లాగితే డొంక కదులుతుందంటరు. బాయిల పాతాళగరిగె ఏస్తె ఎప్పుడో మరిచిపోయినయి దొరుకుతయి. కొత్తగా బయటపడుతయి. అట్లనే సాహిత్యంలో ఒక లింక్ ని వెదుకుతూ ఉంటే అనేక మూలాలు దొరుకుతూ ఉంటాయి. ఈ లింక్ అన్ని సార్లు కాకపోయినా కొన్ని సార్లయినా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.

తీగ అట్లా తెలియ వచ్చిన మహిళే కృపాబాయి సత్యనాథన్. ఇంగ్లీషులో ఆత్మకథాత్మక నవల ‘సగుణ – ఎ స్టోరీ ఆఫ్ నేటివ్ క్రిస్టియన్’ పేరిట రాసింది. ఇట్లా ఇంగ్లీషులో ఆత్మకథను నవలగా రాసిన మొట్టమొదటి భారతీయ మహిళ. దేశంలో ఇంగ్లీషులో నవలలు రాసిన రెండో మహిళ. 1874లో జనవరి నుంచి ఎప్రిల్ వరకు (నాలుగు సంచికలు) ‘బెంగాల్ మ్యాగజైన్’లో తోరుదత్ ‘బియాంక’ పేరిట ఒక నవలను సీరియల్ గా ప్రచురించింది. అది అసంపూర్ణ నవల, (మార్కండ్ ఆర్. పరాంజ్ పె. 2013: 113) అయినప్పటికీ అదే ఇండియాలో మహిళ రాసిన మొదటి ఇంగ్లీషు నవలగా సాహిత్య చరిత్రలో రికార్డయింది. ఇక్కడ మనం చర్చించుకుంటున్న కృపాబాయి సత్యనాథన్ 1888 నాటికే నవల రాయడమే గాకుండా ముస్లిం బాలికల కోసం పాఠశాల స్థాపించింది. మిషనరీ పాఠశాలను స్థాపించింది. అందులో బోధించింది. బాలికల విద్యాభివృద్ధికి కృషి చేసింది. వైద్య విద్యను అభ్యసించింది. భర్తతో పాటు మదరాసు, రాజమండ్రి, కుంభకోణం, నీలగిరి తదితర ప్రదేశాలు తిరిగింది. అక్కడ నివాసమున్నది. ఈమె గురించి మొదటి సారిగా భండారు అచ్చమాంబ రాసిన అబలా సచ్చరిత్ర రత్నమాలలో చదివిన. ఆ తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు అచ్చేసిన ‘ఆంధ్ర వాజ్మయ సూచిక’లో రెండు తెలుగు నవలలు ఈమె రచనలుగా నమోదయ్యాయి. అప్పటి నుంచి ఈమె ఎవరూ అని వెతుకుతూ ఉంటే అనేక కొత్త విషయాలు అందుబాటులోకి వచ్చాయి. అవి మీ ముందుంచుతున్నాను.

ఇండియాలో మహిళల రచనలపై వచ్చిన సాధికారికమైన పరిశోధక గ్రంథం (రెండు భాగాలు) ‘విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా’. దీనికి సుప్రసిద్ధ విమర్శకులు, ఫెమినిస్ట్ ఉద్యమకారులు సూజితారు, కె.లలితలు సంపాదకత్వం వహించారు. ఇందులో కృపాబాయి గురించి రెండు పేజీల్లో సమాచారమిచ్చిండ్రు. ఈ పుస్తకం 1993లో అచ్చయింది. అయితే 1902 నాటికే కృపాబాయి నవల ‘సగుణ’ తెలుగులోకి అనువాదమయిందని భండారు అచ్చమాంబ రాతల వల్ల తెలుస్తుంది. బహుశా తెలుగులోకి అనువాదమయిన మొదటి మహిళా రచయిత కృపాబాయియే కావొచ్చు. ఈమె మరో నవల ‘కమల’ 1909లో తెలుగులోకి అనువాదమయింది.

‘సగుణ’ నవలను 1998లో లోకు? చందాని అనే ఆస్ట్రేలియాలో నివసించే శ్రీలక వనిత తన సంపాదకత్వంలో వెలువరించింది. దీన్ని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వారు ప్రచురించారు. ఇట్లా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా తెలుగు సాహిత్య చరిత్రకు కొత్తగా జోడించుకోవాల్సిన వ్యక్తి కృపాబాయి సత్యనాథన్.

