కవిత్వం, లోలోపలి సంఘర్షణకు ప్రతిరూపం. బాహ్య అంత:ప్రపంచాల సమరం

బహుముఖ సృజన శీలి స్వాతి శ్రీపాదతో నేటి రచయిత పత్తిపాక మోహన్ ‌ముఖాముఖి

ప్రశ్న : అయిదు దశాబ్దాల పైగా వ్రాస్తున్నారు కదా, మీ నేపధ్యం,స్ఫూర్తి గురించి చెప్పండి.

అతి మామూలు మధ్య తరగతి కుటుంబం. ఆరుగురు అక్కచెల్లెళ్ళలో మూడో దాన్ని. ఇద్దరక్కలు ముగ్గురు చెల్లెళ్ళు. ఒక తమ్ముడు. చిన్నతనంలో నాపైన అమ్మ నాన్న ఇద్దరక్కల అజమాయిషీ- ఒక రకంగా విప్లవాత్మకంగా స్వతంత్ర్య ఆలోచనలు జన్మాంతర సంస్కారం కావచ్చు. అక్కల మీద కోపం వచ్చినప్పుడల్లా పాటలు అల్లుకునే దాన్ని పెత్తందారు పెద్దక్క, చిత్రాల చిన్నక్క అంటూ … స్వతంత్ర్య భావాలు నాన్న నుండే వచ్చాయి. ఊహా ప్రపంచం, రచనా వారాసత్వం రాయలేని అమ్మకు రాసే రూపం నేను. అమ్మకు ఎన్నో కలలుండేవి- ఒక్కటీ తీర లేదు.

ఇందూరు భారతి నాకు ఒక పెద్ద చేయూత.

స్కూల్లో ఏదైనా నచ్చని సమయాల్లో కవిత్వం రాసే దాన్ని. నిజానికి నాకున్న ఫ్లాషింగ్ మెమొరీకి చదువు మీద ఏకాగ్రత చూపితే ఏదనుకుంటే అది అయి ఉండే దానను . కాని అప్పుడు నాకు సాహిత్యమే ముఖ్యమనిపించింది.

( ఊహ తెలిసినప్పటినుండీ ఇప్పటి వరకు ఏరోజున ఏం జరిగింది పూస గుచ్చినట్టు చెప్పగలను, ఎవరేం మాట్లాడారో కూడా). కాదంటే అప్పుడు అవార్డ్స్ గురించీ పేరు ప్రఖ్యాతుల గురించీ ఏ మాత్రం తెలీదు. రచన నా ఉనికి , నా ఊపిరి, నా సర్వస్వం.

ఇప్పుడు నన్ను ప్రేమించే నా పిల్లలు వారి పిల్లలు, వారి కుక్కలు ఇదే నా కుటుంబం.

ప్ర: నిజామాబాద్ లో సాహిత్య వాతావరణం ఎలా ఉండేది? అందులోనూ స్త్రీలకు ఉన్న స్థానం ఏమిటి?

అప్పట్లో ముఖ్యంగా సాంప్రదాయిక కుటుంబాలలో స్త్రీలు బయటకు రాడమే తక్కువ, అయినా మా నాన్న అమ్మాయిలు చదువుకోవాలని అనే వారు. కట్నాలిస్తే చేసుకున్నవాడు అది లాక్కుని వదిలేస్తాడు, మీ చదువు ఎవరూ తీసుకుపోలేరు అనే వారు. నిజానికి ఆయనే ఒక హిట్లర్. చదువుకుందుకు తప్ప మరే స్వేచ్చా ఇవ్వలేదు.

ఆ పిచ్చి పిచ్చి రాతలెందుకు ముందు చదువుకో అనే వారు. అమ్మకు ఆడపిల్లలు ఒద్దికగా గీసిన గీతల్లో ఉండాలి.

