ఉపాధ్యాయుడుగా, కవిగా ఎన్నో అవార్డులు కోట్ల వెంకటేశ్వర రెడ్డితో మామిడాల రమేష్.. ఈ పక్షం ముఖాముఖి

మూడున్నర దశాబ్దాలుగా నిరంతరం కవిత్వం రాస్తూ తనదైన ముద్రతో తెలుగు సాహిత్య చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్న కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి ఉపాధ్యాయుడుగా, కవిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. హాస్యం, వ్యంగ్యం, రాజకీయ కవిత్వంలో అలవోకగా అల్లే కవిగా ప్రసిద్ధులు. 2019లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారమిచ్చి గౌరవించింది. నిరంతర కవిగా కవితాయాత్ర కొనసాగిస్తున్న శ్రీ కోట్ల వెంకటేశ్వరరెడ్డితో మామిడాల రమేశ్ జరిపిన ఆత్మీయ సంభాషణ ఇది.

నమస్కారం కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు

కోట్ల: నమస్కారం సార్

మీ జీవితానుభవాలు, కవితా సృష్టికి ఎలా దారి చూపాయో వివరిస్తారా?

నాకు కవిత్వం, జీవితం ఒకటే. కవిత్వ సృజనా, మనిషిగా జీవించడం పూలబాట మీద నడకకాదు. జీవితం అనేక సంవేదనల నిత్యప్రయాణం. కవిత్వ సృజనా అంతే ప్రతి కవిత వేదనా భరిత సృష్ట, దిగువ మధ్యతరగతి, రైతు కూలీ కుటుంబ జీవితం, గ్రామీణ విపత్కర పరిస్థితులు చవి చూసిన కవికి కవిత్వం ఒక అప్రయత్న ప్రకటనే. మా ఊరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చిన్న చింతకుంట మండలం దుప్పల్లి గ్రామం. ప్రస్తుతం నాది వనపర్తి జిల్లా. ఒకప్పటి తెలంగాణ గ్రామానికి నిదర్శనం మాగ్రామం. ఇప్పుడు కాదు. నా బాల్యం కూటి కోసమే కాదు నీటికోసమూ అలమటించిన రోజులు. మాది పేరుకే అగ్రవర్ణం, మాకుటుంబంలో అంతా బీడీ కార్మికులే. నేను నాకు నల్గురు చెల్లెండ్రు. వాళ్ళు చదువులుమాని నన్ను చదివించారు. ఇప్పటికీ వాళ్ళలో మా అమ్మను చూసుకుంటాను. ఉద్యోగం వచ్చేదాక బంధువులు, మిత్రుల తోడ్పాటుతో 28 ఏళ్ళు గడిచిపోయాయి. మొదట శాఖాగ్రంథాలయంలో 1986లో లైబ్రేరియన్ గా జీవితం మొదలు పెట్టాను. ఉద్యోగం చిన్నది బాధ్యతలు పెద్దవి. నలుగురు చెల్లెండ్ల పెళ్ళిళ్ళు చేయాలి. నేనూ బ్రతకాలి, ఉద్యోగం లేనప్పడు ఎన్నడూ అప్పులు చేయని నేను వచ్చాక అప్పులు చేయాల్సి వచ్చింది. అనేక ఆటుపోట్ల మధ్య లైబ్రేరియన్ గా విస్తృతమైన అధ్యయనం చేసుకోవడానికి వీలైంది ఆర్థికంగా గ్రామ జీవితం విచ్ఛిన్నమైనదైనా మా ఊరు సాంస్కృతికంగా బాగా సంపన్నమైనది. ముఖ్యంగా రంగస్థల నాటకాలకు, భజన కీర్తనలకు, కబడీ ఆటలకు మాఊరు ప్రసిద్ధి అప్పటికీ, ఇప్పటికి. ఆ అభిరుచి నన్ను కొంచెం సాహిత్యం వైపు నెట్టందేమో.