బొంబాయి ప్రెసిడెన్సీలో క్రైస్తవ మతంలోకి మారిన మొట్టమొదటి బ్రాహ్మణ వ్యక్తి హరిపంత్ ఖిస్తి, ఆయన భార్య రాధాబాయి. ఈ దంపతులకు 14మంది సంతానం. ఇందులో 13వ సంతానం కృపాబాయి. ఈమె 1862 ఫిబ్రవరి 14 నాడు ఇప్పటి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో జన్మించింది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి రాధాబాయి అన్నీ తానే అయి పిల్లల్ని పెంచి పెద్ద జేసింది. ఇంటికి పెద్దవాడయిన భాస్కర్ కుటుంబాన్ని కొంత పోషించిండు. ఇతడు కూడా చిన్న వయసులోనే చనిపోయిండు. .

1847 ఆ ప్రాంతంలో సావిత్రిబాయి ఫులే కొన్ని రోజులు విద్యాభ్యాసం చేసిన అహ్మద్ నగర్ లోని మిషనరీ పాఠశాలలోనే ఈమె కూడా మొదట్లో చదువుకున్నది. బహుశా తర్వాతి కాలంలో కృపాబాయి పాఠశాలల స్థాపనకు సావిత్రిబాయి ఫులే స్ఫూర్తి ఎంతవరకున్నదో భవిష్యత్ పరిశోధనల్లో తేలాల్సి ఉన్నది. ఈమె జీవిత చరిత్రకు సంబందించిన కొంత సమాచారం ‘కమల – ఎ స్టోరీ ఆఫ్ హిందూ లైఫ్’ పుస్తకానికి హెచ్.బి. గ్రిగ్ అనే మహిళ రాసిన ముందుమాట ద్వారా తెలుస్తోంది. ఈ నవల కృపాబాయి చనిపోయిన తర్వాత వెలువడింది. తనకు స్ఫూర్తిగా నిలిచిన విద్యావంతుడైన సోదరుడు భాస్కర్ చనిపోవడంతో కృపాబాయి డిప్రెషన్ కు గురయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు 13వ యేట బొంబాయిలోని జనానా మిషనరీ పాఠశాలలో చేర్పించారు. అక్కడ ఆమె ప్రతిభను గుర్తించిన మిషనరీ డాక్టర్ ప్రోత్సహించారు. వైద్య విద్యలో శిక్షణనిప్పించేందుకు ఇంగ్లండ్ కు పంపేందుకు ధనంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. అయితే కృపాబాయి శారీరకంగా బలహీనంగా ఉండడంతో ఆ పనిని మిషన్ నిర్వాహకులు విరమించుకున్నారు. అయితే అప్పుడప్పుడే మద్రాసులో మహిళలకు సైతం వైద్య విద్య అందుబాటులోకి రావడంతో కృపాబాయిని మిషనరీ నిర్వాహకులు అక్కడికి పంపిచారు. బొంబాయి నుంచి ఒక్కతే 1878 ఆ ప్రాంతంలో మదరాసుకు చేరుకుంది. ఇక్కడ మద్రాసు మెడికల్ కళాశాలలో

మొదటి సంవత్సరం ఒక్క కెమిస్ట్రీలో మినహా మిగతా అన్ని సబ్జెక్టులలో ఆమె టాపర్‌గా నిలిచింది. అయితే ఒక ఏడాది గడిచిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్య విద్యకు స్వస్తి పలికింది. ఈ సమయంలో అక్కడ మిషనరీగా పనిచేస్తున్న రెవరెండ్ విలియం థామస్ సత్యనాథన్ (1830-1892) ఇంట్లో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసిండ్రు. సత్యనాథన్ భార్య అన్నా సత్యనాథన్ (1832-1924) కూడా కృపాబాయిని సొంత కూతురిలా చూసుకున్నారు. కృపాబాయికి చదువుపట్ల గల ఆసక్తిని అచ్చమాంబ ఇలా రాసిండ్రు.