అలాటి రోజుల్లో నిజామాబాద్ లో కవిత్వం రాసి, కధలు రాసి వేదిక వరకూ వచ్చిన అమ్మాయిని నేనొక్కదాన్నే. దానికి పెద్ద సపోర్ట్ వీరభద్రాచారి గారు, ఆయనకంటూ ఆయన ఏమీ ఆశపడక పోయినా ఇందూరు భారతి స్థాపించి మాలాటి వారందరినీ ప్రోత్సహించి ఇందూరుకు సాహితీ సౌరభం ఇచ్చిన వ్యక్తి ఆయన. దానికి వెన్నూ దన్నూ సైబ పరంధాములు, చిత్ర కారులు, కవి , ఫొటో గ్రాఫర్. నా కధలు కవిత్వం బొమ్మలు వేసి పత్రికలకు పంపినది సైబ. ఆ ఇద్దరే నా సాహితీ ప్రస్థావనకు పునాది. మాఇంట్లో అమ్మకు నాన్నకు నచ్చ జెప్పి వేదిక వరకూ తెచ్చారు. చాలా రోజులు కవిత్వం చదివిన దాన్ని నేనొక్కదాన్నే. ఇందూరు అంటే స్వాతి, స్వాతి అంటే ఇందూరు అనుకునే వారు. కామోసనుకుని గర్వపడ్డాను. కాని ప్రత్యేక తెలంగాణా వచ్చాక కవి మిత్రుల సన్మానాలకు మరేవో కొలతలు చూసి, బలాబలాలు చూసి ఇంతే కదా అనుకున్నాను. మా స్కూల్ మిత్రుడు చాలా సార్లు చెప్పాడు – మీ పుస్తకాలు మీ వివరాలూ కవిత గారికి పంపండి అని.

జగమెరిగిన నా వివరాలు నేను చెప్పుకోవాలా? స్కూల్లోనే బెస్ట్ టీచర్ అవార్డ్ కి అప్లై చెయ్యమంటే చెయ్య లేదు ప్రతి ఏడాదీ ప్రశంసా పత్రాలనిచ్చిన విద్యా సంస్థకు నా గొప్పలు నేను చెప్పుకోవాలా? అని.

ఇదీ అంతే. ఒకప్పుడూ ఇందూరు గర్వపడి ఎందరినో ప్రభావితం చేసి, ఇప్పటికీ చేస్తున్న నా రచన గురించి నేను చెప్పుకోవాలా?

గుర్తింపు ఎప్పుడూ ఎదుటి వారి ప్రతిభ మన ప్రతిభకు కొలత కాదు. ఒక కిలో రాయి కిలో బరువునే తూకం వెయ్యగలదు, వెయ్యి కిలోలనో లక్ష కిలోలనో కాదు.

ప్ర: నలుగురు కవుల సంకలనం చౌరస్తా కు ఆ రోజుల్లో చాలా పేరొచ్చింది. దాని కధా కమామీషూ ఏమిటి?

మా నలుగురివీ నాలుగు దారులు. సైబ కవిత్వం గీసిన చిత్రం లా ఉండేది.

తొలి తొలి రోజుల్లో సమాజమూ ఊహలూ కలగలిపి రాసే ఉద్వేగం నాది. సూర్యప్రకాశ్ గారు కొంచం వేరుగా స్పష్టంగా దారిచూపే వారు. బద్దూరి నరసింహం అన్ని ఆలోచనలకూ రూపం ఇచ్చేవారు. ముఖ్యంగా మేం నలుగురమే కవిత్వం రాసి , చదివి అందరినీ ఊదర కొట్టే వాళ్ళం.

చౌరస్తా ఆలోచన వీరభద్రాచారిగారిది. ఆయనకు మా కవిత్వం లోకానికి అందించాలనిపించింది. ఆర్ధిక వనరులు అంతగా లేని ఆ రోజుల్లో సైబ తన చేతి రాతతో,బొమ్మలతో , మా మొహాలు గీసి స్టెన్సిల్స్ రాసి సైక్లోస్టైల్ చేసి తెచ్చిన పుస్తకం. నిజానికి ఆ రోజుల్లో అదో సంచలనమే. మాకెవ్వరికీ కీర్తి కాంక్ష లేదు కాని ఉంటే అదొక రికార్డ్. ఎందరో నచ్చి మెచ్చిన కవిత్వం. ఇప్పటికీ చాలా మంది నన్ను ఆ పదహారేళ్ళ స్వాతిగానే గుర్తుంచుకున్నారు ( ముఖ్యంగా కె. శివారెడ్డి గారు)

అప్పట్లో నాస్ఫూర్తితో చాలా మంది కవిత్వం రాసారు, అలాగని చెప్పుకున్నారు, ఈ రోజున గుర్తు చేస్తే అవునా అంటారు.

