తెలంగాణా లో అనువాదాల ఆవశ్యకత

ఆంగ్ల సాహిత్యం లోని అనేక ఉద్గ్రంథాలు తెలుగు సాహిత్యం లోకి అనువాదం కావడం మనకు నిత్యానుభవమే .చాలా గొప్ప తాత్వికుల సిద్దాంతాలను కవుల భావుకతను మనం ఈ అనువాదాల ద్వారా ఆస్వాదిస్తున్నాం .

కానయితే ఈ అనువాదాలు తెలుగు సాహిత్యం నుండి అందునా తెలంగాణా సాహిత్యం నుండి ఎంతవరకు జరుగుతున్నాయి ?ప్రపంచ ప్రజలకు రాష్ట్రేతరులకు మన రచనలు ఎంత వరకు చేరుతున్నాయి ?మన కవులు రచయితలు ప్రపంచ సాహిత్య పటం లో కనీసం దేశ సాహిత్య పటం లో ఎక్కడున్నారు ?

ఎవరో కొందరు మినహాయిస్తే మనకు తృప్తి కరమైన సమాధానం లభించదు .ఈ అనువాదాలు జరగవలసిన స్థాయి లో జరగడం లేదు .అన్ని ప్రక్రియలలో నిష్ణాతులైన వ్యక్తులు మన సాహిత్య రంగం లో ఉన్నారు .వీళ్ళు ప్రపంచ అట్లాగే భారతీయ సాహిత్య రంగానికి చేరువ కావలసిన అవసరం ఉన్నది .

తెలుగు సాహిత్యం విషయానికి వస్తే ప్రాచీనం లో నన్నయాదుల పద్య కవిత్వమంతా అనువాదమే అని తెలంగాణ ఉద్యమం సందర్భం గా జరిగిన పరిశోధనలు నిరూపించాయి . అయినా ఈ కవిత్వం ఎంత స్మరణీయం గా మారిందో ప్రత్యేకించి పెర్కొవలలిసిన పని లేదు .బెంగాలీ నుండి అట్లాగే ఇతర భారతీయ భాషలనుండి అనువాద సాహిత్యం వల్ల ఎంత ప్రభావితులమైనమో సాహితీ లోకానికంతా తెలిసిందే .ఇక ఆంగ్ల సాహిత్యానువాదాలు తెలుగు వాళ్ళను ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి .

కాని ఈ స్థాయి మన సాహిత్యానికి ఉన్నదా ?ఈ కృషి మన దగ్గర జరుగుతున్నదా ?ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది .

మనం అనేక ఆటుపోట్ల కోర్చి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. .ఇప్పుడిప్పుడే మన అస్తిత్వాన్ని స్థేరీకరించుకుటున్నాం. సాహిత్య అతిత్వాన్ని గురించి కూడా స్థేరీకరణ పొందుతున్నాం .కవులను గౌరవించడం ,ప్రోత్సహించడం నిరంతరం కొనసాగిస్తున్నాం .

వీటి తో పాటు తెలంగాణా సాహిత్య అస్తిత్వాన్ని ప్రపంచ పటం మీద నిలుపవలసి ఉన్నది . అన్ని భారతీయ భాషల్లో మన పరిమళాన్ని వ్యా పింపజేయవలసి ఉన్నది .

అందుకు ఉత్తమ రచనల తో పాటు అనేక భాషా ప్రవీణులైన అనువాదకులు ఎదిగి రావాలి . అనువాద భాష అనువాదిత భాష యొక్క మౌలికావధులను పూర్తి గా అవగాహన చేసుకోవలసి ఉన్నది .ఉభయ సంస్కృతులను ఆవాహన చేసుకోవాలె .అట్లాంటి అనువాదకులు తెలంగాణాలో లేరని కాదు .కాని ఇంకా ఎక్కువ వృద్ది కావలసి ఉన్నది .దీని తో పాటు ఇతర భాషానువాదకులను ఆకర్షించే ఉత్తమ రచనల ఆవశ్యకత కూడా ఉన్నది . అన్ని ప్రక్రియల్లో ఈ విశిష్టత పరిడవిల్లాలి .

తెలంగాణా సాహిత్యకారులు ఈ దిశ గా కూడా అడుగులు వేస్తారని ఆశిద్దాం .ఈ ప్రయత్నం లో మనం కూడా దోహదమవుదాం . ఇదే సమయం లో సంక్రాంతి వస్తోంది .ఇది రైతుల పండుగ . వ్యవసాయ దారుల మనోభావాలకు ప్రతీక .సస్య లక్ష్మి దరహాసానికి వేదిక.ఈ సంక్రాంతి సాహిత్య క్రాంతి కి కూడా భూమిక కావాలని ఆశిద్దాం .

జై తెలంగాణా ,జై జాగృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com