కృపాబాయి మొదటి నుంచి విద్యపట్ల ఆసక్తి కనబరిచేది. ఈ విషయం గురించి భండారు అచ్చమాంబ ఇలా రాసింది. “కృపాబాయి బాల్యమునుండియే మిగుల తెలివి గలది యనిపించుకొనెను. ఈమె విద్నభ్యసించునపుడు తన సహోదరునితోడ గూర్చుండి చదువలయునని కోరుచుండెను గాని యామె తన వద్ద చదువ కూర్చుండినచో తన తప్పిదములను దిద్దునని యెంచి యట్టి యవమానమున కోర్వ జాలక యామె సహోదరుడామెను దగ్గర జేరనిచ్చెడివాడు కాడు. చిన్నయన్న యట్లు చేసినను కృపాబాయి జ్యేష్ఠ భ్రాత యగు భాస్కరుడు తన ముద్దు చెల్లెలియం దధిక ప్రీతి కలవాడై యామె విద్యాభ్యాసము చక్కగా జరుపుచుండెను. ఆమెకు సృష్టి సౌందర్యావలోకమునం ధధిక ప్రీతిగాన నామె నిత్యము భాస్కరునితోడ బోయి యనేక పర్వతములను, వనములను, ఉవవనములను దప్పక చూచుచుండెను.” (అచ్చమాంబ, భండారు. 1917; 37)

ఇదే సమయంలో రెవరెండ్ సత్యనాథన్ కుమారుడు సామ్యూల్ సత్యనాథన్ ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నాలుగేండ్లు విద్యాభ్యాసం చేసి ఇండియాకు చేరుకున్నాడు. సామ్యూల్, కృపాబాయి ఒకే ఇంట్లో నివసిస్తూ ఉండడంతో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 1881లో పెండ్లి చేసుకున్నారు. ఇండియాకు చేరుకున్న సామ్యూల్ సత్యనాథన్ మొదట ఉదకమండలంలోని ‘బ్రిక్స్ స్మారక పాఠశాల’లో ప్రధానోపాధ్యాయులగా పనిచేశారు. ఇక్కడో హెబర్ట్ కళాశాలలో కొన్ని రోజులు ఆయన లెక్చరర్ గా పనిచేసిండు.

ఉదకమండలంలో ఉన్న సమయంలోనే కృపాబాయి సత్యనాథన్ ముస్లిం బాలికల దురవస్థను గమనించి వారి కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించింది. ఆ తర్వాత మిషనరీల తరపున మరో విద్యాలయాన్ని కూడా ఆమె ఏర్పాటు చేసింది. వీటిని నిర్వహించడమే గాకుండా అందులో ఆమె బోధన కూడా చేసింది. సామ్యూల్ సత్యనాథనను అధికారులు బదిలీపై ఉదకమండలం నుంచి రాజమండ్రికి పంపించారు. ఇక్కడ ఆయన ఒక్క సంవత్సం 1884-85 మధ్యన ఉన్నాడు. రాజమండ్రి నుంచి ఆయనకు తమిళనాడులోని కుంభకోణంకు బదిలీ అయింది. అక్కడ ఒక ఏడాది ఉన్న తర్వాత ఆయన్ని ప్రభుత్వం విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా నియమించింది. ఇది 1886లో జరిగింది.

ఉదకమండలంలో ఉన్న సమయంలోనే కృపాబాయి తన రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించింది. మొదట అక్కడి వాతావరణాన్ని, ప్రకృతిని వర్ణిస్తూ ‘ది ఇండియన్ అబ్జర్వర్’, ‘నేషనల్ ఇండియన్ జర్నల్’ మొదలైన పత్రికలకు అనేక వ్యాసాలు రాసింది. భర్త ఉ ద్యోగం మదరాసుకు మారిన తర్వాత ఆమె ఆరోగ్యం కొంత కుదుట పడింది. ఈ సమయంలో ఒక స్నేహితురాలితో పాటు భర్త కూడా చిన్న చిన్న వ్యాసాలు, కవిత్వం రాసే బదులు నవల రాయమని ప్రోత్సహించారు. వారి ప్రోత్సహం మేరకు ఆమె మొదట 1887-88 మధ్య కాలంలో ‘మదరాసు క్రిస్టియన్ మ్యాగజైన్’లో తన కుటుంబ జీవితాన్ని నవలగా రాసింది. ఇది నవలా రూపంలో వెలువడిన తర్వాత ఇండియాతో పాటు విదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. తొలిసారిగా ఒక భారతీయ మహిళ, అదీ మతం మార్చుకున్న రెండో తరం మహిళగా తన అనుభవాలు, జ్ఞాపకాలను ‘సగుణ’ నవలలో రికార్డు చేసింది. భారతీయుల ఆచార వ్యవహారాల గురించి రాసేప్పుడు వాటి గురించి అంతగా తెలియని పాఠకులను సైతం దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యే విధంగా నవలను రాసింది. ఇందులో చిన్నప్పుడే అంటే తన ఆరేండ్ల వయసులో (1868)లో చనిపోయిన తండ్రితో పాటు తల్లి రాధాబాయి, ఆమె మిత్రురాలు లక్ష్మి, తన మిత్రురాండ్రు ప్రేమ, హరిణి, మిషనరీ మిసెస్ రాబర్ట్స్, సోదరుడు భాస్కర్ ఇట్లా అనేక సజీవ పాత్రలతో నవలను నడిపించింది. అందుకే ఈ నవలకు విదేశాల్లో సైతం మంచి గుర్తింపు ఉండింది. ఈ విషయమై కృపాబాయి రాసిన మరో నవల ‘కమల’కు ముందుమాట రాస్తూ గ్రిగ్స్ అనే విమర్శకురాలు ఇలా చెప్పిండ్రు. “Her writings seem even better known to English than to Indian readers, some of them having been reviewed in flattering terms in the leading English journals. Her majesty the Queen Empress had recently accepted a copy of “saguna” and was graciously pleased to request that any other work by the authoress should be sent to her.” (Memoirs, Mrs H.B.Grigg, 1894).

