంతుడనే వాడున్నాడా? అనే సందేహం కలిగింది. “ఒకడు ఆకలిచే మలమల మాడి చచ్చుటేమి? ఒకడు అన్ని సుఖసంపదల అనుభవించుడేమి? అనే ఊహే తట్టింది. ఎవరి సౌఖ్యం కొరకై రాత్రింబగళ్ళు కష్టించాడో అతడే పూర్తిగా మరిచిపోవుట గొప్ప అన్యాయంగా తోచింది. ప్రపంచమంతా బూటకం – పచ్చిదోపిడి – ఇల్లాటివెన్నో ఆలోచనలు వెంకయ్య తలలో తిరిగిపోయినయి. కండ్లు తెరిచిండు; రామి ఎదురుగ ఏడుస్తూ?చీర కొంగును బిగ్గరగ నడుంకు చుట్టింది. పిల్లలు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడి ఉన్నారు. ఈ దృశాన్ని చూడంగానే వెంకయ్యకు కండ్ల నిండ నీళ్ళు తిరిగినయి. వెంకయ్యకు జ్వరం తీవ్రంగా వచ్చింది. మూల్గుతున్నాడు. మనుష్యుల ధ్యాస కూడా తప్పింది. రోగిష్టి అందులో మూడు దినాల నుండి నోట్లోకి ఇంత అంబలైనా పడలేదు. రోగిష్టి అయిన భర్తకే లేనప్పుడు రామికెక్కడిది ? చంటి పిల్లకు పాలు దొరక ఏడ్చి నోరారిపోయింది. చావు బతుకు మీద దాని ప్రాణమున్నది. రామికి పిచ్చి లేచినట్టయింది. ఏమి చేయుటకు తోచలేదు. సాహసించింది. చల్మారెడ్డి దగ్గరికి మరియొకసారి పరిగెతింది.

చల్మారెడ్డి స్నేహితులతో ఇస్పేటు ఆడుతున్నాడు. చాలా సంతోషంగా గడచిపోతున్నది. కాలము, స్నేహితులందరు అతని ఉదార స్వభావానికి పొగడుతున్నరు. ఆ స్నేహితుల పని అంత అతన్ని ఆకులలో ఓడించి పొట్ట బోసుకొనుటయే. పదులు ఇరవదులు వందల కొలది రూపాయలు రోజు వోడుతునే ఉంటడు. రణరంగంలో వెన్నిచ్చి పరిగెత్తినా చల్మారెడ్డి ఇందులో వెనుదీయడమనే దెరుగడు. చాలా మోజులో ఉన్నది ప్యాకాట. ఇంతలో రామి, కాళ్ళు తడబడుతుంటే ఎట్లాగో అతి కష్టముతో చల్మారెడ్డి ఇంటి ముందు చేరి “అయ్యా! అని అరిచింది. చల్మారెడ్డికి అరికాలి మంట నెత్తికెక్కింది. తన ఉల్లాసాన్నంతా ధ్వంసము చేసిన రామిని చీరెయ్యాలనుకున్నాడు.

“ఏమే భోసిడి పొగరెక్కింది! మాటి మాటికి నా వద్దకి రావద్దని చెప్పలేదా?” అని ఆమె వైపు చెప్పు విసిరిండు.

చల్మారెడ్డి స్నేహితులంతా తమ ఉత్సాహాన్ని పాడుచేసినందుకు తగిన శాస్తి అయింది కదా అని ఒక్కమారు గొల్లున నవ్వారు.

రామికా దెబ్బతో స్పృహ తప్పింది. వీథిలో అట్లాగే పడిపోయింది. బజారు నుండి పొయ్యే ఓ బిచ్చగానికి ఆమె అవస్థ చూసి మనసు కరిగింది. నోటిలో ఇన్ని నీళ్ళు పోసి తెలివి తెచ్చిండు. మెల్లగా ఆమెను ఇంటికి చేర్చిండు. రామి పడుకుంటు లేచుకుంటూ తన మొగని మంచము దరికి చేరి చూసేవరకు వెంకయ్య దీర్ఘనిద్రలో ఉన్నడు. హా! యని అతని మీద పడింది. చింపుడు బొంతలో పండుకొని వున్న చంటిది కెవ్వుమని కేకవేసి చుట్టబడ్డది. ఆ దృశ్యాన్నంతా చూసి రామి ఒక్క పెట్టు అరచి కిందపడిపోయింది. ఇదంతా ఏమీ తెలియదు. పిల్లలిద్దరు వెర్రి ముఖాలతో ఒకరినొకరు చూసుకున్నారు. ఇదంతా ఏమయబడ్డది. ఆ దృశ్యాన్నంతా చూసి రామి

సమాజానికి ఈ గొడవ ఏమీ అవసరము లేనట్లు గప్ చుప్ గా ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com