డిగ్రీ చదివేరోజుల్లోనే ఒక లిఖిత మాసపత్రికను నడిపాను. వార్షిక సంచికలకు సంపాదకునిగా ఉన్నాను. అభిరుచి అట్లూ మొదలై ఎం.ఏ. అర్థశాస్త్రంలో సీటు వచ్చినా ఎం.ఏ తెలుగులో చేరిపోయాను. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో గొప్ప గొప్ప ఆచార్యుల దగ్గర చదువుకోవడం, ఆర్ట్స్ కాలేజి నిత్య రాజకీయాల వేదికగా ఉండటం, విద్యార్థి ఉద్యమాలు కొత్త కాంతికి దారి వేసినయి. సినారె కవిత్వ బోధన, బిరుదు రాజు రామరాజు వంటి పరిశోధకుల మార్గనిర్దేశం, ఎస్వీ రామారావు వంటి ఆచార్యుల ప్రోత్సాహం నన్ను కవితా రచన వైపు తిప్పినవి.

రచయితగా మిమ్మల్ని ప్రభావితం చేసినవారు?

మా తరానికి శ్రీశ్రీ, దిగంబర కవులు ఆకర్షించారు. ఆవేశాన్ని నింపారు. ఆతర్వాత కుందుర్తి వచన కవితా మార్గం, శేషేంద్ర మామూలు వస్తువును కవితా వస్తువుగా తీర్చిదిద్దేతీరు నన్నుకర్షించినవి. ఆధునిక మాహా భారతం చదివి ఎంతో ఉద్వేగానికి లోనైనాను. ఏకలవ్య శిష్యుడనై తదనంతర కాలంలో ఆ అభిమానంతోనే నా పెద్ద కుమారునికి శేషేంద్ర అని పెట్టుకున్నాను. ఇక మహాకవి సినారె బోధన, కవితా పఠనం, వారి ఆహార్యం నన్ను మంత్ర ముగ్ధున్ని చేసిన అంశాలు. తరగతిలో ఉన్నా ఎన్నడూ దగ్గరగా వెళ్ళి మాట్లాడిన సాహసం చేయలేదు. 1987లో నా తొలిపుస్తకం ‘గుండెకింద తడి’ అవిష్కరణకు ఆహ్వానించాక వారితో సాన్నిహిత్యం పెరిగింది. మెళు కువలు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆకర్షించింది ఆచార్య ఎన్. గోపిగారే, కె. శివారెడ్డి, ఎన్. గోపి గారలు విస్తృతంగా రాయడం ఎట్లా సాధ్యమని నెవ్వెర పోయేవాడిని. వాళ్ళలాగా ఎందుకు రాయకూడదని ఆలోచించేవాడిని ఆ ఆలోచనలే నన్ను కవిని చేశాయి.

కాళోజి పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేత, సినారె పురస్కారం అందుకున్నారు కదా మీ అనుభూతి ఎలా ఉంది?

నేను ఎం.ఫిల్ చేస్తున్న రోజుల్లో వరంగల్ లో ఒక కవి సమ్మేళనంలో కాళోజీ గారిని 1985లో చూశాను. ఆకవి సమ్మేళనంలో ‘ఎన్ కౌంటర్’ అనే ఒక ఫన్నీ మినీ కవిత వేగంగా చదివి వేదిక దిగిపోయాను. అధ్యక్ష స్థానంలో ఉన్న వారు అరె వీడేదో గమ్మత్తుగ చెప్పాడు. ఒరేయ్ వచ్చి మరోసారి చదువు అన్నాడు. నాకు భలే సంతోషం వేసింది. ఆ ఉత్సాహం వారికి ‘నూరు తెలంగాణ నానీలు’ అంకితమిచ్చే దాక తగ్గలేదు. ఎంతో ప్రేమతో స్వీకరించి ఆశీర్వదించారు. మూడు దశాబ్దాల కవితా ప్రయాణంలో ఎన్నో అవార్డులు, సత్కారాలు, వచ్చాయి. నా మొదటి కవితా సంపుటికే సరసం (సమతా రచయితల సంఘం) ఉత్తమ కవితా సంపుటి అవార్డు లభించింది. అవన్ని ఒక ఎత్తు సినారె పురస్కారం ఒక ఎత్తు. ఎందుకంటే అది నా హక్కు అనుకుంటాను. కాళోజి వంటి ప్రజాకవి, సినారె వంటి మానవీయ మహాకవి జమిలిగా నాలో ఉన్నారేమో అనిపిస్తుంది.