ఈమె రెండో నవల 1893లో మళ్ళీ ‘మదరాసు క్రిస్టియన్ మాగజైన్’లో సీరియల్ గా ప్రచురితమయింది. ఇది 1894 డిసెంబర్ లో పుస్తకంగా అచ్చయింది. ఈ రెండు నవలలను మదరాసులోని శ్రీనివాసన్, వరదన్ అండ్ కంపెనీ అనే ప్రచురణ సంస్థ ముద్రించింది. ‘సగుణ’లో క్రైస్తవ జీవితాలను, ఇండియన్స్, విదేశీయుల మధ్యన వైరుధ్యాలు, ఆచార వ్యవహారాల్లో తేడాను రికార్డు చేస్తే ‘కమల’ నవలలో హిందూ మహిళల జీవితాలను, వారి ఆచారాలను, విద్యావశ్యకతను రికార్డు చేసింది. కృపాబాయి రాసిన వ్యాసాలు, కవిత్వం కూడా పుస్తకంగా అచ్చయింది.

సామ్యూల్ సత్యనాథన్ ఇంట్లో అందరూ రచయితలే కావడం గొప్ప విషయం. సామ్యూల్ తండ్రి డబ్ల్యు.టి. సత్యనాథన్ రచనలు చేసిండు. సామ్యూల్ (1861-1906) “క్రిస్టియన్ పేట్రియాట్’ అనే పత్రికకు సంపాదకత్వం వహించడమే గాకుండా, కొన్ని పుస్తకాలు రాసిండు. సామ్యూల్ తల్లి అన్నా సత్యనాథన్ (1832-1894) కూడా రచనలు చేసింది. అట్లాగే సామ్యూల్ రెండో భార్య కమల సత్యనాథన్ (1879-1950) (హిందూ హిరోయిన్ శకుంతల’ పేరిట రచనలు చేసింది. సామ్యూల్-కమల సత్యనాథన్ సంతానం పద్మినీ సేన్ గుప్త (1906-1988) కూడా గొప్ప రచయిత్రి.

కృపాబాయికి ఇష్టమైన కవి వర్డ్స్ వర్త్. ఈమె వర్డ్స్ వర్త్ తో పాటు, టెన్నిసన్, లాంగ్ ఫెలో, బ్రౌనింగ్, లూయిస్ మోరిస్, జార్జ్ ఎలియట్, మిల్టన్, రుడ్యర్డ్ కిప్లింగ్ తదితరుల రచనలు విరివిగా చదివింది. అందుకే ఆమె తన రచనలను చక్కగా తీర్చి దిద్దగలిగింది.