మళ్ళీ ఆ చౌరస్తా పునర్ముద్రించాలని ఆలోచన.

ప్ర: మీ కవిత్వం వివరాలు కొంచం పంచుకుంటారా?

కవిత్వం అంతర్జనితం, లోలోపలి సంఘర్షణకు ప్రతి రూపం. బాహ్య అంతః ప్రపంచాల సమరం. ఒక వాక్యాన్ని నాలుగు వరుసల్లో రాసుకోడం కవిత్వం కాదు. ముందు మామూలుగా ఆరంభమైనా, వచనానికీ కవిత్వానికీ తేడా తెలుసుకున్నది విస్తృతంగా చదవడం వల్ల. తెలుగు లోనూ ఆంగ్లం లోనూ కవిత్వం ఔపోసన పట్టడం వల్ల.

కప్పి చెప్పేది కవిత్వం. కవి ఊహ అందుకునే సవాలు పఠితలకు లేనప్పుడు అది కవిత్వమెలా అవుతుంది?

నిజానికి 69 నుండి అవిరామంగా కవిత్వం రాస్తూనే ఉన్న 2007 వరకూ పుస్తకం వేసుకునే సాహసం చెయ్యలేదు.

తొలి కవిత్వం -హృదయంలో అడుగులు, ఆ పైన, మనసుకు చూపుంటే, ఎడారులు ఎండమావులు, నదినై ప్రవహించాలని, సుప్త క్షణం, పోతబొమ్మ, రాబోతున్న పుస్తకం -ఇక్కడ అందరూ ఒకటే. మీ కవిత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వలనీ, మీకు జ్ఞాన పీఠ్ ఇవ్వాలనీ అంటూ నా కవితకు చాలా మంది అభిమానులు. బాబూ అవన్నీ మీ పెరట్లో ఉన్నాయా అంటాను నవ్వుతూ వారి అభిమానమే నాకు అమూల్యమైన సత్కారం, అతి విలువైన అవార్డ్. అందరికీ వందనాలు.

నా కవిత నాదే మరొకరిలా రాయలేను.

కొందరు పెదవి విరిచారు సామాజిక స్పృహ లేదని – చూస్తే ఆలోచిస్తే కనబడుతుంది. నడి వీధిలో నగ్నంగా నిలబడిన ప్రౌఢ కాదు నా కవిత.

తరచి చూస్తే తప్ప సొబగులు అంతుపట్టని ముగ్ధ.

ప్ర: సాంప్రదాయ నేపధ్యం నుండి వచ్చిన మీకు రచనా రంగంలో ఆటంకాలు ఎదురవలేదా?

ప్ర: అడుగడుగునా ఆటంకాలే కదా! వెనకాల కుఋంబ నేపధ్యం సాంప్రదాయికం. కాని నా భావాలు చాలా మటుకు అభ్యుదయమే. కులమతాల నమ్మకాలు లేవు, వర్గవ్యత్యాసాలు అసలు లేవు. ఉన్నవి రెండే రండు – ఏరకంగా చూసినా ఆడ, మగ, మరొకటి అణచివేయబడిన వారు, అణిచి వేసేవారు.

కట్టూ బొట్టూ, ఆహారపుటలవాట్లూ పుట్టిన పరిసరాలతో వచ్చినవి. నచ్చినవి. అంత మాత్రాన మమ్మల్ని తూర్పార బట్టడం న్యాయమా?

ఆ రోజుల్లో గడపదాటిన స్త్రీలూ దాటని వాళ్ళు కూడా అన్ని రకాలా హింసకు గురైన వాళ్ళే. ఆ రోజుల్లో గడపదాటిన స్త్రీలూ దాటని వాళ్ళు కూడా అన్ని రకాలా హింసకు గురైన వాళ్ళే. ఆ రోజుల్లో గడపదాటిన స్త్రీలూ దాటని వాళ్ళు కూడా అన్ని రకాలా హింసకు గురైన వాళ్ళే.