పాఠకుల్లో కవిత్వ స్పృహ పెరగడానికి ఏం చేయాలంటారు. మీ అధ్యయనం, మీ రచనా విధానం?

మిత్రమా! పాఠకుల్లో కవితా స్పృహ ఉంది. మరింత పెరగడానికి మనం చేయాల్సింది వాళ్ళ హృదయ స్పందనల్ని ప్రతిబింబింప చేయాలి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం పట్ల జరుగుతున్న అణచివేతల్ని ఎండగట్టినప్పుడల్లా పందలాది మంది ఫోన్లు చేసి అభినందించిన అనుభవం నాకు ఉంది. మీరన్నట్లు కవిత్వానికి పాఠకుల సంఖ్య కొంత పరిమితంగానే ఉంటుంది. కాని వాళ్ళు శ్రేష్ఠులు కూడా. ఇక రచనా విధానానికి వస్తే సినారె అన్నట్లు కప్పిచెప్పడం కవిత్వం. ఒక్కో దృశ్యం వెంటాడుతుంటది. కన్యాశుల్కం సినిమా పాఠ్యాంశంలో భాగంగా 1985లో చూశాను. అందులో సావిత్రి నవ్విన నవ్వు తలుచుకున్నప్పుడల్లా నన్ను వెంటాడుతూనే

ఉంటుంది. సినిమా చూసిన వెంటనే ‘వెంటాడే దృశ్యం’ అని ఆంధ్రప్రభ వారపత్రికలో ఒక కవిత రాశాను. కదిలించినప్పుడు, నేను కదిలినప్పుడు చాలా వేగంగా రాస్తాను.

ఆధునిక కవిత్వంలో ఎన్నో ప్రక్రియలు వస్తున్నాయి. అయినా అస్పష్టత, సంక్లిష్టత అలాగే ఉన్నాయి. మీరేమంటారు.

ఆధునిక కవిత్వంలో అస్పష్ట, సంక్లిష్ట కవిత్వం మీరన్నట్లు కొంతకాలం రాజ్యమేలిన మాట నిజమే. అట్లూ రాయడం ఒక ఫ్యాషన్‌గా మారిన రోజులు నాకు గుర్తున్నాయి. దాని ఆకర్షణ తగ్గి చాలా కాలమైంది. జనాలకు అర్థం కాకుండా రాసి ప్రయోజనం ఉండదని కవులు గుర్తించారు. ఇప్పటి తరం గొప్ప భావ శబలతతో సరళంగా, స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. వచనమై తేలిపోయిన వాళ్ళు పరిణామ క్రమంలో తెరమరగై పోతారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జలసిరులే కాదు, కవితా ప్రవాహం ఉధ్వతమై ప్రవహిస్తున్నది. తేటపడాల్సిన సమయం వచ్చింది.

కాళోజీ అవార్డు గ్రహీతగా, సీనియర్ కవిగా

మీ సాహిత్య ప్రణాళికలు ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కవితాభిరుచి కలిగిన ముఖ్యమంత్రి కెసిఆర్ నన్ను కాళోజీ అవార్డుకు స్వయంగా ఎంపిక చేయడం, అంతకంటే ముందు కొన్ని సంవత్సరాల క్రితం నమస్తే తెలంగాణలో కవిత చదివి ఫోన్ చేసి అభినందిచడం మరచిపోని జ్ఞాపకాలు. వర్తమాన పరిస్థితులను ప్రతిబింబించే కవిత్వాన్ని రాయడం నాకు ఇష్టం. బహుశ రాజకీయ పరిస్థితుల మీద నేను ఈ మధ్య కాలంలో రాసినంతగా మరొకరు రాసి ఉండరు. ఒక దీర్ఘ కావ్యం రాసే యత్నం కొనసాగుతున్నది.

భావజాల పరంగా

మీ తొలికవితా సంసుటి ‘గుండె కిందతడి” నుండి నేటి వరకు మీ పరిణతిని వివరించండి.

