మరింత నూతనంగా… మార్చ్ 8, 1910లో అంతర్జాతీయ మహిళా సదస్సులో కారీ జ్యూట్కిన్ చేసిన ప్రకటన ఈ మహిళా దినోత్సవానికి మూలంగా నిలిచింది. తరువాత ఈ ఉత్సవ దినం ప్రపంచంలోని అనేక దేశాలలో అనేక విధాలుగా రూపాంతరం చెందింది. భారతదేశంలో కూడా మహిళలు ఈ స్పూర్తిని అందుకొంటున్నారు. సామాజిక పురోభివృద్ధిని అన్ని రకాలుగా ఆవాహన చేసుకొంటూ అన్ని రంగాలలో పురోగమిస్తున్నారు. మహిళలకు సమాన హక్కులు లక్ష్యంగా చేసుకున్న భావజాలంతో స్త్రీ వాదం అడుగు పెట్టింది. 1902లో ఎలిజిబెత్ కాడిస్టాంటతో ప్రారంభమైన ఈ ఉద్యమం అనేక విధాలుగా విస్తరిల్లింది. 19, 20 శతాబ్దాల ఫెమినిజం చట్టపరమైన అసమానతలను తొలగించడంపై దృష్టి పెట్టింది. 1960, 80ల మధ్య వచ్చిన రెండవ వేవ్ ఫెమినిజం సాంస్కృతిక అసమానతల పైన దృష్టి పెట్టింది. 1990, 2000 మధ్య ఫెమినిజం విభిన్న జాతులలో దేశాలలో ఈ భావజాలాన్ని బలంగా ప్రోది చేయడానికి దోహదపడింది. సుమారుగా 1990 ప్రాంతంలో తెలుగు సాహిత్యంలో ప్రారంభమైన స్త్రీవాదం సాహిత్యానికి కొత్త సౌదర్యం దృక్పథాన్ని ప్రతిపాదించింది. అదివరకు సాహిత్యంలో లేని ప్రతీకలను, సరికొత్త నిర్మాణ పద్దతులను తెరమీదకు తెచ్చింది. ఇదే సమయంలో తెలంగాణ స్త్రీ పరిస్థితులను కొంత విభిన్నతతో చూడవలసిన అవసరం ఉంది. పితృస్వామిక భావజాల పంజరం నుండి విడివడినంత మాత్రాన స్త్రీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కావు. ఇక్కడి దళిత బహుజన వర్గాల స్త్రీల సమస్యలు వేరుగా చూడవలసి ఉంది.

ఎన్ని వాదాలు ఆదర్శాలు వచ్చినా స్త్రీల పై వివక్ష హింస అట్లాగే కొనసాగు తున్నవి. ఎన్ని చట్టాలు సంస్కరణలు వచ్చినా మానవ ధృక్పథంలో స్త్రీకి రావలసిన సముచిత స్థానం ఇంకా ప్రశ్నగానే ఉండిపోయింది.

ఈ విషయాన్ని సాహిత్యంలో బలంగా ప్రతిపాదించవలసిన సందర్భం ఇది. నాటినుండి స్త్రీ సృజనకారుల సాహిత్య సృష్టిని స్మరించుకోవలసిన వేళ ఇది. మన దేశం నుండి ప్రాంతం వరకు ప్రశ్నించగలిగిన స్త్రీ గొంతుకలను

అంచనా వేయవలసిన సందర్భం ఇది. తంగేడు ఈ సంచికలో తన పరిది మేరకు ఈ ప్రయత్నం చేసింది. – ప్రత్యేక సంచిక కోసం మా సంపాదక వర్గం అడిగిన వెంటనే రచనలు అందజేసి సహకరించిన (విదేశాలలో ఉండికూడా) సృజన కారిణులకు మా ధన్యవాదాలు. స్త్రీ చైతన్యాన్ని పునరుత్తేజ పరచడానికి మేం చేసిన చిరు ప్రయత్నం ఇది. ఇట్లాంటి ప్రయత్నాలకు ఎల్లవేళల సృజనకారుల, పాఠకుల అభిప్రాయాలను ప్రోత్సాహాన్ని కోరుతున్నాం. ఆకాశంలో సగమైన మనం మరింత నూతనంగా వికసిద్దాం.

జై తెలంగాణ, జై జాగృతి… –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com