ఇక ఈమె తెలుగువారికి ఎట్లా దగ్గరయ్యిందో చూద్దాం. బండారు అచ్చమాంబ 1905లో చనిపోయింది. ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ మొదటి భాగం అచ్చమాంబ బతికుండగానే 1901లో అచ్చయింది. రెండో సంపుటం ఎప్పుడు అచ్చయిందో తెలియదు. అయితే ఎన్.వి.కృష్ణ అండ్ కో వారు 1913లో మొదటి భాగాన్ని మూడు వేల ప్రతుల్లో పునర్ముద్రించారు. ఈ కంపెనీలో భాగస్వామి అయిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు రెండో భాగాన్ని 1917లో ప్రచురించాడు. ఈ పుస్తకం ‘ఉత్తమ గ్రంథాలయం’ ప్రచురణ సంస్థ తరపున వెలువరించారు. దీనికి గాడిచర్ల పీఠిక రాస్తూ ఇలా చెప్పాడు. “కీర్తి శేషురాలైన శ్రీమతి. బండారు అచ్చమాంబ గారు రచించిన అబలా సచ్చరిత్ర రత్నమాలలో కొన్ని చరిత్రములు ఇదివరలో నేను ఎచ్.వి.వి.కృష్ణలో భాగస్థుడుగా నుండగా మొదటి సంపుటముగా ప్రకటించితిని. ఇట నే వర్ణింప నవసరము కాని కొన్ని కారణములచే రెండవ సంపుటము నింత కాలము దనుకను ప్రకటింపజాలనైతిని. ఆంధ్రలోక మీ రెండవ సంపుటమునకై యెదురు చూచుచున్నదని నే నెరుగని వాడను కాను కావున నిప్పుడు యుద్ధ సమయమే యైనను గ్రంథములకు వలయు సర్వోపకరణములు మిక్కిలి ధర హెచ్చి యున్నను సాహసించి పనిబూని నేటికీ గ్రంథమును వెలియిడగలిగితిని.”(గాడిచర్ల, హరిసర్వోత్తమరావు. 1917: పేజి ఏడు)

ఈ గ్రంథములో కృపాబాయి తెలుగు పుస్తకం సగుణ గురించి అచ్చమాంబ “1886వ సంవత్సరమునందామె భర్తను చెన్నపట్టణమునకు మార్చిరి; యచటికి వచ్చిన యనంతరము పత్రికలకు వ్యాసములు వ్రాయుటలోనే కాలము గడపక, ప్రబంధ రచన చేయుట మంచిదియని యామె భర్త సూచించెను. అందుపై నామె తన బాల్యము నందలి యనేక సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొని వానితో దన కల్పనలను గూర్చి ‘సగుణమ్మ’ యను ప్రబంధమును నొకదాని నింగ్లీషునందు వ్రాసెను. అది ప్రస్తుతము తెలుగునందు భాషాంతరీకరింపబడి యున్నది” అని రాసింది. అంటే 1905 కన్నా ముందే ఈ పుస్తకం అచ్చయింది.

అట్లాగే ఆంగ్లంలో ‘కమల’ నవల 1894లో అచ్చయింది. దీన్ని తెలుగులోకి తర్జుమా చేసిండ్రు. ఈ అనువాదాన్ని 1909లో మదరాసులోని ఎపిసికె ప్రెస్లో అచ్చేసిండ్రు. మొత్తం 143 పేజీల్లో ఈ నవల అచ్చయింది. అయితే ఈ రెండు నవలల మూల ప్రతులు మాత్రం లభ్యం కావడం లేదు. అవి దొరికినప్పుడు మాత్రమే వాటిని ఎవరు తర్జుమా చేసిండ్రో తెలుసుకునేందుకు అవకాశముంటుంది. ఇందులో ‘కమల’ నవల తెలుగు ప్రతి బ్రిటీష్ లైబ్రరీలో ఉన్నట్లు అక్కడ పనిచేసిన బార్నెట్ అనే అతను రాసిండు. (ఎ కేటలాగ్ ఆఫ్ తెలుగు బుక్స్, 1912: 90).

అచ్చమాంబ జీవితానికి కృపాబాయి సత్యనాథన్ జీవితానికి చాలా సారుప్యాలున్నాయి. ఇద్దరు కూడా స్వయంకృషితో పట్టుబట్టి విద్యాభ్యాసం చేసిండ్రు. ఇద్దరు కూడా తమ సమకాలీన జీవితాలను సృజనాత్మకంగా సైతం రికార్డు చేసిండ్రు. ఇద్దరు కూడా దాదాపు ఒకే వయసులో మరణించారు. అచ్చమాంబ 1905 జనవరి 18న 30వ యేట మరణించగా, కృపాబాయి సత్యనాథన్ 32వ యేట ఆగస్టు 8, 1894 నాడు మదరాసులో మరణించింది. ఈమె సమాధి ఏడాది కూడా బతికిలేని తన కూతురు పక్కన పరశువాకంలోని సెమిట్రీలో ఉన్నది.

సంగిశెట్టి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com