అభ్యుదయం, మానవీయం, అస్థిత్వ ఉద్యమం వంటి భావాలు నా కవిత్వం నిండా కనిపిస్తాయి. వర్తమాన కవితా రీతులు ఆకళింపు చేసుకొంటూ నిత్య విద్యార్థిగా రచనలు కొనసాగిస్తున్నాను. వస్తువును కవితా వస్తువుగా తీర్చిదిద్దే రసవిద్య నాకు పట్టుబడిందనే భావన నాకు కలిగింది. సాహిత్య అధ్యయనం, కవిత్వ రచననే నా ఇప్పటి వ్యాపకం.

సంక్లిష్టమవుతున్న సామాజిక పరిస్థితుల్లో కవిత్వ భవిష్యత్తు?

ఏ పరిస్థితుల్లోనైనా కవిత్వం వేయి కాంతులు వెదజల్లుతుంది. మనిషికి హృదయమూ, మెదడూ ఉన్నంత కాలం కవిత్వం హమేషా నిలిచే ఉంటుంది.

‘మరో బ్రేకింగ్ వ్యూస్’ మీ నుండి పాఠకులు ఆశించవచ్చా?

‘హరితస్వప్నం’ కవితా సంపుటి ఈ నెలాఖరుకు ఆవిష్కరించుకోవలసి ఉంది.

దాని తర్వాత మరో కొత్త సంపుటి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను. ప్రచురణ ఖరీదైంది మిత్రమా!

నేటి యువ రచయితలకు మీ రిచ్చే సూచనలేమిటి?

ఇప్పటికీ కొంత మంది పుట్టుకతో వృద్ధులున్నారు. మూస పద్ధతిలో కవిత్వం రాస్తున్నారు. అచ్చువేస్తున్నారు. వర్తమాన కవిత్వ అధ్యయనం చేయాల్సి ఉంది. భిన్నంగా చెప్పంది, ఆలోచించంది కవిగా రాణించలేమని గుర్తించుకోవాలి. మీరు గమనిస్తున్నరో లేదో చాలా శతకాలు వస్తున్నాయి. శతక లక్షణాలున్న కొత్తగా చెప్పే అంశాలు కొరవడుతున్నాయి. వేమన, బద్దెన, కరుణ శ్రీ, శ్రీశ్రీ వంటి వాళ్ళూ శతకాలు రాశారు. అభివ్యక్తిలోను, వస్తువులోనూ ఎంతో వైవిధ్యం కనిపిస్తాయి. ఆధునిక కవుల్లో ఆ పద్ధతి నాకు కనిపించట్లేదు కొత్తగా చెప్పాలి. అప్పుడే మనం నిలబడతాం.

మీ ‘నూరు తెలంగాణ నానీలు’ ఉద్యమ కాలంలో నినాదాలైనాయి. భావజాల విస్తృతికి పనికి వచ్చాయి. అంత మాటుగా ఎందుకు స్పందించారు?

అవును మీరన్నది నిజమే. ‘ఇప్పుడు రాకుంటే తెలంగాణ మరెప్పుడు సిద్ధించదు’ అన్న కె.సి.ఆర్ మాట జీర్ణించుకున్న. ఆచార్య ఎన్. గోపి గారు అప్పట్లో నేను రాసిన ‘రానీలు’ (రాజకీయనీతులు) చదివి అభినందించారు. నానీల ప్రక్రియలో విజయవంతంగా రచనలు వస్తున్న కాలంలో ఏకాంశతో నానీలు రాస్తే బాగుంటుందని భావించి ‘తెలంగాణ ఉద్యమ’ స్ఫూర్తిని అందిపుచ్చుకొని రాసినవి. అమానవీయంగా ప్రవరించిన సమైక్య వాదుల పైన నా స్పందన అది.

మీ ‘అరే బేటా కామోష్’ కవిత వివాదస్పదమై, చర్చనీయమైందని విన్నాను వివరించండి.