రచనా వ్యాసంగంలో ముఖ్యంగా విద్యావ్యవస్థల్లో ఉండి అస్మదీయుల అండ ఉన్నవారు అయినా కాకున్నా పేరున్న రచయిత్రులయ్యారు. భాషా సమృద్ధి వేరు. సృజనాత్మక ప్రతిభా పాఠవాలు వేరు. సినీ రంగానికీ పత్రికా రంగనైకీ చేరువలో ఉన్నవారు పేరు సంపాదించుకున్నారు. కేవలం రచనతో పైకి వచ్చిన వారు చాలా తక్కువ.

చిన్నతనం కదా, బహుమతులనీ, పుస్తకాలు వేస్తామనీ ఎందరో ప్రలోభపెట్టాలని చూసారు. కాని పెరిగిన నేపథ్యం అప్పటికీ ఇప్పటికీ అలా లొంగిపోనివ్వ లేదు. పోనివ్వదు. నాకున్న విలువల ముందు ప్రపంచం యావత్తూ ఒక పక్కన ఉంచినా బలాదూరే నన్ను కొనలేరు.

అబద్ధం కాని, అశ్లీలపదంకాని పలకని, పలకలేని నాకు రచన సాక్షాత్ దైవమే, సరస్వతీ మాతే.

చాలా మంది అంటారు మీకు రావసిన పేరు రాలేదని సక్రమంగా రానప్పుడు అది అవసరం లేదు.

ఫ్ర: మీ కధ, నవల గురించి మీ మాటలు-

69 నుండి 74 లోపల చాలా కధలు రాసాను. సైనిక్ సమాచార్ , స్రవంతి, విశ్వరచన, పల్లకి, మయూరి, కృష్ణాపత్రిక, ఆంధ్ర భూమి , ఆంధ్రజ్యోతి వనితా జ్యోతి ఇలా అన్నింట్లో వందలకొద్దీ కధలు వచ్చాయి. ఈ మధ్యన 74-2020 లోపు ఒక 200 కధలు వచ్చి ఉంటాయి. రాసే వరక్ ఏనాది కాని బయటకు వచ్చాక అది జనాలది.

ఇప్పటికీ రాస్తూనే ఉన్నా కొంచం అరుదుగా .. వాకాటి పాండురంగారావ్ -జాగృతి కధా బహుమతి తో పాటు తెలుగు విశ్వవిద్యాలయం వాసిరెడ్డి రంగనాయకమ్మ స్మారక కీర్తి పురస్కారం మరెన్నో …

కధ నాకూ సమాజానికీ ఉన్న ఘర్షణ. మనసును కదిలించి మదన పెట్టే సంఘటనలు నన్ను నిలువనీక కథ రాయిస్తాయి.

ఏ కధ రాసినా ఎవరినో ఒకరిని కదిలించడం దానికిచ్చిన అపురుపమైన ఆదరణ. పుస్తకాలుగా మౌన వీణ, గోడలు, అవతలివైపు, పొరలు, పంజరం విడిచి … ఇంతవరకూ

నవల విషయానికి వస్తే అది మరింత అరుదుగా ఏడది రెండేళ్ళకు ఒకటి రాయడం ఎక్కువ. పట్టుమని పది నవలలు రాసి ఉంటాను అందులో నాలుగొ అయిదో పుస్తకాలు మిగతావి ఈ బుక్స్.

పునరాగమనం, చిరుజల్లు కురిసెనా? శిశిర వసంతం, చుక్కాని చిరు దీపం

టగ్ ఆఫ్ వార్, ఎక్కడి నుండి ఇక్కడి దాకా …

నవల ఒక జీవితం చిత్రం.

కధలకూ నవలలకూ నాయకురాళ్ళు స్త్రీలే

ఫ్ర: మీ అనువాద కృషి –

అనువాదం నాకోసం నేను ఎంచుకున్న ప్రక్రియ. నన్ను నేను ఒక నిరాశా నిస్పృహల వలయం నుండి ఊబి నుండి బయటకు తెచ్చుకుందుకు ఎన్నుకున్న దారి. అయితే నాకంటు కొన్ని నిర్ధుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరికోసం అనువాదం చేస్తున్నాము, మూల రచయిత భావం శైలి ఎంత వరకు అనువదించగలం అనేది ముఖ్యం గాని అనువాదకుల భాషా పాండిత్యాలు కాదు. మన సాహిత్యం కోసం విదేశీయులు ఎదురు చూడటం లేదు. తెలుగు రాని మన దేశ మిత్రులకు ఎంత ఆంగ్ల వచ్చో తెలిసి ఉండాలి. నా దృష్టిలో నిఘంటువు తెరవకుండా చదివించగలిగేది చక్కని అనువాదం. అలాగని మూల రచన వదిలి అనువాదకుల స్వమ్త కవిత్వం చేరిస్తే అది అనువాదమూ కాదు, అను సృజనా కాదు.