మీకు ఇంతకు ముందే వివరించాను, శేషేంద్ర నా అభిమాన కవి. ప్రత్యక్షంగా ఆయన్ను చూసింది ఆయన షష్ఠిపూర్తి రోజునే. వారి స్వగృహంలో. ఆయన జీవితం, ఆయన భావజాలం ఒకటిగా లేవు అనిపించాయి. కవిత్వం ఆయన శ్వాస కాదు. ఒక ఫ్యాషన్ అనిపించింది. కామోత్సవ్ రచన చదివితే ఏదో ఆవేశం నా చేత ఆ కవిత రాయించింది. అది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. బహుశ శేషంద్ర కవితా జీవితంలో అంత డ్యామిజీ చేసిన పోయెం మరోటి ఉండకపోవచ్చు. వారే స్వయంగా కొంత కాలం కవిత్వ రచన మానుకున్నాను అన్నారు. ఆ కవిత అచ్చు కావడంతో కాంట్రవర్సి మొదలైంది. గాంధీ స్మారక సమితి వారు విజయవాడలో నాకవితను పేర్కొంటూ ‘

కామోత్సవ్’ను అపమని కేసు వేశారు. ఆగిపోయింది కూడా. దానితో ఒక గుర్తింపు. అనేక మందలింపులు, బోలెడు పేరు

నాకు వచ్చినవి. వారితో మరో కవితా వేదికలో సారస్వత పరిషత్ లో పాలుపంచుకోవడం జరిగింది. ఆనాటి కవితను వారెంతో మెచ్చుకున్నారు. జీవితం, కవిత్వం ఒకటిగానే ఉండాలనే భావన నాలో బలంగా ఉండే అంశం. ఆనాటి చర్చల్లో అరసం మిత్రులు, ఆవంత్స సోమసుందర్ వంటి ప్రముఖులు నాకు అండగా నిలిచారు. సినారె వంటి వాళ్ళు మందలించారు. అంతా మంచికే జరిగింది. రాయక తప్పని పరిస్థితులు నాకు కలిగాయి.

వచన కవిత్వంలో ఉద్యమాలు, వాదాలు, ధోరణుల వెంట మీరు నడవక పోవడానికి కారణమేమిటి?వచన కవిత్వంలో ఉద్యమాలు, వాదాలు, ధోరణుల వెంట మీరు నడవక పోవడానికి కారణమేమిటి?వచన కవిత్వంలో ఉద్యమాలు, వాదాలు, ధోరణుల వెంట మీరు నడవక పోవడానికి కారణమేమిటి?

అట్లా ముద్రాంకితాలు ఏమీ లేవుగాని, నేను స్త్రీ, దళితవాద కవిత్వం బలంగానే రాశాను. అస్థిత్వ ఉద్యమ రచనలు మీకు తెలిసినవే.

మీ ఇంట్లో వనజాత కథలు, మీరు కవిత్వం ఎట్లా ఉంటుందీ సాహిత్య వాతావరణం?

వివాద రహితంగా ఉంటుంది. వనజాత అరుదైన కథకురాలు, ఎన్నో వస్తువులు దగ్గర పెట్టుకుంది. ఉద్యోగరీత్య ఆమె

జిల్లా సివిల్ సప్లయ్ అధికారి, తీరిక ఉండదు. ఆమె నాకు తొలిశ్రోత, నేను ఆమెకు తొలి పాఠకున్ని, నాకు ప్రేరణ కూడా ఆమెనే వివాహానంతరం ఉద్యోగక్రమంలో బదిలీ పై వరంగల్ వెళ్ళింది. తాను అక్కడ నేను మహబూబ్ నగర్ లో టీచర్ను. పిల్లలు హైద్రాబాదులో ఆ ఒంటరితనం, వసత సహచర్యలుప్తి నాచేత ‘అంతర్వాహిణి’ కవితా సంపుటిని రాయించింది. నేను వనజాత గురించి రాసినా, సగటు ఉద్యోగం చేసే మహిళల పరిస్థితి, ప్రాధాన్యతలను వ్యక్తం చేశాను అందులో.

చివరగా మీ కుటుంబం గురించి చెప్పండి?

నేను, వనజాత, ఇద్దరబ్బాయిలు. అందరికి వివాహాలు అయినాయి. ఉన్నత చదువులు చదువుకుని ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. నన్ను కవిత్వానికి వదిలేశారు. నాకో మనవడు. వాడి కోసం ‘మనుమసిద్ధి’ కవితా సంపుటిని ప్రకటించాను. మూడు కథలు, ఆరు కవితలతో’ మా ఇల్లు పరిమళం వెదజల్లుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com