అనువాదకులకు ఈర్ష్యా, అహమూ ఎక్కువే. మాకు తప్ప ఇతరులకు ఏమీ రాదనే ప్రొఫెషనల్ రైవలరీ.

ఇప్పుడు ఎంతగా అనువాదం ఒక వ్యసనం లా పరిణమించిందంటే ఒక వారం అనువాదానికి దూరంగా ఉంటే నన్ను నేను కోల్పోయినట్టు అనిపిస్తుంది.

ప్ర: మీ పునరాగమనం నవల – దాని ప్రభావం

పునరాగమనం నవల ముందు కౌముది వెబ్ మాసపత్రికలో పడమటి సూర్యోదయం అనే పేరుతో సీరియల్ గా వచ్చింది.

ఆ నవల ఒక సంచలనమే -ముందుమాట రాసిన వల్లీశ్వర్ గారు నవోదయ లో పుస్తకం ఇచ్చాకా పుస్తకం చదివిన షాప్ ఓనర్ గారు, ఒకే మాట చెప్పారు, పేజీలు తిరగేద్దామనుకున్నా- అందర్రూ పదహారేళ్ళ అమ్మాయి నాయికగా నవలలు రాసి చదివిస్తే మీరు యాభై యేళ్ళ నవలా నాయికతో ఆ పని చేయించారని.

ఒక కంప్యూటర్ రిపేర్కి వచ్చిన వ్యక్తి ” మేడమ్ ఏం రాసారు… మా ఇల్లాలికి పదేళ్ళుగా చెప్తున్నా కంప్యూటర్ నేర్చుకోమని ఉహు వినలేదు. మీ నవల చద్దివి, ఆ యాభై యేళ్ళ హీరొయిన్ నేర్చుకోగాలేనిది నేనేనా తక్కువ అని నేర్చేసుకుంది అని”

నిజానికి మన సమాజంలో పదహారేళ్ళ అమ్మాయి అయినా యాభై యేళ్ళ అమ్మ అయినా ఎదుర్కునే సమస్యలు ఇంచుమించు ఒకటే. ఆ నవలలో వ్యక్తులందరు మన చుట్టూనే కనిపిస్తారు.

ధైర్యంగా రాసానని అన్నారు.

ప్ర: వర్తమాన రచయిత్రుల గురించి వారి రచనల గురించి ఏం చెబుతారు?

వర్తమాన రచయిత్రులకు సఖ్యత లేదు. వెనక తరం వారికి – ముందు తరాన్ని అహ్వానించే సౌహార్ద్రత లేదు. ముందు తరం వారికి వర్తమాన రచయిత్రులను గౌరవించే సంస్కారం లేదు. ఒకరినొకరు ఆదరించి అభిమానించే తత్వమే కరువైంది.

ఎవరికి వారు వట వృక్షాలమనే భ్రమ. పెదవుల చివరి మెప్పుదలకు లొంగిపోయి పొంగి పోయి ఉనికిని మరచిపోయే గుణం.

రచన సదా ప్రోత్సహించవలసిన విషయమే. కాని కనకపు సింహాసనం దేనికివ్వాలో తెలిసి ఉండాలి.

విలువలు ఉంటే ఆధునిక రచయిత్రులకు పాత చింతకాయ పచ్చడులు. స్వేచ్చా విహంగాలై దారి తెలియక పోవడమే ఆధునికతా?

ఇంకా కులాలు మతాలు అంటూ చెరగటం…

రచన ఔన్నత్యానికి తీసుకు వెళ్ళాలి గాని అధోపాతానికి కాదు.

వారు వారిని ప్రేమించుకునే బదులు వారి రచనను ప్రేమిస్తే బాగుంటుంది.

ఒద్దికగా పెంచుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com